శనివారం, ఆగస్టు 24, 2013

అప...హాస్యం!



'హ హ్హ హ్హ హ్హ హ్హా!'
శంకర్రావు నవ్వుకి వంటింట్లో ఉన్న పంకజాక్షి ఠారెత్తిపోయి పరిగెత్తుకుని వచ్చింది. వీధి గదిలో శంకర్రావు పొట్టపట్టుకుని దొర్లుతూ నవ్వుతున్నాడు. వూరినుంచి వచ్చి, పాత దినపత్రికలు సర్దే పని పెట్టుకున్న భర్త ఎందుకు అంతగా నవ్వుతున్నాడో పంకజాక్షికి అర్థం కాలేదు.

'దినపత్రికలో జోకులేముంటాయండీ? మీది మరీ చోద్యం కాకపోతే' అంది పంకజాక్షి.

'నీ మొహం, ఇందులో మన నేతల మాటలు చూడు. అన్నీ బ్రహ్మాండమైన జోకులే...' అన్నాడు శంకర్రావు నవ్వుతూనే.

'చాల్లెండి సంబరం. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు అవతల పోపు మాడిపోతుంది' అంటూ వెళ్లబోయింది పంకజాక్షి.

శంకర్రావు ఆమెను వారించి, 'ఇవతల దేశంలో పరిస్థితే మాడిపోతోంది. సంగతేమిటో తెలిస్తే నువ్వూ నాలాగే నవ్వుతావు మరి' అన్నాడు.

'అయితే ఉండండి. స్టవ్‌ కట్టేసి వస్తా' అంటూ పంకజాక్షి క్షణాల్లో వచ్చి, 'ఇప్పుడు చెప్పండి ఆ జోకులేంటో?' అంది సరదా పడుతూ.

శంకర్రావు ఆమె చేతికి తాను చదువుతున్న పాత దినపత్రిక ఇచ్చి ఓ వార్త చదవమన్నాడు. అది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ ప్రసంగం.

పంకజాక్షి చదువుతూ 'చిరునవ్వుల భారతమే మా ప్రభుత్వ లక్ష్యం...' అనేసరికి, శంకర్రావు 'అదే... అదే...' అంటూ మళ్ళీ నవ్వసాగాడు.

పంకజాక్షి మొహం చిట్లించి, 'ఇందులో నవ్వడానికేముంది? ముందు మీరు మీ పేరును శంకల్రావు అని మార్చుకోండి. మీకన్నీ శంకలే...' అంది.

'నీ తలకాయ్‌, చిరునవ్వుల భారతమేమిటి... ఇప్పటికే భారతమంతా అట్టహాస ప్రహసనమైతేనూ. ప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు మామూలివా? విషాదం నుంచి పుట్టిన వినోదం. ఈ ప్రభుత్వ విన్యాసాలను చూసి ఏడవలేక నవ్వుతున్న నిర్వేదం. మన భారత ప్రభుత్వమనే తెల్లతెర మీద కనిపించేది ఒకరు. ఆయన కేవలం పెదవులు మాత్రమే కదుపుతారు. కానీ, మాటలు ఆయనవి కావు. తెర వెనక నుంచి పలికేది మరొకరు. కుర్చీలో కూర్చుని ఆడేది ఒకరు. ఆడించేది వేరొకరు. పల్లకి మీద బొమ్మ ఒకరు. పల్లకిని మోసేది ఎవరెవరో. కానీ, వూరేగేది మాత్రం వీరెవరూ కాదు. ఇదొక విచిత్ర అధికార ప్రకరణం. ఎన్నడూ చూడని సరికొత్త పెత్తన ప్రహసనం. ఈ తైతక్కల ప్రభుత్వాన్ని చూసి ప్రజలంతా నిత్యం నవ్వుకుంటూనే ఉంటే, ఇంకా చిరునవ్వుల భారతమంటే పొట్ట పగిలిపోదూ?' అంటూ వివరించాడు శంకర్రావు.

'అవునండోయ్‌. మీరు చెబుతుంటే నాకూ నవ్వొస్తోంది. ఉండండి ఇంకా చదువుతా. ఇంకెన్ని జోకులున్నాయో...' అంటూ కొనసాగించింది.

'పేదలు అర్ధాకలితో అలమటించరాదనేదే మా ప్రభుత్వ లక్ష్యం...' అంటూ చదువుతున్న పంకజాక్షి కూడా నవ్వేసింది.

'చూశావా... నీకు కూడా నవ్వాగడం లేదు?' అన్నాడు శంకర్రావు. 'ఓ పక్క పేదరికం మీద పనికిమాలిన సర్వేలు అవీ చేసేది వీళ్లే. అట్టు తింటే అమీరని, ఇడ్లీ తింటే గరీబు కాదని, సాయంత్రానికి పదో, పాతికో జేబులో పడ్డవాడు సంపన్నుడేనని దిక్కుమాలిన నిర్వచనాలు ఇచ్చేదీ వీళ్లే. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల ధరవరలు ఆకాశం పరిధులు దాటి రోదసిలోకి సైతం రాకెట్లలా దూసుకుపోతున్నాయి. నేతల దౌర్జన్యాల్లా నిరుద్యోగం పెరిగిపోతోంది. నాయకుల నిజాయతీలాగా సంక్షేమం అంతకంతకు సన్నగిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాటలకు నవ్వు రాదా మరి?' అన్నాడు.

పంకజాక్షి నవ్వుతూనే చదవసాగింది. 'రకరకాల జాడ్యాల నుంచి భారత్‌ను విముక్తం చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదు...' అంటూనే నవ్వేసింది.

'అసలైన జాడ్యాలు తలచుకునే కదా నీకు నవ్వొస్తుంట? నిజమే మరి. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆటల్లో వేటాడారు. బొగ్గు గనుల్లో తవ్వుకున్నారు. ఫోన్ల పేరు చెప్పి పిండుకున్నారు. దర్యాప్తులో వేలెట్టి అడ్డుకోబోయారు. దస్త్రాలు సైతం మాయం చేశారు. సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్నారు. వీటి నుంచి కాక ఇక వేటి నుంచి భారత్‌ విముక్తి పొందాలి?' అంటూ శంకర్రావు నవ్వసాగాడు.

పంకజాక్షి మరో పేజీ తిప్పి, ముఖ్యమంత్రి ఉపన్యాసం చదివింది. 'చూశారా, రాష్ట్రంలో ఏడున్నర కోట్లమందికి కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నారంట. భలే, మొత్తం జనాభాయే ఎనిమిదిన్నర కోట్లయితే ఇదెక్కడి ప్రసంగమండీ చోద్యం కాకపోతే?' అంది మరింత నవ్వుతూ.

'అందుకే మరి... దినపత్రికలు చదవమనేది. రాష్ట్ర జనాభాలో ఇరవై శాతానికి కార్డులే లేవు. నలభై శాతం గులాబీ కార్డులవారికి చౌక బియ్యం ఇవ్వరు. మిగిలినవాళ్లు ఏడున్నర కోట్లంటే, ఒకటో తరగతి చదువుతున్న మన బుజ్జిగాడు కూడా పొర్లి పొర్లి మరీ నవ్వుతాడు' అన్నాడు శంకర్రావు.

'మొత్తానికి మన నేతలు భలే నవ్వించార్లెండి...'

'కాబట్టే, దినపత్రికలు చదివితే ఆరోగ్యమని చెప్పేది. ఓ నాయకుడు కోట్లకు కోట్లు కళ్లముందు దోచుకుంటూనే స్వర్ణయుగం తెస్తానంటాడు. మరో నాయకుడు ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, వాళ్ల కోసమే తన బతుకంటాడు. ఇంకో నేత దేశం వెలిగిపోతోందంటాడు. ఇక మనం కామెడీ సినిమాలకు వెళ్లక్కర్లేదు. హాస్యపత్రికలు కొనక్కర్లేదు. లాఫింగ్‌ క్లబ్బుల్లో చేరక్కర్లేదు. ఎ...హే...మం...టావ్‌?'

పంకజాక్షి మరోసారి నవ్వేసింది.
PUBLISHED IN EENADU ON 24.08.2013

1 కామెంట్‌:

  1. మీ సెటైరు వోక్స్ వాగన్ టైరులా నవ్వొస్తుంది. నవ్వనా!! మా ఇంట్లో పాత పేపర్లు నేను కూడా వెదుకుతా.. తస్సదియ్య. బాగుంది.

    రిప్లయితొలగించండి