'ఏంటి మావా? ఎప్పుడూ మొహం దిగులుగా పెట్టుకుని తెగ ఆలోచిస్తూ కూర్చునేవాడివి. ఇవాళేంటి? మంచి దిలాసాగా కాలు మీద కాలేసుకుని వూపేస్తూ నీలో నువ్వు నవ్వుకుంటున్నావు... ఏంటి కత?'
'మరేంటనుకున్నావే? ఇన్నాళ్లూ మనవన్నీ బీదల పాట్లు అనుకున్నాం... రెక్కాడితే కానీ డొక్కాడదు... దరిద్రగొట్టుగాళ్లమని ఈసురోమని ఉండేవాడిని... ఇప్పుడు తెలిసింది అసలు సంగతి''ఓసోస్... ఇంతలోకే ఏం మారిపోయిందేంటి? మన బతుకులు ఎప్పటిలాగే ఏడుస్తున్నాయే?'
'నువ్వూరుకోవే... మనం ఇన్నాళ్లూ అజ్నేనంలో కొట్టుమిట్టాడిపోయాం. మన యువరాజుగారి మాటలు విన్నాక తెలిసింది. ఇందాకా రచ్చబండకాడ పేపరు చదువుతుంటే విన్నాన్లే. అబ్బో... ఎంత బాగా చెప్పాడే? వినగానే మెదడులో మబ్బులన్నీ విడిపోయాయనుకో'
'యువరాజుగారంటే ఆ సోనియా అమ్మ కొడుకేగా... ఇంతకీ ఏం చెప్పాడేంటి ఆయన?'
'అదేమన్నా మామూలు విషయమేంటే? పేదరికమనేది వట్టి భావనంట. అంతా మనం అనుకునేదేనంట. మన ఆలోచనలనుబట్టే ఆ భావన పుడుతుందేగాని నిజానికి పేదరికమన్నది లేనేలేదంట. మరి ఆయన చెప్పినట్టు పేదరికమనేదే లేదనుకో, ఇక మనం దిగులు పడ్డమెందుకు? అందుకే మరి లోపల్నుంచి సంబరం తన్నుకొస్తా ఉంది'
'వార్నీ! అదా సంగతి... నువ్వూ నీ తెలివీ ఏడ్చినట్టే ఉన్నాయి. పొద్దున్న తిండి గొంతు దిగిందో లేదో, రాత్రికి ఆకలేస్తే ఏం తినాలో తెలీదు మనకి. నులక మంచమ్మీద కాళ్లు వూపేసుకుంటూ మనం పేదలం కాదని వూరికే అనేసుకుంటే సరిపోతుందేటి? ఆ యువరాజా బాబుకేం... ఎన్నయినా చెబుతాడు. కడుపునిండిన వాడు. ఆయనగారి మాటలు విని కడుపులో కాళ్లు పెట్టుకుని కూర్చున్నామనుకో, డొక్కలెగరేయాల్సిందే. ముందా మంచం దిగి పిల్లల కడుపు నిండే దారేదో చూడు'
'వూరుకోవే... వెధవ నస, వెధన నసాని. నీదెప్పుడూ ఒకటే గోల. ఆయనేం చెప్పాడో ఓసారి నిదానంగా ఆలోచించి చూడు. నిజమేంటో తెలుస్తాది. అసలు పేదలంటే ఎవరు? ఏది లేనివాడిని పేదవాళ్లని అంటాం? మన సంగతే చూడు. కంతల్దో, కన్నాల్దో ఓ పూరి గుడిసంటూ ఉందా? వూగేదో, వూడేదో ఓ నులక మంచముందా? కలో, గంజో తింటున్నామా లేదా? మరీపాటి కూడా లేనివాళ్లు లేరేంటి? మరి వాళ్లకంటే మనం గొప్పే కదా? ఓసారి ఆలోచించు'
'నిన్ను చూస్తుంటే రాత్రి వూళ్లో పంచాయతీ ఎన్నికలోళ్లు పోయించిన మందు మత్తు ఇంకా దిగినట్టు లేదు. సిగ్గు లేకపోతే సరి. ఏ పూటకాపూట కాయకష్టం చేస్తే కానీ ఇంత కూడు కూడా నోటి దగ్గరకి రాదు. మన బతుకులు గొప్పంటావేంటి? ఆయనకేం? తల్లి చాటు బిడ్డ. ఆ సోనియా అమ్మ చంకనేసుకుని సాకుతూ, రేపో మాపో పెద్ద కుర్చీ ఎక్కించేద్దామని ఆలోచిస్తోంది. వాళ్లకి ఆ కుర్చీలు, అవి ఎక్కే దారులే కనిపిస్తాయి కానీ మనలాంటి పేదల బతుకుల్లో అతుకులు అగపడతాయా? ఆయనేదో అన్నాడంట... ఈయన కులాసాగా కూర్చున్నాడంట. లే...లే...'
'అది కాదే. మరాయన మాటల్లో అసలు పసేమీ లేదంటావా?'
'పసా, నసా? దిక్కుమాలిన గొడవ. ఆ యువరాజు నాయనమ్మ ఇందిరమ్మ ఏమంది? దేశంలోంచి అసలు పేదరికాన్నే తరిమేస్తామంటూ గొప్పలు చెప్పారా లేదా? మరి తరిమారా? ఎక్కడ చూసినా పేదల్నే తరిమి తరిమి కొడుతున్నారు. ఇక యువరాజు నాన్న ఏమన్నారో గుర్తు లేదా? పేదవాళ్ల బతుకుల్లో పూలు పూయించేస్తామన్నారు. కానీ మనకి అడుగడుగునా ముళ్లే కదా ఉన్నది? ఇప్పుడీయనగారి అమ్మగారి మాటలూ అంతే. ఈవిడగారి హయాములోనే కదా, ఆ మధ్యన పేదరికం మీద సర్వేలు, గట్రా చేసి మాగొప్ప విషయాలు చాటి చెప్పారు... గుర్తుకు రాలే? పొద్దున్న ఫలహారంగా ఇడ్లీలు, అట్టు తింటే పేదవాడికింద లెక్కలోకి రారని, రోజుకి ఇరవయ్యో పాతికో సంపాదించేవాళ్లెవర్నీ పేదలని అనక్కర్లేదని నానా కూతలు కూశారు. ఇవన్నీ చూడకుండా యువరాజుగారు కలతనిద్రలో వాగినట్టు ఏదో అంటే దాన్నే పట్టుకుని వేలాడుతున్నావ్... నేను చెబుతున్నది బుర్రలోకెక్కుతోందా?'
'ఎక్కడమేటే బాబూ... రాత్రి ఎక్కిందంతా దిగిపోతేను? నువ్విన్ని విషయాలు విడమరిచి చెప్పాక ఇంకా బుర్రకెక్కదా? ఏదో అదాటున ఆయన మాటలు నిజమే కాబోలనుకున్నాను. కానీ ఆయనగారి నాయనమ్మ నుంచి ఇప్పటి వరకు ఎవరెన్ని మాటలు చెబుతున్నా మన పేదల బతుకులు ఇలాగే నానాటికీ తీసికట్టు అన్నట్టు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. నువ్వనేది నిజమేలే...'
'ఇంకా నెమ్మదిగా అంటావేంటి? ఎవరెన్ని చెప్పినా మన బతుకులేవీ మారవు. అంతగా అంతా భావనలోనే ఉందంటే ఆ యువరాజుగారే భావించుకోవచ్చుగా... పెద్ద కుర్చీలో తానే కూర్చున్నట్టు... దేశానికి రాజైపోయినట్టు... చాలా చక్కగా పరిపాలిస్తున్నట్టు... దేశవిదేశాల్లో ఆయనగారి సత్తా గురించి మీటింగులు గట్రా పెట్టేసి మరీ పొగిడేస్తున్నట్టు... అమ్మా బాబూ కలిసి మన దేశానికి బంగారు తాపడం చేసేసినట్టు... ఇంకా ఇలా తోచినట్టు! పడక పడక మన పేదరికం మీద పడాలేటి... ఏమంటావు?'
'ఇంకేమంటాను, నువ్వింత బాగా చెప్పాక? నువ్వేటంటే నేనూ అదే అంటాను. పేదరికమంటే వట్టి భావనన్నాడు! ఛీ... ఇందులో ఏదో కొత్త సంగతి ఉందనుకున్నాను... మన దరిద్రం మారదని తోచలేదు... మా బాగా చెప్పావే... మొత్తమ్మీద నాకంటే బుర్రున్నదానివే'
'ఈ సంగతి నీకు ఇన్నాళ్లు కాపురం చేశాక తెలిసిందేంటి? కానీ ఓ సంగతి చెప్పనా? నిజానికి నేను బుర్రలేనిదాన్నేలే...'
'అదేంటి?'
'అంత బుర్రే ఉంటే నిన్ను కట్టుకుంటానేంటి? ఇకనైనా లే. లేచి సాయంత్రానికి నాలుగు నూకలు తీసుకొచ్చే దారేదో చూడు!'
PUBLISHED IN EENADU ON 13.08.2013
మీ వ్యంగ్య రచనకు జోహార్లు. మీరు ఎంచుకుయువరాన్న నేపధ్యం నిఖార్సయినది. ముఖ్యంగా మీరు రాసిన డైలాగు "ఇందిరమ్మ ఏమంది? దేశంలోంచి అసలు పేదరికాన్నే తరిమేస్తామంటూ గొప్పలు చెప్పలేదా? ఎక్కడ చూసినా పేదల్నే తరిమి తరిమి కొడుతున్నారు. ఇక రాజీవుడు ఏమన్నాడో గుర్తు లేదా? పేదవాళ్ల బతుకుల్లో పూలు పూయించేస్తానన్నాడు. కానీ మనకి అడుగడుగునా ముళ్లే కదా ఉన్నది? ఇప్పుడు సోనియమ్మ మాటలూ అంతే. ఈవిడగారి హయాములోనే కదా, ఆ మధ్యన పేదరికం మీద సర్వేలుచేసి గొప్ప విషయాలు చాటి చెప్పారు... గుర్తుకు రాలే?" ఐ ఓపెనర్. ఇంకా మీ బ్లాగ్ నుంచి మంచి మంచి శీర్షికలు రావాలని............ ఆచారం షణ్ముఖాచారి
రిప్లయితొలగించండి