"అనగనగా ఓ రాజ్యంలో ఓరాజుగారు..."
-అంటూ మొదలుపెట్టారు గురువుగారు. శిష్యుడు ఉత్సాహంగా ముందుకు ఒంగి కూర్చుని, "ఏ రాజ్యంలోనండీ...?" అనడిగాడు.
"ఏదో అరాచక రాజ్యంరా... మధ్యలో ప్రశ్నలు అడక్కు... నీకంతగా కావాలనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రమే అనుకో. పోయేదేముంది? ముందు కథ విను..."
"మన్నించండి గురూగారూ. చెప్పండి" అన్నాడు శిష్యుడు నాలిక్కరుచుకుని.
"సరే... ఆ రాజుగారికి తానంత గొప్పవాడు మరొహడు ఉండడని మా చెడ్డ నమ్మకం. ఆ సంగతిని ఆయన మంత్రులు, సహచరులు, అనుచరులు ఎలాగో పసిగట్టేశారు. ఇంకేముంది? రాజుగారు 'ఊ...' అన్నా గొప్పే. 'ఊహూ' అన్నా గొప్పే. 'ఆహా... ఏం చెప్పారండీ, ఇంత గొప్ప ఆలోచనలు ఇంకెవరికొస్తాయండీ, తమకి కాక?' అంటూ భజన చేసేవాళ్లు. దాంతో ఆయనకిక ఎటు చూసినా ప్రశంసలే వినిపించేవి. పొగడ్తలే కనిపించేవి. చివరాకరికి ఆయన పొగడ్త తప్ప మరొకటి వినలేని పరిస్థితికి చేరిపోయాడు. ఎవరైనా ఎక్కడైనా విమర్శిస్తే అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవాడు. మరి ఆయన మీద ఆయనకున్నంత నమ్మకం రాజ్యంలో ప్రజానీకానికి ఉందాలేదా అని అడక్కు. అది మనకనవసరం. ఏం? ఓసారి రాజుగారు కోట మీద పచార్లు చేస్తూ తన గొప్పదనం గురించి తెగ ఆలోచించి సంబరపడిపోతున్నారు.
'నిజమే.... ఇంత రాజ్యాన్ని ఇంతబాగా పరిపాలిస్తున్న నేను చాలా గొప్పవాడిని' అనుకున్నాడు.
ఆ పక్కనే చెట్టుమీద ఉన్న కాకి అరిచింది.
'అసలు... ప్రజల గురించి ఇంతగా ఆలోచించే నేను చాలా ఉన్నతుడిని కూడా...' అనుకున్నాడు.
చెట్టుమీద కాకి మళ్లీ అరిచింది.
'నేనెంతో సౌమ్యుడిని. ధర్మాత్ముడిని. గొప్ప పరిపాలనా దక్షుడిని' అనుకున్నారు రాజుగారు.
చెట్టు మీద కాకి వరసగా మూడు సార్లు అరిచింది.
అంతే... ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది.
'ఎవరక్కడ?' అని అరిచారు.
'చిత్తం ప్రభూ' అని వచ్చారు రాజ భటులు.
'వెంటనే ఆ చెట్టుమీద కాకికి మరణ శిక్ష విధించండి...' అంటూ రాజుగారు హుంకరించారు.
వాళ్లకేం అర్థం కాలేదు. మొహమొహాలు చూసుకున్నారు. ఆపై భయపడుతూనే అడిగారు.
'క... క... కాకికా మహారాజా...?'
'అవును. కాకికే. అది రాజద్రోహం చేసింది. అందుకే... ' అంటూ అరిచారు.
అంతే... రాజ భటులు, మంత్రులు, వందిమాగధులు, అనుచరులు, సహచరులు... అందరూ పొలోమని బయల్దేరారు కాకి మీద దండయాత్రకి. వింటున్నావా?" అని అడిగారు గురూగారు.
"భలే ఉందండీ కథ.. ఆ తర్వాత ఏం జరిగిందండీ?" అని అడిగాడు శిష్యుడు.
"కథ సంగతి అలా ఉంచరా... ఇప్పుడో ప్రశ్న అడుగుతాను చెప్పు. ఇంతకీ రాజుగారికి ఆ చెట్టు మీద కాకి మీద అంత ఆగ్రహం ఎందుకు కలిగింది? కాకి చేసిన రాజద్రోహం ఏమిటి?"
శిష్యుడు ఎంత ఆలోచించినా సమాధానం తెలియలేదు.
"నాకు తట్టడం లేదు గురూగారూ. అంత గొప్ప రాజుగారికి ఆ కాకి మీద అంత దగ్డ ఎందుకండీ?" అనడిగాడు.
"నాకు తెలుసురా. నీకు అర్థం కాదని. జవాబు చాలా సులువురా. కాకి ఏమని అరుస్తుంది?"
"కావు...కావు... అని" అన్నాడు శిష్యుడు బుర్రగోక్కుంటూ.
గురూగారు నవ్వేసి చెప్పారు... "అదే మరి దాని తప్పు. ఆయన తనెంతో గొప్పవాడిని అనుకుంటే అది 'కావు.. కావు...' అంది. ఉన్నతుడిని అనుకుంటే 'కావు.. కావు' అంది. సౌమ్యుడిని, ధర్మాత్ముడిని, పరిపాలనా దక్షుడిని అనుకంటే మళ్లీ అదే కూత కూసింది. అదీ సంగతి. అర్థమైందా?"
శిష్యుడు తెల్లబోయాడు.
"వీడెక్కడి రాజండీ? ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి రాజు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడాండీ అసలు? బుర్రా, బుద్ధీ ఉన్న రాజెవడైనా తన ప్రజల గురించి, వాళ్ల సమస్యల గురించి ఆలోచిస్తాడు కానీ, ఇలాంటి పనికిమాలిన, పిచ్చి విషయాలను పట్టించుకుంటాడాండీ... " అంటూ ఆయాసపడ్డాడు.
గురువుగారు తాపీగా పడక్కుర్చీలో జారగిల పడి, "ఎందుకు ఉండడ్రా... ఓసారి ఊహా ప్రపంచంలోంచి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి నీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూడు. ఎక్కడదాకానో ఎందుకు నీ రాష్ట్రంలోనే కనిపిస్తాడు..." అన్నారు.
కాసేపు ఆలోచించిన శిష్యుడి మొహం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగింది.
"అర్థమైంది గురూగారూ! ఏవో విమర్శలు చేశాడని సొంత పార్టీ ఎంపీ మీదనే కక్షకట్టిన అధినేతను మర్చిపోయానండి. అయినా నాకు అర్థం కాక అడుగుతానీండి, ఓ పక్క జనం కరోనాతో అల్లాడిపోతుండగా... మరో పక్క సరైన సదుపాయాలు అందక ప్రాణాలు అడుగంటిపోతుండగా... ఇంకో పక్క ఈ విపత్కర పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయో తెలియని అయోమయ దుస్థితి నెలకొని ఉండగా... అవేమీ పట్టకుండా, పట్టించుకోకుండా... ప్రజల గురించి ఆవేదన పడకుండా... ఈ దయనీయ స్థితిగతుల నుంచి బయట పడడానికి మొత్తం యంత్రాంగాన్నంతటినీ ఏకత్రాటిపై నడిపించాల్సింది పోయి... రోజుకు 24 గంటలూ యుద్ధప్రాతిపదిక మీద నిరంతరం నిర్ణయాలు తీసుకుంటూ, వాటి ఫలితాలను విశ్లేషించుకుంటూ, నమ్ముకుని ఓటేసిన ప్రజల బాగోగుల కోసం అహరహం తపన పడాల్సింది పోయి... ఎవడో ఏదో అన్నాడని ఇలాంటి పనులు చేయడమేంటండీ? ఇలాంటి ప్రతిచర్యలకు ఇదాండీ సమయం? దీని కోసమాండీ, చట్టాన్ని, పోలీసుల్ని, అనుచరుల్ని, సహచరుల్ని వాడడం? మరో పక్క ఇలాంటి దిగజారుడు, దివాళాకోరు, దగుల్బాజీ, దౌర్భాగ్య, దారుణ చర్యలను ఉన్నత న్యాయస్థానాలు సైతం తప్పుపడుతున్న దాఖలాలు కనిపించడం లేదాండీ? ఇదెంత సిగ్గుచేటండీ. రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా పల్చనైపోదండీ? అబ్బే... నా రక్తం ఉడికిపోతోందండి... మీరేమన్నా అనుకోండి అంతే..." అంటూ శిష్యుడు ఊగిపోయాడు.
గురువుగారు నవ్వి, "ఆగరా బడుద్దాయ్! కాస్త నీ ఆవేశాన్ని పక్కన పెట్టు. నువ్వొచ్చింది రాజకీయ పాఠాలు నేర్చుకోడానికన్న సంగతి మర్చిపోకు. ఓ నేతగా ఎదగాలనుకునే నీకు ఇంతకంటే గొప్ప నీచ సూత్రాలు ఎక్కడ దొరుకుతాయిరా? అధికారమే పరమావధి అనుకుని రంగంలోకి దిగాక, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు పడకూడదురా. అసలు సిగ్గూ ఎగ్గూ వదిలేయకపోతే రాజకీయాల్లో ఎలా రాణిస్తావురా? ఈ మొత్తం వ్యవహారంలో గూడార్థం చూడు. విమర్శలు, ఆరోపణలు మన అమ్ముల పొదిలో అస్త్రాల్లాంటివిరోయ్! వాటిని ఎలా వాడాలో కానుకోవాలి. ఇవి లేకుండా అసలు అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా చెప్పు? ఒకప్పుడు ఈ నేత, ఆయన పితా కూడా ఊరూవాడా పాదయాత్రలు చేసి, అధికారంలో ఉన్నవారిని నానా తిట్లూ తిట్టి, అడ్డమైన ఆరోపణలు చేసి, దుమ్మెత్తి పోసి, విమర్శలు గుప్పించి, జనాన్ని ఏమార్చి కుర్చీ ఎక్కిన వాళ్లే కదట్రా! మరా సంగతి మర్చిపోతే ఎలా? అధికారం అందాక కూడా అనుచరుల చేత, సహచరుల చేత, మంత్రుల చేత చేయిస్తున్న పనే వితండ విమర్శల వింత పురాణ పారాయణే కదరా? అలాంటి విమర్శల్ని, ఆరోపణల్ని మనం వాడుకోవాలి కానీ, మరొకడిని వాడనిస్తే ఎలారా? మరిలాంటి విమర్శలే రేపు పెద్దవై, ప్రజల మనసుల్ని పాడుచేస్తే కుర్చీకిందకి నీళ్లు వస్తాయోమోననే భయం, ముందు జాగ్రత్త, ఉలికిపాటు, ఉడుకుమోత్తనం లేకపోతే ఎలారా? అందుకే ఎక్కడ ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా వెంటనే అప్రమత్తం అయిపోవాలి. వాడి మీద వీలయినన్ని అడ్డగోలు కేసులు బనాయించి, అనుచరుల చేత అవాకులు, చెవాకులు వాగించి, పోలీసుల్ని ఎగదోసి, థర్డ్ డిగ్రీలో, థౌజండ్ డిగ్రీలో ఉపయోగించి, చీకటి కొట్లో పడేసి దుండగుల చేత చితగ్గొట్టించి, మక్కెలిరగదన్ని, కుళ్లబొడిచి, కాళ్లు విరగ్గొట్టి, ఒళ్లు హూనం చేసి మరీ వదలాలి. ఇకపై ఎవరూ కూడా నోరెత్తడానికి కూడా భయపడేలా చేయాలి. అదీ అసలు రాజకీయం! అర్థమైందా నీ మట్టి బుర్రకి?" అన్నారు.
శిష్యుడు ఆవేశం నుంచి తేరుకుని, "తమరింతగా చెప్పాక అర్థం కాక చస్తుందాండీ? కానీ నాదో సందేహం గురూగారూ! మరిలాంటి నీచ, నికృష్ట, నిర్లజ్జాకర, నిర్లక్ష్య, దుష్ట, దురంత, దురంహంకార, దుర్మార్గ, దుర్భర, దారుణ చర్యలను ప్రజలు గమనించి, చైతన్య పూరితులైపోతే అసలుకే మోసం వస్తుంది కదాండీ?" అని అడిగాడు.
గురువుగారు పకపకా నవ్వారు. "ఓరినీ అమాయకత్వం అడవులు పట్టిపోనూ! ప్రజల మీద, వాళ్ల చైతన్యం మీద నమ్మకం ఉన్నవాడెవడైనా ఇలాంటి పనులు చేస్తార్రా? ఇలాంటి వాళ్ల దృష్టిలో ప్రజలు ఒట్టి వెర్రిబాగులోళ్లు! తాత్కాలిక తాయిలాలకి ఎగబడి ఓట్లు గుద్దేసే అమాయకులు! జనం మీద ఇంతటి చులకన భావం పెంచుకోవడం కూడా నీచ రాజకీయ సోపానంలో ఓ నిచ్చెనేరా! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అధికారం ఉన్నందుకు దాన్ని ఎంత దారుణంగా వాడుకోవాలో అది నేర్చుకోవాలి ముందు. తెలిసిందా? ఇక పోయిరా!"
-సృజన
PUBLISHED IN JANASENA WEBSITE ON 21.5.21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి