బుధవారం, ఏప్రిల్ 30, 2014

అసలైన చికిత్స!



డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు ఆసుపత్రికి పంకజాక్షి ఆదరాబాదరా వచ్చింది. పక్కనే ఆమె భర్త అప్పారావు కోపంగా, చిరాగ్గా చూస్తూ నుంచుని ఉన్నాడు.

'డాక్టర్‌! ఈయన ఉదయం లేస్తూనే వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారండి. మీరే కాపాడాలి' అందామె కొంగును నోట్లో దోపుకొంటూ.

'ఛ... నోర్ముయ్‌! చమడాలు వలిచేస్తా' అన్నాడు అప్పారావు.

పంకజాక్షి గుడ్లనీరు కుక్కుకుని, 'పెళ్లయిన దగ్గర్నుంచి ఒక్కమాట అని ఎరగరండి. ఏది పెడితే అది నోరు మూసుకుని తినేవారు. పెళ్లయిన కొత్తలో ఈయనకసలు నోట్లో నాలుక ఉందో లేదోనని ఆయన నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి పరీక్షించాను కూడానండి. నోట్లో వేలుపెడితే కొరకరు సరికదా, చంటి పిల్లాడిలా చీకుతారండి. అలాంటి మనిషి ఇలా నానా తిట్లూ తిడుతున్నారండి. ఏదైనా పిచ్చి పట్టిందేమోనని భయమేస్తోందండి'

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు తలపంకించి అప్పారావుతో 'మిమ్మల్నోసారి పరీక్షించాలి. ఇలా కూర్చోండి' అన్నారు.

'నువ్వెవరు నన్ను పరీక్షించడానికి? వెళ్లి మీ నాన్నని పరీక్షించుకో, అమ్మని పరీక్షించుకో. నా జోలికొస్తే తాట తీస్తా' అన్నాడు అప్పారావు.

డాక్టర్‌ పిచ్చేశ్వరరావు పంకజాక్షికేసి తిరిగి, 'కొన్ని రోజులుగా మీవారు ఎక్కడెక్కడ తిరిగారో, ఏం చేశారో చెప్పగలవామ్మా?' అని అడిగారు.

'ఆయ్‌... ఎన్నికల కాలం కదండీ! కనిపించిన ప్రతి రాజకీయ నాయకుడి సభలకు పోయొచ్చేవారండి. ఏ నేత రోడ్‌ షో పెట్టినా ఈయన ఉండాల్సిందేనండి. ఇంట్లో టీవీలో కూడా అన్నీ ప్రచారం వార్తలే చూసి చూసి చంపేశారండి బాబూ...' అంది పంకజాక్షి.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావుకు విషయం అర్థమైంది.

'నువ్వేం కంగారుపడకమ్మా. నేను నయంచేస్తా కదా?' అన్నారు.

ఇంతలో అప్పారావు దిగ్గున లేచి, 'తోలు వలుస్తా! తొక్కలో కబుర్లు నువ్వూను. నాకే రోగం లేదని సవాలు చేస్తా, నువ్వు చేస్తావా? నీ మాట అబద్ధమైతే నీ స్టెతస్కోపు నాకిచ్చేయాలి. నిజమైతే నా మొలతాడు నీకిచ్చేస్తా. సవాలుకు సిద్ధమేనా?' అన్నాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు నవ్వి, 'అలాగే అప్పారావు! మీకే రోగం లేదు. ఉన్న రోగాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు, నాయకులకే ఉన్నా యి. సరేనా?' అన్నారు.

'ఏం సోయి తప్పి మాట్లాడుతున్నవా? జనానికేం రోగముంటది? ఉన్న రుగ్మతలన్నీ నాయకులకే ఉంటవి. ఆల్లంతా ఆగమాగం చేస్తంటే నువ్వేం తమాషా చూస్తన్నవా?' అని భార్య కేసి తిరిగి, 'ఈడి పేరేంటి, పిచ్చేశ్వర్రావు కదూ?' అని అడిగి, మళ్ళీ డాక్టర్‌కేసి చూస్తూ, 'నేను చిటికేస్తే వెయ్యి ముక్కలవుతావు' అన్నాడు.

ఈలోగా డాక్టర్‌ సైగ చేయడంతో నర్సు వచ్చి అప్పారావును కూర్చోబెట్టింది. అప్పారావు ఆమెను చూస్తూనే చటుక్కున ఆమె బుగ్గలు నిమిరాడు. రెండు చేతుల్తో ఆమె తలవంచి నడినెత్తిన ముద్దుపెట్టుకుని, మెత్తగా నవ్వుతూ 'నర్సులారా... అమ్మలారా... అక్కలారా... రాబోయేది స్వర్ణయుగం. నేనే సీఎం అవుతా. అప్పుడు మీకందరికీ బంగారు సిరెంజీలు ఇస్తా. వాటితో పొడవడానికి ఉచితంగా రోగుల్ని సరఫరా చేస్తా. నా మీద మా ఆవిడ, ఈ డాక్టరు కుట్ర పన్నుతున్నారు. కానీ, జనమంతా నా వెనకే ఉన్నారు. బై ది బై... నువ్వు కొత్త ఆసుపత్రి కట్టుకోవడానికి భూమినిప్పిస్తా, దాని విలువలో సగం నాకిస్తావా? పోనీ నా పది రూపాయల కంపెనీ షేర్లు మూడువేలు పెట్టి కొనుక్కుంటావా?' అన్నాడు.

ఇంతలోనే డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు అతడికి ఓ ఇంజెక్షన్‌ ఇచ్చారు. దాంతో అప్పారావు ఏదో మత్తులో ఉన్నట్టుగా, 'నీ నాలుక తెగ్గోస్తా... నా జోలికొస్తే ఖబడ్దార్‌... నువ్వొక రావణాసురుడివి... కంసుడివి... హిరణ్య కశిపుడివి... లోఫర్‌వి... డాఫర్‌వి... అనకొండవి... తోడేలువి... కుక్కవి... గాడిదవి... తోలు వలుస్తా... తీట తీసేస్తా... చర్మం వలిచేస్తా... గుడ్డలిప్పదీస్తా... చెప్పుతో కొడతా...' అంటూ గొణగసాగాడు.

పంకజాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ 'ఈయనకి ఏమైందండీ?' అంది.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు 'మరేం ఫర్వాలేదమ్మా... రకరకాల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, తిట్లు, శాపనార్థాలు విని విని మీవారి మనసు, బుర్ర గందరగోళానికి గురయ్యాయి. నేతలు ఇంతలా దిగజారి మాట్లాడటం, సహజంగా నెమ్మదస్తుడైన మీ వారిని కలవరపరచింది. అంతే!' అన్నారు.

'మరి ఈయనకి ఏంటండీ చికిత్స?' అంది పంకజాక్షి.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు ఆమెను ఆగమంటూ సైగ చేసి, అప్పారావు దగ్గరకు వెళ్లి, 'అప్పారావుగారూ, ఇప్పుడెలా ఉంది?' అన్నారు.

'నాకు కాదండీ... అవినీతిపరులు, చిత్తశుద్ధి లేనివారు, ప్రజల్లో విద్వేషాలు పెంచేవాళ్లు, నేరారోపణలు ఉండీ జైలుకెళ్లినా బెయిలు మీద వచ్చి సిగ్గులేకుండా జనానికి మాయమాటలు చెప్పేవారు, ప్రజల ఆస్తులు దోచుకునేవారు, అక్రమంగా కోట్లకు కోట్లు దోచుకున్నవారు... వీళ్లందరికీ ఉందండీ మాయరోగం! వీళ్లా చెప్పండి మన అభ్యర్థులు? ముందువాళ్లకు చెయ్యండి వైద్యం...' అన్నాడు అప్పారావు నీరసంగా.

'నేను కాదు, ఇలాంటి నీచ రాజకీయ నేతలందరికీ మీరే చక్కని వైద్యం చేయగలరు' అన్నారు డాక్టర్‌.

ఆ మాటలకు అప్పారావు ఉత్సాహంగా లేచి కూర్చుని 'నేనా... ఎలా?' అన్నాడు.

'మీ ఓటు వేయడం ద్వారా. అవినీతిపరులైన అసుర నేతల్ని మీ ఓటు అనే వజ్రాయుధంతో శిక్షించండి. పనిచేసే నేతనే ఎన్నుకోండి. మీ చేతిలోని ఓటే సమాజంలోని అన్ని రోగాలకూ చికిత్స' అన్నారు.

'మనసులో దిగులంతా మాయం చేశారు డాక్టర్‌' అంటూ అప్పారావు లేచి కూర్చున్నాడు. పంకజాక్షి ఆనందంతో కళ్లు తుడుచుకుని డాక్టర్‌కి నమస్కరించింది.

PUBLISHED IN EENADU ON 30.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి