బుధవారం, జనవరి 15, 2014

నిజమైన పండగ!


'భగభగా మండేను భోగి మంటల్లు...
భోగి మంటల్లోన కాలేను కష్టాలు'

- చప్పట్లుకొడుతూ చుట్టూ తిరుగుతోంది ఎంకి. తిరుగుతున్నదల్లా చటుక్కున ఆగి, 'బావా... బావా... ఒక్కసారి ఎవరెవరు ఎలాంటి మంటలేత్తన్నారో చూసొద్దామా?' అంది సరదాగా. బావ నవ్వుకుని, 'సరే... పద' అన్నాడు.

ఇద్దరూ కలిసి ఓ వీధిలోకి వెళ్లారు. అక్కడొక నాయకుడి ఇల్లు ఉంది. ఆయన అనుచరులతో వచ్చి భోగి మంటల్లో ఏవేవో పడేస్తున్నాడు.

'ఏంటి బావా ఏత్తన్నాడు?' అడిగింది ఎంకి.

బావ పరిశీలనగా చూసి, 'ప్రజలకిచ్చిన వాగ్దానాలు' అన్నాడు.

'అదేంటి? ఎవురైనా భోగి మంటల్లో పిడకలేత్తారు, కట్టెలేత్తారు కానీ ఇలాంటియ్యి కూడా ఏత్తారేటి?' అంది ఎంకి.

'ఆయనెవరనుకున్నావు? అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేనా, చచ్చేనా? ఆయన దగ్గర తగలబెట్టడానికి ఇంకేముంటాయి మరి?' అన్నాడు.

'అదేటి బావా అలాగంటావు? 'జనానికిచ్చిన మాటలన్నీ నిలబెట్టేసుకున్నాం... సెప్పినవన్నీ సేసేశాం... అసలిన్నేసి మంచి పనులు సేసిన పార్టీ మరోటి లేదు' అని వూదరగొడతారు కదా? నువ్వేటి అట్టా తీసి పారేత్తన్నావు?'

'వూరుకోయే! ఇన్నాల్లూ ఆల్ల పాలన ఎలాంటిదో సూసినా బుద్ధి రాలేదేంటి నీకు? తొమ్మిదేళ్లక్రితం నేనొక్కడినీ పనిసేసి తెచ్చిన రూకల్తో ఇల్లంతా గడిచేది. పైగా పదో పరకో... ఎదర కర్సులకి డిబ్బీలో ఏసేటోల్లం. గుర్తులే? అప్పుడు బియ్యం ధరకి, ఇప్పటి ధరకి పొంతన ఉందాని? పోపులోకి సిటికెడు నూని కోసం గిజగిజలాడిపోతన్నావు. వారానికోపాలైనా పట్టెడు కూరన్నం తినగలుతున్నామా సెప్పు? మనమెవ్వరం పేదోల్లం కాదంట. ఈల్లందరూ కలిసి కాకి లెక్కలన్నీ ఏసి 'అబ్బెబ్బెబ్బెబ్బే... మనదేశంలో పేదోల్లు అంతకంతకు తగ్గిపోతన్నా'రని ప్రెచారాలు కూడాను' అన్నాడు బావ కోపంగా.

ఇంతలో ఆ నేత అనుచరుడు మరిన్ని కట్టలేవో తెచ్చి మంటల్లో పడేశాడు. మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

'ఓలబ్బో... పెద్ద భోగిమంటే. ఇప్పుడేటి తెచ్చి పడేశాడు బావా?' అంది ఎంకి.

'ఇప్పుడేసినవి ప్రజలకోసం ఆల్లు పెట్టిన పదకాలే! ఆటి అమలులాగే ఇయ్యీ తగలడుతున్నాయి సూడు'

'బావా? ఈల్లు మనకోసం పెట్టిన పథకాలూ సరిగా లేవంటావా?'

'నువ్వు మనిషివి ఎదిగావు కానీ బుద్దిలో సిన్నతనం ఇంకా పోలేదే? ఓ... భోగిమంటలు సూద్దారన్న సరదాయే కానీ, మన సుట్టూ ఉన్న కష్టాల మంటల సెగ ఏంటో కానుకున్నట్టు లేవు...'

'అట్టా కోప్పడకు బావా... కూసింత ఇవరంగా సెప్పొచ్చుగా?'

'మరదే... ఏమన్నా అంటే బుంగమూతెడతావు. కాస్త చుట్టూ జరుగుతున్నది సూస్తూ ఎరిక పెంచుకోవాలని ఎన్నిసార్లు సెప్పినా బుర్రకెక్కించుకోవు. ఈల్లు, ఈల్ల మనుషులు వూరూవాడా నానా కంగాళీచేసి బోలెడేసి పథకాలు పెట్టేశారా? తామసలు పుట్టిందే ప్రెజానీకం కోసమన్నట్టు, వాళ్లని ఉద్దరించడానికన్నట్టు మాట్లాడారా? తొమ్మిదేళ్లలో మనం కానీ, మన సుట్టూ ఉన్న మన్లాంటి బడుగు బతుకులోల్లు కానీ ఎదిగామా? కానీ ఈ నేతలు, ఆల్ల అనుచరులు, ఆల్ల బంధువులు, తోకగాళ్లకేసి సూడు. నడుచుకుంటా పోయేటోడు ఇవాల స్కూటరెక్కాడు. సైకిల్‌బెల్లు కొట్టేవోడల్లా కారు హారను మోగిత్తన్నాడు. అద్దె ఇంట్లో కాలక్షేపం సేసేటోడు సొంతింట్లోకి మారాడు. తెలుత్తోందా?'

'పోన్లే బావా... పాపం ఆల్లు ఎదిగితే మనకెందుకు బాద? మనం ఎదగలేదని ఏడవాలి కానీ...'

'సాల్లే... మా బాగా సెప్పావు, ఏదాంతం. ఆల్లంతా నిజమైన అర్హతలుండి ఎదిగితే నాకెందుకు ఉలుకు? ఆ పార్టీ పేరుమీద ఎదిగినోల్లంతా మనలాంటి పేదోల్ల పేరు సెప్పుకొని ఎదిగినోల్లే మరి. పేదలకి ఇల్లిత్తామన్నారా? ఏదీ మనగ్గాని, మన పక్కోడిగ్గాని వచ్చిందా... లేదే? ఆడెవడో ఆ పార్టీ నేత కండువా మోసేటోడు దొంగ పత్రాలు సూపించి ఆ ఇల్లు కొట్టేశాడు. ఒక్క మనూళ్లోనే కాదే, అంతా ఇదే తంతు. ఆ నేతలు సెప్పినోల్లందరికీ ముందిచ్చాకే, ఒకటో అరో పేదోల్లకిచ్చి మా గొప్ప పన్లు సేసుకుంటున్నట్టు టీవీల్లో, సబల్లోను వూదరగొడుతున్నారు. పేదలకి వైద్దె పదకమన్నారు... ఏదీ?అంతకన్నా సిత్రం, మన సుట్టూతా ఉండే పొలాలన్నింటికీ నీళ్లొచ్చేత్తాయని కాలవల పని మొదలెట్టారా? వాటిలో ఎన్నింట్లో పన్లు పూర్తయ్యాయి? ఎన్నింట్లో నీళ్లొచ్చాయి... సూసుకో. సెప్పేది కొండంత, జరిగింది పిసరంత. కానీ ఆ పనుల పేరు సెప్పి కోటానుకోట్ల సొమ్ము ఆ పార్టీవోళ్ల జేబుల్లోకే పోయిందంట. ఎందుకంటే ఆల్లే ఆ పన్లు సేసేత్తామని కాంటరాక్టర్ల అవతారమెత్తారు మరి'

'పోన్లెద్దూ బావా... కోట్లకు కోట్లు ఎవురో ఎవురికో ఇత్తే మనకేంటంట?'

'ఏడిశావ్‌, ఎర్రిమొగవా? ఆ డబ్బంతా ఏంటనుకున్నావు? మనం, మన్లాంటి ప్రెజలంతా పన్నుల రూపంలో కట్టిందే మరి. ఇలా పోగడిన సొమ్మునంతా సక్రమంగా పేదోల్లకే కర్సు సేసుంటే నువ్వూ నేను, ఇయ్యాల ఇలాగుండకపోదుం'

'ఎరికైంది బావా? ఈల్ల పాలన కంటే పెద్ద భోగిమంట ఏటుంటాది? ప్రతీదీ తగలెట్టాశారన్నమాట. పోన్లే. మరో ఇంటికి పోదాం పద'

ఎంకి, బావ కలిసి ఇంకోచోటకి వెళ్లారు. అక్కడొక యువనేత ఇంటి ముందు భోగి మంట మరింతగా భగభగలాడుతోంది.

'ఓలబ్బోలబ్బో... ఎంతలేసి మంటలు బావా? ఈయనేంటి పడేత్తన్నాడో?'

'ఈయన ఎవరనుకుంటున్నావు? ఒకప్పటి నేత కొడుకే. ఆ తండ్రి అండతో ఇతడు మొత్తాన్నీ సుట్టబెట్టేశాడు. పచ్చటి పొలాల్ని, గనుల్ని ఏవేవో పరిశ్రమల పేరు సెప్పి పెద్దోల్లకి ఆ తండ్రి రాసిచ్చేత్తే... ఇతగాడు అలా బూములు దండుకున్నోల్ల దగ్గర్నుంచి డబ్బులు నొల్లుకునేవాడు. అలా ఒకటా, రెండా... లక్ష కోట్లు బొక్కేశాడంట. అందుకే ఆ మధ్యన ఇతడిని కటకటాల ఎనకేశారు. ఇప్పుడు బెయిలుమీద బయటకొచ్చాడులే'

'మరంత బొక్కేసినోడిని ఎలా వదిలేశారు బావా?'

'అదో పెద్ద రాజకీయంలే! ఎన్నికలొత్తన్నాయి గందా? ఎట్టాగొట్టా మాయమాటలు సెప్పి మనకాడ ఓట్లు పొందేద్దారని వదిలేశారంట'

'మరీయన ఏటేత్తన్నాడు మంటల్లో?'

'తను సేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అవకతవకల తాలూకు సాచ్చికాలన్నీ పడేత్తన్నట్టున్నాడు...'

'వార్నాయనో... అయితే మన బతుకుల్లో మంటలెట్టి ఆల్లు భోగమనుభవిత్తన్నారన్నమాట. సాల్లే మావా... ఇంకే భోగి మంటలు సూడక్కర్లేదు. అసలీల్లందరినీ మనవెయ్యాలి భోగిమంటల్లో. పద... ఉన్నదేదో వండుకుని తిని తొంగుందారి. మన్లాంటోల్లకి పండగైనా ఒకటే, పబ్బమైనా ఒకటే. ఇలాంటి తప్పుడు సాముల్ని రేపొచ్చే ఎన్నికల్లో ఇంటికి అంపించాకే మనకి నిజమైన సంక్రాంతి!'

'నీకూ బుద్దొచ్చిందిగా? ఇక మనకంతా పండగేలే!'

PUBLISHED IN EENADU ON 13.01.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి