బుధవారం, డిసెంబర్ 01, 2021

రాజ‌కీయ అవ‌క‌త‌వ‌క కంగాళీ సినిమా!

 


ఏంట్రోయ్‌...త‌ల‌కి జండూబామ్ పట్టించుకుంటున్నావ్‌? నా రాజకీయ పాఠాలు నీకంత త‌ల‌నెప్పిగా ఉన్నా యా?”  అని అడిగారు గురువుగారు లోప‌లి నుంచి వ‌స్తూనే.

అబ్బెబ్బే... అదేం కాదండి... భ‌లేవారే! ఏమీ తోచ‌క సినిమాకెళ్లానండి బాబూ... పుట్టి బుద్ధెరిగాక అంత చెత్త‌ సినిమా ఎప్పుడూ చూడ‌లేదండి. త‌ల వాచిపోయిందండి. బ‌య‌ట‌కొచ్చి జండూబామ్‌, అమృతాంజ‌న్‌, పెయిన్ బామ్‌లాంటి వ‌న్నీ కొనుక్కొచ్చేశానండి. సినిమా నుంచి నేరుగా ఇక్క‌డికే వ‌చ్చేశానండి. మీరొచ్చేలోగా అన్నీ క‌ల‌పి పట్టించేసుకుంటున్నానండి... అంతే...

ఏం సినిమారా అది? దాని వివ‌రాలేంటో చెప్పు, స‌రదాగా ఉంది...

ఏం చెప్ప‌నండీ బాబూ... అదేదో డ‌బ్బింగ్ సినిమా అండి. లిప్ మూమెంట్ కూడా క‌ల‌వ‌లేదండి. ఏ స‌న్నివేశానికీ పొంత‌న లేదండి. ఒక్క డైలాగ్‌కి కూడా అర్థం లేదండి. క‌థ ఏంటో అర్థం కాలేదండి. ఒట్టి అతుకుల బొంతండి.  స్క్రీన్ ప్లే ప‌ర‌మ చెత్తండి. ద‌ర్శ‌క‌త్వం ఘోరాతిఘోర‌మండి. ఇక హీరో ఒట్టి జిడ్డు మొహంగాడండి. ఆడేంటో, ఆడి న‌ట‌నేంటో... ఆడు న‌వ్వితే ఏడ్చిన‌ట్టుందండి. ఏడిస్తే న‌వ్వొచ్చేసిందండి. మిగ‌తా న‌టీన‌టుల గురించి చెప్పేదేముందండీ... ఎవ‌డేం చేస్తాడో, ఏం వాగుతాడో తెలీదండి... మ‌ధ్య‌లో వ‌చ్చేద్దామ‌నుకుంటే గేట్లు తీయ‌లేదండి... చ‌చ్చిన‌ట్టు భ‌రించాల్సి వ‌చ్చిందండి బాబూ!

అంతేరా... టికెట్ తీసుకుని హాల్లోకి వెళ్లి కూర్చున్నాక త‌ప్పుతుందా? భ‌రించాల్సిందే. అయినా సినిమా రేటింగేంటో, రివ్యూలెలా ఉన్న‌యో, టాక్ ఏంటో చూసుకోకుండా, అస‌లు పోస్ట‌ర్ అయినా చూడ‌కుండా వెళితే ఇలాగే అవుతుంది...

అదికాద్సార్‌... ఆ సినిమా ప్ర‌చారం విన్నానండి. కనీవినీ ఎరుగ‌ని సినిమా అంటూ ఊద‌ర‌గొట్టారండి. దేశ‌మే కాదండి, ఆ మాట‌కొస్తే ప్ర‌పంచంలోనే గొప్ప సినిమా చూపిస్తామ‌న్నారండి. ఆలసించిన ఆశాభంగం అన్నారండి. నేడే చూడండి, రేపాడ‌దంటే కామోస‌నుకుని వెళ్లి ఇరుక్కుపోయానండి... పైగా భారీ క‌టౌట్లండి...

ఓరెర్రోడా! హామీలు చూసి నాయ‌కుడిని, క‌టౌట్‌చూసి సినిమాని అంచ‌నా వేయ‌కూడ‌దురోయ్‌. దెబ్బ‌యిపోతావ్‌. ఆడికి ఓటేస్తే అయిదేళ్లు ఏడ‌వాలి, దీనికి టికెట్ కొంటే మూడు గంట‌లు  భ‌రించాలి. మొద‌టి దానికి ఉదాహ‌ర‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం అయితే, రెండో దానికి ఉదాహ‌ర‌ణ నువ్వ‌న్న‌మాట‌... అర్థమైందా?”

మీరు పాఠం మొద‌లు పెట్టేశార‌ని అర్థ‌మైపోయిందండి. కానీ గురూగారూ, రాజ‌కీయాల‌కీ సినిమాకీ ఎలా ముడిపెడ‌తారండీ?”

భ‌లేవాడివిరా... మీరెన్నుకున్న నేత మామూలేడేంట్రా? అస‌లు సినిమా వాళ్ల‌కే సినిమా చూపిస్తున్నాడు క‌ద‌రా?”

అవునండోయ్‌... మొన్నామ‌ధ్య ఓ పెద్ద హీరో సినిమా షో అడ్డ‌గోలుగా ఆపేశాడండి. ఇహ ఇప్పుడేమో సినిమా టికెట్ల‌న్నీ మేమే అమ్మేస్తామంటున్నాడండి... దాని కోసం ఏకంగా అసెంబ్లీలో అమెండ‌మెంట్ బిల్లు కూడా పాస్ చేయించేశాడు కదండీ? కానీ ఈ నిర్ణ‌యం వెనుక అనే అనుమానాలు, భ‌యాలు అవీ ఉన్నాయి క‌దండీ?”

ఒరేయ్‌... ఆ నేత తీసుకునే నిర్ణ‌యం స‌రిగ్గా ఉందిరా చెప్పు? నువ్వు టికెట్ తీసుకుని సినిమాకెళ్లి త‌ల‌నెప్పి తెచ్చుకుంటే, నీ ప‌ర‌గ‌ణాలో జ‌నం ఓటేసి మ‌రీ శిరోభారం భ‌రిస్తున్నారు. అస‌లా మాట కొస్తే నువ్వు చూసిన సినిమాని మించిపోయింది క‌ద‌రా, ఇక్క‌డి రాజ‌కీయ సినిమా?”

భ‌లే గురూగారూ! ఇవాళ పాఠం స‌ర‌దాగా ఉందండి. నేను చూసొచ్చిన సినిమా గురించి చెప్పాక‌దండీ, మ‌రి మీరు ఈ రాజ‌కీయ సినిమా గురించి చెప్ప‌రా?”

చెప్ప‌డానికేముందిరా... నువ్వు చూసొచ్చింది డ‌బ్బింగ్ సినిమా అయితే, ఇక్క‌డ ఆడుతున్న‌ది దెబ్బ మీద దెబ్బ కొట్టే దెబ్బింగ్ సినిమా! అస‌లు రాష్ట్ర ఆదాయాన్నే దారి మ‌ళ్లిస్తున్న దొబ్బింగ్ సినిమా! ఇక్క‌డ కూడా లిప్ మూమెంట్ క‌ల‌వ‌డం లేదు క‌ద‌రా, చెప్పేదొకటి చేసేదొకటి. నిన్న అన్న మాట ఇవాళ ఉండ‌దు, ఇవాళ అనే మాట రేపు వినిపించ‌దు.  ఈ రాజ‌కీయ సినిమా మొద‌లై రెండున్న‌రేళ్లయింది క‌దా? అస‌లు ఒక స‌న్నివేశానికి మ‌రో స‌న్నివేశానికి పొంత‌న ఉందా అని! పోనీ క‌థ ఏమైనా ముందుకు క‌దిలిందా అంటే అదీ లేదు. ఇందులో క‌థ అతుకుల బొంత కాదురా, చిరుగుల బొంత‌. మొద‌టి సీన్‌లో హీరో  ఎంతో మెత్త‌గా, కొత్త‌గా, న‌వ్వుతూ క‌నిపించాడా? రాన్రానూ ఆడే విల‌నేషాలు మొద‌లెట్టాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో క‌క్ష‌లు తీర్చుకుంటున్నాడు త‌ప్ప, క‌థానాయ‌కుడి ల‌క్ష‌ణాలేవీ? ఊ అంటే ఫైటింగు, ఆ అంటే ఫైటింగ్‌. అస‌లు ఎదురి తిరిగి ఎవ‌రైనా మాట్టాడితే చాలు గూండాల‌తో విరుచుకు ప‌డిపోతున్నాడు. సినిమాకు ముందు ఊరూవాడా తిరిగి తెగ ప్ర‌చారం చేశాడు. జ‌నం న‌మ్మి బొమ్మ అద్దిరి పోతుందేమో అనుకున్నారు. కానీ ఏదీ?  సినిమా స‌గం పూర్త‌యి విశ్రాంతికి వ‌చ్చేసినా, ప్ర‌చారంలో చెప్పిన సీన్లలో ఒక్కటంటే ఒక్క‌టి లేదు. అన్నీ ఎడిటింగ్‌లో కట్ అయిపోయాయో ఏంటో మ‌రి! స్వ‌ర్ణ‌యుగం అంటే ఏంటో చూపిస్తాన‌న్నాడు. తీరా తెర మీద చూస్తే బంగారం లాంటి రాష్ట్రం అప్పుల కుప్ప‌లా మారిపోయింది. రాజ‌ధాని అంటే ఎలా ఉంటుందో చూద్దురుగాన‌న్నాడు. పైగా ఒక‌టి కాదు, మూడు రాజ‌ధానుల‌న్నాడు. పోనీలే, కామోసు... బాగా డెవ‌ల‌ప్‌మెంట్ చేస్తాడేమో అని ప్రేక్ష‌క జ‌నం ఆశ‌గా చూస్తే, మ‌ళ్లీ మొద‌టికొచ్చాడు. తూనా బొడ్డూ...  మొద‌ట్లో డైలాగ్ స‌రిగా చెప్ప‌లేదూ, మ‌ళ్లీ బాగా పంచ్ డైలాగ్ రాసి మ‌రోసారి చెబుతానంటున్నాడు.  ఇలాంటి విచిత్రం ఏ సినిమాలోనైనా చూశామా? ఇప్ప‌టికే సినిమా  స‌గం అయింది, రాజ‌ధాని ఊసే లేదు. సెకండాఫ్‌లో ఆ డైలాగ్ వినిపిస్తుందో లేదో డౌటే! ఇలా ఒక‌టా రెండా, తెర మీద‌కి రాగానే పెద్ద హీరోలా పోజు పెట్టి మాట్లాడిన మాట‌ల‌న్నీ, ఇప్పుడు మార్చేస్తున్నాడు. ఇక ఈ హీరోగారి అనుచరుల న‌ట‌నేమైనా బాగుందా అంటే అదీ లేదు. వాళ్లు అసెంబ్లీ సీన్ల‌లో చెప్పే డైలాగ్‌లు విని మ‌హిళ‌లంతా సిగ్గుతో త‌ల‌లొంచుకుంటున్నారు. ఇలాంటి చెత్త స్క్రీన్ ప్లే ఇంకెక్క‌డైనా చూశామా చెప్పు? వీళ్లంతా క‌లిసి ఆడిస్తున్న సినిమా చూసి, క్లాస్ ప్రేక్ష‌కుల నుంచి మాస్ ప్రేక్ష‌కుల వ‌ర‌కు అంద‌రూ తిట్టుకుంటున్నారు. నువ్వు చూసిన డ‌బ్బింగ్ సినిమా హాళ్లో గేట్లు మూసేయ‌డం వ‌ల్ల నువ్వు బ‌య‌ట‌కి రాలేన‌ట్టే, ఈ రాజ‌కీయ సినిమా న‌చ్చ‌క‌పోయినా ఏం చేయ‌లేక జ‌న‌మంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు, వేరే దారి లేక‌. ఏ సినిమాలోనైనా హీరో వేరు, విల‌న్ వేరుగా ఉంటారు. ఈ సినిమాలో మాత్రం హీరోయే విల‌న్‌గా మారిపోయాడు. ఇంత వ‌ర‌కు హీరో చేసిన మంచి ప‌నంటూ ఒక్క‌టి లేదు. పైగా చేసేవ‌న్నీ అవ‌క‌త‌వ‌క ప‌నులే. చ‌దువుకునే విద్యార్థుల్ని, వాళ్ల త‌ల్లిదండ్ర‌ల్ని, పంట‌లు పండించే రైతుల్ని, వాళ్ల కుటుంబాల‌ని, నిశ్చింత‌గా  ప‌ని చేసుకునే ఉద్యోగుల్ని... ఇలా అన్ని ర‌కాల జ‌నాన్ని ఏడిపించే హీరో... ఏ సినిమాలోనైనా క‌నిపిస్తాడా నీకు? పైగా ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, న‌ట‌న‌, ఎడిటింగ్, నిర్మాత‌, సంగీతం, గీత ర‌చ‌న‌, అనుస‌ర‌ణ‌, ప‌బ్లిసిటీ, డిస్ట్రిబ్యూష‌న్ అన్నీ ఆ హీరోవేనంట‌. అందుకే ఈ సినిమా ఇలా త‌యారైంది. ఇక సెకండాఫ్‌లో ఎలాంటి సీన్లు చూడాలో, ఇంకా ఎన్ని దారుణ‌మైన ట్విస్ట్‌లు ఉంటాయో, ఇంకెన్ని భ‌యంక‌ర‌మైన స్టంట్లు ఉంటాయో, ఇంకెన్ని ఘోర‌మైన డైలాగులు వినాలో... అని త‌ల్ల‌డిల్లిపోతున్నారు ప్రేక్ష‌క జ‌నం అంతా. ఇంకేం చెప్ప‌మంటావు చెప్పు?”

అయ్య‌బాబోయ్‌...ఇదెక్క‌డి సినిమా అండీ బాబూ! దీనిక‌న్నా నేను చూసొచ్చిన డ‌బ్బింగ్ సినిమానే న‌య‌మ‌నిపిస్తోందండి... నాకొక్క త‌ల‌నొప్పే వ‌చ్చిందండి. కానీ ఈ రాజ‌కీయ సినిమా భ‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఒళ్లంతా మంట‌లెక్కిపోతోందో ఏమోనండి. ఇంత‌కీ ఈ సినిమా జోన‌ర్ ఏంటండీ?”

రాజ‌కీయ‌, జాన‌ప‌ద‌, స‌కుటుంబ‌, స్వ‌క‌పోల క‌ల్పిత‌, అవ‌క‌త‌వ‌క‌, కంగాళీ, సోషియో మెంట‌ల్ హార‌ర్ హిస్టీరిక్ ఫాంట‌సీ!

-సృజ‌న‌

PUBLISHED ON 1.12.2021 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి