“గురూగారూ! నాకో సందేహం వచ్చిందండి... అడగమంటారా?”
“అడగరా శిష్యా! సందేహాలతో సతమతమవకూడదు. పైగా
నువ్వు అడిగే ప్రశ్నని బట్టే నీ స్థాయి ఏంటో కూడా తెలుస్తుంది. అడుగు..”
“ఏం లేదు గురూగారూ! గెలిస్తే అధికారం వచ్చినట్టా?
లేక అధికారం వచ్చాక గెలిచినట్టా?”
“వార్నీ... భలే చిక్కు ప్రశ్నే వేశావురా! పైకి అర్థం
కానట్టు కనిపిస్తుంది కానీ, నీ ప్రశ్న ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలిగేలా
ఉందిరా. పర్వాలేదు. ఇన్నాళ్లూ నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చకుంటున్నందుకు కాస్తో
కూస్తో ఇంగితం ఉన్న ప్నశ్నే వేశావు. అయితే చెబుతాను విను. గెలుపు, అధికారం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయిరా. వీటిలో ఏ ఒకటి సాధించినా,
రెండోది దక్కుతుంది. ఏ ఒకటి దూరమైనా, రెండోది
కూడా దూరమవుతుంది...”
“అయితే గురూగారూ! ఈ రెండింటిలో ఏది ముఖ్యమండీ?
దేని కోసం ముందుగా ప్రయత్నించాలి?”
“చందమామలో బేతాళ కథలు చదువుకుని చక్కా వచ్చావేంట్రా?
ఇలా ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తున్నావ్? నీ ప్రశ్నకు
సమాధానం తెలియాలంటే ముందు గెలుపంటే ఏంటో, అధికారం అంటే ఏంటో
అర్థం కావాలిరా. ఇప్పుడు ఈ రెండింటిమీదా నీ అభిప్రాయమేంటో చెప్పు. దాన్ని బట్టే నా
సమాధానం ఉంటుంది...”
“సరే గురూగారూ! నా దృష్టిలో గెలుపంటే ఎన్నికల్లో గెలవడమేనండి.
ఇక అధికారం అంటే కుర్చీ ఎక్కడమేనండి.. అంతేనంటారా?”
“సాధారణంగా అంతేరా కానీ, ఒకోసారి
గెలిచినా ఓడిపోయినట్టే... ఓడిపోయినా గెలిచినట్టే. అలాగే ఒకోసారి అధికారం చేజిక్కినా
గెలవనట్టే. కుర్చీ మీదే ఉన్నా ఓడినట్టే... అర్థమైందా?”
“అయ్‌బాబోయ్! ఇదేంటండి బాబూ, ఇలా చెబుతున్నారు? మీ మాటల్లో మతలబులు నా మట్టి
బుర్రకు అర్థం కావండి... కాస్త మీరే వివరించి పుణ్యం కట్టుకోండి...”
“అలారా దారికి! లేకపోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకువైనట్టు
అడిగితే ఎలారా? ఇంతకీ నీ బుర్రలోకి ఈ సందేహం ఎందుకొచ్చిందో
ముందు చెప్పు...”
“ఏం లేదు గురూగారూ! మొన్న స్థానిక ఎన్నికల ఫలితాలు
వచ్చాయి కదండీ? ఆ హడావుడి అదీ చూస్తే అలా అడగాలనిపించిందండి
అంతే... పరిషత్ ఎన్నికల్లో భారీగా గెలిచామంటూ అధికార పక్షం జబ్బలు చరుచుకుంటోంది
కదండీ... మరి అది గెలుపు కాదంటారా?”
“ఆ సంగతి కాసేపు అలా ఉంచరా. అలనాటి
మహాభారతంలో జూదంలో కౌరవులు గెలిచారు కదా, మరి అది గెలుపు కాదంటావా? అది చెప్పు ముందు...”
“ఛ... ఛ... అదీ ఓ గెలుపేనండీ... మాయా జూదం కాదుటండీ? చెప్పినట్టు వినే పాచికలతో
మోసం చేసి గెలిస్తే దాన్ని గెలుపని
ఎలాగంటాం?”
“అంటే దానర్థం ఏమిటి? నైతికంగా కౌరవులు ఓడిపోయినట్టేగా? అందుకే గెలుపు, ఓటమి, అధికారాలను పైకి కనిపించే
అంకెల్ని బట్టి అర్థం చేసుకోకూడదురా. లోపలి అంతరార్థం ఏంటో చూడాలి. అర్థమైందా?”
“అయినట్టే ఉంది కానండీ, ఇంతకీ మన ఆంధ్ర రాజకీయ భారతంలో మొన్నటి స్థానిక
ఎన్నికలసంగతి కూడా ఇలాంటిదేనంటారా?”
“నేనడం కాదురా శిష్యా! నామినేషన్ల ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు అత్యధిక
చోట్ల ఏం జరిగిందో ఓ సారి గుర్తు చేసుకో.
అటు కీలుబొమ్మలుగా మారి చెప్పినట్టు వినే పోలీసు యంత్రాంగంతోను, ఇటు విర్రవీగి చెలరేగే
అనుచర గణంతోను అడుగడుగునా ఎన్ని బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయో లెక్క పెట్టుకో. స్వయానా మంత్రులు
కూడా రంగంలోకి దిగి, సర్వ శక్తులు మోహరించి బలవంతపు ఏకగ్రీవాలు ఎన్నెన్ని చోట్ల చేయించారో
లిస్టు రాసుకో. ప్రతిపక్షం నుంచి ఎవరినీ నామినేషన్ వేయించకుండా ఎక్కడెక్కడ ఎలా అడ్డుకున్నారో జ్ఞాపకం చేసుకో. వేరే వాళ్లకి ఓటేస్తే
పింఛన్లు ఆపేస్తాం, రేషన్ కట్ చేస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపేస్తాం అంటూ ఎలా రెచ్చిపోయి ఎక్కడికక్కడ
జనాన్ని ఎలా హడలుగొట్టారో అర్థం చేసుకో. ఆ తర్వాత చెప్పు అది గెలుపో, ఓటమో?”
“ఆ... ఇప్పుడు మీరిందాకా
అన్న మతలబు మాటలు అర్థమవుతున్నాయండి. ఇలాంటి వాతావరణాన్ని కల్పించాక గెలిచినా
ఓడినట్టేనండి. అలాగే అధికారం చేతిలో ఉంటే ఇలాంటి అడ్డగోలు గెలుపులెన్నో కాతాలో వేసుకోవచ్చని
కూడా అర్థమైందండి. అధికారం, గెలుపు ఎలా పెనవేసుకుని ఉంటాయో తెలిసిందండి...”
“మరింతకి మించిన నీచ
రాజకీయ పాఠం నీకింకేముంటుందిరా? బాగా ఒంటబట్టించుకో...”
“బాగుంది గురూగారూ! అంటే
అధికారమనే కుర్చీ ఎక్కాక ఇక ఏం చేసినా చెల్లుతుందన్నమాటండి... మరి ఇందాకా మీరు
కుర్చీ మీద ఉన్నా ఓడినట్టే అన్నారు కదా, అదెలాగండీ?”
“అది అర్థం కావాలన్నా
నువ్వు ఆంధ్ర రాజకీయ మహా భారతం క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలిరా... నువ్వే గమనించు...
భారీ అంకెలతో గెలిచి అధికారం చేజిక్కించుకున్నా, ఏం జరుగుతోంది? పైకి ప్రజాస్వామ్యం కబుర్లు, చేసేది నియంత నిర్వాకం. జనాకర్షక
పథకాలతో రూపాయి ఆశ చూపించి, కోట్లకు కోట్లు దోచుకునే వ్యవహారం. అడ్డగోలు పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొట్టే
దాష్టీకం. రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకుపోతున్న అవకతవకల విధానం. ఒక్క పరిశ్రమనైనా
తీసుకురాలేని దౌర్భాగ్యం. పైగా ఉన్న ఫ్యాక్టరీలు, పోర్టులు, భూములు అయిన వారికి దోచి పెట్టే తెంపరితనం. అటు వైద్య పరంగా కానీ, ఇటు చట్ట పరంగా కానీ ప్రజలకు
రక్షణ, భద్రత కల్పించలేని నిర్లక్ష్యం.
నోరెత్తిన వాడిపై దాడులు చేసే నికృష్టం. అడిగిన వాడిపై అడ్డమైన కేసులు బనాయించే బరితెగింపుతనం.
సమస్యల మాటెత్తితే గూండాగిరీ చేసి నోరు మూయించాలని చూసే నైచ్యం. ఇలా ఎటు చూసినా
అగమ్యగోచరంగా ఉన్న పాలన సాగుతున్నప్పుడు కుర్చీ మీద బాసింపట్టు వేసుకుని కుర్చున్నా
దాన్ని గెలుపనాలా? ఓటమనాలా?”
“అవునండోయ్... అసలైన
గెలుపంటే ఏంటో బాగా అర్థమైందండి. నిజమైన ఓటమంటే ఏంటో తెలిసిందండి. మొత్తమ్మీద ఇవాల్టి
పాఠం భలేగా ఉంది గురూగారూ!”
“పాఠం ఇంకా అయిపోలేదురా
బడుద్దాయ్. ఇంతకీ నువ్వు గెలవాలనుకుంటున్నావా? ఓడాలనుకుంటున్నావా? అది చెప్పు ముందు...”
“ప్రజల మనసులు గెలవాలనుకుంటున్నానండి...
అంతేనాండీ?”
“ఏడిశావ్... నవ భారత
నీచ రాజకీయాల్లో నువ్వు గెలవాలంటే ముందు మనిషిగా ఓడిపోవాలి. అధికారం అందుకోవాలంటే
నైతికంగా పరాజయం పొందాలి. ఆ అధికారాన్ని కొనసాగించుకోవాలంటే నీతిగా ఓటమి పాలవ్వాలి.
నిజాయితీ పరంగా ఓడిపోవాలి. ఇన్ని రకాలుగా ఓడిపోయినా అదే గెలుపనుకోవాలి. ఆ గెలుపుతోనే
విర్రవీగాలి. ఇదే అసలు సిసలు పాఠం. ఇది నీకంత తేలిగ్గా అర్థం కాదులే కానీ, ఇవాల్టికి ఇంటికి పోయి పడుకో”
-సృజన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి