మంగళవారం, జనవరి 28, 2014

ఎన్నికల సరంజామా!



'గురూగారండీ... మరేం- ఎన్నికలొస్తున్నాయ్‌ కదండీ, బజార్లో సరంజామా కొనుక్కోవడానికి జాబితా రాసుకుని బయల్దేరానండి. ఇవి సరిపోతాయో లేదో కాస్త చెప్పరూ?' అంటూ ఓ పెద్ద సంచీ వూపుకొంటూ వచ్చాడు శిష్యుడు. 
గురూగారు వాడిని ఎగాదిగా చూసి, 'ముందు నీ జాబితా ఏంటో చెప్పు. దాన్నిబట్టి నీ బుద్ధేంటో, దాని లోతేంటో చెబుతా...' అన్నారు నిదానంగా.
'ఓ... మా ఆవిడను అడిగితే బోలెడు సరకులు చెప్పిందండి. మొదటగానేమో రెండు కిలోల మైదాపిండండి. ఆ తరవాత పురికొసలండి...' 
'మైదాపిండి, పురికొసలా? అవెందుకురా?'

'బలేవారే. మైదాపిండిని ఉడకబెట్టి పార్టీ జెండాల్ని పురికొసలకు అతికించడానికండి...'

'అబ్బో... మిగతా జాబితా కూడా చదివి ఏడు...'

'వెదురు బొంగులండి. ఎక్కడ పడితే అక్కడ పాతేసి జెండాలు కట్టడానికండి. ఆ తరవాతేమో పేడముద్దలండి...'

'పేడముద్దలా... అవెందుకు?'

'ఎదర పార్టీవాళ్ల జెండాల మీదకు విసరడానికండి. ఇంకానేమో వూరి చివర ఏట్లోంచి ఓ ట్యాంకుడు బురదండి. ప్రత్యర్థులపై బురద జల్లడానికండి. ఓ బస్తాడు బొగ్గులు, డజను చాటలండి. బొగ్గులు బాగా రాజేసి, ప్రతిపక్షంపై నిప్పులు చెరగడానికండి. అలాగే రెండు బస్తాల దుమ్ము, పారలండి. ఎగస్పార్టీ వాళ్లపై దుమ్మెత్తిపోయడానికండి. రెండు డ్రమ్ముల కిరసనాయిలు, నాలుగు డజన్ల అగ్గిపెట్టెలండి... ఉపన్యాసం ఇస్తూ వేరే పార్టీలపై మండిపడ్డానికి ఉంటాయని మా ఆవిడ చెప్పిందండి. అలాగే పోటీ నేతల మీద కారాలు, మిరియాలు నూరడానికి ఎండుమిర్చి, మిరియాలు, రోలు, పొత్రం ఇంకానేమో...'

ఆ సరికి గురువుగారికి కడుపులో తిప్పింది. 'ఆపరా బడుద్ధాయ్‌...' అంటూ ఒక్క అరుపు అరిచారు. 
శిష్యుడు డంగైపోయాడు.

'ఇన్నాళ్లూ నా దగ్గర రాజకీయాల్లో నేర్చుకున్నది ఇదేనట్రా బుద్ధి లేనోడా! ఎన్నికల సరంజామా గురించి భార్యల్ని అడుగుతార్రా ఎవరైనా? ముందా జాబితా చింపెయ్‌...'

శిష్యుడు వెంటనే చింపేసి, 'బుద్ధొచ్చిందండి. మరి ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో మీరే చెప్పండి గురూగారూ...' అన్నాడు.

గురువుగారు నిట్టూర్చి మొదలెట్టారు. 'ఓరి పిచ్చోడా... నేను చెప్పడం కాదురా. సమకాలీన రాజకీయాలను గమనించి నువ్వే తెలుసుకోవాలి. మొన్నటికి మొన్న మనదేశ యువరాజావారు ఎలాంటి ఉపన్యాసం దంచారో గుర్తు తెచ్చుకో. ఉదాహరణకు ఆయనేమన్నారు? మీ గిన్నెలో అన్నాన్నవుతా, ఆదుకునే అన్ననవుతా, నడిపించే సేనానవుతా, చేతిలో పుస్తకమవుతా... అనే ధోరణిలో రెచ్చిపోలేదూ? ఆ మాటల మతలబులు నేర్చుకోవాలి. తెలిసిందా?'

'ఓ... తెలిసిందండి. ఇంతకంటే బాగా చెబుతా వినండి. మీ టిఫిన్‌ తినే చెంచానవుతా. మీ ఇడ్లీలోకి చెట్నీనవుతా. మీ రోట్లో రోకలవుతా. మీ బకెట్లో చెంబునవుతా. మీ చొక్కాకు గుండీనవుతా. ఇలాగే కదండి...'

గురువుగారు పకపకా నవ్వారు. 'బాగా చెప్పావురా. ఆయన ఉపన్యాసం కంటే నీదే బాగుంది. ఆయన ఇంకా ఏమన్నారు? ప్రత్యర్థి పార్టీలు బట్టతలవాళ్లకు క్షవరం చేయించే బాపతని, మాటలు అమ్మేసే రకమని అన్నారు చూశావా? ఆ చాతుర్యం ఒంటపట్టించుకోవాలి...'

'చాలండి గురూగారూ! ఈ మాత్రం చెబితే రెచ్చిపోనూ. ఎగస్పార్టీవాళ్లు గుడ్డివాళ్లకు కళ్లజోళ్లు అమ్మే రకమని అనొచ్చండి. చెవిటివాళ్లకు రేడియోలు, మూగవాళ్లకు మైకులు, పొలాలు లేనివాళ్లకు నాగళ్లు, చొక్కాల్లేనోళ్లకు గుండీలు ఇస్తారని చెప్పేసేసి చాలా చెప్పొచ్చండి. అనడానికేముందండి... అయినా నాకు తెలియక అడుగుతానండీ, ఎగస్పార్టీవాళ్లు క్షవరం చేస్తారనడానికి ఇంకా ఏం మిగిల్చారండి వీళ్లు?'

'అబ్బో... అదరగొట్టావురా. నిజమే. మొత్తం క్షవరమంతా వాళ్లే చేశాక ఇంకేం మిగిలిందని? ఇక రాజమాత ఉపన్యాసం కూడా చదువుకో. అవినీతి మీద యుద్ధం చేయాలంటున్నారు. అసలు జరిగిన అవినీతంతా వాళ్ల హయాములోదే కద? లక్షల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన విషయాలేవీ గుర్తేలేనట్టు మాట్లాడారు చూశావా? అలాగే మనరాష్ట్రంలో యువనేత ఉపన్యాసాలు వింటున్నావుగా? స్వర్ణయుగం తెచ్చేస్తానంటున్నాడు... తండ్రిని అడ్డంపెట్టుకుని బంగారం లాంటి రాష్ట్రాన్ని దోచిన సంగతి దాచేసి! నువ్వు కూడా ఆ తెలివి కనబరచాలి...'

'అవునండి. మనం చేసిన అవకతవక, అక్రమాల పనుల గురించి ఎత్తకుండా, మళ్ళీ అధికారమిస్తే వాటినే తుదముట్టించేస్తామనొచ్చండి. అంతేకదండి'

'అద్గది. దార్లోకొచ్చావు. ఇప్పుడు రాసుకో, ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో. ఏమాత్రం సంకోచించకుండా ఎడాపెడా వాడేసుకోడానికి బోలెడన్ని అబద్ధాలు సిద్ధం చేసుకో. ఓడిపోతామనే భయం మనసులో ఉన్నా దాన్ని కప్పిపుచ్చుకొని మాట్లాడే నిబ్బరాన్ని, సిగ్గులేనితనాన్ని ఒంటపట్టించుకో. ప్రత్యర్థుల మీద రువ్వడానికి బోలెడు జోకులు, ఛలోక్తులు రాసుకుని ఉంచుకో. ఎగస్పార్టీవాళ్లకు అంటగట్టడానికి కులతత్వం, మతతత్వం, వేర్పాటువాదం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టే నైపుణ్యం, అవినీతిపరులు జైల్లో ఉన్నా వారిని విడిపించి మరీ నాటకాలాడించే నేర్పరితనం, దొంగలతోనైనా దోస్తీకట్టే చాతుర్యం, అమలు చేసే ఉద్దేశం లేకపోయినా ఏకబిగిన చదవడానికి అర్థంపర్థం లేనివైనా సరే బోలెడు హామీలు రాసుకుని ఉంచుకో. ఇవన్నీ బజార్లో దొరికేవి కాదు కాబట్టి, ఆ సంచి అవతల పడేసి నీ బుర్రకు పదునుపెట్టుకో. అప్పుడిక నీదే గెలుపు. ఇక పోయిరా!'

PUBLISHED IN EENADU ON 28/01/2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి