శుక్రవారం, మార్చి 03, 2023

అరాచక అతి విశ్వాసం!

 


''ఏందయ్యా సెక్రట్రీ... ఇవాళ మన ప్రోగ్రామ్స్‌ఏంటి?''

''బహిరంగ సభ ఉందండయ్య...''

''ఎంత దూరంలో?''

''రెండు కిలోమీటర్ల దూరంలోనేనండయ్య...''

''మరి ఏర్పాట్లు చేశావా?''

''సిద్ధమండయ్య. కారు రెడీ చేశానండయ్య...''

''ఏం సెక్రట్రీవయ్యా నువ్వు? కారేంటయ్యా కారు? హెలీకాప్టర్‌పెట్టలేకపోయావా?''

''సార్‌... మరీ రెండు కిలోమీటర్ల దూరానికి హెలీకాప్టర్‌పెడితే బాగుండదేమోనండయ్య. ఆనక విమర్శలొస్తే చెప్పలేదంటారని...''

''ఏడిశావ్‌. కారు మీద వెళితే ఒళ్లు హూనం అయిపోతుంది కదయ్యా?''

''అవునండయ్య. మర్చిపోయాను. అసలే మన పాలనలో రోడ్లు దరిద్రంగా ఉన్నాయండి. గర్భిణీని తీసుకెళ్తుంటే ఆసుపత్రికి వెళ్లేలోగానే డెలివరీ అయిపోతుందయ్య. ఎక్కడ ఏ వాహనం గోతిలో పడి యాక్సెస్‌రాడ్డు విరిగిపోయి ఆగిపోయిందో తెలియదండయ్య. ఎప్పుడేం ప్రమాదం జరిగిందో కూడా చెప్పలేమండయ్య... అలాంటప్పుడు తమరు సామాన్యులను కలవడానికి ఆలస్యమైపోతుందయ్య. ఇహ తమరి మనసు కలవరపడిపోతుందయ్య. ఆ దిగులుతో ఈ రాత్రికి పాపం... మీకు నిద్ర కూడా పట్టదేమోనండి...''

''మరి ఇన్ని తెలిసిన వాడివి కారు పెట్టడమేంటయ్యా. ఏ విమానమో, హెలీకాప్టరో ఏర్పాటు చెయ్యి...''

''అలాగే సార్‌. కానీ చిన్న సందేహం సార్‌. ఇలా చిన్న చిన్న దూరాలకి కూడా హెలీకప్టర్లు అవీ పెట్టుకుంటే ప్రజాధనం వృధా అయిపోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తాయేమోనండయ్య...''

''హ...హ్హ...హ్హ! నీ అమాయికత్వం చూస్తే జాలేస్తోందోయ్‌. ఇంకా మన పాలనలో ప్రతిపక్షం అంటూ ఉందంటావా?''

''అబ్బే... ఎక్కడండీ? మనం పగ, కక్ష, కార్పణ్యాలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసేశామనుకోండి. కానీ... ఎన్నికలు దగ్గర్లోకి వచ్చేశాయి కదా అనండయ్య...''

''అందకనే కదయ్యా... ఇలాంటి సభలకు బయల్దేరుతుంట. లేకపోతే మన క్యాంపు ఆఫీసు నుంచే యవ్వారాలన్నీ నడిపించేస్తున్నాం కదా?''

''అవునండి... మీటలు నొక్కడాలూ, రిబ్బన్‌కత్తిరించడాలూ, ప్రారంభోత్సవాలు చేయడాలూ... అన్నీ వర్చువల్‌గా జరిగిపోతున్నాయి కదండీ... కానీ అయ్యా... ఒకప్పుడు పాదయాత్ర చేస్తూ ఊరూవాడా తిరిగిన వారేనా తమరు అని ఆశ్చర్యమేస్తోందండయ్య...''

''భలేవాడివయ్యా... మరి అప్పటికీ ఇప్పటికీ తేడాలేదూ? అప్పుడు మనకి అధికారం ఏక్కడేడిసిందీ? దాని కోసం మరి ఎంతయినా కష్టపడాలయ్యా. నడవడమే కాదు... అవసరమైతే డేకాలి కూడాను. మరప్పుడలా చేశాం కాబట్టే...ఆ... ఇప్పుడిలా ఊరేగుతున్నాం. ఏమంటావ్‌?''

''అనడానికేముందండయ్య... తమరి చరిత్ర సమసిపోయేదా? మాసిపోయేదా? అబ్బో... అప్పట్లో తమరి ఉపన్యాసాలు తల్చుకుంటే ఇప్పటికీ పొలమారుతుందయ్య. ఎన్ని కల్లబొల్లి కబుర్లు, ఎన్ని మాయ మాటలు? అరచేతిలో సొరగం చూపించేశారు కదండయ్య? జనం భలే బోల్తా పడ్డారు లెండి...''

''జాగర్తయ్యోయ్‌... ఉన్నమాటగా ఎక్కడా అనకు. గోడలకు చెవులుంటాయి. ఏదో నువ్వు నా ఉప్పు తిని ఎన్నాళ్ల నుంచో నా దగ్గర పడున్నావని కాస్త మనసు విప్పి మాటాడుతున్నానంతే...''

''అయ్యయ్యో... తమరు ప్రత్యేకంగా చెప్పాలిటండీ... మనలో మన మాటంతే. అసలు తమర్ని చూస్తే నాకు మాచెడ్డ ఆశ్చర్యమనిపిస్తుందయ్య. ఎలాగుండే వారు? ఎలా ఎదిగిపోయారు? ఒకప్పుడు చిన్న స్విచ్చుల కంపెనీ తప్ప ఏముండేదండీ తమ దగ్గర? అసలామాటకొస్తే ఒకానొక సమయంలో ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సిన స్థితి కదండీ?  అలాంటిది ఆ పళంగా తమరి తండ్రిగారు కుర్చీ ఎక్కాక  తమరు ఏం జమాయించారయ్యా? ఎంత తెలివి? ఎంత తెగింపు? ఎంత బరితెగింపు? ఎంత నిబ్బరం? అబ్బో... చక్రం తిప్పేశారు కదండయ్య? తమరు పెద్ద పెద్ద కంపెనీలోళ్లతో బేరాలెట్టడం, అప్పటికప్పుడు తమరు సృష్టించిన సూట్‌కేసు కంపెనీల్లోకి ఆళ్లంతా కాసులు జమ చేయడం, ఆనక తమరి తండ్రిగోరు ఆళ్లందరికీ ఏం కావాలంటే అవి... భూములనీ, ఫ్యాక్టరీలనీ, సెజ్‌లనీ, పోర్టులనీ, గనులనీ... అన్నీ శాంక్షనింగ్‌చేయించేయడం... అదంతా ఓ మహా మాయండి... తల్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందండి... ఒకటా రెండా చెప్పండి... లక్ష కోట్లని ఆ ఎర్రిబాగుల నిఘా సంస్థలు అంటున్నాయి గానీ... నన్నడిగితే అంతకు పదింతలు ఉండదండీ? ఆ... ఏది ఏమైనా... తమరి దగ్గర ఉంటూ ఇంతప్పటి నుంచి ఇప్పుడింత వరకు తమరు ఎదిగిన తీరు చూస్తేనండయ్యా... తస్పదియ్యా... పిచ్చెక్కిపోతుందండయ్య...''

''ఇక చాల్లేవయ్యా... అక్కడితో ఆగు. లేకపోతే తమకంతో కళ్లు తిరిగి కింద పడేలా ఉన్నావ్‌. ఇదంతా చెయ్యడానికి  ఎన్ని పాట్లు పడ్డానయ్యా... అదేమీ గుర్తులేదా నీకు?''

''లేకేమండయ్య...కళ్లారా చూసినోడిని. కాలం కలిసి రాకపోయినా, దాన్ని దార్లోకి తెచ్చుకున్నారండయ్య. అవకాశాలు రాకపోయినా వాటినీ తమరే సృష్టించుకున్నారండయ్య... మరి అప్పట్లో నాన్నగారు ఉన్నట్టుండి కనుమరుగైపోతే ఎంత తల్లడిల్లిపోయారో నాకు తెలియదా చెప్పండయ్య. ఆపళంగా ఆ సానుభూతిని సాకు చేసుకుని సీటు భర్తీ చేద్దామనుకున్నారు కదయ్యా తమరు? అంత్యక్రియల కన్నా ముందే సంతకాల ప్రక్రియ చేపట్టడం కళ్లారా చూశాను కదయ్యా? ఎందుకో అధిష్ఠానం బిగుసుకుపోయింది కానీ, అప్పట్లోనే తమరు కుర్చీ ఎక్కవలసిన వారేకదయ్యా? అయినా ఊరుకున్నారేంటండి? ఆ సానుభూతి చల్లారిపోకుండా... మనసులో ఏడుపును దిగమింగుకుని, జనాన్ని ఓదారుస్తానంటూ బయల్దేరినప్పుడే అనుకున్నానండయ్య... తమరు అలాంటిలాంటి మనిషి కాదని! అధిష్ఠానం వద్దన్నా... విన్నారేంటండి? జనంలోకి దిగిపోయారు. ఆ పట్టు పట్టు పెట్టిన కాలు పెట్టినచోట పెట్టుకుండా తిరిగారయ్య. మధ్యలో ప్రతిపక్షం బెంచీల మీద కొన్నాళ్లు కూర్చున్నా, మీ కలలు వదలేదండయ్య. ఇహ... ఆపై తమరి పాదయాత్ర చరిత్ర, ఆ తర్వాత తమరి పరిపాలన చరిత్ర... అంతా నాకు తెలిసిందే కదండయ్యా?''

''చరిత్ర సరేనయ్యా... వర్తమానం సంగతి చెప్పవేం? ఇప్పుడేమీ కష్టపడడం లేదంటావా?''

''అయ్యబాబోయ్‌... ఎంతమాటండి? కుర్చీ ఎక్కిన కాణ్ణుంచి తమరు పడుతున్న కష్టం అంతా ఇంతానా చెప్పండి. ఏం చేసినా ప్రజల పేరు మీదనే చేయాలా? ప్రజల కోసమేనని నమ్మించాలా? అది మామూలు కష్టమా చెప్పండయ్య? ఒకేపు మీ మీద ఆశలెట్టుకున్న అస్మదీయులను సముదాయించాలి కదయ్య? ఏ పథకం పెట్టినా అందులో వాళ్లకి ప్రయోజనం చూపించొద్దయ్యా? ఓ పక్క ఏం చేస్తున్నా జనం కోసమేనని నమ్మస్తూ, మరో పక్క స్వజనానికి మేలు చేకూర్చాలంటే మాటలేంటండయ్య? అటు చూస్తే మీడియా, ఇటు చూస్తే ప్రతిపక్షాలు, ఆ పక్కన చట్టం, ఈ పక్కన న్యాయం... ఇన్ని ప్రతిబంధకాల మధ్యన కూడా మనోళ్లకి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, పదవులు, హోదాలు పందేరం చేయడమంటే కత్తి మీద సామే కదండయ్య? సాకు చిక్కితే చాలు సాక్ష్యాలతో సహా నిజాలు రాసే పత్రికలను కాసుకోవద్దయ్య? ఆళ్లు రాసేవన్నీ అబద్దాలంటూ ప్రజలు భ్రమించేలా సొంత పత్రికలో కథనాలు వండి వార్చొద్దయ్య? వీలు దొరికితే విమర్శలు గుప్పిస్తూ జనాన్ని మేలుకొలిపే నికార్సయిన నేతల దిమ్మదిరిగేలా ఆంక్షలు పెట్టొద్దయ్యా? అందుకోసం చట్టాన్ని, రాజ్యాంగాన్ని అడ్డగోలుగా తిరగరాసి కాలం చెల్లిన కేసులు సైతం బనాయించాలంటే... ఎంత కష్టమో, ఎంత శ్రమో నాకు తెలియదేంటయ్య? సమస్యల మీద శాంతియుతంగానైనా పోరాడ్డానికి ఎవరైనా బయల్దేరుతున్నారని తెలిస్తే,  తెల్లారకుండానే ఆళ్లని ఇళ్లలోనే నిర్భంధం చేయడానికి ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా పావులు కదపాలో నాకెరికే కదండయ్య? నిరసన ప్రదర్శనలను ఉక్కుపాదాలతో అణచివేయాలంటే తమరి పాదాలెంత కందిపోతాయో, ఉద్యమాలను కాలరాయాలంటే తమరి కాళ్లెంత నొప్పి పుడతాయో అర్థం చేసుకోగలనండయ్య. బదిలీలనో, కేసులనో సాకులెట్టి పోలీసులను, అధికారులను, ఉద్యోగులను తమ దారికి తెచ్చుకోవాలంటే తమరెంత ఒత్తిడికి గురై ఉంటారో ఊహించగలనయ్య. ఎక్కడెక్కడ అప్పులు చేసినా, ఏ కేంద్ర పథకాల నిధులు మళ్లించినా ఆ సొమ్మును సంక్షేమం పేరు చెప్పి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం అప్పనంగా పంచేయడానికి మీటలు నొక్కి నొక్కి మీ చేతి వేళ్లు తీపులొచ్చేసి ఉంటాయండయ్య. ఓ పక్క జనానికి సొమ్ములు పంచుతున్నట్టు ప్రచారం చేసుకుంటూనే, మరో పక్క ఆళ్ల దగ్గర నుంచే పన్నులని, ధరలని, ఛార్జీలని, సెస్సులని అంతకు పదింతలు గుంజుకోడానికి తెగ ఆలోచించి మీ బుర్ర వేడెక్కిపోతుందయ్య. ఇలా ఈ మూడున్నరేళ్లలోనూ తమరు మానసికంగా, శారీరకంగా ఎంత నలిగిపోతున్నారో నేను దగ్గరుండి గమనిస్తున్నాను కదండయ్య? అసలన్నింటికన్నా పెద్ద కష్టం మరోటుందయ్య... ఓ పక్క ఇంత శ్రమ పడిపోతూ కూడా ఎక్కడా పైకి తేలకుండా తేలిగ్గా నవ్వుతుంటారే... అది మరొకళ్లని సాధ్యమయ్యే పనేనా చెప్పండయ్య?''

''వార్నీ...భలే చెప్పావయ్యా. నా కష్టాలేంటో నువ్వు చెబుతుంటే నా మీద నాకే జాలేస్తోందనుకో...''

''కానీ... ఒక్క మాటండయ్య. ఇంత వరకు తమరు పడిన కష్టం ఒక ఎత్తయ్య, ఇక మీదట పడేది మరో ఎత్తయ్య...''

''అవునా? మరైతే ఆ కష్టమేంటో కూడా నువ్వే చెప్పు...''

''ఏముందండయ్య? ఎన్నికలు తరుముకొస్తున్నాయండయ్య. రాదారి నుంచి గోదారి వరకు తమరి పాలన తీరేంటో జనం గమనిస్తున్నారండయ్య. పాదయాత్ర నాటికీ, పాలించిన నాటికీ పొంతనలేంటో తెలుసుకుంటున్నారండయ్య. పుచ్చుకునేదానికి, ఇచ్చేదానికి తేడాపాడాలేంటో లెక్కలేసుకుంటున్నారండయ్య. చెబుతున్న దానికి, చేస్తున్నదానికి జరిగిందేంటో చూస్తున్నరండయ్య. ఇప్పుడాళ్లని నమ్మించడం చాలా కష్టమండయ్య. భ్రమల్లో ముంచి తేల్చడం మరీ కష్టమనిపిస్తోందండయ్య. అది మాత్రం కాస్త గుర్చుంచుకోండయ్య...''

''హ...హ్హ...హ్హ...హ్హా! సెక్రట్రీ... నువ్వెంత అమాయకుడివో మరోసారి రుజువైందయ్యా. దగ్గరగా ఉండి నా చరిత్రంతా కాచి వడబోశావు కానీ, నా నిజ స్వరూపం కానుకోలేకపోయావు. ఓసారి మనిషి మాంసం రుచి చూసిన పులి పస్తులైనా ఉంటుంది కానీ, ఇక మామూలు తిండి తినదని వినే ఉంటావు. అలాగే ఓ సారి అధికారం అందుకున్నాక నేనూరుకుంటానా? దాన్ని పదే పదే అందుకోడానికి ఎంతకైనా తెగిస్తానని తెలుసుకోలేకపోతున్నావు.  చేతిలో పవరుంది. దాంతో వ్యవస్థలన్నింటినీ, సర్కసులో రింగు మాస్టరు కొరడా ఝళిపించి పులుల్ని ఆడించినట్టు ఆడిస్తా. ఈ మూడున్నరేళ్లలో నేను చేసింది పాలన కాదయ్యా... సమాంతర పరిపాలన. సర్పంచుల నుంచి మంత్రుల వరకు అందరినీ డమ్మీల్ని చేశా. నేననుకున్నదే అందరి నోటా పలికించా. అరాచక శక్తుల్ని అడుగడుగునా మోహరించా. నోరెత్తేవాడు లేకుండా అందరినీ భయభ్రాంతుల్ని చేశా. ప్రతిపక్షానికి పక్షవాతం వచ్చేలా చేశా. ప్రశ్నించే వాడిని పత్తా లేకుండా చేశా. అడిగేవాడిని అయిపూ అజా లేకుండా చేశా. నిలదీసే వాడికి నీళ్లు పుట్టకుండా చేశా. కాదనే వాడికి కళ్లు తిరిగేలా చేశా. ఎదురుతిరగేవాడంటూ ఎక్కడా లేకుండా చేశా. ఇక ప్రజలంటావా? ఆళ్లొట్టి వెర్రిబాగులోళ్లయ్యా. అదే నా విశ్వాసం. అదే నా నమ్మకం. అర్థమైందా... హహ్హహ్హా!''

''ఆహా... అద్భుతం సార్‌! మీ అతి విశ్వాసానికి జోహార్‌! మీ అపనమ్మకానికి జోహార్‌!!''

-సృజన

PUBLISHED ON 4.3.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి