మంగళవారం, అక్టోబర్ 18, 2022

అరాచక చక్రవర్తి

 


''సార్‌... కొంపలంటుకునేలా ఉన్నాయండి...''

''ఎవరివంట?''

''ఎవరివో అయితే మీకెందుకు చెబుతాను సార్‌... మనవేనండి...''

''ఛస్‌ ఊరుకోవో... కొంపలంటించేదే మనవైనప్పుడు మనవెందుకవుతాయ్‌...''

''అయ్యా... మీ భరోసా మీదే కానీ నా ఆదుర్దా పట్టించుకోరండి...''

''చూడు సెక్రటరీ... నిన్ను పన్లో పెట్టుకుంది మన జమానాలో మన పాలన ఎలా సాగుతోందో అడపాదడపా చెప్పడానికి. కానీ ఇలా చీటికీ మాటికీ వచ్చి కంగారు పెట్టడానికి కాదు...''

''నేనేం చెప్పినా మీరు తొణకరని తెలుసండి. కానీ ఒక్కసారి నా ఆత్రం చూసి కాస్త ఆలోచించండి మరి. ఆనక చెప్పలేదంటారు...''

''సర్లె... ఎదవ నస ఆపి... సంగతేంటో చెప్పు...''

''అదేనండి... ఆ ఎగస్పార్టీ వాడు పర్యటన పెట్టుకున్నాడండి... జనాలు కుప్పలుతెప్పలుగా వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయండి...''

''భలేవాడివయ్యా... ఇంతా చేసి నువ్వు చెప్పేదిదా? ప్రజానీకాన్ని నానా భ్రమల్లో ముంచెత్తి, లేనిపోని ఆశలు రేకెత్తించి, నేను తప్ప ఆళ్లని ఉద్దరించేవాడింకెవడూ లేడన్నంత మాయ చేసి, బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చి, కుర్చీ మీద బాసింపట్టేసుకుని  కూర్చున్నాక... ఇంకా ఎగస్పార్టీ ఏంటయ్యా? అసలా మాటంటేనే మా చెడ్డ చికాకు నాకు. ఇప్పుడు మన జమానాలో కింద నుంచి పైదాకా అంతా మనమే కదా? ఇంకా కోన్‌కిస్కాగాడెవడో వస్తున్నాడని చెప్పి నా టైమ్‌ చెడగొడతావేంటయ్యా? నీకసలు బుద్దుందా అని?''

''అయ్యా... మీరెంత తిట్టినా, మీ సెక్రటరీగా కుదురుకున్నాక నా డ్యూటీ నేను చెయ్యాలి కదండి... మీ ధిలాసా, మీ కులాసా నాకు తెలిసినా... నిజాలు నివేదించుకోవడం నా కర్తవ్యం కనుక పరిగెత్తుకుని వచ్చానండి... ముందు నేను చెప్పేది సాంతం వినండి... ఆనక మీ ఇష్టం...''

''సర్లేవయ్యా సెక్రటరీ... ఓ... ఆయాస పడిపోక. నీ డ్యూటీ నువ్వు చెయ్యిలే. ఇంతకీ ఎవడాడు?''

''అదేనండి... మీ పాలనలో లొసుగులన్నీ అరటి పండొలిచినట్టు విప్పి చూపిస్తుంటాడు కదండి... ఆడేనండి. జనం కోసం సైనికుడిలా ఎదురొడ్డి నిలుచుంటాడు కదండి... ఆడేనండి. తమరు తీసుకునే ప్రతి  నిర్ణయంలో లోటుపాట్లేంటో వెండితెరమీద సినిమా చూపించినట్టు చూపిస్తాడు చూడండి... ఆడేనండి. మీ హామీల్లో డొల్లలన్నీ ఎండగట్టి జనం మత్తు వదిలిస్తాడు చూడండి... ఆడేనండి. ప్రజల సమస్యల కోసం ఇల్లూ, ఒళ్లూ కూడా చూసుకోకుండా పోరాడుతుంటాడు కదండీ... ఆడేనండి. మీ హయాంలో అవినీతి అక్రమాలు ఎంతగా వేళ్లూనికుని పోయాయో ఉదాహరణలతో సహా ఏకరువు పెడుతుంటాడు కదండీ... ఆడేనండి. ఇసుక నుండి కొండకోనల దాకా ఎలాంటి వనరులను తమరు, తమ అనుచరులు కలసి కుమ్మక్కై ఎంతలా దోచుకుంటున్నారో విడమర్చి మరీ లెక్కలు తేలుస్తుంటాడు కదండీ... ఆడేనండి. ఎవడు ఓ పిలుపిస్తే జనం కదం తొక్కి నాయకుడి వెనకాల సైనికుల్లా విరగబడుతుంటారో... ఆడేనండి. ఎవడు ఆవేశంగా మాట్లాడుతుంటే వింటున్న సామాన్యులు ఎగబడి చప్పట్లు కొడుతూ ఎలుగెత్తి నినాదాలు చేస్తారో... ఆడేనండి. అలాంటోడు తమరి జమానాలో అణగారిపోయిన జనవాణికి ఏకైక గొంతుకై ప్రజల సమస్యలేంటో స్వయంగా తెలుసుకుంటానని ప్రతిన బూని మరీ వస్తున్నాడంటే... మరి మీ ఉప్పు తిని బతికే నాలాంటోడికి కంగారుగా ఉండదేంటండి? అధికారం మత్తులో జోగుతున్న తమరిని తట్టిలేపి మీ చుట్టూ జరుగుతున్న వాస్తవాలేంటో వివరిద్దామని ఆదరా బాదరా నేను ఉరుక్కుంటూ వస్తే... తమరు మాత్రం అదేమీ పట్టించుకోకుండా, నిమ్మకి నీరెత్తినట్టు నిద్రలో జోగడమే కాకుండా... నన్ను నానా తిట్లూ తిడుతున్నారండి... ఆయ్‌...!''

''సర్లేవయ్యా సెక్రటరీ... నిన్ను, నీ ఆదుర్దాని అర్థం చేసుకున్నాలే... ఇంతకీ ఏంచేద్దామంటావు?''

''ఏముందండీ... చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలనన్నారు... అలాంటిది అనకొండాలాంటోడు అగ్గిమీద గుగ్గిలంలా వస్తుంటే... తీరిగ్గా ఉంటే ఎలాగండీ? అందుకే ఈ వార్త మీ చెవిన వేద్దామని పడుతూ లేస్తూ చక్కా వచ్చానండి...''

''మొత్తానికి నీ స్వామిభక్తి మెచ్చుకోదగ్గదేనయ్యా... నిజమేలే... నువ్వు అంతలా చెబితే కానీ నాకు బుర్రకెక్కలేదు. అగ్గిపుల్లనైనా పూర్తిగా ఆర్పేస్తే కానీ పడెయ్యకూడదు. ఆనకదే పెద్ద అగ్నిప్రమాదానికి దారితీయవచ్చు... ఏమంటావ్‌?''

''అమ్మయ్య... ఇప్పటికి నా మనసు శాంతించిందండి... తమరు ఊహల్లోంచి ఊడిపడ్డారు అదేచాలు... మరింతకీ ఏం చేద్దామని ప్రభులవారి సెలవు...''

''చూడు సెక్రటరీ... నా భక్తుడిగా, నా మేలు కోరేవాడిగా నీ భయం, దిగులు అర్థం చేసుకున్నాన్లేవయ్యా... కానీ నీకింకా మన జమానా ఒడ్డు, పొడవు, వెడల్పు, లోతు తెలిసినట్టు లేదు. పైనుంచి కింద దాకా అన్ని వ్యవస్థల్నీ గుప్పెట్లో పెట్టుకున్నాం. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా మన మనసులో మాట తప్ప మరోటి చెప్పలేనంతగా అదుపులో పెట్టాం. అధికారుల కీళ్లు నొక్కిపెట్టి మనం చెప్పింది తప్ప ఇంకేదీ ఆలోచించనంత తొత్తుల్లా తయారు చేశాం. ఎదురుతిరిగిన అయ్యేఎస్సుల్ని కూడా అయిపూ అజా లేకుండా చేసి, మనకి వంత పాడే యంత్రాంగాన్ని మన చుట్టూ మోహరించి పెట్టుకున్నాం.  పోలీసుల్ని, ఆళ్లని నడిపించే ఆఫీసర్లని బదిలీలనివేకెన్సీ రిజర్వులనిసస్పెన్షన్లనీఆరోపణలని రకరకాలుగా భయపెట్టి  ఆఖరికి మన పెంపుడుకుక్కల్లా పడుండేలా చేసేసుకున్నాం. చట్టాన్ని కూడా లెక్క చేయకుండా లొసుగులతో ఆడిస్తూ న్యాయవ్యవస్థను కూడా నీరుగారేలా చేస్తున్నాం. కాబట్టి ఆట్టే కంగారు పడమాక...''

''అయ్యా... అరాచక చక్రవర్తులు. అఘటనా ఘటన సమర్దులు. నయవంచక నయా సామ్రాట్టులు. తమరి సంగతి నాకు తెలియంది కాదు. కానీ ప్రభో... కడవంత గుమ్మిడికాయైనా కత్తి పీటకు లోకువేనన్నట్టు... అవతల ఎన్నికలు రాబోతున్నాయి కదండి... కాబట్టి కాస్త తమరు కర్తవ్యం బోధించాలండి మరి...''

''సర్లేవయ్యా... దానిదేముందీ? మన రక్షక భటుల్ని లైన్లో పెట్టలేకపోయావా?''

''ఆళ్లు తమరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారండి. ఏం చెయ్యమంటారో చెబితే, అది చేసెయ్యడానికి లాఠీలు గట్రా తుడుచుకుని సిద్దంగా ఉన్నారండి...''

''మరింకేం? నేను చెప్పానని చెప్పి... ఆడిని అడుగడుగునా అడ్డుకుని శాంతి భద్రతలు కాపాడమను సరిపోద్ది...''

''అదేంటండీ... ఇప్పుడు శాంతిభద్రతలకు భంగమేమొచ్చిందండీ? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పర్యటనలు అవీ చేసుకోవచ్చండి కదండీ?''

''అదిగో సెక్రటరీ... నీతో పెద్ద చిక్కొచ్చిపడిందయ్యా... ఊరికే ఒగరుస్తావ్‌... పోనీ ఉపాయం చెబితే కానుకోలేవు...''

''సార్‌...తమరు కాస్త నా మట్టి బుర్రని దృష్టిలో పెట్టుకుని అర్థమయ్యేలా ఆదేశాలు సెలవియ్యండి మరి...''

''అదేనయ్యా... ఆడొస్తే రానీ, కానీ... ఆడి మొహం ఎవరికీ కనబడకూడదని పోలీసుల చేత నోటీసులిప్పించు.  ఆడి కోసం పోటెత్తి వచ్చిన జనాన్ని చూసి ఆఖరికాడు చేతులు కూడా ఊపకూడదని ఆంక్షలెట్టించమను. ఆడు బస చేసిన హోటలు గది కిటికీలు కూడా... గాలి కోసమైనా సరే తెరవకూడదని రూల్సు పెట్టమను. నలుగురినీ కలవకూడదని, ఇంకా ఆమాటకొస్తే నవ్వకూడదని కూడా కొత్త నిబంధనలు జారీ చేయమను. ఆడికి జేజేలు కొట్టే అనుచరుల్ని ఎక్కడికక్కడ ఏదో వంకెట్టి అరెస్టులు చేయించమను. గుమిగూడిన జనాన్ని భద్రత పేరెట్టి చితగ్గొట్టంచమను. ఆడు చెయ్యెత్తితే చాలు ప్రజానీకం వెర్రెత్తిపోతుందని మనకి తెలుసుకాబట్టి...  తల మీదు దురదేసినా ఆడు గోక్కోడానికి కూడా వీల్లేదని ఆదేశాలు ఇమ్మనమను. మీటింగులు గట్రా వల్లకాదని చెప్పించమను. ఇంకా కావాలంటే ఆడి పర్యటనకి పోటీగా ఏదో ఓ పేరెట్టి మన గూండాల ద్వారా పోటీ కార్యక్రమం పెట్టించమను. దానికి అన్ని అనుమతులు ఇచ్చేసి, ఈడికి మాత్రం అన్నీ అడ్డంకులే కల్పించమను. ఇంత చేస్తే ఇకేముందీ? ఆడి పర్యటన విఫలమవుద్ది... ఏమంటావ్‌?''

''ఆహా... ఏమని వర్ణించమంటారు తమరి దమనకాండ! తమరి తెంపరితనం! తమరి పేట్రేగింపు! తమరి నియంతృత్వం! తమరి దౌర్జన్యం! తమరి అన్యాయ పరిపాలన! తమరి పెచ్చరింత! నాకు... మాటలు కూడా కరువవుతున్నాయి ప్రభూ!''

''ఊరికే పొగడకయ్యా... నాకు సిగ్గుగా ఉంటుంది. నీకంతగా ఉబలాటంగా ఉంటే కాసిన్ని తిట్లు తెలిస్తే తిట్టు. వినడానికి సొంపుగా ఉంటుంది...''

''అయ్యా... ప్రజానీకమంతా చేసేది అదే కదండీ... అయినా నాదొక చిన్న సందేహమండి... శ్రీవారు అనుమతిస్తే విన్నవించుకుంటాను...''

''తప్పకుండా చెప్పవయ్యా సెక్రటరీ... మనలో మనమాటగా అనుమానం చిన్నదైనా తీర్చుకోవలసిందే...''

''ఏం లేదండి... తమరి పోకడలన్నీ జనం గమనిస్తే ఏమవుతుందా అని....?''

''ఓరెర్రి సెక్రటరీ... జనం ఆలోచించడం మర్చిపోయి చాలా కాలమైందయ్యా... ఆళ్లంతా మేలుకోకుండా మనం ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారంతో ఊదరగొట్టడం లేదూ? ఇంత చేశాం, అంత చేశామని మాయ లెక్కలు చెప్పి జోకొట్టడం లేదూ? అలవి కానీ హామీలిచ్చి ఆశలు ఎగసనదోయడం లేదూ? కాస్తో కూస్తో విదిల్చి వశపరుచుకోలేదూ? ఆళ్లు మత్తులోంచి బయటపడరని నా ప్రగాఢ విశ్వాసమయ్యా...అర్థమైందా?''

''అర్థంకాక ఏమవుతుంది మహప్రభో! తమరి అతివిశ్వాసం చూస్తే దిమ్మదిరిగిపోతోందండి. ప్రభువుల వారి ధీమాకి ఇక కాలమే జవాబు చెప్పాలండి... ఉంటానండి మరి''

-సృజన

PUBLISHED ON 17.10.2022 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి