శుక్రవారం, మార్చి 31, 2023

రాజకీయ రామాయణం


 

శిష్యుడు వచ్చేసరికి గురువుగారు టీవీలో సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. శిష్యుడు వచ్చి గురువుగారికి నిశ్శబ్దంగా నమస్కరించి వినయంగా కూర్చున్నాడు.

''దారా... రాములోరి పెళ్లయిపోయాక మనం రామాయణం చెప్పుకుందాం. సరేనా?'' అన్నారు గురువుగారు.

శిష్యుడు నీళ్లు నమిలి, ''ఎందుకులెండి గురూగారూ! మీరు కల్యాణం చూడండి. ఇవాల్టికి పాఠం వద్దులెండి'' అన్నాడు.

''భలేవాడివిరా! రామాయణాన్ని మించిన పాఠం ఏముంటుంది చెప్పు...''

''అవుననుకోండి. కానీ, మన రాజకీయాలకీ రామాయణానికీ పొంతన కుదర్దని...''

''వార్నీ... రామాయణమంటే వయసు మళ్లాక చదువుకునే పురాణమనుకుంటున్నావేంట్రా? జీవితంలో దేనికైనా అందులో పాఠం ఉంటుంది, పరిష్కారం కూడా ఉంటుంది...''

''ఊరుకోండి గురూగారూ! మీరు దేన్నుంచి దేనికైనా ముడి పెట్టేయగలరు కానీ...ఇప్పటి అరాచక రాజకీయాలెక్కడ? అప్పటి ఆదర్శవంతమైన రామరాజ్యమెక్కడ?''

''ఒరే... నేర్చుకోవాలనే బుద్ధి ఉండాలే కానీ, ఎందులోనైనా పోలిక కనిపిస్తుందిరా బడుద్ధాయ్...''

''ఇక మీరు వదిలేలా లేరని అర్థమైంది గురూగారూ. మరైతే మీరే చెప్పండి, ఇవాళ మన పరగణాలో జనం పడుతున్న బాధలకి రామాయణంలో ఎలాంటి పోలిక ఉందో?''

''అలాగన్నావ్బాగుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదురా, నీ చేతే చెప్పిస్తాను చూడు.  సీత రాముడికి దూరమై అన్ని కష్టాలు పడడానికి కారణమేంటి?''

''ఏముందండీ... మారీచుడి మాయ వల్లండి...''

''మరదే పోలిక. మారీచుడేం చేశాడు? బంగారు లేడిలాగా కనిపించి మురిపించాడు. ఆశలు కల్పించాడు. సీత ముచ్చటపడిపోయింది. అప్పటికీ లక్ష్మణుడు హెచ్చరించాడు కూడా, బంగారు లేడి కనీ వినీ ఎరుగని వింత, ఇదంతా రాక్షస మాయ అని! సీత వినలేదు. మరి తర్వాత ఏమైంది? లంకలో బందీ అయిపోయింది. అవునా?''

''ఇదంతా నాకూ తెలుసు గురూగారూ! కానీ ఆ లంకకి, మనకి లంకె ఏంటా అని...''

''మరిక్కడ కూడా జరిగిందిదే కదరా? రాజకీయ రావణాసురుడు మారువేషంలో వచ్చాడు. బంగారు రాజ్యం తెస్తానంటూ ఆశలు చూపించాడు. బతుకులు మార్చేస్తానన్నాడు. సాధ్యం కాని హామీలు గుప్పించాడు. జనం పాపం... ముచ్చటపడ్డారు. మారీచుడి మాయ లాంటి   ఆశల వలలో చిక్కుకున్నారు. ఇప్పుడు లంకలో సీతలా విలవిలలాడుతున్నారు. అవునా?''

''నిజమేనండోయ్‌. భలే పోలిక చెప్పారు. పాపం... సీతకి అటు బంగారు లేడీ దక్కలేదు, ఇటు భర్తకీ దూరమైంది. రాక్షస మూకల మధ్య నిస్సహాయంగా కుమిలిపోయిందండి...''

''మరి మన పరగణా ప్రజల పరిస్థితి కూడా అంతే కదరా? నమ్మిన హామీలు చూస్తే హంగామా తప్ప ఏమీ లేదనిపిస్తున్నాయి. చుట్టూ చూస్తే రాకాసుల్లాంటి నేతలు, అనుచరులు, వాళ్ల అరాచకాలూను. ఊ అంటే తప్పు. కాదంటే ముప్పు. అడిగితే అగచాట్లు.  అదేమంటే అరాచకాలు. ప్రశ్నిస్తే పీచమణచడాలు. లంకలో సీతమ్మలా తల్లడిల్లిపోవడం లేదూ?''

''అవునండి బాబూ. నీకిక నేనే దిక్కని సీతమ్మని ఆ రావణాసురుడు బెదిరించినట్టే, ఈ రాజకీయ రావణాసురుడు కూడా విర్రవీగుతున్నాడండి. తననే మళ్లీ ఎన్నుకోవాలని మళ్లీ మాయమాటలు చెబుతున్నాడండి. ఆ సీత కథ రామబాణంతో  తెరిపినపడిందండి. మరి ఇప్పుడీ జనం  పరిస్థితి ఏంటండి పాపం?''

''వీళ్లని గట్టెక్కించేది కూడా రామబాణమేరా. కానీ అదిప్పుడు వీళ్ల చేతుల్లోనే ఉంది...''

''ఏంటండదీ?''

''ఓటురా. జనం చేతిలో ఓటే రామబాణంలాంటిది. దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ప్రయోగిస్తే సరి. రాజకీయ రావణాసురుడి చెర వదిలిపోతుంది. రాక్షస మూకల బాధ తీరిపోతుంది...''

''బాగుంది గురూగారూ. కానీ నాకో సందేహమండి. ఇంతకీ రాముడెవరండీ?''

''రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాట్ట వెనకటికి నీలాంటోడే. సరైన నాయకుడే రాముడురా.  లంకలో సీత రాముడి కోసం తపించినట్టే, జనం కూడా అలాంటి నాయకుడు ఎవరో పోల్చుకోవాలి.  ఆడి తప్పని వాడు, ఆపదల్లో అండగా నిలిచేవాడు, ఆవేశాన్నే ఆయుధంగా మలిచేవాడు, అడుగడుగునా నేనున్నానని నిలిచేవాడు ఎవడో అతడే ఆ నాయకుడు.  మళ్లీ మాయ మాటల మారీచుడి వలలో పడకూడదు. లంకలో రావణాసురుడెలా ప్రలోభపెట్టాడో తెలుసుకదా? నా చెయ్యి పట్టుకుంటే పట్టపురాణిని చేస్తానన్నాడు. సర్వ సుఖాలూ నీవేనన్నాడు. దేవతలు సైతం తననేమీ చేయలేరన్నాడు. ఆ రాముడికి రాజ్యం కూడా లేదని ఎద్దేవా చేశాడు. దేశదిమ్మరన్నాడు. లంక దాకా రానేలేడన్నాడు. అయినా సీత విందా? లేదుకదా, అంతటి రావణుడిని కూడా గడ్డిపరకలా చూసిందా, లేదా? అదిగో అలాంటి స్థిర నిశ్చయానికి రావాలి. అప్పుడే మరి రాక్షస రాజ్యం నుంచి విముక్తి. అర్థమైందా?''

''అవునండోయ్.  దురహంకారం, దౌర్జన్యం, కక్ష, కావేషం, ధన దాహం, అరాచకం, అధికార దుర్వినియోగం, పదవీ వ్యామోహం, అన్యాయం, తెంపరితనం... ఇవన్నీ రాజకీయ రావణాసురుడి పది తలలని గ్రహించాలండి. అధికారం, మందీమార్బలం, పటాటోపం, హంగు, ఆర్భాటం, మాయ మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలు, ప్రలోభాలు... ఇవన్నీ అరచేతిలో వైకుంఠం చూపించే రాక్షస మాయల్లాంటివని జనం తెలుసుకోవాలండి. వీటికి ఆకర్షితులు కాకుండా రామబాణాన్ని ప్రయోగించాలండి. అప్పుడిక రాబోయేదంతా రామరాజ్యమేనండి. అంతే కదండీ?''

''సెభాష్రా. రామాయణం అనగానే వెళ్లొస్తానన్నవాడివి, ఇప్పుడు చూశావా, ఎంత బాగా చెప్పావో? మొత్తానికి నీకు రాజకీయ రామాయణం అర్థమైందిరా. ఇక దాన్ని పారాయణం చేసుకో. పైకొస్తావ్‌. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 31.3.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి