గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి...
బుల్లి కారున్న షోకిల అబ్బాయి...
ప్రేమలో పడితే?
మొదట కళ్లతోటి మొదలు పెట్టిన లడాయి...
హృదయమంత పాకే హుషారైన హాయిగా మారుతుంది!
యువ గుండెల కువకువలంటే అంతే...
అది ఆండ్రాయిడ్ అప్లికేషన్ల నేటి కాలమైనా...
యాభై ఏళ్ల 'ఆత్మబలం' నాటి కాలమైనా...
అందుకే ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం!
అందువల్లనే అది వి.బి. రాజేంద్రప్రసాద్ స్థాపించిన 'జగపతి' ఆర్ట్ పిక్చర్స్ సంస్థకి ఓ ప్రతిష్ఠాత్మక చిత్రమైంది!
విక్టరీ మధుసూదన రావు దర్శకత్వ ప్రతిభకు ఓ గీటురాయిగా నిలిచింది!
హీరోగా అక్కినేని నాగేశ్వరరావుకి ఓ తీపి జ్ఞాపకమైంది!
హీరోయిన్ బి. సరోజకి మరిచిపోలేని విజయమైంది! వెరశి ఎప్పుడో 1964లో ఇదే రోజున విడుదలైనా ఇప్పుడు కూడా చెప్పుకోదగిన సినిమాగా మిగిలింది.
'ఆత్మబలం' సినిమా కథ ఓ పదేళ్ల పిల్లాడి మానసిక వైద్యంతో మొదలవుతుంది. ఎందుకంటే, తండ్రి చనిపోవడాన్ని కళ్లారా చూసిన అతడిలోని మానసిక వైకల్యమే కథని మలుపు తిప్పేది కాబట్టి. ఆ పిల్లాడే పెరిగి పెద్దవాడై జగ్గయ్యగా మారి, హీరోహీరోయిన్లనీ వాళ్ల ప్రేమనీ ముప్పుతిప్పలు పెడతాడు. హీరో ఉరికంబం ఎక్కడానికి కారకుడవుతాడు. అటు హీరో ఉరిశిక్షకి వెళుతున్న దృశ్యాలు, ఇటు అతడిని కాపాడే ప్రయత్నాల మధ్య సినిమా క్త్లెమాక్స్ రక్తికట్టడానికి దోహద పడతాడు. టైటిల్స్‌లోనే మానసిక వైద్యశాలకి వెళ్లిపోయిన ఆ కుర్రాడు, తిరిగి హీరోహీరోయిన్ల ప్రేమ రసకందాయంలో పడ్డాక వూడిపడతాడు. ఆ కుర్రాడి తల్లి కన్నాంబలా గంభీరంగా తెరపై కనిపించేనాటికి ఆమెకో మిల్లు ఉంటుంది. ఆ మిల్లుకో మేనేజర్ ఉంటాడు. వాడు సన్నగా రివటలా రవణారెడ్డిలాగా ఉన్నా, దుర్మార్గంలో మాత్రం గట్టిపిండమే. అందులో ఇంజినీరే హీరోగారు. అతడు కారు మీద ఉద్యోగానికి వెళుతుంటే హీరోయిన్ లిఫ్ట్‌కోసం కారాపి మరీ పరిచయమై ప్రేమకు నాంది పలుకుతుంది. ఆపై ఆత్రేయగారి కలం పాటలతో పరుగులు పెడితే, హీరోహీరోయిన్లు పార్కుల్లో పరుగులు పెడతారు. 'గిల్లికజ్జాలు తెచ్చుకునే...' ఆ అమ్మాయి కళ్లల్లో బలే బడాయిని అతడు చూస్తే, 'బుల్లికారున్న షోకిల...' అయిన ఆ ఆబ్బాయి పోజుల్లో బడాయిని ఆమె గుర్తిస్తుంది. ఆపై అతడు 'పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు...' అని గొప్పలు పోతాడు. మళ్లీ వెంటనే 'ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు...' అని ఒప్పేసుకుంటాడు.
ఆ తర్వాత ఇద్దరూ 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' 'చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టునీడకై...' పరుగులు పెడుతూ, 'చెప్పలేని ఆ హాయి...' ఎంత వెచ్చగా ఉంటుందో తెలుసుకుంటారు. ఆ సరికి ఇద్దరూ ప్రేమలో తడిసి ముద్దయిపోతారు. ఇలా వీళ్లు డ్యూయట్ల మీద డ్యూయట్లు పాడుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటే, మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న జగ్గయ్య కథను మలుపు తిప్పడానికి పారిపోతాడు. మిల్లు యజమానురాలి కోరికపై హీరో అతడిని ఇంటికి తీసుకొచ్చినా, ఒక్క రోజే ఉండి వెళ్లిపోతాననే అతడిని ఆపడానికి పాటే మార్గమవుతుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?' అని హీరోయిన్ పాడేసరికి, వెళ్లేవాడు కాస్తా ఆగిపోయి 'ఎక్కడికీ పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకుంటి కుర్రదానా' అని ఆగిపోతాడు. అమ్మతో చెప్పి జయను పెళ్లాడతాననేసరికి ప్రేమికులతో పాటు ప్రేక్షకుల మనసులూ కలుక్కుమంటాయి. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కన్నాంబ కోసం అవసరమైతే ఎంతటి త్యాగమైనా చేయాలని చెప్పి చనిపోయిన తన తల్లి మాటలు హీరోయిన్‌ను కట్టిపడేస్తాయి. హీరో కూడా త్యాగాన్నే బోధించి వెళ్లిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయి 'కనులకు కలలే బరువైనాయి... కన్నీళ్త్లెనా కరువైనాయి...' అని పాడుకుంటూ ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రేమ గురించి రవణారెడ్డి చెప్పడం, జగ్గయ్య అనుమానపడడం, దేనికైనా తెగించే మనస్తత్వం ఉన్న అతడి బారి నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి హీరోను చేరుకోవడం లాంటి సంఘటనలతో కథ చిక్కనై పాకాన పడుతుంది. హీరోహీరోయిన్లు ఒకటై 'తెల్లవారనీకు ఈ రేయిని... తీరిపోనీకు ఈ తీయనీ హాయినీ...' అని పాడుకునేసరికి, జగ్గయ్య పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరుకుంటుంది. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటూ, తనను హీరోనే హత్య చేసినట్టు కనిపించే పరిస్థితులు కల్పించి చనిపోతాడు. సాక్ష్యాలన్నీ కలిసి హీరోను ఉరికంబానికి, సినిమాని క్త్లెమాక్స్‌కి తీసుకువెళతాయి. హీరోకి ఉరితాడు తగిలించేలోగా ఆగమేఘాల మీద (నిజానికి కారు మీద) హీరోయిన్, రేలంగిలు జగ్గయ్య డైరీని తీసుకొచ్చేసరికి అందులోని అంశాలను బట్టి చిట్టచివరి నిమిషంలో న్యాయమూర్తి ఉరిశిక్షను ఆపుచేయడంతో ప్రేక్షకులు వూపిరిపీల్చుకుంటారు.
'అగ్నిసంస్కార్' అనే బెంగాలీ నవల ఆధారంగా అల్లుకున్న ఈ చక్కని కథకి ఆత్రేయ మాటలు, పాటలు అద్భుతంగా అమరాయి. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చిన పాటలన్నీ హాయిగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ ఈ సినిమాను ఏ సీడీలోనో చూస్తే కథ, కథనాలు కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు.
PUBLISHED IN EENADU ON 09.01.2014
ఆ రోజుల్లో ఓ ఊపు ఊపిన చిత్రం.
రిప్లయితొలగించండి