గురువారం, ఆగస్టు 15, 2013

బందిపోటుకి 50 ఏళ్లు

అరాచకత్వం అధికారం చెలాయిస్తున్నప్పుడు...
ప్రజాచైతన్యం ఓ కథానాయకుడి రూపం దాలుస్తుంది...
అవినీతి అక్రమాలు ప్రజావంచనకు పాల్పడినప్పుడు...
ఆ కథానాయకుడి వీరత్వం నీరాజనాలు అందుకుంటుంది...
'బందిపోటు' సినిమా వెండితెరపై ఆవిష్కరించినది ఇదే!
అందుకే 50 ఏళ్లయినా అదొక చెరగని జ్ఞాపకంగా మిగిలింది!

ఆత్మవిశ్వాసాన్ని పోత పోసినట్టుండే ఆరడుగుల కథానాయకుడు... పొగరు, తలబిరుసు కలబోసిన అందాల రాకుమారి... ఇక వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఆకట్టుకోకుండా ఎలా ఉంటుంది? నందమూరి తారక రామారావు కథానాయకుడిగా, కృష్ణకుమారి కథానాయికగా 50 ఏళ్ల క్రితం విడుదలైన 'బందిపోటు' సినిమా అందుకనే అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో నిర్మాతలు సుందర్‌లాల్‌ నహతా, డూండీలు తీసిన ఈ సినిమా పేరును తల్చుకోగానే ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి.
సినిమా మొదట్లోనే అడవిలో విహారానికి వచ్చిన రాకుమారిని కాపాడిన కథానాయకుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతే, అతడిలోని చిలిపిదనం వెల్లువెత్తి ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తుంది. ఎంత సాహసవంతుడైనా ఓ సామాన్య యువకుడి చొరవను సహించలేని రాకుమారి రాచరికపు అహంకారం కస్సుమంటుంటే ప్రేక్షకులందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. రాజుగారి అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని అరాచకం సాగించే బావమరిది రాజనాలలాగా రెచ్చిపోతే, ఎదురు తిరిగిన కథానాయకుడు అందుకు దీటుగా విజృంభిస్తాడు. చిన్నాన్నని, తండ్రిని మోసగించి చంపించిన రాజనాల దౌర్జన్యాల బారి నుంచి ప్రజల్ని కూడా రక్షించడానికి తానే బందిపోటుగా మారతాడు. ఇదేమీ తెలియక ఆ బందిపోటును బందీ చేస్తానని బయల్దేరిన రాకుమారికి కథానాయకుడు నిజమేమిటో చెప్పాలనుకున్నాడు. అందుకే ఓ పాటందుకుని... 'వగల రాణివి నీవే...' అన్నాడు. 'సొగసుకాడిని నేనే...' అని కూడా చెప్పాడు. ఆపై... 'ఈడు కుదిరెను, జోడు కుదిరెను, మేడ దిగిరావే' అంటూ పిలిచాడు. బందిపోటనుకుని బంధించడానికి వచ్చిన రాకుమారికి అతడి ప్రేమ కబుర్లు చికాకు కలిగించకుండా ఎలా ఉంటాయి? కాబట్టే, అతడు 'పిండి వెన్నెల నీకోసం... పిల్లతెమ్మెర నాకోసం... రెండు కలిసిన నిండు పున్నమి రేయి మనకోసం...' అని ఎంతగా చెప్పినా వినలేదు. చివరికి ఆమెను బంధించి గుహలోకి తీసుకెళ్లి మరీ రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను వివరించాల్సి వచ్చింది. బందిపోటు మంచి మనసు అర్థమైన వెంటనే రాకుమారి, ఇక ఇప్పటికే ఆలస్యమైందని చటుక్కున ప్రేమలో పడుతుంది. ఇంకేముంది? డ్యూయట్టే!



ఆమె అక్కడ అంతఃపురంలో. అతడు అడవిలోని గుహలో. వెండితెర రెండు భాగాలైన రవికాంత్‌ నగాయిచ్‌ చక్కని ఫొటోగ్రఫీ సాక్షిగా, ఘంటసాల అద్భుతమైన సంగీతం బాసటగా ఆమె తీయని గొంతెత్తి, 'వూహలు గుసగులాడె... నా హృదయము వూగిసలాడె...' అని ప్రేమను బయటపెట్టేసింది. ఆపై వివశమైపోయి 'వలదన్న వినదీ మనసు... కలనైన నిన్నే తలచు...' అని కూడా చెప్పేసింది. చివరికి 'నీ ఆనతి లేకున్నచో విడలేను వూపిరి కూడా...' అనేసింది. మరి అతడు వూరుకుంటాడా? 'నను కోరి చేరిన వేళ... దూరాన నిలిచేవేల?' అని ప్రశ్నించి మరీ దగ్గరయ్యాడు. ఇంకేముంది? వాళ్ల ప్రేమకు 'దివి మల్లెపందిరి వేసింది... భువి పెళ్లి పీటను వేసింది'! ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు.
ఓ సినిమా జనరంజకంగా రూపొందాలంటే ఏమేం అంశాలుండాలో అన్నీ సమపాళ్లలో కుదిరిన 'బందిపోటు', విఠలాచార్య దర్శకత్వ పటిమను, మహారథి కథలోని పట్టును చాటి చెబుతుంది. రాజైన బావగారిని బంధించి, మేనకోడలైన కృష్ణకుమారిని పెళ్లి చేసుకుని సింహాసనం ఎక్కాలనుకునే రాజనాల క్రౌర్యం, అతడిని ముప్పుతిప్పలు పెట్టి నవ్వులు పండిస్తూనే అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఎన్టీఆర్‌ ధీరత్వాలను కథ, కథనాలు కదం తొక్కిస్తాయి. కోటలోకి చొరబడి రాకుమారిని ఉడికించడం, మారువేషాలతో రాజనాలను ఏడిపించడం లాంటి ఎన్నో సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల చప్పట్లను, ఈలల్ని అందుకుంటుంది. ముఖ్యంగా రాకుమారి అంతఃపురంలో అద్దం వెనక నుంచి ఎన్టీఆర్‌, తాగిన మత్తులో ఉన్న రాజనాలను ఆటపట్టించే సన్నివేశం థియేటర్లలో నవ్వులు పండించింది. ఇక పతాక సన్నివేశాలను ఈస్ట్‌మన్‌ కలర్‌లో చూపించడం మరింత ఆకర్షణను చేకూర్చింది. ఈ సినిమా అప్పట్లో 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. మొత్తానికి ఇప్పటి తరంవారు ఏ సీడీయో వేసుకుని చూసినా హాయిగా ఆనందించగలిగే అపురూప జానపద చిత్రం 'బందిపోటు'.

PUBLISHED IN EENADU ON 15.08.2013

1 కామెంట్‌:

  1. మీ కలంపోటుతో బందిపోటుని రఫ్ఫాడించేశారు.నిజానికి ఇది ఒక రాజకీయ జానపదం. ప్రేక్షకుల నయనాలకు కాలక్షేపనిక్షేపం!......... ఆచారం షణ్ముఖాచారి

    రిప్లయితొలగించండి