వేదిక మిరుమిట్లు గొలుపుతోంది. దేశవిదేశీ ప్రముఖులంతా
ఆసీనులై ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది టీవీలకు కళ్లప్పగించి చూస్తున్నారు.
అందరిలోనూ ఉత్కంఠ. రాజకీయాల్లోనే ప్రఖ్యాతిగాంచిన 'మస్కార్' అవార్డులను ప్రకటించే
వేదిక అది. ప్రజలను నమ్మించి, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాధనాన్ని
మస్కా కొట్టి దోచుకునే నేతలకు ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ఆ అవార్డు అందుకోవడం అంత సులవైన
పని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో రాజకీయ ప్రముఖులు పోటీ పడుతుంటారు. తాము చేసిన వెధవ
పన్లను వీడియోలుగా తీసి పోటీ న్యాయ నిర్ణేతలకు పంపుతారు. తాము అధికారంలో ఉండగా చేసిన
నీచ, నికృష్ట పనులను కళాత్మకంగా చూపిస్తూ తగిన సన్నివేశాలతో,
పాటలతో, డైలాగ్స్ తో సహా ఎంట్రీలను పంపుతారు.
దేశదేశాల నుంచి అలా అందిన ఎంట్రీలను వందలాది మంది న్యాయనిర్ణేతలతో కూడిన కమిటీ చూస్తుంది.
ఎవరెవరు ఎంతెంత దుండగాలకు పాల్పడ్డారో, ఎంతెంత దగుల్బాజీ పనులను
చేశారో, ఎంతెంత స్థాయిలో ప్రజాధనాన్ని, వనరులని అడ్డగోలుగా దోచుకున్నారో పరిశీలించి, ఆ దారుణాల
స్థాయిని అంచనా వేసి నిర్ణేతలు వేర్వేరు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. ఆ అవార్డుల
వివరాలను సీల్డు కవర్లలో భద్ర పరుస్తారు. అవార్డులు ఎవరెవరికి వచ్చాయో చివరి క్షణం
వరకు ఎవరికీ తెలియదు. 'మస్కార్' వేదిక
మీద వ్యాఖ్యాతలు ఆ కవర్లను విప్పి పేర్లు చదివినప్పుడు మాత్రమే ఫలితాలు వెల్లడవుతాయి.
అంతటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల వేడుకను ప్రత్యక్షంగా, పరోక్షంగా
చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు.
''ఒరే... ఈరిగా... మస్కార్ అవార్డులంట...
టీవీలో చూపిస్తున్నారు. లెగెహే...''
అంటూ లేపాడు సూరిగాడు.
''ఏ అవార్డులెవరకి వస్తే మనకేంట్రా?'' అంటూనే కళ్లు నులుముకుంటూ వచ్చి
కూర్చున్నాడు ఈరిగాడు.
''భలేవోడివిరా బాబూ... ఈసారి మనోళ్లు కూడా
పోటీ పడుతున్నారు తెలుసా? అందుకే మరి ఈ సందడి'' అన్నాడు సూరిగాడు.
వేదిక మీద అందాల వయ్యారి యాంకర్ వంకర్లు తిరిగిపోతూ
మాట్లాడుతోంది.
''రాజకీయాలు కూడా ఒక కళే. అందులో రాణించాలంటే
సినిమాల్లోలాగే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన,
మ్యూజిక్, ఎడిటింగ్, డైలాగ్స్
లాంటి ఎన్నో విభాగాల్లో ఆరితేరిపోవాలి. ఈ కళలో ఎవరెవరు ఏఏ కేటగిరీల్లో చెలరేగిపోయారో
కొద్ది సేపట్లో మనందరికీ తెలిసిపోతుంది'' అంటూ వివరించింది.
ఇంతలో వేదిక పైకి ఓ ప్రముఖ వ్యక్తి వచ్చాడు. మైకు
పుచ్చుకుని గొంతు సవరించుకుని చెప్పసాగాడు.
''ఇప్పుడు ఉత్తమ చెత్త రాజకీయ చిత్రం అవార్డును
ప్రకటించనున్నాం. రాజకీయం అంటేనే నమ్మించడం,
వంచించడం. ఈ కేటగిరీలో మాకు అందిన ఎన్నో ఎంట్రీలను వడబోశాం. చివరికి
అవార్డు ఎవరికి వచ్చిందో ప్రకటించబోతున్నాం'' అన్నాడు. అందరూ
ఉత్కంఠతో చూడసాగారు. యాంకర్ ఇచ్చిన సీల్డు కవరును విప్పి చెప్పాడు.
''... అండ్ ద మస్కార్ గోస్ టూ... 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్
మటాష్' ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్...'' అంటూ
ప్రకటించగానే చప్పట్లు మార్మోగాయి. అవార్డు
అందుకోడానికి ఆ రాజకీయ చిత్రం దర్శకుడు గజన్ ద్రోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ
వేదిక పైకి నడిచి వచ్చాడు.
''వార్నీ ఈడు మన గజన్ గాడ్రా... ఈడింత గొప్ప
సినిమా చూపించాడ్రా?'' అంటూ ఈరిగాడు ఆశ్చర్యపోయాడు.
''కాదేంట్రా మరి? ఈడు మామూలోడా చెప్పు. ఈడు అధికారంలోకి
వచ్చిన దగ్గర్నుంచి జనానికి చూపిస్తున్న నీచ రాజకీయ చిత్రం ఇదే కదరా? ఈడి పాలనలో 'ఎవ్రీథింగ్' అంటే
ఏది పడితే అది.... 'ఎవ్రీవేర్' అంటే ఎక్కడబడితే
అక్కడ... 'ఆల్ ఎట్ మటాష్' అంటే అంతా మటాష్
అయిపోయింది కదరా? ఏ రంగాన్ని కానీ, ఏ వ్యవస్థని
కానీ తీసుకో... మరి ఇంత దారుణమై మార్పు చూపించినందుకు అవార్డు రాకుండా ఎలా ఉంటుందిరా?''
అంటూ చెప్పుకొచ్చాడు సూరిగాడు.
వేదిక మీద యాంకర్ చెబుతోంది.
''ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించనున్నాం'' అంటూ సీల్డు కవర్ అందించింది.
వేదిక మీద ప్రముఖుడు దాన్ని అందుకుని, ''... అండ్ ద మస్కార్ గోస్
టూ...'' అంటూ ఒక్క క్షణం ఆగి, పేరు ప్రకటించాడు.
''అరె... ఇది కూడా ఈడికే వచ్చిందేంట్రా?'' అంటూ అరిచాడు ఈరిగాడు.
''మరి కాదేంటెహె. ఈడిని మించిన నటుడు ఎవడుంటాడ్రా, ఈ ప్రపంచంలోనీ. పైకి మెత్తగా నవ్వుతాడు.
లోపల నీచ పథకాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పైకి సామాన్యుల కోసమే తన బతుకంటాడు. ఆ తర్వాత
వాళ్ల మీదనే చెత్త పన్నులన్నీ వేసి భారం మోపుతాడు. నీ అన్ననంటాడు. బిడ్డనంటాడు. మామనంటాడు.
తలలు నిమురుతాడు. బుగ్గలు పుణుకుతాడు. ఓ తాతా... ఓ అవ్వా... ఓ అమ్మా... ఓ చెల్లీ...
అంటూ వరసలు కలిపి వినయం అభినయిస్తాడు. ఆపై అందరి జేబులకీ చిల్లులు పెడతాడు. నా బతుకంతా
మీ కోసమేనంటాడు... అలా అంటూనే బడుగు జీవుల బతుకులతో ఆడుకుంటాడు. అంతా అండర్ యాక్షన్
అనుకో...'' అంటూ సూరిగాడు చెప్పాడు.
వేదిక మీద మరో అవార్డు గురించి యాంకర్ చెప్పసాగింది.
''ఇది ఉత్తమ చెత్త రాజకీయ స్క్రీన్ ప్లే
అవార్డు...'' అంటూ
సీల్డు కవర్ అందించింది.
''... అండ్ ద అవార్డు గోస్ టూ... 'బేరారార్'...'' అంటూ ప్రముఖుడు ప్రకటించగానే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్
ఒవేషన్ ఇచ్చారు.
''ఇదేంట్రా సూరిగా? ఈ సినిమాకి కూడా ఈడే నవ్వుకుంటూ
వెళుతున్నాడు?'' అంటూ ఆశ్చర్యపోయాడు.
''నువ్వు భలే అమాయకుడివిరా బాబూ. ఈ రాజకీయక
చిత్రం కూడా ఆడు చూపిస్తున్నదే మరి. 'బేరారార్' అంటూ ఏంటో తెలుసా? ఈడి
పొలిటికల్ స్క్రీన్ ప్లే వల్ల సామాన్యులంతా 'బేర్'మంటూ ఏడుస్తున్నారు కదరా? పైగా ఈడు, ఈడి మనుషులు కలిసి రాష్ట్రం మొత్తాన్ని బేరం పెట్టేశారు కదా? అందుకే మరి ఆ పేరు. ఏవేవో పథకాలంటాడు. ఆటి ద్వారా మీట నొక్కితే డబ్బులొచ్చి
కాతాలో పడతాయంటాడు. కానీ సెస్సులనీ, టాక్సులనీ, ధరలనీ, ఛార్జీలనీ అన్నింటినీ పెంచేసి వెనక నుంచి అంతకు
పదింతలు వాళ్ల దగ్గరి నుంచే లాగేస్తున్నాడు. మరి ఇలాంటి కథనం ఎక్కడైనా ఉందా చెప్పు?''
అంటూ వివరించాడు సూరిగాడు. ...
వేదిక మీద యాంకర్ మళ్లీ మెలికలు తిరిగిపోతూ వచ్చి, ''ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్
కేటగిరీ...'' అంటూ సీల్డు కవర్ అందించింది.
''... అండ్ ద మస్కార్ గోస్ టూ... 'ఘోరావతార్ 2'...'' అంటూ ప్రకటించాడు.
ఈసారి ఈరిగాడు నోరెళ్లబెట్టాడు. ''ఇదేంట్రా ఇది కూడా ఈడికేనేంట్రా?''
అన్నాడు.
సూరిగాడు నవ్వి, ''ఓరెర్రెదవా. విజువల్ ఎఫెక్ట్స్ అంటూ ఏంటో తెలుసా?
లేనిది ఉన్నట్టు చూపించడం. ఇందులో ఈడు పండిపోయాడు మరి. పత్రికల్లో ఫుల్
పేజీ ప్రకటనలిస్తాడు. అందులో పెద్ద పెద్ద సంఖ్యలు వేస్తాడు. అన్నేసి కోట్లు జనం కోసం
ఖర్చు పెట్టేశానంటూ గొప్పగా చెప్పుకుంటాడు. తీరా చేసి ఆరా తీస్తే... అవన్నీడొల్ల లెక్కలే
మరి. ఇలా లేనిది ఉన్నట్టు చూపించడంలో ఈళ్ల నాన్న 'ఘోరావతార్'
అయితే ఈడు ఘోరావతార్ నెంబర్ టూగాడన్నమాట'' అంటూ
బోధించాడు.
వేదిక మీద
అవార్డులు ప్రకటిస్తూనే ఉన్నారు. 'వరస్ట్ సౌండ్' విభాగం. ''... అండ్ ద మస్కార్ గోస్ టూ... 'టాప్ టెన్' అని ప్రకటించారు.
ఈరిగాడు కెవ్వుమని కేకేశాడు. ''అరె... ఇదేంట్రా మన నేతలందరూ నవ్వుకుంటూ
వేదిక ఎక్కుతున్నారూ?'' అన్నాడు.
''మరి వీళ్లంతా రోజూ చేస్తున్నది వరస్ట్
సౌండ్సే కదరా పిచ్చినాయాలా? తెల్లారి లేస్తే చాలు మైకుల ముందు మూతులెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని నానా బూతులూ
తిడతారు. వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటే మాటలతో వాగుతారు. ఈళ్ల గొప్పలూ వినలేం. ఈళ్ల
తిట్లూ వినలేం. ఏమంటావ్?'' అన్నాడు సూరిగాడు.
వేదిక మీద యాంకర్ మరో సారి వయ్యారంగా వచ్చింది.
ఇప్పుడు ''ఒరిజినల్
సాంగ్ కేటగిరీ...'' అంటూ సీల్డు కవర్ అందించింది.
''... అండ్ ద మస్కార్ గోస్ టూ... 'బేరారార్'...'' అంటూ ప్రకటించారు.
''వార్నాయనో... ఈళ్లు పాటలు కూడా పాడారేంట్రా?'' అన్నాడు ఈరిగాడు.
''ఒరే... నీ చుట్టూ ఏం జరుగుతోందో నీకు పట్టదురా.
ఈ పాట భలే హిట్టయిందిలే...'' అన్నాడు సూరిగాడు.
వేదిక పైకి ఆంధ్రా టీమ్ అంతా ఉత్సాహంగా చేరుకున్నారు.
నేపథ్యంలో పాట వినిపించసాగింది.
''చేటు చేటు చేటు చేటు చేటు... వీర చేటు...''
అంతే మస్కార్ వేదికంతా దద్దరిల్లిపోయింది. ఆంధ్రాటీమ్
అంతా ఆ పాటకు జట్టు కట్టి స్టెప్పులేయసాగారు.
''పోలిటిక్స్ దుమ్ములోన
చెత్తగిత్త దూకినట్టు
రాజకీయ జాతరలో
మేతరాజు ఊగినట్టు
వెర్రి చూపులేసుకుని
జనం బేర్‌మన్నట్టు
భూములన్ని బేరమెట్టి
అమ్ముకుని దోచినట్టు
నా ఆట చూడు... నా పాట చూడు...
చేటు చేటు చేటు
చేటు చేటు చేటు వీర చేటు
మోటు మోటు మోటు
మోటు మోటు మోటు వీర మోటు''
వేదిక మీద నీచ రాజకీయ నేతలంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని
గెంతసాగారు.
''గుండెలదిరిపోయేలా
ధరల దెబ్బ తగిలినట్టు
సెవులు సిల్లు పడేలా
పిచ్చి భాష వాగినట్టు
వెర్రి జనం జెల్ల కొట్టి
ధనం పోగు చేసినట్టు
కొండలన్ని కొల్లగొట్టి
కాసులు వెనకేసినట్టు
వొంటి లోని రగతమంతా
సలసలసలమని మరిగినట్టు
ప్రశ్నిస్తే పగపట్టి
పిచ్చి కేసులెట్టినట్టు
నమ్మించి ఆశపెట్టి
నానా బాధలెట్టినట్టు
చేటు చేటు చేటు వీర చేటు''
టీవీలో మస్కార్ అవార్డులు చూస్టున్న ఈరిగాడు, సూరిగాడు కూడా లేచి గెంతులేయసాగారు.
++++++++
ఇంతలో ఈరిగాడికి, సూరిగాడికి వీపులు చుర్రుమన్నాయి.
''ఎదవల్లారా... ఎదవల్లారాని... సిగ్గు లేదంట్రా? బారెడు పొద్దెక్కినా పక్క మీంచి
లేవరు. పైగా నాటు నాటు చేటు చేటంటూ పలవరింతలొకటా'' అంటూ అమ్మ
చీపురు తిరగేసింది. ఆసరికి వాళ్లకి పూర్తిగా మెలకువ వచ్చింది.
''ఇకనైనా మనం మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకుని
ఈ 'చేటు'కి ముగింపు పలకాల్రా...'' అనుకుంటూ ఇద్దరూ వీపులు తడుముకుంటూ
బయటకొచ్చారు.
-సృజన
PUBLISHED ON 14.3.2023 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి