సోమవారం, ఆగస్టు 31, 2026

తెలుగు చమత్కారాలు!



ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ‘‘ఏటండీ? ‘సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని తిట్టారంట.  చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా వ్రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు’’ అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది. భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.

'వాడెదవ' అంటే తిట్టనుకునేరు...చెరకుగడ చివరిభాగం.

tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి. ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. 

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా. (customary fee - బ్రౌన్)

ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.

తండ్రికి తగ్గ ఆ కొడుకు "పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు" అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ "మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు" అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం (శబ్దరత్నాకరం).

సొంత విషయాలను పదేపదే చెబుతుంటే 'నీ సొద ఆపు’ అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

 కొసమెరుపు... 

పేషెంట్: డాక్టర్ గారూ!
నా వయస్సు అరవయ్యేళ్ళు
నేనేమి తినాలి? ఏమి తినకూడదు చెప్పండి.
డాక్టర్: ఈ వయసులో మీరు 
ఏది పడితే అది తినకూడదు...
ఏది పడితే అది తినాలి...

 తెలుగా మజాకానా!

శనివారం, ఆగస్టు 29, 2026

బాలీవుడ్ లో నవ్వులు పంచిన తెలుగు వాడు !

తెలుగు ప్రాంతంలో పుట్టి...

ముంబైకి వలస వెళ్లి...

ఆర్థిక ఇబ్బందులు పడి...

రకరకాల  పనులు చేసి...

ఆఖరికి వెండితెరపై ఓ వెలుగు వెలగడం వెనుక... కేవలం విధి మాత్రమే ఉండదు. జీవితంలోని ప్రతి దశలోనూ ఉత్సాహాన్ని, ఉత్సుకతను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిత్వం కూడా ఉంటుంది.

అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడే... జానీలీవర్.

బాలీవుడ్ సినిమాల్లో కమేడియన్ గా నవ్వులు పంచిన జానీ లీవర్ తెలుగు వాడేనని చాలా తక్కువ మందికే తెలుసు. ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. అసలు పేరు జాన్ ప్రకాష్ రావ్ జనుముల. తండ్రి హిందూస్తాన్ లీవర్ లో కార్మికుడు.

కడుపు పట్టుకుని వలస వెళ్ళిపోయిన తండ్రి చిటికెన వేలు పుచ్చుకుని చిన్నప్పుడే ముంబై మహానగరం చేరాడు జానీ.   అక్కడ చదువు  7 వ తరగతి దాటలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు... కుటుంబ పరిస్థితుల మధ్య రాటుదేలాడు.  దొరికిన పనల్లా చేశాడు. ట్రాఫిక్ ఆగినప్పుడల్లా వాహనాల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి పెన్నులు లాంటి వస్తువులు అమ్మడం లాంటి పనుల్లో కూడా అవకాశాలనే చూశాడు. ఆ పనులను కూడా ఉత్సాహంగా కొత్తగా చేయాలని ప్రయత్నం చేసేవాడు. బాలీవుడ్ సినిమాల్లో హీరోల గొంతును అనుకరిస్తూ, మిమిక్రీ చేస్తూ, హిందీ సినిమా పాటలకి డ్యాన్సులు చేస్తూ అమ్మేవాడు. సరదాగా చేసే ఆ పనుల్లోనే ‘సేల్స్ మన్ షిప్’ చూపించేవాడు.

ఒకసారి హిందూస్తాన్ లీవర్ కంపెనీలో ఏదో ఫంక్షన్ జరిగితే, అక్కడ పని చేసే ఉన్నత ఉద్యోగుల గొంతులను మిమిక్రీ చేసి కడుపుబ్బ నవ్వించాడు. దానితో జానీ పేరు పక్కన లీవర్ చేరిపోయింది.  అందిన పనిని ఇష్టంగా చేసే ఆ తత్వమే అతడికి అదే కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తుంటేనే అనుకరణ కళతో హాస్యం పండించే అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు అతడిని ఇండియాలోనే తొలి ‘స్టాండప్ కమేడియన్’ గా పేరు తెచ్చిపెట్టాయి. జానీ టైమింగ్, హావభావాలు, మిమిక్రీ ప్రతిభ చూసి అనేక కామెడీ షోలు  అతడి కోసం క్యూ కట్టాయి. దాంతో  ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయి కమెడియన్ గా మారాడు జానీ లీవర్.

అలా ప్రదర్శనలు ఇస్తూ 1982 లో వరల్డ్ టూర్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బృందం తో కలిసి కామెడీ షో చేసే ఛాన్స్ తలుపు తట్టింది. అది జానీలీవర్ జీవితాన్ని మలుపు తిప్పింది. వెండితెరపై తొలి అవకాశాన్ని అప్పటి నటుడు సునీల్ దత్ ‘దర్ధ్ కా రిస్తా’ లో ఇచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోగా తన పని తాను చేసుకుంటూ తనలోని మిమిక్రీ, హాస్యాలను మేళవిస్తూ ‘హసీ కే హంగామా’ పేరుతో ఒక ఆడియో క్యాసెట్ విడుదల చేసాడు. ఆ క్యాసెట్ సూపర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పరిచయం చేసింది. కామెడీ స్టార్ గా మార్చేసింది. ఒక ఛారిటీ షో లో ఆయన ప్రతిభను గమనించిన బాలీవుడ్ నిర్మాత గుల్ ఆనంద్ ‘జల్వా’ సినిమా లో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు జానీ లీవర్.

1990 లో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా బాజీగర్’తో   స్టార్ కమెడియన్ అయిపోయాడు. అయినా కూడా తనకి ఇష్టమైన కామెడీ షో లని మాత్రం వదల్లేదు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా 1999లో మైఖేల్ జాక్సన్ ని అనుకరిస్తూ జానీ లీవర్ చేసిన స్కిట్ ను ఇప్పటికీ తలుచుకుంటునే ఉంటారు హాస్య ప్రియులు.

మొత్తం 350 పైగా సినిమాల్లో నటించిన జానీ లీవర్,  చాలా భాషల్లో మాట్లాడగలడు కూడా. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళం, తుళు. తుళు, తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసాడు. తెలుగులో మహేష్ బాబు  హీరో గా పరిచయమైన ‘రాజకుమారుడు’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసాడు కూడా.

సినిమాలతో పాటు, టీవీ షో లు కూడా అనేకం చేసాడు.

జానీ లీవర్ భార్య సుజాత. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. జానీ  సోదరుడు జిమ్మీ మోసెస్ కూడా హాస్య నటుడుగా, మిమిక్రీ కళాకారుడిగా రాణించాడు.

జానీ లీవర్ చివరిగా 2023 లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక కామెడీ షో లో కనిపించాడు.

 

సోమవారం, ఆగస్టు 24, 2026

దక్షిణామూర్తి, ఇళైరాజాల బంధం... ఓ ఆదర్శం !


చెంబై వైద్యనాద్ భాగవతార్, ఏసుదాస్ గురుశిష్యుల బంధం గురించి చాలా మందికి తెలుసు. అలాంటిదే  వీ. దక్షిణామూర్తి - ఇళైయారాజా బంధం, అనుబంధం కూడా.

ఏసుదాస్, ఇళైరాజా... ఇద్దరూ చరిత్ర సృష్టించిన కళాకారులు. అందుకు తొలి దశల్లో వాళ్ల గురువులు అందించిన సహకారం చెప్పుకోదగ్గది.

ఇళైయరాజాకు తొలిదశ కర్ణాటక సంగీతం గురువు వీ. దక్షిణామూర్తి. ఆయన తమిళ బ్రాహ్మణులు. ఇళైయరాజా తమిళ సమాజంలో మాలగా పేర్కొనే వర్గం వాడు. ఇళైయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణనలోకి తీసుకోలేదు! ఇళైయరాజాలోని విద్యార్థిని పరిగణనలోకి తీసుకున్నారు. అతని లోని తపనను పరిగణించారు. తారతమ్యాలు చూపించకుండా ఎంతో చనువుగా ఇళైరాజాను చూసుకున్నారు.

ఇళైయరాజాను తన మంచం మీద కూర్చోబెట్టుకుని మరీ దక్షిణామూర్తి, ఎంతో ఆప్యాయంగా విద్య నేర్పించారు.  ఈ గురుశిష్యులిద్దరూ...సమాజంలోని కులవాద వికృత జీవులకు సరైన పాఠంగా నిలిచారు.

దక్షిణామూర్తిని మలయాళ, తమిళ సినిమా పరిశ్రమలు 'సామి' అని పిలుస్తాయి. ఇళైయరాజా కూడా సామి అనే పిలుస్తారు.

చెంబై వైద్యనాధ్ బాగవతార్, దక్షిణామూర్తి వంటి గురువుల శిష్యరికంలో ఏసుదాస్, ఇళైయరాజాలు కులమతాలకు అతీతంగా రాణించి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులయ్యారు.

బ్రాహ్మణ్యం, దళితత్వం పుట్టుకతో రావు.

బ్రాహ్మణ డీఎన్ఏ, దళిత డీఎన్ఏ అని విడివిడిగా లేవు.

బ్రాహ్మణ్యం, దళితత్వం అన్నవి స్థితులు. కొందరు తమ మనస్తత్వ రీత్యా, తమ జీవన విధానంవల్లా ఆ స్థితుల వాళ్లయ్యారు.

ఇవాళ ఏసుదాస్, ఇళైయరాజాలది ఓ  గొప్ప చరిత్ర.

కులం, మతం ఒక మనిషిని ఉన్నతుణ్ణి చెయ్యవు. అతడి తపన, పట్టుదల, వినయం, విద్య పట్ల ఉన్న అనురక్తి... ఇవే ఎవరినైనా గొప్పవాళ్లను చేస్తాయి.

 

గురువారం, ఆగస్టు 20, 2026

కేవీ రెడ్డి అరిస్తే ‘ష్.. గప్‌చుప్’!

క్రమశిక్షణకు ప్రాణమిచ్చే దర్శకుల్లో కె.వి. రెడ్డి ఒకరు. ‘మాయాబజార్’ లాంటి గొప్ప సినిమాను తెలుగు చలన చిత్రసీమకు అందించిన ఆయన ముందు అలనాటి ఏఎన్నార్, ఎన్టీఆర్ కూడా చేతులు కట్టుకుని ఉండేవాళ్లు. సెట్టింగులోకి వచ్చారంటే ఒక పూజ చేస్తున్నంత శ్రద్ధగా పని చేసేవారాయన. పని మొదలు పెట్టాక ఎలాంటి అనవసరపు శబ్దాలు
ఆయనకు వినబడకూడదు. అంతా నిశ్శబ్దంగా సాగిపోవాలి. ఈ విషయంలో నిర్మాతలను సైతం ఆయన లెక్క చేసేవారు కారు. ఓసారి ‘మాయా బజార్’ షూటింగులో అదే జరిగింది. సెట్ లో కేవీ రెడ్డి స్క్రిప్ట్ చూసుకుంటూ పాత్ర దారుల చేత రిహార్సల్స్
చేయిస్తున్నారు . ఓ మూలగా నిర్మాతలైన  నాగి రెడ్డి , చక్రపాణి ఉన్నారు. వాళ్లు ఎవరి గురించో మాట్లాడుకున్తున్నారు. కేవీ రెడ్డి అది గమనించి వారి కేసి ఓసారి సీరియస్ గా చూశారు. అయినా వాళ్లది గమనించలేదు. వాళ్లు మాట్లాడుకోవడం ఆపకపోవడంతో కేవీరెడ్డి ఎలాంటి మొహమాటం లేకుండా గొంతు పెంచి,  "ఉడ్ యూ ప్లీజ్ అవుట్ ..." అన్నారు. సెట్ లో వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. వెంటనే నాగిరెడ్డి , చక్రపాణి లేచి నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయారట.

ఇంకో సందర్భంలో సెట్ బయట ఏఎన్నార్, ఎన్టీఆర్, గుమ్మడి, నాగి రెడ్డి, చక్రపాణి  కూర్చుని ఉన్నారు. ఏయన్నార్ ఏదో జోక్ వేయగానే అందరూ గొల్లుమని నవ్వారు. వెంటనే లోపల నుంచి కేవీ రెడ్డి అరుపు వివిపించింద. అంతే... అందరూ సైలెంట్. ఇలాంటి క్రమశిక్షణను ఈనాటి చిత్ర సీమలో ఊహించగలమా?

 

బుధవారం, ఆగస్టు 19, 2026

ఒకే స్త్రీతో... ఏడుసార్లు ప్రేమలో...


​ఒక  మనవడు తన 80 ఏళ్ల తాతగారిని ఇలా అడిగాడు:
​"తాతయ్యా… మీరు ఒకే స్త్రీని 60 ఏళ్ల పాటు ఎలా ప్రేమించగలిగారు?"
​మనవడు తాతయ్య నుండి ఇలాంటి సమాధానాలు వస్తాయని ఊహించాడు:
​"పరస్పర అవగాహన ఉండాలి..."
​"మనసు విప్పి మాట్లాడుకోవాలి..."
​"సర్దుకుపోవడం, రాజీ పడటం నేర్చుకోవాలి..."
​కానీ తాతగారు చిరునవ్వు నవ్వి, క్షణం పాటు బామ్మ వైపు చూసి ఇలా అన్నారు:
​"నేను ఒకే స్త్రీని 60 ఏళ్ల పాటు ప్రేమించానని నీతో ఎవరు చెప్పారు?"
​ఆ మాటకి మనవడు ఆశ్చర్యపోయాడు.
​తాతగారు కొనసాగిస్తూ…
​మొదటి ప్రేమ ❤️: "20 ఏళ్ల వయసులో, ఆమె సౌందర్యానికి, ఆమె ఉత్సాహభరితమైన మనస్తత్వానికి ముగ్ధుడనై ఆమెతో ప్రేమలో పడ్డాను.
​రెండవ ప్రేమ ❤️: 30 ఏళ్ల వయసులో, ఆమె ఒక తల్లిగా మారింది. రాత్రంతా నిద్రపోకుండా, మన పాపాయిని ఒడిలో జోలపాడి నిద్రపుచ్చిన ఆ మాతృమూర్తిని చూసి మళ్లీ ప్రేమలో పడ్డాను.
​మూడవ ప్రేమ ❤️: 40 ఏళ్ల వయసులో, కుటుంబ బాధ్యతల భారమంతటినీ పెదవులపై చిరునవ్వుతో మోసిన ఆ ధైర్యవంతురాలైన స్త్రీతో ప్రేమలో పడ్డాను.
​నాల్గవ ప్రేమ ❤️: 50 ఏళ్ల వయసులో, మన పిల్లల భవిష్యత్తు కోసం తన స్వంత కలలను, ఆశలను త్యాగం చేసిన ఆ సమర్పణ భావంతో ప్రేమలో పడ్డాను.
​ఐదవ ప్రేమ ❤️: 60 ఏళ్ల వయసులో, ఆమె ముఖంలో ముడతలు వచ్చాయి. కానీ నా ఒక్క చూపుతోనే నా బాధను, ఆందోళనను అర్థం చేసుకునే ఆ జీవిత భాగస్వామితో ప్రేమలో పడ్డాను.
​ఆరవ ప్రేమ ❤️: 70 ఏళ్ల వయసులో, ప్రతీ రోజూ క్రమం తప్పకుండా 'టాబ్లెట్లు వేసుకున్నారా?' అని అడిగే ఆ ప్రేమమూర్తితో ప్రేమలో పడ్డాను. ఆమె ఆప్యాయత నా హృదయాన్ని తాకింది.
​ఏడవ ప్రేమ ❤️: ఇక ఇప్పుడు, 80 ఏళ్ల వయసులో... నా పక్కనే నెమ్మదిగా అడుగులు వేస్తూ, పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ చెబుతూ, నాతో కలిసి నవ్వే ఈ తోటి ప్రయాణీకురాలితో ప్రేమలో ఉన్నాను."
​మనవడు నిశ్చేష్టుడై, మౌనంగా ఉండిపోయాడు.
​తాతగారు చిరునవ్వుతో ఆఖరిగా ఇలా అన్నారు:
​"వివాహం అంటే జీవితాంతం ఒకేలా ఉండే వ్యక్తితో కలసి జీవించడం కాదు.
కాలం మారే కొద్దీ... రకరకాల రూపాలుగా మారే అదే వ్యక్తితో, పదే పదే మళ్లీ మళ్లీ ప్రేమలో పడటం నేర్చుకోవడం!"
​అందం మారుతుంది.
​వయసు మారుతుంది.
​శరీరం మారుతుంది.
​పరిస్థితులు మారుతాయి.
​కానీ ప్రతీ మార్పులోనూ, మీరు మీ భాగస్వామి వైపు చూసి... "ఈ రోజుకీ నా మనసుకి నచ్చిన ఏకైక వ్యక్తివి నువ్వే!" అని చెప్పగలిగితే...
​❤️ అదే దీర్ఘకాలిక, సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క అసలైన రహస్యం.
​ఎందుకంటే…
​🌹 ప్రేమ అంటే ఒక్కసారి మాత్రమే ప్రేమించడం కాదు.
🌹 నిజమైన ప్రేమ అంటే... జీవితంలోని ప్రతీ దశలోనూ, అదే వ్యక్తితో పదే పదే కొత్తగా ప్రేమలో పడటం.
​ఇక్కడ మనం వేసుకోవాల్సిన అత్యంత అందమైన ప్రశ్న ఏమిటంటే:
​"ఈ రోజు మీతో ఉన్న జీవిత భాగస్వామి, మీరు మొదట ప్రేమించిన ఆ పాత వ్యక్తి మాత్రమేనా…? లేదా కలసి పంచుకున్న ఏళ్లు, పడిన కష్టాలు, చేసిన త్యాగాలు మరియు తీపి జ్ఞాపకాలతో రూపుదిద్దుకున్న ఒక కొత్త అందమైన వ్యక్తిగా మారారా?"
​❤️ నిజమైన ప్రేమ అంటే ఇద్దరూ ఒకేలా ఉండిపోవడం కాదు... ఇద్దరూ కలసి మారుతూ, ప్రతీ రోజూ ఒకరినొకరు మళ్లీ మళ్లీ ఎంచుకోవడం! ❤️🌹

ఏలియన్స్ మన కేసి చూస్తే... కనిపించే అద్భుతం


 

మంగళవారం, ఆగస్టు 18, 2026

ఏలియన్స్ మన కేసి చూస్తే?



మన సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగానే ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాల చుట్టూ కూడా ఏవేవో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా? వాటిలో ఏ గ్రహం మీదైనా మన భూమి లాంటి వాతావరణం ఉండే ఉంటుంది కదా? అలా ఉంటే వాటిలో కూడా మనలాంటి వాళ్ల ఉండే అవకాశం ఉంది కదా?

ఈ ప్రశ్నలే మనకు గ్రహాంతర వాసుల (ఏలియన్స్) గురించిన ఆలోచనలు కలుగజేస్తాయి.  ఈ ఆలోచనల ఆధారంగానే ఎన్నో ఊహాగానాలు, కథలు, సినిమాలు బోలెడు పుట్టుకొచ్చాయి.

సరే... ఇప్పుడొక ఆసక్తికరమైన ఊహకి వద్దాం.  

ఎక్కడో సుదూరంలో ఉండే గ్రహంలోని ఏలియన్స్ అత్యాధునికమైన ఏ టెలిస్కోపు లాంటి పరికరంతోనో మన భూమి కేసి చూస్తే ఏం కనబడుతుంది?

పైకి చాలా సాధారణంగా కనిపించే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే వాళ్లకి ఏం కనిపిస్తుందనే విషయం, ఆ గ్రహం మనకి ఎంత దూరంలో ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతరిక్షంలో దూరాలను కాంతి సంవత్సరం అనే కొలమానంలో చెబుతారని తెలుసుగా? ఒక కాంతి సంవత్సరం అంటే... కాంతి ఒక ఏడాదిలో ప్రయాణించే దూరం. కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలా అది ఏడాదిలో ప్రయాణించే మొత్తం దూరాన్ని ‘కాంతి సంవత్సరం’ అంటారు.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఏలియన్స్ ఉన్న ఒక గ్రహం మన భూమికి దాదాపు 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అనుకుందాం. వాళ్లు టెలిస్కోపు లాంటి ఏదైనా ఒక అత్యాధునిక పరికరంలో మన భూమి కేసి చూశారనుకోండి. అప్పుడేం కనిపిస్తుంది?  

ఏముందీ... మన విమానాలు, రైళ్లు, ఆకాశహర్మ్యాలు, లైట్లతో వెలిగిపోయే నగరాలు అన్నీ కనిపిస్తాయనుకుంటే... అది శుద్ధ తప్పు.  

వాళ్లకి మనమెవ్వరం కనిపించం. మన భూమి 2,000 ఏళ్ల క్రితం నాడు ఎలా ఉందో ఆ ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. మన ప్రాచీన వీధుల్లో వెలిగే కాగడాలు, సముద్రాల మీద ప్రయాణిస్తున్న చెక్క నౌకలు, అప్పటి సామ్రాజ్యాలు, గుర్రాలు రథాల్లాంటి రవాణా సాధనాలు... ఇలాంటివే  వారికి కనిపిస్తాయి.

ఎందుకంటే కాంతి ప్రయాణించడానికి కొంత సమయం పడుతుంది కదా? ఆ గ్రహం మనకి 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి అప్పటి దృశ్యాలనే వాళ్లు చూడగలుగుతారు. ఈ రోజు భూమి నుండి వెలువడే కాంతి మరో 2,000 సంవత్సరాల వరకు వారిని చేరుకోదు.

విశ్వంలో, దూరం అనేది గతాన్ని చూపే ఒక కిటికీ లాంటిది.

మీరు ఎంత దూరం చూస్తే, సమయం పరంగా అంత వెనక్కి చూస్తున్నారని అర్థం.

అలగే మనకి 6.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇంకో గ్రహం ఉండి, అందులో గొప్ప నాగరికత ఉన్న ఏలియన్స్ తమ దగ్గరున్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌తో మన

భూమిని చూశారనుకోండి. అప్పుడు వాళ్లకి మానవజాతి ఏమాత్రం కనిపించదు.

భూమిపై సంచరిస్తున్న డైనోసార్లను వారు చూస్తారు.

మరి 4.5 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం నుండి చూస్తే?

మన గ్రహం అసలు ఉనికిలోనే ఉండదు.

భూమి పుట్టడానికి చాలా కాలం ముందు విశ్వంలో ఉన్న భారీ వాయువులు, ధూళి మేఘాలను మాత్రమే వారు చూస్తారు.

ఈ విశ్వమంతటా సార్వత్రికమైన "ఇప్పుడు" (ప్రస్తుతం) అనేది లేదు.

కాంతి పరిమిత వేగం కారణంగా, అంతరిక్షంలోని ఒకో ప్రదేశం నుంచి చూసినప్పుడు, ఒకోలా భూమి చరిత్రలోని వేర్వేరు దశలు కనిపిస్తాయి.

విశ్వంలో ఎక్కడో ఒక చోట నుంచి చూస్తే, భూమి ఇంకా డైనోసార్ల యుగంలోనే ఉండవచ్చు.

మరెక్కడి నుంచో చూస్తే ప్రాచీన నాగరికతలు ఇప్పుడే మొదలవుతూ ఉండవచ్చు.

ఇంకా ఎక్కడో బహు దూరంలోంచి చూస్తే మన ప్రపంచం ఇంకా ఏర్పడనే ఉండదు.

అలాగే  మనం కూడా ఎక్కడో దూరంగా ఉన్న భూమి లాంటి గ్రహాన్ని చూశామనుకోండి... అప్పుడు మనకి కనిపించే దృశ్యాలు ‘ఇప్పుడు’ అక్కడ ఉన్నవి కావు. మనకి, ఆ గ్రహానికి ఉన్న దూరాన్ని బట్టి అంత గతంలోనివి.

కాబట్టి మీరు నక్షత్రాలను చూసినప్పుడల్లా ఒక విషయం గుర్తుంచుకోండి...

మీరు కేవలం అంతరిక్షంలోకి మాత్రమే చూడటం లేదు.

కాంతి వేగంతో మీ కళ్ళను చేరుకుంటున్న బిలియన్ల సంవత్సరాల విశ్వ చరిత్రను మీరు చూస్తున్నారు.

 

శుక్రవారం, ఆగస్టు 07, 2026

పితృ దోషాలు మటుమాయం


 

దెయ్యాల గ్రామం... భయాలు, నిజాలు


 

అంతరిక్షంలో అన్నదమ్ముల అద్భుత ప్రయాణం!


భూమి మీద నుంచి 50 ఏళ్ల క్రితం ఇద్దరు అన్నదమ్ములు చెరో దారిలో అంతరిక్షంలోకి బయల్దేరారు. అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా, విసుగూ విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్లలా ఇప్పటికి ఏకంగా 2500 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. అంతేకాదు... అంత దూరం నుంచి కూడా భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని పంపుతూనే ఉన్నారు.

ఇంతకీ ఆ అపూర్వమైన అన్నదమ్ములు ఎవరో తెలుసా?

వాయేజర్-1, వాయేజర్-2.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వీళ్లని తయారు చేసింది. 1977లో వీళ్లని అంతరిక్షంలోకి ప్రయోగించింది.

అన్నదమ్ముల్లాంటి ఈ అంతరిక్ష పరికరాలు (స్పేస్ ప్రోబ్స్) ఇప్పుడు ఎలాంటి ఘనతను సాధించాయో తెలుసా?

మానవులు ప్రయోగించిన ఓ పరికరం ఏనాడూ వెళ్లనంత దూరానికి ఇవి చేరుకున్నాయి.

ఆ దూరం 2500 కోట్ల కిలోమీటర్లకు పైమాటే.

అదెంత దూరమో అర్థం కావాలంటే అసలు మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి సూర్యకుటుంబం అంటారు కదా? 

సూర్యుడి నుండి నిరంతరం వెలువడే సౌర పవనాలు (solar winds), అయస్కాంత క్షేత్రం (magnetic field) కలిసి అంతరిక్షంలో ఏర్పరిచే ఒక భారీ 'బుడగ' లాంటి రక్షిత ప్రాంతాన్ని హెలియో స్పియర్ అంటారు. గెలాక్సీలోని ఇతర నక్షత్రాల విస్ఫోటనాల నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల (cosmic rays) నుండి ఇది మన సౌర వ్యవస్థ లోపలి గ్రహాలను రక్షిస్తుంది.

ఈ హెలియో స్పియర్ వెలుపలి సరిహద్దు (outer boundary)ను హెలియో పాజ్ అంటారు. ఈ ప్రాంతంలో సూర్యుడి నుండి వచ్చే సౌర పవనాలు తమ వేగాన్ని కోల్పోయి, నక్షత్రాల మధ్య ఉండే వాయువులు, ధూళితో (interstellar medium) ఢీకొంటాయి.  

నాసా ప్రయోగించిన వాయేజర్ 1, వాయేజర్ 2 వ్యోమనౌకలు ఈ సరిహద్దును దాటి పోయాయి. వాయేజర్ 1 ఆగస్టు 2012లో, వాయేజర్ 2 నవంబర్ 2018లో 'హీలియోస్పియర్' దాటిపోయి రికార్డు సృష్టించాయి.   

ఇక అక్కడి నుంచి మొదలయ్యే ప్రాంతాన్ని నక్షత్రాంతర రోదసి (interstellar space) అంటారు.

అద్భుత ఆవిష్కరణ...

అక్కడ అవి చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

సౌర వ్యవస్థ చివర భాగంలో ఉన్న హెలియోపాజ్  ప్రాంతంలో ప్లాస్మా ఉష్ణోగ్రతలు 54,000 నుంచి 90,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు నమోదయ్యాయి. అందుకే ఈ ప్రాంతాన్ని చాలామంది "అగ్ని గోడ" (Wall of Fire) అని పిలుస్తారు.

ఇంతటి భయంకరమైన వేడిలో కూడా వాయేజర్ నౌకలు ఎలా సురక్షితంగా ప్రయాణించాయి?

దీనికి కారణం అక్కడి పదార్థ సాంద్రత చాలా తక్కువగా ఉండటమే. అక్కడ కణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటంతో, అవి అంతరిక్ష నౌకకు వేడిని బదిలీ చేయలేకపోయాయి. అంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువైనా, వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎలాగంటే... మనం వేడిగా ఉన్న ఓవెన్‌లో గాలిలో చేయి కొద్దిసేపు ఉంచినా ఏమీ కాదు. కానీ ఓవెన్ లో వేడెక్కిన ఇనుప పాత్రను తాకితే మాత్రం వెంటనే కాలుతుంది కదా? అలాగన్నమాట.

ఈ మిషన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. సౌర వ్యవస్థ అంచు ఒక స్థిరమైన సరిహద్దు కాదు. అది సూర్యుని కార్యకలాపాలను బట్టి విస్తరిస్తూ, కుంచించుకుంటూ ఉండే సరిహద్దు. అందుకే వోయేజర్-1, వోయేజర్-2 రెండూ సూర్యుని నుండి వేర్వేరు దూరాల్లో హెలియోపాజ్‌ను దాటాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హెలియోస్ఫియర్ వెలుపల ఉన్న అయస్కాంత క్షేత్రం, లోపల ఉన్న అయస్కాంత క్షేత్రం దాదాపు ఒకే దిశలో ఉంది. ఇది శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది.

 మొత్తం మీద వాయేజర్ సోదరులు దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అమూల్యమైన సమాచారాన్ని భూమికి పంపుతూ, విశ్వ రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు.

మరి ఈ ప్రయోగం ఉద్దేశ్యం ఏమిటి?

వాయేజర్ స్పేస్ ప్రోబ్స్ ను అంతరిక్షంలోకి పంపడం వెనుక ఓ లక్ష్యం ఉంది. అంతుపట్టని ఈ విశ్వంలో ఎక్కడైనా మనలాంటి గ్రహాంతర వాసులు ఉంటే వాళ్లకి మన ఉనికి, మన భూమి గురించి తెలియజేయాలనే. అందుకే వీటిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఆధ్వర్యంలో ఒక గోల్డెన్ రికార్డును అమర్చారు. ఇందులో భూమిపై ఉన్న విభిన్న శబ్దాలు (గాలి, ఉరుములు, పక్షులు, జంతువుల అరుపులు), సంగీతం, సంస్కృతుల చిత్రాలతో పాటు, గ్రహాంతర వాసుల కోసం 55 ప్రపంచ భాషలలో శుభాకాంక్షలు రికార్డ్ చేశారు. ఇందులో 55 భాషల్లో శుభాకాంక్షలు ఉన్నాయి. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ‘‘తెలుగు మాట్లాడే ప్రజల నుంచి మా శుభాకాంక్షలు’’ అని అందులో ఉంటుంది.