బుధవారం, ఏప్రిల్ 12, 2023

సామాన్యుడి విశ్వరూపం!

 


''ఓం సామాన్యాయనమః

అసామాన్యాయనమః
అనన్య సామాన్యాయనమః
అమాయకాయనమః
ఓటు హస్తాయనమః
నోటు ప్రియాయనమః
చుక్కమాలక్ష్మి చోదకాయనమః
ప్రలోభ ప్రభావాయనమః
ఉత్తిత్తి హామీ ఉన్మత్తామనమః
మాయ మాటల మానసోల్లాసాయనమః''
... అధినేత గొంతు హాలంతా మార్మోగుతుండగా సెక్రటరీ ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ నిలువెత్తున ఓ ఫొటో ఉంది. అందులో గోచీ పెట్టుకున్న ఓ సామాన్యుడి చిత్రం ఉంది. అమాయకంగా నవ్వుతున్న అతడి చేతిలో ఓటు ముద్ర కనిపిస్తోంది. రెండు చెవుల్లో పువ్వులు అలంకరించి ఉన్నాయి. ఆ ఫొటో ముందు ఓటు యంత్రం, దాని మీద ఓ పువ్వు ఉన్నాయి. అధినేత కుర్చీలో కూర్చుని బిగ్గరగా మంత్రాలు చదువుతూ పువ్వులు విసురుతున్నాడు. సెక్రటరీకి ఈ హడావుడంతా ఏంటో అర్థం కాలేదు. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి తాను వచ్చినట్టు తెలియడం కోసం చిన్నగా దగ్గాడు. అధినేత తలతిప్పి నిశ్శబ్దం అన్నట్టు సైగ చేసి పూజ కొనసాగించాడు.
''ఓం నిరుపేదాయనమః మద్యం సమర్పయామి
ఓం జీర్ణవస్త్రాయనమః ధనం సమర్పయామి
ఓం క్షుద్బాధ పీడితాయనమః కోడిపలావు సమర్పయామి
ఓం అధికార ప్రదాయకాయనమః సకల ఉపచారాన్‌ సమర్పయామి''
అంటూ అధినేత గంట వాయించి హారతిచ్చి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడు. సెక్రటరీ కూడా లేని భక్తి నటించి హారతి కళ్లకద్దుకుని నమస్కారం చేసి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడ్డాడు.
అధినేత నవ్వేసి, ''ఈ తతంగమంతా చూసి బెంబేలు పడ్డావేంటయ్యా సెక్రట్రీ? మరేం లేదయ్యా, ఎన్నికలొస్తున్నాయి కదా, సామాన్యుడిని ప్రసన్నం చేసుకుందామని రహస్యంగా ఉపచార పూజలు చేస్తున్నాను. ఓ జాతకాలాయన చెప్పాడులే... పూజ బాగుందా?''
అప్పటికి సెక్రటరీ తేరుకున్నాడు. విషయం అర్థమై విషయంలోకి వచ్చేశాడు.
''ఆహా... సామాన్యుడంటే తమకెంత భక్తి, ఎంత భయం, ఎంత శ్రద్ధ!'' అంటూ తన్మయత్వం అభినయించాడు.
''కాదుటయ్యా మరి? విష్ణుమూర్తుల వారి వేలికి సుదర్శన చక్రం ఉన్నట్టు, ఈడి వేలి కొసన ఓటుందయ్యా. ఆ వేలుతో ఏ పార్టీ మీట మీద నొక్కుతాడోనని లోలోపల బెంగుంది. అందుకేనన్నమాట...'' అన్నాడు అధినేత అర్థోక్తిగా.
సెక్రటరీ కొద్దిగా తటపటాయించినా, ''ఉపచారాలు బాగున్నాయి కానీ సార్‌, మనం చేసేవన్నీ అపచారాలే కదండీ... మరివన్నీ ఫలిస్తాయంటారా?'' అన్నాడు ఉన్నదున్నట్టు.
అధినేత పగలబడి నవ్వేశాడు.
''చూడు సెక్రట్రీ. ఆడి దగ్గర ఓటుంటే, మన కాడ నోటుంది. దాన్ని చూసేసరికి ఆడి మనసు వశం తప్పుద్ది. సీసా ఒకటి చేతిలో పెట్టామనుకో. దాని వాసనకి ఆడి కళ్లు బైర్లు కమ్ముతాయి. పూటుగా తాగించి, నోటు చేతికిచ్చి, బిర్యానీ పొట్లం సమర్పించామనుకో ఆ మత్తులో ఆడు మన గుర్తు మీద నొక్కేస్తాడు. ఎంత పెద్ద ఆల్సేషియన్‌ డాగ్‌ అయినా బిస్కెట్టు పడేస్తే తోకూపుతుంది చూడు... అట్టాగన్నమాట. ఎన్ని ఎన్నికల్లో చూడ్డం లేదూ?'' అన్నాడు చిద్విలాసంగా.
అధినేత అతిధీమా చూసి సెక్రటరీ ఆశ్చర్యపోయాడు. ''అవుననుకోండి. కానీ తమరు చేసిన అపచారాల ముందు ఈ ఉపచారాలు ఫలిస్తాయా అని?''
''నిజమేననుకో. కానీ తప్పదయ్యా. అధికారం అందేంత వరకు చక్రం తిప్పలేం. అందాక తిప్పకుండా ఉండలేం. కుర్చీ ఎక్కక ముందు కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరుగుతూ, నోటికొచ్చిన నానా కూతలు కూస్తాం. అదిగో స్వర్ణయుగం అంటాం. ఇదిగో స్వర్గం అంటాం. తప్పదు. వాళ్ల కోసమే ఏడుస్తాం. వాళ్లనే ఓదారుస్తాం. అవన్నీ జరిగేవి కావని నీకూ తెలుసు, నాకూ తెలుసు. వెర్రి జనం మాత్రం నమ్మేస్తారు. తెగ ఆశపడిపోయి ఓట్లు గుద్దేస్తారు. మనం అలాగే కదా అందలమెక్కింది? మరి అందక అందక అధికారం అందాక, పిచ్చి ప్రజలకు సేవ చూస్తూ కూచుంటే, ఇక మనకేంటి దక్కేది? దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తెలియంది కాదు కదా, ఏమంటావ్‌?''
''ఏమంటానండీ, తమరింత పచ్చిగా చెబుతుంటేనూ? అందుకు తగినట్టుగానే సాగిందిలెండి తమరి పాలన. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఓ పక్క అడ్డంగా దోచుకుతింటూ కూడా మనసంతా సామాన్యుడేనన్నట్టు భలే మసిబూసి మారేడుకాయ చేశారు లెండి. ఓ పక్క మీటలు నొక్కుతూ జనం ఖాతాల్లోకి ధనం జమ చేసినట్టు చేసి, మరో పక్క వాళ్లకి తెలియకుండానే అంతకు పదింతలు వెనక్కి తిరిగొచ్చేలా పన్నాగాలు పన్నారు. రోడ్డు సెస్సులనీ, చెత్త పన్నులనీ, అదనపు ఛార్జీలనీ జనం జేబులు పిండేశారు. ఇసుక నుంచి కాసులు కురిపించారు. మద్యం నుంచి మనీ రప్పించారు. గనుల ద్వారా గల్లా నింపుకున్నారు. అంతా బాగేనే ఉంది కానీండి... సామాన్యులు నాలుగేళ్ల నాటికన్నా బాగా తెలివిమీరారేమోనని అనుమానమండి...''
''ఆ సందేహం నీకెందుకు కలిగింది?''
''ఏముందండీ? ప్రజల సమస్యలన్నీ నెత్తి మీద వేసుకుని జనాన్ని చైతన్యం చేస్తున్నాడు చూడండీ, ఆడి సభలకు జనం విరగబడుతున్నారండి. ఆడేం మాట్టాడినా ఈలలూ, చప్పట్లూనండి. ఆడేం పిలుపిచ్చినా వెనకా ముందూ చూడకుండా ఉరుకుతున్నారండి. పైగా ఆడు తమరి బండారం విప్పి చెప్పేస్తున్నాడండి. తమరు, తమరి అనుచరులు కలిసి ఎక్కడెక్కడ ఎంత నొక్కేస్తున్నారో, తమరు పైకి సామాన్యుడి జపం చేస్తూనే, లోలోపల బరితెగించి ఆళ్ల బతుకులు ఎంతలా పీల్చి పిప్పి చేస్తున్నారో, ఏ ప్రాజెక్టు పేరు చెప్పి ఎంత నొక్కేస్తున్నారో, ఏ పథకం వెనుక ఎంత భోంచేస్తున్నరో, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో మొత్తం అరటి పండు ఒలిచి పెట్టినట్టు వివరించేస్తున్నాడండి. అవన్నీ సామాన్యుడి బుర్రలోకి దూరితే ఇక తమకి మరోసారి కుర్చీ ఎక్కే అవకాశం ఉండదనే అనిపిస్తోందండి...''
సెక్రటరీ భయాలకి అధినేత తేలిగ్గా నవ్వేశాడు. ''మరందుకే కదయ్యా... ఆడి సభలకు చోటుచ్చిన ఊళ్ల మీదకి క్రేన్లు, బుల్డోజర్లూ నడిపిస్తున్నాం. మనం ఉస్కో అంటే చాలు ఉరికే పోలీసు కుక్కల్ని ఉసిగొల్పుతున్నాం. అక్రమ కేసులు పెట్టిస్తున్నాం. మన రౌడీల్ని కూడా పంపించి దౌర్జన్యం చేయిస్తున్నాం. దాంతో జనం బిక్కచచ్చిపోవడం లేదూ? ఆడి సభలకు వెళ్లొచ్చిన జనం పేర్లను రేషన్‌ కార్డుల జాబితా నుంచీ, పథకాల జాబితా నుంచీ పీకి పారేస్తున్నాం. అదే కాదయ్యా... ఆళ్ల సభల్ని మాత్రం సాగనిస్తున్నామా? అనుమతులివ్వకుండా ఏడిపించడం లేదూ? లేనిపోని ఆంక్షలు పెట్టి రాపాడించడం లేదూ? సమయానికి ట్రాఫిక్కు మళ్లింపులు చేయడం లేదూ? కరెంటు కూడా కట్‌ చేయడం లేదూ? పోలీసుల్ని, మన గూండాల్ని ఎక్కడికక్కడ కాపలా పెట్టి దార్లు మూయించేయడం లేదూ? జనాన్ని చెదరగొట్టడం లేదూ? అలా ఈ పాటికి మనమేంటో, మన పవరేంటో, మన పగేంటో, కసేంటో తెలిసే ఉంటుందిలేవయ్యా...''
సెక్రటరీ ఊరుకోలేదు. ''మరక్కడే ఉందండి అసలు సంగతి. ఇవన్నీ తమరు అధికారాన్ని ఉపయోగించి ప్రయోగిస్తున్నారండి. కానీ అవే మీ నిజ స్వరూపం ఏంటో సామాన్యులకు చెబుతున్నాయండి. జనం అన్నీ గమనిస్తారు కదండీ. ఆనక అవకాశం వచ్చినప్పుడు వేరే మీటలు నొక్కుతారేమోనని నా భయమండి...''
సెక్రటరీ మాటలకి అధినేత పగలబడి నవ్వేశాడు.
''ఓరెర్రి సెక్రట్రీ! నా పవరేంటో, నా పొగరేంటో, నా విరగబాటేంటో నీకింకా అర్థమయినట్టు లేదయ్యా. అధికారం తలకెక్కిన వాడిని దాన్ని నిలబెట్టుకోవడమెలాగో తెలియదంటావా? అవడానికిది ప్రజాస్వామ్యమే అయినా ఏలుతున్నది ధనస్వామ్యమయ్యా. అధికార స్వామ్యం. అదే నా దగ్గరున్న బ్రహ్మాస్త్రం. దాన్ని ఎక్కడెలా ప్రయోగించాలో నాకు తెలుసు. అవసరమైతే మీటలు నొక్కే యంత్రాలను కూడా శాసించగలను. రిగ్గింగు చేయించగలను. బూత్‌ కేప్చరింగ్‌ చేయించగలను. దొంగ ఓట్లు గుద్దించగలను. ఊళ్లకు ఊళ్లు స్వాధీనం చేసుకుని మన గూండాలు, రౌడీల చేత మీటలు నొక్కించగలను. డబ్బు, సారా పంచడమే కాదయ్యా, అవసరమైతే బాంబులు, కత్తులు, కటార్లు కూడా ప్రయోగించగలను. జనం ఇళ్లలో ఉండగానే ఆళ్ల ఓట్లు మాత్రం నాకే పడేలా చేసుకోగలను. పైకి సామాన్యుడి పూజ చేస్తున్నాను కదాని వెర్రిబాగుల వాడిననుకున్నావా?''
ఇంతలో సామాన్యుడి ఫొటో లోంచి ''హ...హ్హ...హ్హ...హ్హా!'' అంటూ బిగ్గరగా ఓ పెద్ద నవ్వు వినిపించసాగింది. అధినేత, సెక్రటరీ బిత్తరపోయి చూస్తుండగానే ఓ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి సామాన్యుడి విశ్వరూపం విస్తరించింది. ఆ సామాన్యుడికి అనేక తలలు ఉన్నాయి. అనేక చేతులు ఉన్నాయి. ఆ చేతుల్లో కత్తి, సుత్తి, డాలు, గునపం, నాగలి, పలుగు, పార, తట్ట, బుట్ట లాంటి ఎన్నో పరికరాలు ఉన్నాయి.
''ఓరోరీ నీచ నికృష్ట రాజకీయ నరాధమా! అక్రమ విన్యాసాల అధమాధమా! అవినీతి కార్యకలాప అప్రాచ్య స్వరూపమా! పయోముఖ విషకుంభమా! గోముఖ వ్యాఘ్రమా! నీ దురంహంకార, దుష్ట, దౌర్జన్య, దుర్నీతి వ్యవహారాలు నాకు తెలియవనుకున్నావా మూర్ఖుడా? నువ్వు పూజలు చేసినంత మాత్రాన నేను ప్రసన్నుడనవుతాననుకున్నావా? ఉపచారాల మాటున నువ్వు చేసే అపచారాలు అర్థం చేసుకోలేననుకున్నావా? కులాల పేరిట నువ్వు సాగించే కుతంత్రాలు తెలియవనుకున్నావా? మతం పేరుతో నువ్వు చేసే మాయ తెలుసుకోలేననుకున్నావా? అన్ని వృత్తుల వారినీ అతలాకుతలం చేసిన నీ దుష్పరిపాలన విధానాలు అవగతం కాలేదనుకున్నావా? నేనెవరనుకున్నావు? సామాన్యుడిలో వెల్లువెత్తిన వ్యతిరేకతకి మారు రూపాన్ని! ప్రజల్లో పెల్లుబికిన జనచైతన్య స్వరూపాన్ని! మేలుకున్న జాగృతిని! నీ నీచ స్వరూపాన్ని గ్రహించిన సామాన్యుడి విశ్వరూపాన్ని! ఇక నీ మాయలు, మంత్రాలు, భ్రమలు, హామీలు, ప్రచారాలు నన్నేమీ చేయలేవు! నీలాంటి నీచ నేతలకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు!''
ఆ సామాన్యుడి విశ్వరూపం పలికిన పలుకులు విని అధినేత, సెక్రటరీ వెంటనే కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు.
                                                                                                                              -సృజన
PUBLISHED ON 12.4.2023 ON JANASENA WEBSITE


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి