శనివారం, ఆగస్టు 31, 2013

అవకతవక సినిమా!



'యూపీఏ ప్రొడక్షన్స్‌... సోనియా సమర్పించు... మన్మోహన్‌ చిత్రవారి 'అవకతవక భారతం' సినిమా. కడుపుబ్బ నవ్వించే నాయకుల విన్యాసాలు, కడుపు రగిలించే కుంభకోణాలు, కంటతడి పెట్టించే ధరవరలు, ఉత్కంఠ కలిగించే ఉద్వేగాలు, నమ్మశక్యం కాని వాగ్దానాలు, గిలిగింతలు పెట్టే అవకాశవాద పొత్తులు, నరాలు తెగిపోయే సస్పెన్స్‌, అబ్బురపరచే పోరాటాలు... ఆలసించిన ఆశాభంగం! రండి బాబూ రండి... నేడే చూడండి!' 
'ఏం రేపు ఆడదా?' 
'అదే సస్పెన్స్‌' 
'ఇంతకీ హీరో ఎవరు?' 
'ఒకరు కాదు...' 
'ఓ, బహుతారా చిత్రమా, ఎవరెవరో వాళ్లు?' 
'గండర గండడు ద్రవ్యోల్బణం, విచిత్ర వేషాల విదేశ మారక ద్రవ్యం, అంతుపట్టని అభినయ విన్యాస రాజకీయం...' 
'మరి కథానాయికలు ఎవరు?' 
'ఎన్నెన్నో అందాల ఉల్లిపాయ, పచ్చని సోయగాల పచ్చిమిరపకాయ, తళుకు బెళుకుల బంగారం...' 
'అబ్బో, భలే జంటలే! మరి విలన్‌ ఎవరు?' 
'అమెరికా డాలర్‌' 
'మరైతే హాస్యనటులు ఎవరో?' 
'పాలక పల్లకీ మోతగాళ్లు, ఆ పార్టీల నేతలే హాస్యగాళ్లు...' 
'చాలా బాగుంది... ఇంతకీ కథేంటి?' 
'ఇంతవరకు భారతీయ వెండితెరపై కనీవినీ ఎరుగని కథ. అంతులేని, అంతుపట్టని, చిత్రవిచిత్ర మలుపులతో కూడిన అద్భుతమైన కథ...' 
'అవునా? మరి అంత చక్కని కథకు స్క్రీన్‌ప్లే ఎవరు?' 
'ఒక్కరు కాదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. అందరు నేతలు తలో సన్నివేశాన్నీ సృష్టించారు. తలో దృశ్యాన్నీ ఆవిష్కరించారు...' 
'ఇంతకీ ఇంత గొప్ప చిత్రానికి దర్శకుడు ఎవరు నాయనా?' 
'అది కూడా చిత్రమే. తెరమీద పేరు కనిపించేది ఓ తలపండిన దర్శకుడిది. కానీ, తెర మీద సినిమా మొత్తాన్ని నడిపించేది మాత్రం ఓ దర్శకురాలు. ఏ సన్నివేశం తీసుకున్నా అందులోని షాట్‌లన్నీ ఎలా తీయాలో చెప్పేది ఆవిడే. ఈయన మాత్రం- లైట్సాన్‌, యాక్షన్‌, కట్‌... చెబుతారంతే!' 
'ఆహా, ఏం సినిమా అయ్యా! వింటుంటేనే అదిరిపోతోంది. మరి పాటలు ఉన్నాయా?' 
'ఉన్నాయి కానీ, అన్నీ విషాద గీతాలే...' 
'వార్నాయనో! వినగలమా?' 
'టికెట్‌ కొనుక్కుని వెళ్లాక వినక చస్తారా? వెక్కి వెక్కి ఏడుస్తూ మరీ వింటారు. ఇప్పటికే ఆ పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. దేశంలో ఏ మూల చూసినా ప్రజలంతా వాటిని సణుక్కుంటూ, గొణుక్కుంటూ, నిర్వికారంగా, నిర్వేదంగా పాడుకుంటూనే ఉన్నారు' 
'భలే బాగున్నాయయ్యా ఈ సినిమా విశేషాలు. ఆ కథేంటో కూడా కాస్త చెబుదూ?' 
'అనగనగా ఓ సామాన్యుడు. ఆశలు తప్ప ఏదీ ఆశించనివాడు. ఎవరొచ్చి ఏది చెప్పినా నమ్మేంత అమాయకుడు. గుమ్మం దగ్గరకు వచ్చి అడిగితే చాలు తన దగ్గరున్న ఓటును వెంటనే ఇచ్చేసే దానగుణం కలవాడు. అలాంటి సామాన్యుడికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉల్లిపాయ- బాధ్యతలు తెలిసిన పిల్ల. ఎప్పుడూ వంటింట్లో సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. రెండో పిల్ల- పచ్చిమిరపకాయ. అక్కకు తోడుగా రుచులు పండిస్తుంది. మూడో పాప- బంగారం లాంటి పిల్ల. శుభకార్యాల నిర్వహణలో ముక్కుపుడక, తాళిబొట్టు, ఉంగరాల దగ్గర్నుంచి, గాజులు, నగల వరకు స్థోమతను బట్టి సమకూరుస్తూ, తళుక్కున మెరుస్తూ పరువు కాపాడుతూ ఉంటుంది. ముగ్గురమ్మాయిలతో గుట్టుగా సాగిపోతున్న ఆ సామాన్యుడి కుటుంబంలో ఒక్కసారిగా కలవరం పుట్టింది...' 
'ఏమిటా కలవరం?' 
'ద్రవ్యోల్బణం, విదేశ మారక ద్రవ్యం, రాజకీయమనే ముగ్గురు సంపన్నుల బిడ్డల చూపు ఈ ఆడపిల్లల మీద పడింది. ముగ్గురూ కలిసికట్టుగా వాళ్లని వలలో వేసుకున్నారు' 
'ఇదేం కథయ్యా, వీళ్లు హీరోలంటావ్‌? మళ్ళీ వల్లో వేసుకున్నారంటావ్‌?' 
'అదే ఈ సినిమాలో మలుపు. సందేహాలుంటే సినిమా పేరోసారి తల్చుకో. నోర్మూసుకుని వింటే విను. లేకపోతే చూడకతప్పని సినిమా చూడు' 
'సర్లే, మధ్యలో ఆపన్లే. అప్పుడేమైందో చెప్పు' 
'ఆ ముగ్గురివల్ల ముచ్చటైన ముగ్గురు అమ్మాయిలు సామాన్యుడికి అందకుండా పోయారు. పెద్దపిల్ల ఉల్లిపాయ, రెండో పిల్ల పచ్చిమిర్చి విపరీత ప్రవర్తనలవల్ల సామాన్యుడి కుటుంబం అల్లకల్లోలమైంది. అక్కలిద్దర్నీ చూసి బంగారం కూడా పట్టపగ్గాలు లేకుండా పొగరుతో వగలు పోసాగింది' 
'మరి ఆ సంపన్నుల అడ్డదిడ్డ బిడ్డల్ని అదుపు చేసేవారే లేరా?' 
'ఉంటే అది ఈ సినిమా ఎందుకవుతుంది, ఆ పేరెందుకు నప్పుతుంది? అసలే సామాన్యుడు సతమతమవుతుంటే అమెరికా డాలర్‌ కూడా రంగప్రవేశం చేసి విశ్వరూపం చూపించసాగింది. దాంతో సామాన్యుడి కుటుంబం చితికిపోయింది. ఈ కష్టాలు చాలవన్నట్టు సామాన్యుడి కుటుంబ పెద్ద అకస్మాత్తుగా జబ్బుపడి మంచమెక్కాడు' 
'సామాన్యుడి కుటుంబ పెద్దా, ఆయనెవరు?' 
'రూపాయి!' 
'అరె పాపం... అప్పుడేమైంది?' 
'ఇంకా ఏమవ్వాలి? పతాక సన్నివేశం ఆసుపత్రి అత్యవసర విభాగానికి చేరింది. రూపాయి ప్రాణం నిలబెట్టడానికి ఆక్సిజన్‌ పెట్టసాగారు. సెలైన్‌ ఎక్కించసాగారు. బయట ఎర్రలైటు. లోపల నీరసించిన రూపాయి. అంతటా ఉత్కంఠ...' 
'ఇంతకీ దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు చివరికి ఏం చేస్తారయ్యా?' 
'ఏంటి చేసేది! వాళ్లేం చేయకే కదా, కథ ఇలా తయారైంది?' 
'మరి చివరికి ఏమవుతుంది?' 
'ఈ అవకతవకల కథకు ముగింపు ఎలా పలకాలో వాళ్లకే తెలియడం లేదు. మిగతా కథ భారతీయ వెండితెరపై చూడాల్సిందే... అర్థమైందా? ఆ... రండి బాబూ రండి... నేడే చూడండి...' 
'అవున్లే దీన్ని నేడే చూడాలి. రేపు అనుమానమే. వెళ్లి ప్రచారం చేసుకో... పో'

PUBLISHED IN EENADU ON 31.08.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి