"ఏరా అలా మొహం వేలాడేసుకుని వచ్చావ్? ఏంటి కత?"
అంటూ గురువుగారు పలకరించారు. శిష్యుడు వంచిన తల ఎత్తకుండానే చెప్పాడు, "ఏంలేదు గురూగారూ! మా బాస్ తిట్టాడండి..."
"ఏమని తిట్టాడ్రా..."
"యూజ్‌లెస్ ఫెలో అన్నాడండి..."
"వహార్నీ... అది తిట్టు ఏలా అవుతుందిరా? ఆయనన్నది నిజమే కదా?"
"ఏంటి గురూగారూ మీరు కూడానూ! అసలే సిగ్గుపడి చితికిపోతుంటే మీరిలా ఎకసెక్కాలు చేస్తారేంటండీ?"
గురువుగారు నవ్వుతూ, "అలా ఉడుక్కోకురా... ఇంతకీ ఆయన పొరబడి తిట్టాడా? లేక నువ్వు నిజంగానే తప్పు చేశావా?"
"తప్పు నాదేనండి... అందుకే కదండీ, తెగ బాధ పడుతుంట? కాస్త మనసు తెరిపిగా ఉంటుందని మీ దగ్గరకి వచ్చానండి..."
"ఒరే... తప్పుచేస్తే తలెత్తుకుని తిరగాలి. ఎవడైనా తిడితే అడ్డగోలుగా వాదించాలి. ఆడి మీద ఉన్నవీ లేనివీ కల్పించి ఎదురెట్టాలి. వీలుంటే తప్పుడు కేసులు బనాయించాలి. ఇవన్నీ చేయడం మానేసి ఇలా సిగ్గు పడితే ఎలారా?"
"అదేంటి గురూగారూ! అలా అడ్డదిడ్డంగా చెబుతారు? మనం చేసిన తప్పు మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లు గుర్తించి తిడితే మనసు కుంచించుకుపోదాండీ? అరె... మాట పడ్డామే అని మథనపడిపోదాండీ? మన సామర్థ్యం మీద మనకే సందేహం వచ్చి కునారిల్లి పోదాండీ? అలా కాకుండా మీరు చెప్పినట్టు ఎవడైనా తలెగరేస్తాడాండీ? పొగరుతో ప్రవర్తిస్తాడాండీ? అలా చేసిన వాడెవడైనా మనిషా దున్నపోతా, చెప్పండి? అసలు అలాంటి దగుల్బాజీలు ఎక్కడైనా ఉంటారా చెప్పండి?"
"ఒరే... ఒరే... అలా ఆవేశపడిపోకురా బడుద్దాయ్! కాస్త కళ్లెట్టుకు చూడు. నీ రాష్ట్ర అధినేతనే నువ్వు మర్చిపోతే ఎలారా? యధా రాజా తథా ప్రజా అన్నట్టు ఆయనగారి దగ్గర నుంచి హాయిగా నేర్చుకోవాల్సిన నాణ్యమైన గుణాలే కదరా ఇవి?"
"ఆహా... గురూగారూ! నన్ను మాటల్లో పెట్టి రాజకీయ పాఠాలు మొదలుపెట్టేశారన్న మాట. చెప్పండి గురూగారూ రాసుకుంటాను..."
"నేను చెప్పడం కాదురా... నువ్వే చెప్పు. మన రాష్ట్రానికి న్యాయం చెప్పే పెద్దబాస్ ఎవర్రా?"
"హైకోర్ట్ గురూగారూ!"
"మరి మన దేశానికే తలమానికంగా మార్గనిర్దేశం చేసి నిజాల నిగ్గుదీసేదెవర్రా?"
"సుప్రీం కోర్ట్ కదండీ!"
"మరి ఆ రెండు న్యాయ పెద్దన్నలు మన రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎన్నిసార్లు తప్పుపట్టాయో చెప్పగలవా?"
శిష్యుడు తెల్లమొహం వేశాడు. బుర్రగోక్కున్నాడు. ఆపై అన్నాడు, "చాలా అన్యాయం గురూగారూ! ఇంత చిక్కుప్రశ్న వేస్తే ఎలాగండీ?"
గురువుగారు పగలబడి నవ్వేశారు, "నిజమేరోయ్ ఇది నిజంగా చిక్కు ప్రశ్నే. దీనికి సరైన సమాధానం చెప్పాలంటే మహామహులకే సాధ్యం కాదు... నేను కూడా అధినేతలుంగారు కుర్చీ ఎక్కాక ఓ ఏడాది వరకు లెక్కెట్టాన్రా... హైకోర్టను, సుప్రీంకోర్టను ఏడాదిపాలనలో మందలింపులో, చివాట్లో, మొట్టికాయలో, చెంపదెబ్బలో, తీవ్ర ఆసహనం వ్యక్తం చేయడమో... ఇలా ఏదైనా అనుకో... ఏడాది కాలంలో దాదాపు 65 సందర్భాలు ఉన్నాయిరా! అవీపాటికి శతమానం దాటేసి ఉంటాయి. మరి మానం, మర్యాదా ఉన్న నేత ఎవడైనా అయితే ఈ పాటికి ఆత్మ విమర్శ చేసుకుని, సిగ్గు పడిపోయి, తన తప్పులేంటో తెలుసుకుని, తీరు మార్చుకుని, సమీక్షించుకుని, సరిదిద్దుకుని, విశ్లేషించుకుని, చెంపలేసుకుని, జాగ్రత్తపడి,అప్రమత్తుడై, జాగురూకుడై, సరైనా దారిలో నడుస్తాడా లేడా?"
"మరంతే కదండీ? మనిషన్న వాడెవడైనా, సిగ్గూశరం ఉన్నవాడెవడైనా చేసేపని ఇదేకందండీ?"
"కానీ మరలా జరుగుతోందా?"
"అబ్బే... ఎక్కడండీ? దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టు ఉంది కదండీ పరిస్థితి..."
"మరదే నువ్వు నేర్చుకోవలసింది. నికార్సయిన నీచ రాజకీయ పాఠాలు నేర్చుకునేవాడికి ఆయనొక నడిచే విజ్ఞాన భాండాగారం. నిస్సిగ్గు రాజకీయాల నిగ్గు తేల్చే నిఘంటువు. ఉదాహరణకు హైకోర్టు వాత పెట్టిన తాజా పరిణామం చెప్పు, నీ పరిజ్ఞానం ఎంతుందో చూద్దాం..."
శిష్యుడు కాసేపు ఆలోచించి చెప్పాడు, "ఆ...గుర్తొచ్చింది గురూగారూ! పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది కదండీ? అంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుందండీ? నాకు తెలిసి ఇలా జరగడం ఇదే మొదటిసారేమోనండి... ఆయ్!"
"శెభాష్ బాగా చెప్పావ్. మరి తాజాగా సుప్రీం కోర్టు పెట్టిన చివాట్లేంటో కూడా చెప్పు చూద్దాం, నీకెంత గుర్తుందో?"
"గుర్తు లేకేండీ? సొంత పార్టీ ఎంపీపై అడ్డగోలుగా పెట్టిన కేసులో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చానందండి. మరది చాలదండీ, జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పరువు దెబ్బతినిందని చెప్పడానికి? ప్రభుత్వానికే కాదండి, ప్రజానీకానికి కూడా ఎంత నామర్దా అండీ?"
"బాగా చెప్పావ్. కానీ ఎక్కడైనా మన నేత సిగ్గుపడడం చూశావా? పైగా సుప్రీం కోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాలు జరగడం లేదూ? అదీ నువ్వు నేర్చుకోవలసిన మొదటి సూత్రం. న్యాయ స్థానం తీర్పుని కూడా మసిపూసి మారేడు కాయ చేసే తెలివితేటలు వంట పట్టించుకో. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దిగజారాయని హైకోర్ట్ వ్యాఖ్యానిస్తే, పట్టించుకోకుండా ఉండగలిగే తెగువను అలవర్చుకో. న్యాయ పాలనను బలహీన పరుస్తూ, న్యాయవ్యవస్థనే బెదిరించే తెంపరితనాన్ని అలవాటు చేసుకో. నిజాలు రాసే మీడియా సంస్థలపై కేసులు బనాయించే జగమొండితనాన్ని నరనరానా ఎక్కించుకో. ఎవరైనా నీమీద విమర్శలు చేస్తే, అందులో నిజానిజాలు విశ్లేషించుకోవడం మానేసి, వాళ్లపై రాజద్రోహం కేసు బనాయించే దౌర్జన్య రాజకీయాన్ని ఔపాసన పట్టు. పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, బెదిరించి నీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునేలా చేయగలిగే రాజకీయ రౌడీయిజాన్ని ఎలా చెలాయించాలో అవగాహన చేసుకో. సీఐడీ విభాగాన్ని నీ వ్యక్తిగత పగలకు, ప్రతీకారాలకు వీలుగా వ్యవహరించేలా చేయగలిగే రాజకీయ గుండాయిజాన్ని గుండెల నిండా నింపుకో. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించడానికి ఓ విధానం అంటూ లేదా అని న్యాయస్థానం ప్రశ్నిస్తే, ఏమాత్రం పట్టించుకోకుండా నీ పద్దతిలో నువ్వు సాగిపోయే నిబ్బరాన్ని అభ్యసించు. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేసినా, నేను మాత్రం నిర్వహిస్తానంటూ లక్షలాది విద్యార్ధులను, తల్లిదండ్రులను చివరి వరకు ఆందోళనకు, క్షోభకు గురిచేసే
మొండి మోటు విధానాల్నివల్లెవేసుకో. స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమీషన్ నీకు అనుగుణంగా నడుచుకోకపోతే ఆ సంస్థ ఉన్నతాధికారినే మార్చేసే తెగువను తెలుసుకో. కరోనాతో జనం అల్లాడిపోతున్నా, ఆ సంగతి గాలికొదిలేసి నీ రాజకీయ ప్రాధాన్యతలకే ప్రాముఖ్యాన్నిచ్చే ప్రజ్ఞను అలవర్చుకో. ఇలా ఒకటా రెండా... ఇక్కడి నేతని, అతడి అనుచరులను పరిశీలిస్తుంటే నీచ రాజకీయ ప్రహసనంలో సూత్రాలు వేలకు వేలు. రాసుకుంటున్నావా?"
ఆ పాటికే శిష్యుడు చెమటలు కక్కేస్తున్నాడు. ఆయాసపడిపోతూ, "గురూగారూ! ఇక ఆపేయండి. నా నోట్స్ పుస్తకం అయిపోయిందండి. అరాచక సూత్రాలు రాసుకోలేక చేతులు నెప్పులు పుడుతున్నాయండి..." అన్నాడు.
గురువుగారు నవ్వి, "సరే ఇక పోయిరా. ఇంతకీ నీ బాస్ తిట్టాడనే సిగ్గు పోయిందా?"
"ఇంత విన్నాక ఇక సిగ్గా, ఎగ్గా గురూగారూ! నా బాస్ మీద ఉద్యోగ ద్రోహం కేసు పెడతానండి. నేను చేసింది తప్పే కాదని జగమొండిగా వాదించేస్తానండి. ఇక ఉంటానండి!"
-సృజన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి