సోమవారం, మే 17, 2021

ప్రజల ప్రాణాలతో చెలగాటం!


 

“రండి బాబూ రండి... ఆలసించిన ఆశాభంగం... మంచి తరుణం మించిన దొరకదు... భలే మంచి చౌక బేరం... ఆసుపత్రి బెడ్లు... ఆక్సిజన్ సిలెండర్లు... రెమ్డెసివర్ ఇంజక్షన్లు... కరోనా కిట్లు... మీ కోసమే సిద్ధం చేశాం... రండి బాబూ రండి!”

- గురువుగారు చేతిలో పెట్టిన కాగితం చూసి శిష్యుడి మతి పోయింది. అర్థం కాక అయోమయంగా చూస్తూ గురువుగారినే అడిగాడు.
“ఇదేంటి గురూ గారూ! నేనేదో రాజకీయ పాఠాల కోసం మీ దగ్గరకి వస్తే, ఇదేదో కాగితం ఇచ్చి కంఠతా పట్టి అప్పజెప్పమంటున్నారు?”
“ఒరే రాజకీయ పాఠాలకేంరా? అయ్యెప్పుడూ ఉంటాయి. ముందు అర్జంటుగా లక్షలు, కోట్లు సంపాదించే మార్గం చూడరా. ఇలా అడ్డగోలుగా వెనకేశావనుకో, ఆనక రాజకీయాల్లో నిలబడితే పస లేని పథకాలకి ఖర్చు పెట్టడానికైనా పనికొస్తాయ్. ఏమంటావ్?”

“ఊరుకోండి గురూగారూ! ఇవన్నీ దొరకకే దండీ,  ఆంధ్ర ప్రజానీకం అల్లాడిపోతుంట? దొరకని వస్తువులతో వ్యాపారం చేయడమేంటండి?”
“ఒరేయ్ పిచ్చి సన్నాసీ! ఈటన్నిటినీ ముందు నువ్వు ఎలాగోలా దొరకపుచ్చుకోవాల్రా. ఆనక ఆటిని నీ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసుకోవచ్చు. సమస్యలోంచే అవకాశాలు వెతుక్కోవాలనే ఇంగితం తెలీదట్రా నీకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే కదరా, మా మంచి లాభసాటి వ్యాపారం?”
“అదేంటండీ... రాష్ట్రంలో కరోనా రోగులకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, రెమ్డెసివర్ ఇంజక్షన్లు గట్రా పుష్కలంగా దొరుకుతున్నాయని, దేనికీ కొరతే లేదని ఇప్పుడే ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన టీవీల్లో చూసి వస్తుంటేనూ? మీరిలాగంటారేంటి?”
“అది సరేరా... మరి రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న పరిస్థితేంటో నువ్వు చెప్పు, నీ అవగాహన ఎంతో చూద్దాం...”
“ఏముందండీ? దినదిన గండంగా ఉందండి. ఎప్పుడెవరికి మూడుతుందో తెలియడం లేదండి. కరోనా వచ్చిందంటే ఆసుపత్రులు కాపాడతాయనే ఆశ ఏ కోశానా కనబడ్డం లేదండి. కరోనా పరీక్షకని వెళితే, అదే రోజు జరుగుతుందో లేదో అనుమానమండి. పరీక్షించే పరికరాలు కావలసినన్ని లేవంటున్నారండి. ఒకవేళ పరీక్ష జరిగి పాజిటివ్ వస్తే రోగులకిచ్చే కిట్లు లేవంటున్నారండి. కర్మకాలి పరిస్థితి విషమించి ఆసుపత్రికి పరిగెడితే అక్కడ బెడ్లు లేవంటున్నారండి. కిందా మీదా పడి బెడ్ దొరికినా, ఎగ ఊపిరి వస్తే ఆక్సిజన్ లేదంటున్నారండి. పోనీ అది కూడా దొరికి ముక్కుకి ఆక్సిజన్ గొట్టం తగిలించినా పూర్తిగా ఉంటుందో లేదో అనుమానమేనండి. మధ్యలోనే ఆక్సిజన్ అయిపోయి పోవచ్చండి. లేదా మరో చోటకి తరలిస్తుంటే మధ్యలోనే ప్రాణాలు హరీమనొచ్చండి. ఈ మధ్య విజయనగరం, ప్రొద్దుటూరు, గూడూరు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందండి. అంతే కదండీ?”
“బాగానే చెప్పావురా... కానీ డబ్బులు వెదజల్లడానికి సిద్ధపడితే ఇవన్నీ దొరుకుతున్నాయని వినలేదా?”
“వినడమేంటండి బాబూ... కళ్లారా చూశానండి. మొన్న మా బాబాయ్కి ప్రాణం మీదకొస్తే ఇదే జరిగిందండి. రెమ్డెసివర్ ఇంజక్షన్ ముందు లేదన్నారండి. ఆ తర్వాత నలభై వేలకి దొరుకుతుందని చెప్పారండి. అందరం కలిసి డబ్బులు పోగుచేసి కడితే దొరికిందండి”
“మరంటే ఏంటి దానర్థం? ప్రజల కళ్ళ ఎదురుగానే బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోతున్నట్టేగా? అంటే దొరకబుచ్చుకునే వాడికి ముందుగానే అవన్నీ దొరుకుతున్నట్టేగా? అందుకనే మరి నిన్ను కొన్నాళ్లు ఈ వ్యాపారం చేయమంట? అర్థమైందా?”
“ఛీ... ఛీ... ఇలాంటి నీచమైన పని నేను చేయలేనండి... ఇది ప్రజల శవాల మీద చిల్లర ఏరుకోవడం లాంటి దరిద్రమైన పని లాంటిదే కదండి? జనం ప్రాణాల్ని పణంగా పెట్టి మన లాభం మనం చూసుకోవడమే కదండి?”
“వార్నీ అలా ఆవేశపడిపోతే ఎలారా? ఒక రాజకీయ నేతగా ఎదగాలనుకుంటే ఇలాంటి అడ్డగోలు వ్యాపారాలు ఎన్నో చేయాలొరే! ఇలా వెనకేస్తే కానీ ఎన్నికల్లో గెలవలేవు కూడాను. ఇక్కడ రాజకీయ రంగోళీ ఆడుతున్నవారిని చూసైనా నేర్చుకోరా బడుద్ధాయ్! ముందు నీ మనసులోంచి ప్రజానీకం పట్ల జాలి, దయ, కనికరం, నిజాయితీ లాంటి లొల్లాయి భావాలన్నీ తుడిచేయ్! ఇది నీచ రాజకీయంలో నికార్సయిన పాఠం. అర్థమైందా?”
“మీరింతగా చెప్పాక అర్థం కాక ఏమవుతుందండీ? మరైతే నాదొక సందేహం గురూ గారూ! ఒకవేళ మీరు చెబుతున్న పాఠాలు ఒంటబట్టి, రేపో, ఎళ్లుండో, కొన్నాళ్లకో నేను ఓ పరగణాకి ముఖ్యమంత్రినై పోయాననుకోండి... మరప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలో అది కూడా కాస్త చెబుదురూ?”
“ఒరేయ్ ఆ రాజకీయ పాఠాలకి కూడా నువ్వు ఎక్కడికీ వెళ్లక్కర్లేదురా. హాయిగా ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తూ ఎప్పటికప్పుడు సూత్రాలు రాసుకున్నావనుకో. నాణ్యమైన నీచ రాజకీయ అధినేతగా ఎదిగిపోతావ్. ఓ పక్క ప్రజలు అల్లాడిపోతుంటే ఇక్కడి నేతలు ఏం చేస్తున్నరో కాస్త గమనించు. నిజాలకి మసిబూసి అబద్దాలుగా చెలామణీ చేయిస్తున్నారు. కళ్ల ముందు వేల మంది చనిపోతుంటే... శ్మశానాల్లో శవాలు క్యూలో పడుకుని ఉంటే, మృతుల లెక్క నికార్సుగా బయటకి వస్తోందా? లేదే! దానికంటే నిస్సిగ్గు అరాచకీయం ఎక్కడుంటుందిరా? మరో పక్క ప్రాణావసరమైన ఇంజెక్షన్లు సమయానికి దొరక్క జనం గిలగిలలాడిపోతుంటే, అబ్బే... ఆ ఇంజెక్షన్లకు అసలు కొరతే లేదంటూ టీవీ కెమేరాల్లో మైకుల ముందు మూతులు పెట్టి అబద్దపు కూతులు కూస్తున్నారే? అంతకు మించిన నికృష్ట నిబ్బరం మరెక్కడైనా కనిపిస్తోందిరా? అలా వాగడం నేర్చుకో. ఇక ఆసుపత్రల్లో బెడ్స్ లేక రోగులు అతలాకుతలం అయిపోతుంటే, ప్రభుత్వం ప్రకటించే డ్యాష్ బోర్డుల్లో మాత్రం బోలెడన్ని ఖాళీ బెడ్లు ఉన్నట్టు కాకి లెక్కలు చూపెడుతున్నారే? అలా అడ్డగోలుగా బుకాయించడం ఎలాగో అర్థం చేసుకో! ఆక్సిజన్ సరఫరా తగినంత లేదని తెలిసినా, ఆ కొరతను నివారించే బాధ్యత మరచి ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నరే? ఆ బాధ్యతా రాహిత్యాన్ని నరనరానా ఒంటబట్టించుకో! కళ్ల ముందు జనం పిట్టల్లా రాలిపోతున్నా, ఎలాంటి చలనం లేకుండా పెను నిద్రపోతున్న ముఖ్య నేతల్ని చూసి, నీకు నీ కుర్చీ, అధికారం తప్ప మరేదీ ముఖ్యం కాదన్నంత దగుల్బాజీతనాన్ని ఎలా అలవర్చుకోవాలో ఆలోచించు. చనిపోయిన వాళ్ల బంధువులు, వాళ్ల బాధ చూడలేక ముందుకొచ్చిన ప్రజాసంఘాలు ఆవేశం పట్టలేక ఆందోళనలు చేస్తుంటే, వారి ఆవేదనని అర్థం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలనే ఇంగితం లేకుండా, అవన్నీప్రతిపక్ష నేతల కుట్రలంటూ అడ్డగోలుగా బుకాయించే నేర్పరితనం నేర్చుకో. తెలిసిందా?”
“అయ్య బాబోయ్! గురూ గారూ! బుర్ర తిరిగిపోతోందండి... ఇంతలేసి పాఠాలు ఎప్పుడూ వినలేదండి. ఇలాంటి సిగ్గుమాలిన, జగమొండి, శిఖండి, దగుల్బాజీ, దగాకోరు, దుర్మార్గ, దుర్భర, దుర్నీతి, దురంహంకార, దారుణాతి దారుణ నేతగా ఎదగాలంటే నాకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కావడం లేదండి... ఆయ్!”
“ఇవాళ్టికి చాలులే కానీ ఇక వెళ్లిరా! నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకో. నీ స్వీయ జాగ్రత్తే నీకు రక్ష”
                                                                                                                              -సృజన

PUBLISHED IN JANASENA SITE ON 12.5.21

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి