మంగళవారం, అక్టోబర్ 04, 2022

సామాన్యుడి బాధల దండకం!

 


దండాలు తల్లీ... నీకు దండాలమ్మా...

మా కట్టాలు పోగొట్టి కాపాడవమ్మా!

అమ్మోరు తల్లీ... నీకు మొక్కేమమ్మా...

మా ఇక్కట్లు తరిమేసి మమ్మేలవమ్మా!

ఆంధ్ర దేశాన పుట్టి అల్లాడుతున్నాము...

అట్టకట్టాలతోటి వేగి పోతన్నాము...

మా మొరలు వినుకోని ఆదుకోవమ్మా!

మా బాధలను తీర్చేసి దరిజేర్చవమ్మా!

ఓటు తప్ప మాకాడ ఏటి లేదమ్మా...

ఆ ఓటు గుద్దేసి ఓడిపోయామమ్మ!

మా వెతలు సెప్పుకోను మడిసిలేడమ్మ...

నీ కంటె మాకెవరు దిక్కులేరమ్మ!

మా ఓట్లతో గెలిచి... మా మేలునే మరిచి...

మాయ జేసేరమ్మ మా నేతలు!

ఊరువాడా తిరిగి ఓదార్చి బులిపించి...

ఊసులెన్నో సెప్పి ఊరించినారమ్మ!

ఆ మాటలను నమ్మి ఆశపడ్డామమ్మ...

బతుకులిక మారునని మురిసిపోయామమ్మ!

ఆ ఆశలన్నీ వట్టి అడియాసలేనమ్మ...

నమ్మి నట్టేటిలో మునిగిపోయామమ్మ!

పొర్లు దండాలను పెట్టుకుంటామమ్మ...

పొర్లేటి కన్నీరు నువ్వు తుడవాలమ్మ!

పూజలూ పజ్యాలు మాసేతకావమ్మ...

దండకాలను మేము సదవలేమమ్మ!

మా బాధలే నీకు సెప్పుకుంటామమ్మ...

ఆటినే నువు తీర్చి ఆదుకో మా తల్లి!

ఎద్దు రాకాసోడికి ఎదురొడ్డి పోరాడి...

ఎదురు లేకుండా నువ్వు గెలిసినావటమ్మ!

ఈనాడు సూడగా అసుమంటి అసురులు...

అడుగడుగునా పెచ్చు పెరిగిపోయారమ్మ!

బంగారు రోజుల్ని తెస్తామనీ సెప్పి...

బతుకుల్ని బుగ్గిలో కలిపేత్తనారమ్మ!

సాగుసేద్దామంటె గిట్టుబాటే లేదు...

కూలి సేద్దామంటె కూటికే గతి లేదు!

కాయగూరల ధరలు కస్సుమంటాయమ్మ...

సరుకులన్నీ కలిసి వెక్కిరిస్తాయమ్మ!

గంజి తాగేటి మా బోటి పేదలను కూడ...

సొమ్ములను కట్టమని గుంజుతున్నారమ్మ!

పాత సర్కారోళ్లు ఇచ్చిన ఇళ్లపై...

కొత్త సర్కారోళ్ల పెత్తనం సూడమ్మ!

ఆడబిడ్డల బతుకు అల్లాడుతోందమ్మ...

కాపాడు ఖాకీలు పట్టంచుకోరమ్మ!

పిలగాళ్ల సదువులు నేల నాకాయమ్మ...

సర్కారు కొలువులు కానరావమ్మ!

ఎటువైపు సూసినా మత్తు దుకాణాలు...

మా సంసారాలనే సిత్తుసేత్తన్నాయమ్మ!

సారాయి కొట్టాలు కనిపించవని సెప్పి...

ఆటినే సూటిగా పెంచుతున్నారమ్మ!

పగలంత పనిజేసి తీసుకొచ్చిన సొమ్ము...

మత్తులో ముంచెత్తి గుంజుతున్నారమ్మ!

ఇంతసేశామంటు... అంతసేశామంటు...

ఇంటింటికీ తిరిగి గొప్ప సెబుతారమ్మ!

సిగ్గంటు లేకుండ ఊసులాడేరమ్మ...

ఎగ్గంటు లేకుండా ఊరేగుతారమ్మ!

కాస్త మా కట్టాలు సూడమని అడిగితే...

కేసులేవో పెట్టి కాక పెడతారమ్మ!

అడిగితే కోపాలు... అదిలించి పోతారు...

అడుగడుగునా మాకు అగచాట్లు పెడతారు!

ఏవేవొ పథకాలు నీకోసమంటారు...

ఆఖరికి ఆటిలో కొర్రీలు పెడతారు!

అయిన వాళ్లకి ఇచ్చి అర్హులను మరిచేరు...

మాబోటి పెదలను నిలువునా ముంచేరు!

సర్కారు భూములను పెద్దోళ్లకిచ్చేసి...

పరగణా మొత్తాన్ని పిండుతున్నారమ్మ!

గంజాయి సాగులో గిరిజనులను జేర్చి...

ఊరుదాటించేసి దండుతున్నారమ్మ!

దొరికితే కేసులో ఇరికించి జారుకుని...

కాసులను పంచుకుని కులుతున్నారమ్మ!

నేతలందరు నీతి కట్టుదాటారమ్మ...

చేతికందినదంత దోచుకుంటారమ్మ!

ఇసుక రేణువు నుంచి కొండకోనల దాక...

పంచుకుని దర్జాలు వెలగబెడతారమ్మ!

ఏమి సెబుతానమ్మ... ఎన్ని సెబుతానమ్మ...

ఎరుకగల తల్లివి నీకు తెలుసుకదమ్మ!

ఇకనైన మా బుద్ది పెడతోవ పడకుండ...

నిజమైన నేతలను గుర్తించు తెలివియ్యి!

మాయమాటలు విని మోసపోనీకుండ...

చురుకుతో మా బుర్ర  పదునెట్టవమ్మ!

అలనాటి అసురుల ఉసురు తీసిన తల్లి!

నేటి నేతల నుంచి మము కాపాడు తల్లి!!

-సృజన

PUBLISHED ON 3.10.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి