బుధవారం, ఏప్రిల్ 02, 2014

గూడు వెనుక గూడుపుఠాణి!



'గూడు గూడనియేవు... 
గూడు నాదనియేవు... 
నీ గూడు ఏదిరా గురుడా! 
బొమ్మ లోపలి గాలి... 
తుస్సుమన్నాదంటే... 
మిగిలేది బొమికలే నరుడా!' 
- జనచైతన్యానంద స్వాముల వారు తత్వం పాడుతుంటే శిష్యుడు మౌనంగా వచ్చి కూర్చున్నాడు. పాట పూర్తవగానే 'సామాన్యుడి జీవిత లక్ష్యం ఓ గూడు ఏర్పాటు చేసుకోవడమే కదా స్వామీ! మరి మీ తత్వం వారికి బోధపడుతుందంటారా?' అని అడిగాడు.
'నేనీ తత్వాన్ని అందుకున్నది సామాన్యుల కోసం కాదు నాయనా! వారి ఆశల్ని ఆసరా చేసుకుని అడ్డంగా దోచుకుంటున్న అవినీతి నేతల్ని ఉద్దేశించి. సామాన్యుడి అవసరం, నాయకుల స్వార్థానికి బలవుతున్నప్పుడు మనలాంటి వాళ్లం ఒట్టి తత్వాలు పాడకూడదు నాయనా! వారిని చైతన్యవంతుల్ని చేయాలి. మన దేశాటన పరమార్థం అదే కదా?' అన్నారు స్వాములవారు.

'అర్థమైంది స్వామీ! ఇందాకా వూళ్లోకి వెళ్లినప్పుడు ఓ చిత్రమైన సంగతిని గమనించాను. అది చెబుదామనుకుని వచ్చి మీ తత్వంలో పడిపోయాను..'

'చెప్పు నాయనా!'

'అదేంటో స్వామీ ఈ వూరిలో చాలా చోట్ల మొండి గోడలతో మిగిలిపోయిన ఇళ్లు కనిపించాయి. వాటిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాపం.. ఈ వూరిలో చాలామంది సామాన్యులు ఓ గట్టి గూడు కట్టుకుందామని ఆశపడి, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆపేసినట్టున్నారు. ఆ సంసారుల తాపత్రయం చూస్తే బాధ కలిగింది స్వామీ!'

'ఇలాంటి ఇళ్లు ఈ రాజ్యంలో చాలా ఉన్నాయి నాయనా! కానీ అవి అలా ఆగిపోడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కావు. పాలకుల నిర్లక్ష్యాదౌర్భాగ్యాలు! వారి నీచ రాజకీయాలు!'

'ఎంత దారుణం! ప్రజల గోడు పట్టని ఆ పాలకులు ఎవరు స్వామీ?'

జనచైతన్యానంద స్వాముల వారు తన జోలె లోంచి మాయాదర్పణం తీసి, శిష్యుడికిచ్చి చూడమన్నారు. శిష్యుడు చూస్తూ చెప్పసాగాడు..

'ఆశ్చర్యం స్వామీ! ఎవరో ఇళ్లు కడతామంటూ సభల్లో వూదరగొడుతున్నాడు. సామాన్యులు కాసులు గుమ్మరిస్తున్నారు. కానీ ఆ కాసుల్ని కొందరు నాయకులు కుంచాలతో కొలిచి తమ వారికి పంచుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నిర్వేదంతో చూస్తున్నారు. మరి కొన్ని చోట్ల సామాన్యులను ఇళ్లలోంచి గెంటేసి ఎవరెవరో వాటిని ఆక్రమించుకుంటున్నారు. ఇదేమి అరాచకం స్వామీ?'

'ఈ రాజ్యంలో ఇంతవరకు యథేచ్ఛగా సాగిన నీచ రాజకీయం నాయనా! ఏవేవో స్వగృహ పథకాల పేరు చెప్పి కనీస ధరలకే ఇళ్లు కట్టించి ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు నేతలు. ఆ మాటలు నమ్మి కోట్లాది రూపాయల్ని ప్రజలు చెల్లించారు. పాలకుల నిర్లక్ష్యం, పేరుకుపోయిన అవినీతి వల్ల ఆ సొమ్ములు స్వాహా అయిపోయాయి. కట్టిన ఇళ్లు నాసిరకంగా మిగిలాయి. ఇలా కేవలం ఒక పథకం వల్లనే దాదాపు 365 కోట్ల ప్రజాధనం అతీగతీ లేకుండా వ్యర్థమైందని నా దివ్యదృష్టికి గోచరిస్తోంది. ఇక బడుగులకు ఉచితంగా ఇళ్లిస్తామని వూరించి, ఆ వంకతో అధికంగా అయినవారికి కేటాయించుకున్నారు..'

'అయ్యయ్యో స్వామీ! ఈ అరాచక ప్రభుత్వ అకృత్యాలను అడిగేవారే లేరా?'

'అడిగినా ప్రయోజనం ఏముంటుంది నాయనా! అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన ఓ అమాత్యవర్యుడు ఏమన్నాడో తెలుసా? ప్రభుత్వం తమది కాబట్టి ఇళ్లను తమ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకుంటామంటూ సాక్షాత్తూ రాజసభలోనే అహంకరించాడు..'

'ఔరా! ఇక ఈ ప్రజలు తమంత తాము తంటాలు పడాల్సిందేనా స్వామీ?'

'అందుకుగల అవకాశాలను అంతకంతకు భారం చేసింది నాయనా ఈ అరాచక ప్రభుత్వం. భూముల ధరలు, నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ధరలు ఇవన్నీ ఈ నేతల నిర్వాకం వల్ల నాలుగు రెట్లు పెరిగిపోయాయి..'

'హతవిధీ! ఇంత చేసిన ఈ నేతలు ఇంకేం బాగు పడతారులెండి స్వామీ?'

'పిచ్చివాడా! నీ బుద్ధి హిమాలయాల్లో చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది నాయనా! ఇలాంటి అయోమయ, అవకతవకల పాలనను అందించిన ఈ రాజ్యపు రాజావారి కుటుంబం మాత్రం కోట్లకు పడగలెత్తింది నాయనా! ఆ రాజుగారి కొడుకు వందేసి గదుల భవంతులను కట్టుకున్నాడు. పొరుగు రాజ్యానా కోటలు నిర్మించుకున్నాడు. రాజుగారి బంధుకోటి.. ఒకోటీ.. ఇంకోటీ.. మరింకోటీ.. అంటూ కోట్లు కొల్లగొట్టుకున్నారు నాయనా!'

'ఇప్పుడర్థమైంది స్వామీ! మీరు మొదట్లో ఆ తత్వం ఎవరిని ఉద్దేశించి పాడారో! నేను వెంటనే వూర్లోకి వెళ్లి సామాన్యులను కలసి ఈ రాజ్యంలో జరిగిన అక్రమాలను తెలియజేసి వారిని చైతన్యవంతుల్ని చేస్తాను. ఆశీర్వదించండి స్వామీ!'

'ప్రజాదరణ ప్రాప్తిరస్తు!'

PUBLISHED IN EENADU ON 02/04/2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి