శిష్యుడు
చెమటలు కక్కుకుంటూ వచ్చేసరికి
గురువుగారు పడక్కుర్చీలో కూర్చుని
‘అప్పు చేసి పప్పుకూడు’
సినిమా చూస్తున్నారు.
“గురూగారూ!
అర్జంటు పనుండి వచ్చానండి... మీరెలాగైనా సరే నాకు
అప్పు ఇవ్వాలి... లేదా ఇప్పించాలి...”
“ముందు
కాస్త నిమ్మళించరా
శిష్యా! కాసేపు సినిమా చూడు. అప్పు చేసి
పప్పుకూడు. ఎన్టీవోడు ఎంత బాగా చేశాడ్రా...
అన్నీ చేసి చివరాకరికి గొప్పలకు అప్పులు చేస్తే తిప్పలు తప్పవని
మా బాగా చెప్పార్రా...”
“ఆయన చెబితే చెప్పాడు
కానీ... నాకు మాత్రం అప్పు
కావాలి సర్... పరిస్థితి ఘోరంగా ఉంది... ఇంటి పనోళ్లకు జీతం ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవండి...
జీతాలిస్తే ఇంటి అవసరాలకు సరిపోవండి... అవసరాలు
చూస్తే ఫీజులు కట్టలేనండి...
ఫీజులు కడితే తిండికి
కటకటండి...
ఆయ్!”
“ఓరోరి
ఆగరా శిష్యా! ఓ...
తెగ ఆయాసపడిపోతన్నావ్. మొత్తానికి చూస్తే నీ పని
ఆంధ్రప్రదేశ్ యవ్వారంగా ఏడుస్తోందన్నమాట. కానీ
నీలాగా ఆ ప్రభుత్వం
కంగారు పడుతోందా చెప్పు.
ఎక్కడా సిగ్గూ ఎగ్గూ
లేకుండా చేసిన నిర్వాకాన్ని సమర్థించుకుంటోంది. మరి ఆ అధినేతను చూసైనా నేర్చుకోవద్దురా, దిగాలు పడిపోకూడదని?”
“సార్...
నేనేదో అవసరం
కోసం వస్తే మీరు
పాఠాలు మొదలెట్టారేంటి సార్...
“
“ఓరి
నీ హడావుడి పాడుగానూ!
నీకెలాగో సర్దుతాలే కానీ,
ముందు నిదానించరా. డబ్బులున్నప్పుడు ఎవడైనా ఖర్చుపెడతాడు. లేకపోయినా
ఖర్చుపెట్టేవాడే హీరో. ఏమంటావ్?”
“ఇంకేమంటానండీ,
మీరు సర్దుతానన్నాక
ధైర్యం వచ్చిందండి. కానీ
నేనెక్కడ? ఆ రాష్ట్ర
ప్రభుత్వం ఎక్కడ? దాంతో పోల్చారేంటండీ?”
“ఒరే
నువ్విక్కడ ఎలా దివాళా
తీశావో, అక్కడది కూడా
దివాళా తీయడానికి సిద్దంగా
ఉందిరా మరి... “
“అదేంటండీ...
అంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం నాలాంటి పరిస్థితిలో పడిపోవడమేంటండీ?”
“అదేరా
నీకు చెప్పబోయే పాఠం
ఇవాళ. ఇంటినే సరిదిద్దుకోలేని నువ్వు
ఆ ప్రభుత్వం నేత
నుంచి చాలా చాలా నేర్చుకోవాల్రా...
అప్పుడు గానీ నీకు నిబ్బరం అబ్బదు...”
“బాబ్బాబూ...
ఆ నిబ్బరం సంగతేంటో కాస్త చెప్పండి,
నేర్చుకుంటాను...”
“సరేరా... ముందు నీకెన్ని అప్పులున్నాయో
లెక్కగట్టుకుని దాని
మరో 70 వేల రూపాయలు జోడించుకోరా. నువ్వు
కూడా ఆ పరగణావాడివే కదా?”
“అదేంటి
సార్? నా
అప్పులతోనే సతమతమవుతుంటే, మరో 70 వేల
రూపాయలు కలుపుతారు.
గుండె గుబేలు మంటోంది సార్!”
“మరదేరా మతలబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రదేశ్ జనాభా
దాదాపు 5 కోట్లు అనుకో. వాళ్లందరికీ తలా
70 వేల రూపాయలు అప్పు
తెచ్చి నెత్తి మీద పెట్టాడ్రా ఆ
నేత...”
“అయ్యబాబోయ్. అంతలేసి అప్పులా?
ఎందుకు చేస్తున్నాడండీ అలా అడ్డగోలుగానూ?”
“ఒరే
అది అడ్డగోలు తనం కాదురా... నికార్సయిన నీచ రాజకీయ తంత్రం. నీలాంటి
వర్ధమాన రాజకీయ నేతకి
నిగ్గుతేలే నిస్సిగ్గు పాఠం... సరే... ఈ
సంగతి చెప్పు... నువ్వే
గనుక ముఖ్యమంత్రివయ్యావనుకో. ఏం
చేస్తావ్?”
“ఆహా...
ఆ ఊహే అద్భుతంగా ఉంది
సార్! నన్ను ఎన్నుకున్నప్రజానీకానికి మేలు
చేయడానికి అహర్నిశం శ్రమిస్తానండి. పరిశ్రమలు
అవీ వచ్చేలా చేసి,
జనం జీవన
ప్రమాణాలు పెంచడానికి కష్టపడతానండి. ఉద్యోగాలూ అవీ కల్పించి
ప్రజలు వాళ్ల
కాళ్లమీద వాళ్లు నిలబడి నిలదొక్కుకునేలా చేస్తానండి... ఇంకా...”
“ఏడిశావ్లే ఆపేసెయ్! నువ్విలా
ఆదర్శాలు గట్రా వల్లించావనుకో. ఎందుకూ కొరగాకుండా పోతావ్. అందుకే అవన్నీ కట్టిపెట్టి ఆ రాష్ట్ర నేత
నుంచి నాణ్యమైన నికృష్ట
విధానాలు నేర్చుకోవాలి. నీ సొంత అధికారాన్ని
కాపాడుకోడానికి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలి. అర్థమైందా?”
“ఓహో
అర్థమైందండి. ఇంతకీ ఏంచేశాడండీ
ఆయన?”
“అద్గదీ ఇప్పుడు దార్లోకి
వచ్చావురా శిష్యా! ఆయన ప్రజలకు తాత్కాలిక
తాయిలాలు పంచిపెడుతున్నాడ్రా. అందుకోసం ఆచరణ
సాధ్యం కాని పథకాలు రచించాడు. గమనించలేదా?”
“అవునండి.
నవబెడ్డలో,
నవ రాళ్లో అని
పథకాలండి...”
“ఆ...
సరిగ్గా చెప్పావ్! ఆటిని ప్రకటించి ఆశలు
పెంచే, అధికారంలోకి వచ్చాడు. అంచేత
ఆటిని కొనసాగించడం కోసం ఎక్కడెక్కడ నుంచో
అప్పులు చేస్తూ ఆఖరికి రాష్ట్రాన్ని
దివాళా తీసే దశకు తీసుకువచ్చాడు.
ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అప్పులు లెక్కగడితే ఏకంగా
3లక్షల 73 వేల
కోట్లకు పైగానే తేలింది.
ఆ నేత అయిదేళ్ల అధికార
కాలానికి అది ఆరున్నర
లక్షల కోట్లకు చేరిపోయేలా ఉంది.
ఇప్పటికే ఉద్యోగులకు
జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి
కనిపిస్తోంది. ఓ పక్క
చేయించిన పనులకు
బిల్లులు చెల్లించకపోవడంతో
కొత్త పనులకు
కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆఖరికి రాష్ట్రంలో ఉన్న
ప్రభుత్వ భూముల్ని కూడా
అడ్డగోలుగా అమ్మకానికి పెట్టేస్తున్నాడు...
ఇవన్నీచూస్తే నీకేమనిపిస్తోందో చెప్పు...”
“అయ్యబాబోయ్! ఆ రాష్ట్ర పరిస్థితి నా ఇంటి పరిస్థితి కన్నా ఘోరంగా
ఉన్నట్టుందండి. ఇలాగైతే మున్ముందు రాష్ట్రం పరిస్థితి ఏమిటండీ? పాపం
అన్యాయమైపోదాండీ? దివాళా
తీస్తే ఎంత దారుణమండీ?”
“ఓరే...
నీలో ఇంకా జాలీ, దయా లాంటి గుణాలు
ఉన్నట్టున్నాయిరా. అవి నువ్వు నీచ
రాజకీయ నేతగా
ఎదగడానికి ఎందుకూ
పనికిరావు. కాబట్టి వాటిని
వెంటనే వదిలించుకో.
అయినా... రాష్ట్రం ఎలా పోతే నీకెందుకురా? దాని
ప్రతిష్ట ఎలా మసకబారితే
నీకేల? నీకు
కావలసింది అధికారం.
ఓటేసే జనానికి తాత్కాలిక
తాయిలాలు పడేస్తూ నువ్వు
నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీ
వాళ్లకి, నీకు ముడుపులు
చెల్లించే బడా బాబులకీ భూములు, సెజ్‌లు కట్టబెడుతూ కుర్చీ ఎక్కి కాసుల కథాకళి ఆడడమే ముఖ్యం.
ముందు ఈ పాఠాలు నేర్చుకో.
అర్థమైందా?”
“ఆహా...
అద్భతమైన పాఠాలు సార్.
కానీ
నాదో సందేహం సార్. తాత్కాలిక తాయిలాల కోసం అంతలేసి
సొమ్ములు మళ్లిస్తున్నాడు కదా? మరి
ఆదాయం సంగతేంటండీ?”
“అయితే
నువ్వు పూర్తిగా అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోలేదని
తెలుస్తోందిరా. తాత్కాలికంగా ఇచ్చినట్టే ఇచ్చి జరిమానాలు అవీ భారీగా పెంచేసి
జనం నడ్డి
విరగ్గొట్టడం లేదూ? తాయిలాల సొమ్ముతో జనం తాగి
తందనాలు ఆడతారని తెలిసి మద్యం ధరలు పెంచేసి జెల్ల
కొట్టి వసూలు చేయడం లేదూ?”
“అద్భతం సార్. పైకి
ప్రజాసేవ పేరు చెప్పి
తాయిలాల వడ్డింపు. ఆనక దొడ్డిదారిన వాళ్ల
దగ్గర నుంచే
పిండుకోవడం. ఎంత మంచి
అడ్డదిడ్డ రాజకీయ
పాఠాలండీ ఇవన్నీ? కడుపు నిండిపోయిందండి. ఇక
వస్తానండి...”
“మరి
అప్పేదో కావాలని అడిగావ్?
“
“అక్కర్లేదు సార్... ఆ నిస్సిగ్గు నేతని చూశాక ధైర్యం
వచ్చేసిందండి. ఇల్లు అమ్మేసి జల్సా
చేస్తానండి. కుటుంబం ఏమై పోతే నాకేంటి
చెప్పండి!”
-సృజన
PUBLISHED IN JANASENA WEBSITE ON 8.5.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి