బుధవారం, అక్టోబర్ 26, 2022

అప్పుడే... నిజమైన దీపావళి!

 


సామాన్యుడు మంచం మీద నడుం వాల్చి నిద్రలోకి జారుకున్నాడో లేదో, బయటికెళ్లిన ఎంకి గబగబా వచ్చి లేపేసింది.

''ఎహె... లెగు మావా! పండగ రోజుల్లో కూడా ఏంటీ మొద్దు నిద్ర? ఏం తెచ్చానో చూడు...'' అంది సంబరంగా.

''ఏంటే బంగారం లాంటి నిద్ర సెడగొట్టావ్‌... ఏంది నీ గోల?''

''ఏటంటావేంటి మావా... దీపావళి గందా... బాణసంచా భరోసా పథకం పెట్టారంట. బజార్లో పంచిపెడతాంటే పట్టుకొచ్చా... పిల్లలు సరదాగా కాల్చుకుంటారని...''

''ఓస్‌నీ... నీకింకా బ్రమలు పోలేదన్నమాట. ఆళ్లూ ఆళ్ల పథకాలు... ఇయ్యన్నీ కాల్తాయా ఏటన్నానా?''

''పో... మావా... నీదంతా ఒట్టి నసుగుడు మేళం... నువ్వు కొనవు కానీ ఊరికే నస పెడతావు...''

ఈలోగా పిల్లలు బిలబిలలాడుతూ వచ్చారు. సంచీలోంచి సంబరంగా ప్యాకెట్‌ తీశారు. దాని మీద మెత్తగా నవ్వుతున్న సీఎం మొహం, ఆయన పేరు మీద బాణసంచా పంచిపెట్టిన స్థానిక నాయకుడి ఫొటో ఉన్నాయి.

''అబ్బో... ఏం పెచారం... ఏం పెచారం... దీనికేం తక్కువనేదు...'' అంటూ నసిగాడు సామాన్యుడు.

''ఓలొల్లకో మావా... పంచిపెట్టేటోళ్లు పెచారం సేసుకుంటే తప్పేంటంట? నీది మరీ ఇచిత్రం...'' అంది ఎంకి.

''ఇగో... నీలాంటి ఎర్రిబాగులోళ్ల వల్లే ఆళ్ల ఆటలు అట్టా సాగుతున్నాయి.  దోచేతి కొండంత, పంచేది ఆవగింజంత. మన కళ్ల ముందే అనుచరుడి నుంచి అధినేత వరకు అందిన కాడికి అన్నీ దోచేస్తుంటే... నీలాంటోళ్లు మాత్రం కానుకోలేరు...''

''ఎహెస్‌... ఊరుకో మావా... పండగ పూట కూడా రాజకీయాలు మాట్టాడతావు... ఆళ్లెట్టా పోతే మనకెందుకంట? మన బతుకులేవో మనం సూసుకోవాలి కానీ...''

''ఏడిశావ్‌లే... ఇట్టా ఊరుకుంటేనే మన బతుకులిలా దిగజారిపోతన్నాయి.  రాజకీయం అంటూ వేరే ఏటీ నేదు... మన సుట్టూతానే బిగుసుకుని ఉంది. మనల్ని అడుగడుగునా అజమాయించేది అదేగందే? మూడేళ్లయింది ఈళ్లు కుర్చీ ఎక్కి... నువ్వేమన్నా బాగుపడ్డావా, నేదే? కానీ మన నేతలు సూడు. నిన్నగాక మొన్న మన కళ్ల ముందు మొహం దిగాలేసుకుని తిరిగేటోడు, ఇయ్యాల ఆ పార్టీలో సేరి కారులో ఊరేగుతున్నాడు. అదేదో పథకం కింద ఇళ్లు కట్టేసుకున్నాడు. అదేనే రాజకీయం అంటే... మనలాంటి సామాన్యలకేం ఒరిగిందంట?''

''ఏందో మావా... నువ్వు సెబతా ఉంటే నిజమేననిపిస్తాది. తరువాత మరుపొస్తాది. నువ్వన్నట్టు మనము, మన పాక, మన బతుకులు అట్టానే ఏడిశాయి. ఎదుగూనేదు, బొదుగూనేదు. సర్లే కానీ... ఏదో పిల్లలు కాల్చుకుంటుంటే సూద్దారి దా మావా...'' అంటూ ఎంకి ఇంటి బయటకి లాక్కెళ్లింది.

అక్కడ పిల్లలు దీపాలు వెలిగించి ప్యాకెట్ విప్పి అందులో ఏమున్నాయో చూస్తున్నారు.

''నానోయ్‌... మతాబులు ఉన్నాయి సూడు'' అంటూ తెచ్చిచ్చారు. సామాన్యడు వాటిని వెనకా ముందూ తిప్పి చూసి, ''ఒరేయ్‌... ఈటిలోంచి ముత్యాలు రావురా... ఒట్టి పొగొస్తాది. కావాలంటే ముట్టించి చూడండి...'' అన్నాడు.

పిల్లలు దీపం మంట మీద పెట్టారు. ఓ పట్టాన అంటుకోలేదు. తర్వాత అంటుకున్నా పొగ తప్ప ఏదీ లేదు. పిల్లలు చిన్నమొహం పెట్టుకుని మతాబులు అక్కడ పడేశారు.

''అదేటి మావా? ఆ మతాబులు కాలవని, పొగ మాత్రమే వస్తాయని ముందే ఎట్టా సెప్పగలిగావ్‌?'' అంది ఎంకి.

సామాన్యుడు నిట్టూర్చి చెప్పాడు, ''ఆ మతాబులు సేసిన కాగితాలేంటో సూసానే... పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు రావూ? ఆటితో సేసినవి. ఆ ప్రకటనల్లో నిజాలెంతో ఈటిలో ముత్యాలంత. ఓ... అంత సేసేసాం...ఇంత సేసేసాం... అంటూ పెచారమే తప్ప ఈళ్ల పాలనలో జరిగిందేటి? ఒరిగిందేటి? దాన్ని బట్టే సెప్పా...''.

''నిజమే మావా... ఆళ్ల ప్రకటనలే కాదు, మాటల్లో కూడా పెద్ద పెద్ద అంకెలే తప్ప మరేటీ ఇనిపించవు. అన్నేసి కోట్లంటారు, ఇన్నేసి కోట్లంటారు. మరి నిజంగానే అన్నేసి కోట్లు కర్సు సేత్తాంటే... మనలాటోల్ల బతుకులెందుకిట్టా తగలడ్డాయో ఎంతకీ అర్థం కాదు నాకు...'' అంది ఎంకి.

ఈలోగా పిల్లలు ఏదో అట్టపెట్టె తీసి చూపించారు. దాని మీద 'నవరత్నాల బ్రాండ్‌' అని రాసి ఉంది. సామాన్యూడు దాన్ని అటూ ఇటూ తప్పి చూసి నవ్వుకుని, ''ముట్టించి సూడండి. మీకే తెలుస్తాది...''అన్నాడు. పిల్లలు వెలిగించగానే అవి కాసేపు చిటపటలాడి, తర్వాత రంగులు మార్చి, ఆపై చటుక్కున ఆరిపోయాయి. పిల్లలు వాటిని విసుగ్గా పడేశారు.

''ఇయ్యేం కాకరపువ్వొత్తులు మావా? వెలుగులూ లేవు... రవ్వలూ రాలనేదు'' అంది ఎంకి.

''ఆటి బ్రాండ్‌ సూసినప్పుడే అర్థమైందే... నవరత్నాలంట... నవరత్నాలు. బెడ్డలేం కాదూ... అంతా ఓట్ల రాజకీయం. పేర్లు సూత్తే మా గొప్పగా ఉంటాయి. ఆల్ల నాన్న పేరు, ఆడి పేరు కలిపి పెట్టేత్తే సరిపోద్దేంటి? పని జరగద్దూ. ఈ పథకాలందేవోల్ల జాబితాలో మనలాంటోల్లు ఉండరే... ఆళ్ల నేతలకు కావలసినోల్లు, ఆరికి జేజేలు కొట్టేటోల్లు ఉంటారు. కళ్ల ముందు కనబడ్డం లేదూ... కార్ల మీద, స్కూటర్ల మీద వచ్చి రేషన్‌ సరుకులు పట్టుకుపోతన్నారు. మనలాంటోల్లు వెళితే ఒట్టి ముతక బియ్యం తప్ప ఏటీ లేవంటారు. పండగ పూటయినా పప్పు సవగ్గా ఇత్తారనుకుంటే... స్టాకునేదంటారు.  బయట బజార్లో హెచ్చు ధరలకు  కొనుక్కోలేక సేతులు పిసుక్కంటన్నాం. అసలు పేదోళ్లకి కావలసిన సరుకులన్నీ సవగ్గా దొరికేలా సేత్తే... ఈ పథకాలెందుకంట?   ఈటి పేరు మీదు ఎవురెవురికో ఏవేవో అందుతున్నాయి కానీ, నిజంగా నానా పాట్లూ పడే మన్లాంటి పేదోళ్లకి అందుతున్నాయాంట?''

''ఔ...మావా...సత్తెమే సెప్పినావు. నసిగితే నసుగుతావు కానీ నిజాలే సెబుతావులే...''

ఇంతలో పిల్లలు ఇంకో పెట్టి తెచ్చి ''నానోయ్‌... సీమటపాకాయలు...'' అన్నారు. ఆ పెట్టె మీద మంత్రులు, ఎమ్మెల్యేల బొమ్మలున్నాయి.

''ఒరేయ్‌... ఇయ్యి మీకు బాగా సప్పుడు సేత్తాయిరోయ్‌... మాకు మాత్రం కాదు. ముట్టించండి...''

సీమటపాకాయలు పేలుతుంటే పిల్లలు చప్పట్లు కొట్టారు.

''అదేంటి మావా? నువ్వన్నట్టు అయి పేలతాంటే మనకేమీ సప్పుడు అనిపించట్లేదు?'' అంది ఎంకి.

''ఓసెర్రిమొగవా... ఆటి మీద బొమ్మలు సూసావు కదే. మనం తెల్లారి లేస్తే వీధుల్లోను, టీవీల్లోను ఆళ్ల మాటలే కదా ఇనేది? ఆళ్లు పేలినట్టు ఇయ్యెక్కడ పేల్తాయే? నోరిప్పితే ఆళ్లు మాట్టాడేది ఒట్టి బూతులేగందే? ఎదుటోడి మీద విరుచుకుపడ్డం తప్ప పనికొచ్చే ఇసయం ఏటన్నా ఉంటదేటి  ఆళ్ల వాగుడులో. అడిగిన వాడిని నానా తిట్లూ తిడతన్నారు. అమ్మ, అయ్య బూతులతో ఓ... తెగ అరుస్తుంటారు. మరాల్ల మాటల ముందు ఈ సీమటపాకాయలేపాటే? ఇయి పిల్లలకి తప్ప మనకేం సప్పుడనిపిస్తాయే?''

''నిజమే మావో... ఆల్లు మైకులు మూతుల ముందెట్టుకుని వాగుతాంటే... ఇనడానికి కంపరమెత్తిపోతాంది. సీ... ఇలాంటోళ్లా మన నేతలని సెప్పి మాసెడ్డ సికాకేత్తాంది. ఎదుటోడు ఏదైనా అడిగితే నిబ్బరంగా  నిజాలు సెప్పాలేతప్ప, తిట్లెందుకంట? సేతకానితనం కాకపోతేనీ...''

ఈసారి పిల్లలు భూచక్రాలు చూపించారు. సామాన్యుడు వాటిని చూసి, ''ఒరేయ్‌... వీటిని వీధిలోకి తీసుకుపోయి కాల్చండి. ఇవి ఒక్క చోట తిరిగేవి కావు. ఎక్కడెక్కడికో పోతాయి...'' అన్నాడు. పిల్లలు ముట్టించగానే అవి గిరగిరా తిరుగుతూ ఎక్కడికో చక్కాపోయాయి. పిల్లలు బిక్కమొహం పెట్టుకుని వచ్చారు.

''బలే సెప్పావు మావా... అయ్యి అలా కాల్తాయని నీకెట్టా తెలిసింది?''

''ఆటి మీద అదానీ, గిదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల పేర్లున్నాయే. మరి మన రాట్రంలో జరుగుతున్నదేటి? ఎక్కడ లేని సర్కారు భూముల్ని ఆ కంపెనీలకు అప్పగించడం లేదూ? కొండలు, కోనలు, గనులు, సెజ్‌లు, భూములు, ఇసుక తిన్నెలు అన్నింటినీ ఆధీనం సేసుకుని సెక్రం తిప్పడంలేదూ? ఆల్లకి ఊరికే కట్టబెడతారేంటే ఇయ్యన్నీ. అందుకు తగినట్టు ఆ బడా ఆసాములందరూ, మన అధినేత కాతాలకి, కంపెనీలకి భారీ సొమ్ములు మళ్లిత్తారే... అధికారం అడ్డం పెట్టుకుని వేలాది కోట్లు దండుకుంటారే వెర్రిమొగమా... పైగా ఇదంతా పెజానీకం కోసమేనంటారు. పెద్ద పెద్ద పరిశ్రమలొత్తాయంటారు. పిల్లలకి ఉజ్జోగాలొత్తాయంటారు. ఊర్లన్నీ తీరు మారిపోయి పెరిగిపోతాయంటారు. అయ్యన్నీ జరిగాయో లేదో ఎవుడు సూత్తాడు. మన కళ్ల ముందే ఆ భూముల్ని సుట్టాలకి, పక్కాలకి రాయించేసుకుంటారు. అనంతపురం భూముల గతి సూడనేదా? వైజాగు భూముల ఇసయం విననేదా? అందుకే ఆ భూచక్రాలు ఎటెటో పోనాయన్నమాట... అర్థమైందా?''

''అవున్టగదా మావా... వైజాగులో పాపం ఆళ్లెవరో మాజీ సైనికులకిచ్చిన భూముల్ని అడ్డగోలుగా మంత్రిగారే రాయించేసుకున్నారంటగా? నేనూ ఇన్నాలే... ఆడు మంత్రేంటి మావా... ఒట్టి కంత్రీలాగుంటేనీ...''

మళ్లీ పిల్లలు చేతులతో బాంబులు తీసుకొచ్చారు. ''నానా ఈటిని నువ్వే కాల్చు. మాకు బయ్యం...'' అన్నారు. సామాన్యుడు వాటిని చూసి, ''అబ్బే... అస్సలు భయం నేదురా... మీరే కాల్చండి...'' అన్నాడు. పిల్లలు వాటిని ముట్టించారు కానీ అవి తుస్సుమన్నాయి.

''అదేంటి మావా? అయి తుస్సుమంటాయని నీకు ముందే తెలుసా?'' అంది ఎంకి.

''ఒసే... మన పాలకులు మనమీద వేసే బాంబుల ముందు ఇయ్యెంతే. పెరిగిపోయిన ధరలు మనపాలిట నార బాంబులు. పెచ్చరిల్లిపోతన్న అత్యాచారాలు జనం పాలిట నాటు బాంబులు. పాలించే పార్టీ అనుచరులు, గుండాల దౌర్జన్యాలు మనలాంటోల్లకి పెద్ద బాంబులు. సమస్యలు తీర్చండి మహప్రభో అని అడిగే వారిమీద మోపే అక్రమ కేసులు మరో రకం బాంబులు. ఈ పాలకుల తీరు పట్ల విసుగెత్తిపోయి నలుగురూ కలిసి ఏదో నిరసనగా బయల్దేరారనుకో ఆళ్ల మీద నేతలు జరిపే దాడులు ఇంకా భయంకరమైన బాంబులు. ఇన్ని రకాల బాంబుల ముందు ఇయ్యి తస్సుమనక ఏటవుతాయే?''

''నిజమే మావా... ఈళ్ల పాలన తగలెట్ట. నువ్వు సెబతా ఉంటే తెలుస్తాంది. రాజకీయాలంటూ వేరే ఉండవని. మన బతుకులను ప్రతి రోజూ వేసారుస్తూనే ఉంటాయని. ఈళ్లు ఉన్నంతసేపూ మనకి దీపావళి కూడా సీకట్ల పండగలాగే ఉంటది...''

''ఓసినీ... బాగా సెప్పావే. ఇదిగో నీలాంటోల్లు ఇలా నిజానిజాలు తెలుసుకుని... మనలాంటోల్ల కోసం నిలబడి, ప్రతి సమస్య మీద కలబడి, నేతలతో పోరాడి, మనకోసరం పాటు పడే నిజమైన జననాయకులెవరో సూసుకుని ఆళ్లని ఎన్నుకున్నప్పుడేనే... మనకి నిజమైన దీపావళి'' అంటూ కలవరించాడు సామాన్యుడు.

ఈలోగా ఎంకి వచ్చి లేపేసింది. సామాన్యుడికి పూర్తిగా మెలకువ వచ్చింది!

-సృజన

PUBLISHED ON 23.10.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి