గురువారం, మే 28, 2026
శ్రీకృష్ణుడు తీర్చుకోలేని రుణం
దేవదేవుడైన శ్రీకృష్ణుడికే దేవతలు సహా ప్రాణులందరూ రుణపడి ఉంటారు కదా? అలాంటిది ఆయన తీర్చుకోలేని రుణం అంటూ ఉంటుందా?
ఉందని స్వయంగా శ్రీకృష్ణుడే
చెప్పాడు. ఎవరితోనో తెలుసా? గోపికలతో. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 32వ అధ్యాయంలో
కనిపిస్తుంది ఈ ఘట్టం.
ఓసారి గోపికలు
శ్రీకృష్ణుడిని అడుగుతారు.
‘‘కృష్ణా... కొందరు తమను
ప్రేమించేవారినే ప్రేమిస్తారు. మరి కొందరు తమను ప్రేమించని వారిని సైతం
ప్రేమిస్తారు. ఇంకొందరు తమను ప్రేమించిన వారిని కానీ, ప్రేమించని వారిని కానీ...
ఇద్దరినీ ప్రేమించరు. మరి వీరిలో నీకు ఎవరంటే ఇష్టం?’’ అని అడిగారు.
అందుకు శ్రీకృష్ణుడు,
‘‘సఖులారా... కొందరు ప్రతిఫలాపేక్ష కలవారై ఉంటారు. తమకు మేలు చేసేవారినే
సేవిస్తారు. ఇందులో స్నేహం కానీ, ధర్మం కానీ ఉండవు. సహజంగానే దయా స్వభావం కల వారు
కొందరుంటారు. వాళ్లు తమను ప్రేమించని వారిని సైతం సేవిస్తారు. ఇలాంటి వారి ప్రేమలో
ధర్మం, సుహృద్భావం ఉంటాయి. కొందరైతే తమకు మేలు చేసిన వారిని సైతం సేవించరు. వీరు
కృతఘ్నులు, కఠినాత్ములు. నేను వీరిలో ఎవ్వడనూ కాను. అయితే నన్ను ప్రేమించేవారి
పట్ల నేను అదే విధమైన ప్రేమను ప్రకటించకుండా, నా పట్ల వారి ప్రేమ మరింత పెరిగేలా,
అది నిరంతరం నిలిచేలా వ్యవహరిస్తాను. అందుకోసం నేను వారిని కలిసినట్టే కలిసి,
కనిపించినట్టే కనిపించి, దాగినట్టు ఉంటాను. మీతోనే, మీ మధ్యనే ఉంటూ నేను
అదృశ్యమవడానికి కారణం అదే. నేను మాయమై ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ
వివరించాడు. అందుకు గోపికలు ఎంతో ఆనందపడ్డారు.
ఆపై శ్రీకృష్ణుడు వారి పట్ల
తన గాఢమైన ప్రేమను వెల్లడిస్తూ, ‘‘గోపికలారా... మీ ప్రేమ కపటం లేనిది. మీరు నాపై
చూపించే ప్రేమకు తగిన ప్రత్యుపకారము చేయడం నాకు సాధ్యం కాదు. నాకు దేవతలకు ఉండేంత
ఆయుర్దాయము ఉన్నా సరే, నేను మీ రుణం తీర్చుకోలేను. మీరు నన్ను చేరుకోడానికి మీ
ఇళ్లు, వాకిళ్లు, బంధాలు అనే సంకెళ్లను పూర్తిగా వదిలించుకుని వచ్చారు. నిర్మలమైన
మీ ప్రేమ భావాన్ని నాకే సమర్పించారు. అందువల్ల నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను’’
అన్నాడు.
శ్రీకృష్ణుడు చెప్పిన
మధురమైన ఈ మాటలు విని గోపికలందరూ సంతోషంతో పొంగిపోయారు. అదీ కృష్ణ తత్వం.
పుణ్యం... పాపం... సైన్స్ కోణం!
‘పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం’ అంటుంది మన సనాతన
ధర్మం. అంటే...ఇతరులను సంతోషపెట్టడమే పుణ్యం, బాధపెట్టడమే పాపం. ఈ పాపపుణ్యల భావనలను ఆధునిక సైన్స్ కోణంలో
అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా?
"పుణ్యం చేస్తే
స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే
నరకానికి వెళ్తాం" అని మనకు పెద్దలు చెబుతారు. చిత్రగుప్తుడు పైన కూర్చుని ఒక
పెద్ద పుస్తకంలో మన లెక్కలు రాస్తుంటాడని కూడా అంటారు. ఆధునిక యుగంలో ఇవన్నీ
పాతకాలపు నమ్మకాలుగా కొందరికి అనిపించవచ్చు. కానీ ఈ నమ్మకాలను సైన్స్ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో
శాస్త్రీయమైన పరిశోధనలు ఏమైనా జరిగాయా? ఆ విషయాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
·
క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటోంది?
ఈ విశ్వంలో ప్రతీదీ ఒక శక్తే. అంటే ‘ఎనర్జీ’ అన్నమాట. మన ఆలోచనలు, మాటలు,
పనులు అన్నీ ‘వైబ్రేషన్స్’ను కలిగిస్తాయి. ఆ ప్రకారం సనాతన ధర్మంలో చెప్పే
పాపపుణ్యలను సైన్స్ పరిభాషలో ‘నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీలు’ అనుకోవచ్చు. దీన్ని
ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం.
·
పుణ్యం అంటే ఏమిటి?
మనం ఇతరుల పట్ల చూపించే
నిస్వార్థమైన ప్రేమ, జాలి, ఇతరులకు సాయం చేయడం, కృతజ్నత కలిగి ఉండడం.... ఇలాంటి
మంచి భావాలను కలిగి ఉండడమే కదా. ఈ భావోద్వేగాలను సైన్స్ పరంగా ‘హై ఫ్రీక్వెన్సీ’...
అంటే ఉన్నత స్థాయి తరంగాలు అనుకోవచ్చు.
మీరు ఎవరికైనా ఉపకారం
చేసినప్పుడు, ఏ పేదవాడికో అన్నం పెట్టినప్పుడు, లేదా ఒక మూగజీవికి సాయం
చేసినప్పుడు... మీలో కలిగే శారీరక, మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇలాంటి
మంచి పనులు చేసినప్పుడు మీలో తెలియని ఒక ఆనందం, సంతృప్తి కలుగుతాయి. ఇవి మీ
మెదడులో ‘డోపమైన్’, ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్స్ ను విడుదల చేస్తాయి. వీటిని
‘హ్యాపీ హార్మోన్స్’ అంటారు.
సమాజానికి, ప్రకృతికి
లేదా తోటి ప్రాణికి మేలు చేసినప్పుడు మనలోనూ, మన చుట్టూ
ఉన్న వాతావరణంలోనూ ఒక విధమైన సమతుల్యత అంటే హార్మొనీ, ప్రశాంతత ఏర్పడుతాయి. దీన్నే మనం 'పాజిటివ్
ఎనర్జీ' అనవచ్చు.
అంతేకాదు, ఇలాంటి పాజిటివ్ పనులు చేసినప్పుడు మీ శరీరం చుట్టూ ఉండే శక్తి వలయం
అంటే ‘ఆరా’, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి
వ్యక్తులను, అదృష్టాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు ‘‘చేసిన
పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది’’ అంటారు.
·
పాపం సంగతి ఏంటి?
మనలో కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, పగ పెంచుకోవడం... ఇలాంటివన్నీ
‘లో ఫ్రీక్వెన్సీ’ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. మీరు ఎవరి పట్ల అయినీ తీవ్రమైన
ద్వేషం పెంచుకున్నప్పుడు, ఎవరినైనా మోసం చేసినప్పుడు, మీ శరీరంలో ‘కార్టిసాల్’ అనే
‘స్ట్రెస్ హార్మోన్’ విడుదల అవుతుంది. ఇది మీ బీపీని పెంచడం, నిద్రను దూరం చేయడం,
రోగ నిరోధక శక్తిని తగ్గించడం లాంటి ప్రభావాలు
చూపిస్తుంది. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు కలిగి ఉండేవారు, చెడు పనులు
చేసేవారి చుట్టూ ఉండే ‘ఆరా’ ముడుచుకుపోయి, నల్లగా మారుతుంది. అంటే ఇతరుల పట్ల మీరు
చేసే విషపూరితమైన ఆలోచనలు, తరంగాలు ముందుగా మీ శరీరాన్నే పాడు చేస్తాయి. ఈ
నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యలను ఆకర్షిస్తుంది.
‘‘వాడి పాపం పండింది’’ అంటుంటారు ఇలాంటప్పుడే.
·
ఆలోచనలు కూడా శక్తి తరంగ
కేంద్రాలే
పాప పుణ్యాలనేవి కేవలం చేతలకు సంబంధించినవే కాదు. మీరు మనసులో ఏమనుకంటున్నారు,
ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నారనేది కూడా ఒక ఎనర్జీ రూపమే. ‘వాడు నాశనమైపోవాలి’ అని
అనుకుంటే మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని సృష్టించినట్టే. అంటే పాపం చేశారన్నమాటే.
అదే ఎదుటి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరొక పాజిటివ్
ఎనర్జీని పుట్టించినట్టే. అంటే పుణ్యం చేసినట్టే.
ఈ దృష్టి కోణంలో చూస్తే... మానవ
శరీరంలో ప్రతి కణం, ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన
కంపన తీవ్రతను కలిగి ఉంటాయి. అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట.
·
ఇవిగిదవిగో పరిశోధనలు...
సరే... అనుకోడానికి బాగానే ఉంది కానీ, మరి ఈ విషయంలో శాస్త్రీయ పరిశోధనలు
ఏమైనా జరిగాయా? ఆ సంగతులే ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్ డేవిడ్ హాకిన్స్ అనే ఓ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ కొన్ని పరిశోధనలు
చేశారు. వాటి ప్రకారం ఆయనొక ‘కాన్షియస్‌నెస్ మ్యాప్’ తయారు చేశారు. ఈయన మానవ
భావోద్వేగాల ఫ్రీక్సెన్సీలను ఒక స్కేల్ గా విభజించారు.
వాటి ప్రకారం చూస్తే... ప్రేమ, జాలి, కరుణ, ఆనందం లాంటి ఎమోషన్స్ అంటే
భావోద్వేగాలు 500 హెర్జ్ కు పైగా వైబ్రేషనల్ స్థాయిని కలిగి ఉంటాయి. వీటి వల్ల
శాంతి, ఆరోగ్యం ఏర్పడుతాయి.
ఇక తటస్థత అంటే న్యూట్రాలిటీ అనేది 250 హెర్జ్ వైబ్రేషనల్ స్థాయిలో ఉంటుంది.
దీని వల్ల సమతుల్యత కలుగుతుంది.
అదే... కోపం, పగ, అహంకారం అనే భావోద్యేగాలు 150 నుంచి 175 హెర్జ్ లాంటి ‘లో
వైబ్రేషనల్’ స్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల సంకుచితత్వం, ఒత్తిడి అనేవి
వ్యక్తి స్వభావంలో కలుగుతాయి.
అలాగే భయం, ఆందోళన అనే భావోద్వేగాలు 100 హెర్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఇవి
బలహీనతగా మారుతాయి.
ఇంతేకాదు... అసూయ, తప్పు చేశాననే భావన లాంటివి 30 హెర్జ్ అంటే అత్యల్ప స్థాయి
వైబ్రేషనల్ లెవెల్ లో ఉంటాయి. వీటి వల్ల వ్యక్తి స్వభావంలో ఆత్మన్యూనత, అశాంతి
చేరుతాయి.
నిస్వార్థమైన ప్రేమ, దయ వంటివి శరీరంలో కార్టిసోల్
(ఒత్తిడి హార్మోన్)ను తగ్గించి, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ల
వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తాయి. దీనివల్ల మన 'బయో-ఎలక్ట్రోమాగ్నెటిక్
ఫీల్డ్' (Bio-electromagnetic field) చాలా బలంగా, పాజిటివ్‌గా
మారుతుంది. అదే కోపం, పగ ఉన్నప్పుడు శరీరం నిరంతరం 'ఫైట్ ఆర్
ఫ్లైట్' (Fight or Flight) మోడ్‌లో ఉండి, ‘లో-ఫ్రీక్వెన్సీ’ తరంగాలను విడుదల చేస్తుంది.
·
క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ (Quantum
Entanglement)... కర్మ
సిద్ధాంతం
క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం, బ్రహ్మాండంలో ఒకానొక సమయంలో
కలిసి ఉన్న రెండు పరమాణువులు ఎంత దూరంలో ఉన్నా... ఒకదాని చలనం లేదా మార్పు
ఇంకోదానిపై తక్షణమే ప్రభావం చూపిస్తుంది.
దీని ప్రకారం, మనం ఇతరులకు
చేసే కీడు లేదా మేలు అనవి ఏదో ఒక రూపంలో యూనివర్స్ ద్వారా తిరిగి మనల్నే చేరతాయి.
ఎందుకంటే మనమందరం క్వాంటమ్ స్థాయిలో ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం.
మన మనసులో మంచి సంకల్పం ఉంటే మన
చుట్టూ పాజిటివ్ వాతావరణం, చెడు సంకల్పం ఉంటే నెగిటివ్
వాతావరణం ఏర్పడుతాయి.
·
హార్ట్‌మత్ ఇన్‌స్టిట్యూట్
పరిశోధనలు
అమెరికాకు చెందిన హార్ట్‌మత్ ఇన్‌స్టిట్యూట్ వారు మానవ హృదయంపై చేసిన
పరిశోధనల్లో... మనం ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు గుండె
చుట్టూ ఉండే విద్యుదయస్కాంత క్షేత్రం చాలా క్రమబద్ధంగా, శక్తివంతంగా
మారుతుందని, అది మన చుట్టూ ఉన్న ఇతరుల మూడ్‌ను
కూడా ప్రభావితం చేస్తుందని నిరూపించారు.
·
ఈ విశ్వమే... చిత్రగుప్తుడా?
ఈ విశ్వం ఒక పెద్ద బ్యాంక్
లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ కాతాలో ‘పాజిటివ్
ఎనర్జీ’ అంటే పుణ్యం రూపంలో డిపాజిట్ అవుతాయి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు,
ప్రమాదం ఎదురైనప్పుడు ఆ అకౌంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మిమ్మల్ని
రక్షిస్తుంది. అలాంటప్పుడే ‘ఏదో పుణ్యం కాపాడింది’ అంటుంటారు. మనం నెగిటివ్ పనులు
చేస్తే ఈ అకౌంట్ బ్యాలన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం సమస్యల్లో
చిక్కుకుంటాం. ఆ విధంగా చూస్తే మన పాప
పుణ్యాలకు ఈ విశ్వమే చిత్రగుప్తుడిలాగా లెక్కలు రాస్తుందనుకోవచ్చు.
·
సనాతన ధర్మం... సైన్స్...
సనాతన ధర్మం 'పాపం, పుణ్యం' అని దేన్నైతే
పిలిచిందో... దాన్ని నేటి ఆధునిక పరిభాషలో "ఎనర్జీ ఫ్రీక్వెన్సీ
మేనేజ్‌మెంట్" అని చెప్పుకోవచ్చు.
మనం చేసే పనులు, ఆలోచనల ద్వారా సృష్టించే
ఫ్రీక్వెన్సీలు విశ్వంలోకి వెళ్ళి, తిరిగి మన
జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. కాబట్టి, నిస్వార్థమైన
ప్రేమ, దయ అనే 'హై ఫ్రీక్వెన్సీ' తరంగాలతో
జీవించడమే పుణ్యం; కోపం, పగ అనే 'లో
ఫ్రీక్వెన్సీ' తరంగాల్లో చిక్కుకుపోవడమే
పాపానికి మూలం అని శాస్త్రీయంగా అర్థం చేసుకోవచ్చు.
·
సైన్స్, ఆధ్యాత్మికతల కలయిక...
భౌతిక శాస్త్రం ప్రకారం "శక్తిని మనం
సృష్టించలేము, నాశనమూ చేయలేము’’ అంటే... Energy can neither be created nor destroyed. అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి
మారుతుంది."
కర్మ సిద్ధాంతం
ప్రకారం... మీరు ఈ విశ్వంలోకి ఎలాంటి
శక్తిని పంపిస్తారో... అది వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరకే వస్తుంది. బంతిని
గోడకేసి ఎంత గట్టిగా కొడితే, అంతే వేగంగా మనవైపు తిరిగి వచ్చినట్టన్నమాట.
అంటే మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీయే
మిమ్మల్ని
శిక్షిస్తుంది. మీరు సృష్టించే పాజిటివ్ ఎనర్జీయే మిమ్మల్ని ఎల్లప్పుడూ
కాపాడుతుంది.
కాబట్టి...ఇప్పటినుంచైనా
మన ఆలోచనలను, పనులను పాజిటివ్‌గా మార్చుకుందాం... అద్భుతమైన
జీవితాన్ని నిర్మించుకుందాం!
ఇంద్రుడిని చంపే పుత్రుడి కోసం దితి తపస్సు (పిల్లల కోసం రాముడి కథ – 16)
విశ్వామిత్రుడు,
ఇతర మునులతో కలిసి మిథిలకు ప్రయాణిస్తున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో గంగానదిని
దాటి విశాలా అనే నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని గురించి రాముడు అడిగిన
ప్రశ్నకు బదులుగా విశ్వామిత్రుడు... దేవదానవులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని
చిలికిన వివరాలన్నీ చెప్పడు. అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు విజయం పొంది
ఇంద్రుడు స్వర్గానికి రాజయ్యాక ఏం జరిగిందో చెప్పసాగాడు.
‘‘రామా...
ఆ యుద్ధంలో తన కుమారులైన దానవులు మరణించడంతో దితి ఎంతో దు:ఖించింది. ఆమె తన భర్త
అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది.
‘‘దేవతల
చేతిలో నా కుమారులు అందరూ మరణించారు. కాబట్టి ఇంద్రుడిని చంపగలిగే పుత్రుడిని
పొందడం కోసం నేను తపస్సు చేస్తాను. అందుకు అనుమతి ఇవ్వండి’’ అని అడిగింది.
కశ్యపుడు అందుకు అంగీకరించి, ‘‘నువ్వు వెయ్యి సంవత్సరాలు పవిత్రతతో తపస్సు చేస్తే
నీ కోరిక తీరుతుంది’’ అని చెప్పాడు.
అప్పుడు
దితి కుశప్లవనము అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. ఆ ప్రదేశం ఇదే. తనను చంపే
పుత్రుడిని పొందడం కోసం తన పినతల్లి దితి తపస్సు చేస్తున్న సంగతి ఇంద్రుడికి
తెలిసింది. అతడు ఆ ప్రదేశానికి వచ్చి దితికి సపర్యలు చేయసాగాడు. ఆమె తపస్సుకు
కావలసిన అగ్ని, సమిధలు, కుశలు, జలములు లాంటి సామగ్రిని సమయానికి సమకూరుస్తూ తన
పినతల్లికి సేవలు చేశాడు. అలా 990 ఏళ్లు గడిచాయి.
ఇంద్రుడి
సేవలకు సంతోషించిన దితి, ‘‘నాయనా... నిన్ను జయించగల పుత్రుడి కోసమే ఈ తపస్సు
చేస్తున్నాను. నీ సేవలకు ఎంతో సంతోషించాను. నాకు పుత్రుడు కలిగి, అతడు నిన్ను
జయించడానికి సిద్ధమయినప్పుడు నేను వద్దని వారిస్తాను. అప్పుడు మీరిద్దరూ
కలిసి ముల్లోకాలను పాలించండి’’ అంది. అలా చెప్పిన తర్వాత మధ్యాహ్న సమయం కావడంతో నిద్ర ముంచుకు వచ్చిన
దితి, పాదాల వైపుగా తల పెట్టుకుని పడుకుండిపోయింది. పగటి పూట పడుకోవడం, ఆమె
జుట్టుకు పాద ధూళి సోకడమనే దోషాల వల్ల ఆమె అశుచి అయింది. అందువల్ల వ్రత భంగమైనదని
గ్రహించిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో శిశువును ఏడు ముక్కలు
చేశాడు. ఆ సమయంలో ఆ శిశువు ఏడ్వగా ఇంద్రుడు ‘ఏడవకు, ఏడవకు’ అంటూనే ఖండించాడు.
శిశువు ఏడుపు విని మెలకువ వచ్చిన దితి ఇంద్రుడితో ‘చంపకు... చంపకు’ అంటూ నిద్ర
లేచింది. పినతల్లి మాట విని బయటకు వచ్చిన ఇంద్రుడు, ‘‘తల్లీ... నువ్వు పాదాల వైపు
తల పెట్టుకుని పడుకోవడం వల్ల అపవిత్రురాలివయ్యావు. అందుకనే నన్ను చంపడం కోసం
పుడుతున్న వాడిని ముందుగానే ముక్కులుగా చేశాను. నన్ను క్షమించు’’ అన్నాడు.
దితి
ఎంతో దు:ఖించినా తర్వాత తేరుకుని, ‘‘దేవేంద్రా... నా అపరాధం వల్లనే ఇలా జరిగింది.
ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అయితే నాకొక ఉపకారం చెయ్యి. నువ్వు ఖండించడం వల్ల ఏడు
భాగాలైన నా కుమారులు ఏడు లోకాలకు పాలకులు అవ్వాలి. ఏడు రకాల వాయువులకు అధిష్ఠాన
దేవతలై సంచరించాలి. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలోను, ఇంకొకడు ఇంద్రలోకంలోను, మూడో వాడు
వాయువు పేరుతో అంతరిక్షంలోను ఉండాలి. మిగిలిన నలుగురు నీ ఆదేశాలను పాలిస్తూ నాలుగు
దిక్కులా ఉంటారు. వీళ్లను ఖండించేటప్పుడు నువ్వు ఏడవవద్దంటూ ‘మారుద:’ అన్నావు
కాబట్టి, ఇక నుంచి వీళ్లు ‘మరుత్తులు’ అనే పేరుతో ప్రసిద్ధులవుతారు’’ అంది.
దితి
మాటలు విన్న ఇంద్రుడు వినయంగా ఆమెకు నమస్కరించి, ‘‘అలాగే తల్లీ... అంతా నువ్వు
అనుకున్నట్టుగనే జరుగుతుంది. నీ కుమారులు దేవతలై సంచరిస్తారు. నీకు క్షేమమగుగాక’’
అన్నాడు.
ఈ
కథంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ‘‘రామా... దితి తపస్సు చేస్తుండగా
దేవేంద్రుడు సేవలు చేసిన ప్రదేశం ఇదే. ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజుకు, అలంబుస అనే
పట్టపు రాణికి విశాలుడనే కుమారుడు కలిగాడు. అతడే ఈ విశాల అనే నగరాన్ని నిర్మించి
పాలించాడు. విశాలుడి కుమారుడు హేమచంద్రుడు. అతడి తనయుడు సుచంద్రుడు. అతడికి
ధూమ్రాశ్వుడు అనే కొడుకు పుట్టాడు. అతడికి సృంజయుడు కలిగాడు. అతడకి సహదేవుడు,
సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వడికి సోమదత్తుడు పుట్టారు. సోమదత్తుడి పుత్రుడు
కాకుత్‌స్థుడు. అతడికి పుట్టిన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు’’ అంటూ
వివరించాడు. ఆ తర్వాత ‘‘రామా... ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమిద్దాం. రేపు మిథిలా
నగరానికి వెళదాం’’ అన్నాడు.
అంతలోనే
విశాల నగరాన్ని పాలిస్తున్న సుమతి మహారాజు తన రాజ్యానికి విశ్వామిత్రడు వచ్చినట్టు
విని పురోహితులతో, బంధువులతో కలసి వచ్చాడు. ఆయనను సకల మర్యాదలతో పూజించి, వినయంగా
చేతులు జోడించి కుశల ప్రశ్నలు వేశాడు.
‘‘ఓ
మహర్షీ... మీరు మా దేశానికి రావడం వల్ల నేను ధన్యుడనయ్యాను’’ అంటూ రామలక్ష్మణులను
చూసి, ‘‘మహాత్మా... ఈ యువకులిద్దరూ దేవతల లాగా ప్రకాశిస్తున్నారు. వీరిని
చూస్తుంటేనే ఎంతో పరాక్రమవంతులని తెలుస్తోంది. అందంలో అశ్వినీ దేవతలనే
మించిపోయారు. ధనుర్బాణాలు, ఖడ్గాలు ధరించిన వీరు ఎవరు? ఈ అడవిలో కాలినడకన
రావడానికి కారణం ఏమిటి? వీరి గురించి వినాలని కోరుకుంటున్నాను’’ అని అడిగాడు.
అప్పుడు
విశ్వామిత్రుడు, ‘‘వీరిద్దరూ దశరథుడి కుమారులైన రామలక్ష్మణులు’’ అని పరిచయం చేసి,
సిద్ధాశ్రమంలో తను చేసిన యాగం గురించి, మారీచ సుబాహులను ఎదుర్కొని రామలక్ష్మణులు
యాగ రక్షణ చేయడం గురించి అన్ని సంగతులు వివరంగా చెప్పాడు. అంతా విన్న సుమతి మహారాజు పరమానందం చెంది,
రామలక్ష్మణులకు తగిన రీతిలో సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి వారందరికీ
ఆతిథ్యమిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.
.png)

