గురువారం, ఏప్రిల్ 13, 2023

నయవంచక నేతోపదేశం!


 

అధినేత ఇలా హాళ్లోకి వచ్చాడో లేదో, ఒకతను చటుక్కున వచ్చి పెద్ద దండ వేసి కాళ్లకి దణ్ణం పెట్టాడు.

''తమరు కాదనకూడదు. ఇవాళ పేపర్లో తమరి ఫొటో చూసి పులకించిపోయాం. ఆ పళంగా తమరికి సన్మానం చేయాలని చక్కా వచ్చేశాం. ముందుగా తమరి అనుమతి తీసుకోలేకపోయాం. మన్నించాలి...'' అన్నాడు వినయంతో తడిసి ముద్దయిపోతూ.  అతడితో వచ్చిన వాళ్లంతా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నారు.

అధినేతకేం అర్థం కాలేదు. ఈ లోగా సెక్రటరీ వచ్చి, ''అక్కడికీ నేను చెబుతూనే ఉన్నానండి. ఇలా అకస్మాత్తుగా వస్తే కుదరదూ, అయ్యగారు బోలెడంత ప్రజాసేవా గట్రా చేయాలీ, అస్సలు తీరికుండదూ అనేసేసి. కానీ వీళ్లు వినలేదండి. తమరి అభిమానులమంటూ బిలబిలలాడుతూ లోపలికి దూరిపోయారండి. వాళ్లకి తమ మీద ఉన్న ప్రేమ చూసి కాదనలేకపోయానండి...'' అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

అధినేత కాస్త కుదుటపడి, ''ఉన్నట్టుండి నాకు సన్మానమేంటయ్యా. నేనేం సాధించానని?'' అన్నాడు నిదానంగా.

దండేసినతడు అందుకున్నాడు.

''ఆహా... ఎంత నిరాడంబరం? ఎంత వినయం? దేశం మొత్తం మీద తమరేంటో మార్మోగిపోతోందండి. అందరి అధినేతల్లోకీ ఇప్పుడు తమరేనంట కదా అత్యంత ధనవంతులు? మిగతా అందరు అధినేతల ఆస్తులన్నీ కలిపినా తమదేనంటగా పై చెయ్యి? అసలందరిదీ కలపిన సంపదలో తమరొక్కరిదే సగానికి పైగా ఉందంట కదండీ? మరిందెంత ఘనమైన విషయమండీ? పేపర్లో చదివి పులకించిపోయామంటూ నమ్మండి. అందుకే తమరి దర్శనం చేసుకుందామని వచ్చామండి. మా యందు దయుంచి మాకు మార్గదర్శనం చేయాలండి...'' అంటూ ఏకరువు పెట్టాడు.

అప్పటికి సంగతేంటో అర్థమైంది అధినేతకి. ''ఓ అదా సంగతి? అద్సరే కానీ, ఇంతకీ మీరంతా ఎవరు?'' అన్నాడు ముసిముసిగా నవ్వుతూ.

''మేమంతా తమరి ఏకలవ్య శిష్యులమండి. తమకి అధికారం లేని కాలం నుంచీ మిమ్మల్ని గమనిస్తూ, మీ గురించి వార్తలు చదువుతూ, తమరి విన్యాసాలు చూస్తూ, ఎప్పటికైనా తమరి అడుగుజాడల్లో నడవాలని తహతహలాడిపోతుంటామండి... ఏదో మా పరిధిలో కాస్తో కూస్తో వెధవ పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నామండి. మా వాళ్లని పరిచయం చేస్తనుండండి. ఇదిగో... ఈడు లేడండీ, జనానికి టోకరా వేసి బతుకుతుంటాడండి. ఆడు ప్రజల్ని నమ్మించి మోసం చేస్తుంటాడండి. ఈడు మాయ చేసి దోచుకుంటాడండి. ఆడు దగా చేసి సంపాదిస్తాడండి. కానీ మేమంతా తమరి కాలిగోటికి కూడా సరిపోమండి. అందుకే మేం చేసే సన్మానాన్ని కాదనడానికి వీల్లేదండి...'' అంటూ దండ వేసినతడు కాళ్లావేళ్లా పడసాగాడు.

అధినేత అలవోకగా సెక్రటరీ కేసి చూసి, ''ఈళ్లు తెగ మొహమాట పెట్టేస్తున్నారయ్యా. నాది చూస్తే జాలి గుండె. గబుక్కుని కాదనలేను. మరి చుట్టు పక్కల మీడియా వాళ్లెవరూ లేరు కదా?'' అన్నాడు.

''అబ్బే లేరండి. మన పత్రికలోల్లే ఉన్నారండి. ఆళ్లెలాగూ తమకి చూపించే వార్త రాస్తారు కాబట్టి పరవాలేదండి...''

''మరి ప్రజలు కానీ, ప్రతిపక్షాలోళ్లు కానీ లేకుండా చూసుకున్నావా?''

''ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నానండి. హాలు తలుపులు బిడాయించేసి బయట మన పోలీసోళ్ల చేత కాపలా పెట్టించానండి. అయ్యగారు అత్యవసర రహస్య సమాలోచనలో ఉన్నారూ, కాసేపటి వరకు పరిపాలనా అదీ చేయరూ అని చెప్పేశానండి. ఇహ తమరు నిస్సంకోచంగా వీళ్ల సన్మానం అందుకుని నిజాలు చెప్పి మార్గదర్శనం చేయొచ్చండి...''

వచ్చిన వాళ్లంతా అప్పటికప్పుడు చకచకా ఏర్పాట్లు చేసేశారు. ఓ పెద్ద కుర్చీలో అధినేతని కూర్చోబెట్టి, అందరూ నేల మీద చతికిల పడ్డారు. ఆపై ఒకొక్కరూ వచ్చి దండలు, శాలువాలు, బుకేలు ఇస్తూ తమకి తోచినది మాట్లాడసాగారు.

మొదటగా ఒక వ్యక్తి గొంతు సవరించుకున్నాడు.

''ముందుగా శ్రీవారి గురించి ఓ చిన్న కవిత'' అంటూ అందుకున్నాడు.

''ఎవ్వారి తరమౌను ఈ వెధవ పనులు...

అవని నేరములందు అన్నిటను మిన్న...

అసురులైన ఈ తీరు అందుటను సున్న...

అన్నన్న... ఇది కదా అకృత్యమన్న!''

అంటూ అధినేత మెడలో దండ వేసి మాట్లాడసాగాడు.

''సాటి దుండగులారా! సహచర నీచులారా! నేడు మనకి సుదినం. మనమంతా చిన్నా చితకా వెధవ పనులు చేస్తూ కాలం గడుపుతున్నవాళ్లం. దాంతో అందరం ఎంతో కొంత చెడ్డవాళ్లమని సమాజంలో ముద్ర పడినవాళ్లమే. కానీ ఈయన? మనందరం చేసే రకరకాల నీచపు పనులను ఒకేసారి, ఏక గుత్తంగా, దర్జాగా చేస్తూ కూడా పైకి మంచిగా కనిపిస్తున్న నయా నయవంచక చక్రవర్తి. మనమంతా మన పరిధిలో కొందరికి టోపీ వేయగలం. కానీ ఈయన రాష్ట్రంలోని ప్రజలందరికీ ఒకే సారి టోపీ వేసి టోకుగా, హోల్సేలుగా, గుంపగుత్తగా దోచుకుంటున్నారు. ఈయన విధానాలను నేర్చుకోడానికి మనం ఎన్ని జన్మలెత్తాలో అర్థం కాకుండా ఉంది'' అంటూ అధినేత కాళ్లకి దండం పెట్టి వెళ్లి కూర్చున్నాడు.

ఆ తర్వాత మరో దుండగుడు వచ్చి అధినేతకి పుష్పగుచ్ఛం అందించి మాట్లాడసాగాడు.

''చేత చిన్న ముద్ద చూపించి బులిపించి..

ప్రజలను నమ్మించి, ఓట్లు పట్టి...

సందిట తాయిలాలు... సిరి దోచు పథకాలు...

కరకు నేతా! నిన్ను చేరి కొలుతు!!''

అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాన్ని మార్చి పాడగానే చప్పట్లు మార్మోగాయి.

''నిజానికి మనమంతా ఈయన ముందు ఒట్టి చవట దద్దమ్మలకిందే లెక్క. ఎందుకంటే మనం ఏ వెధవ పని చేసినా భయం భయంగా చేస్తాం. అవే వెధవ పనులను ఈయన దర్జాగా చేస్తారు. మనం మన దొంగ పనులన్నీ రాత్రులు, రహస్యంగా  చేస్తుంటాం. అదే ఈయన పట్టపగలు బాహాటంగా  చేస్తుంటారు. మనం బయటకి వెళ్తే చాలు, పోలీసులు వెతుకుతుంటారు. కానీ ఈయన బయటకి వెళ్తే అదే పోలీసులు సెక్యూరిటీగా వుంటారు. మన నేరం బయట పడితే చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తాం. అదే ఈయన మాత్రం ఆ చట్టానికే ఎదురు తిరుగుతారు. ఆ చట్టం తన పని తాను చేసుకుని పోకుండా చట్టంలోని లొసుగులనే అడ్డం వేసి కేసుల్ని సాగదీస్తూ దర్జాగా పదవిలో కొనసాగుతారు. మనలాగా ఈయన కూడా ప్రజలని అడ్డంగా దోచుకుంటున్నా కూడా, పైకి మాత్రం ప్రజల కోసమే తన జీవితమన్నట్టు కలరింగు ఇస్తారు. ఒకప్పుడు ఇంటిని తాకట్టు పెట్టే స్థితి నుంచి ఈనాడు దేశంలోని అధినేతలందరిలోకీ అత్యంత ధనవంతుడుగా పేరు తెచ్చుకున్న ఈయన అఖండమైన తెలివితేటల గురించి ఎంత చెప్పినా అది తక్కువే'' అంటూ తన్మయత్వానికి లోనై కళ్లొత్తుకుంటూ వెళ్లి కూర్చున్నాడు.

ఆ తర్వాత మొదట్లో దండేసిన వ్యక్తి లేచి అధినేతకి శాలువా కప్పి ''నేనొక సన్మాన పత్రం రాయించుకొచ్చాను. అది చదువుతాను'' అంటూ గొంతు సవరించుకున్నాడు.

''అగణిత అక్రమ వక్ర మార్గ వైతాళికా!

 ద్విగుణీకృత దుశ్చరిత్ర దురంధరా!

చండ ప్రచండ నీచకృత్య నిర్నిరోధా!

నయవంచక నయా విధాన రూపకల్పా!

జన పీడిత జయ విధాన జగజ్జేతా!

జయము... జయము...'' అనగానే అందరూ ఆనందంగా ఈలలు వేసి గోల చేశారు.

''ఆగండాగండి. మనం ఇలా ఎంత సేపు ఈయన్ని పొగిడినా మన తనివి తీరదు. మన అభిమాన ప్రదర్శనకి ఎన్ని రోజులైనా సరిపోదు. కాబట్టి ఇంతటితో ఆపుదాం. ఇప్పుడు మనందరం మరిన్ని నీచ నికృష్ట పనులు దొరక్కుండా ఎలా చేయాలో, ఎలాంటి నైపుణ్యాలు అలవరచుకోవాలో మన అభిమాన అధినేతలుంగారిని వేడుకుందాం. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఆయన మనకి నాలుగు చెడ్డ మాటలు బోధిస్తారు. శ్రద్ధగా విని మరింతగా చెడిపోవాలని కోరుకుంటున్నాను'' అంటూ కూర్చున్నాడు.

అధినేత తన మెడలో ఉన్న దండలన్నీ పక్కన పెట్టి, శాలువాలన్నీ కుప్పగా పోసి, బుకేలన్నీ రాసిగా పడేసి లేచి నుంచుని ముసిముసిగా నవ్వుతూ గొంతు సవరించుకున్నాడు.

''మీ అందరి అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే మీరెంత వెర్రిబాగులోళ్లో నాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ దేశంలోని అధినేతలందరికంటే నేను అత్యంత ధనవంతుడినని పేపర్లో వచ్చినందకు మీరు మురిసిపోతున్నారు. ఒక విధంగా అది గర్వకారణమే అయినా అదంతా ఎన్నికల సమయంలో నా అంతట నేను దాఖలు చేసిన అఫిడవెట్లోని అంశాలే.  నేను అధికారింగా ప్రకటించిన దీనికే మీరు ఇంతగా ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారంటే... మీ అమాయకత్వానికి జాలేస్తోంది. మనలో మన మాటగా చెబుతున్నాను. నేను అనధికారింగా దోచుకున్న, వెనకేసిన, పోగు చేసిన సంపదెంతో ఒక విధంగా నాకే లెక్కకు అందదు. దాన్ని మీరు ఊహించను కూడా లేరు. ఎందుకంటే మీరంతా  ముందుచూపు లేని మామాలు, సాదాసీదా నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొనేళ్ల పాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా కోట్లకు కోట్లు దోచుకోడానికి పథక రచన చేసిన రాజకీయ వేత్తను. అన్నింటికన్నీ పెద్ద సంపద ప్రజా ధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం ఉండాలి. దాని కోసమే నేను కిందా మీదా పడ్డాను. తపన పడ్డాను. ఊళ్ల మీద పడ్డాను. అధికారం అందాలంటే ముందుగా ప్రజల్ని నమ్మించాలి. అందుకోసమే నేను పాదయాత్రలు చేశాను. ప్రజలు ఏడవకపోయినా ఓదార్చాను. అవ్వా, తాతా, చెల్లీ, తల్లీ... అంటూ వరసలు కలిపాను. బుగ్గలు నిమిరాను. బుర్రలు ముద్దు పెట్టుకున్నాను. ఆఖరికి అనుకున్నది సాధించాను. ఇప్పుడు అనుచరుల నుంచి అధికారుల వరకు అందరికీ అవినీతిని రుచి చూపించాను. నన్ను నమ్ముకున్న వాళ్లకి భూములు, సెజ్లు, పోర్టులు అప్పగించి అందుకు ప్రతిగా వాటాలు అందుకున్నాను. వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకున్నాను. ఎదురు తిరిగిన వారికి బెదురు పుట్టేలా చేస్తున్నాను. ఆఖరికి జనం కూడా తమ సమస్యల గురించి చెప్పుకోడానికి సైతం భయపడేలా చేస్తున్నాను. ఇక ప్రతిపక్షం వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాను. ఏ పని తలపెట్టినా సామాన్యుల కోసమేనంటూ చెబుతాను. ఆ పనికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ నాకు అనుకూలంగా ఉండేవారికే కట్టబెడుతున్నాను. రాష్ట్రంలో అపార మైన ప్రజా సంపద ఉంది. దాన్ని దోచుకోడానికి ఒకసారి అధికారం అందితే సరిపోదు. మళ్లీ మళ్లీ దాన్ని అందుకోవాలి. అందుకోసమే నా తపనంతా. తిరిగి అధికారాన్ని అందుకోడానికి ఎందుకైనా సిద్ధపడతాను. ఈ ప్రజలు ఒట్టి వెర్రిబాగులోళ్లు.  వాళ్ల కళ్ల ముందు మనం కోట్లు కొల్లగొడుతున్నా పట్టించుకోరు. మనం దోచుకునే దాంట్లో ఏ అరశాతమో, అందులో సగమో పడేస్తే సంబరిపడిపోతారు. పైగా అంతకు పదింతలు పన్నులు, ఛార్జీలు, సెస్సులంటూ పిండుకున్నా తెలుసుకోలేరు. అదే నా ధీమా. కాబట్టి మీరు కూడా ఎలాగోలా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించండి. అప్పుడిక ఎలాంటి భయం లేకుండా బాహాటంగానే దోచుకోవచ్చు. మీరు చేసిన సన్మానానికి ప్రతిగా వచ్చే ఎన్నికల్లో మీకు ఏదో ఒక స్థాయిలో టికెట్ఖరారు చేసి అవకాశం కలిగిస్తాను. ఈలోగా మీరు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అసాధ్యమైనా సరే ఏవో రకరకాల హామీలు ఇచ్చి నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అందుకోసం నా ప్రసంగాల వీడియోలు చూస్తూ ఉండండి. ఇదే నేను చెప్పే నయవంచక నేతోపదేశం'' అన్నాడు.

ఆ మాటలకు అక్కడకొచ్చిన దొంగ, దుష్ట,దౌర్జన్య, దోపిడీ, దుండగ, దగుల్బాజీ, దగాకోరులంతా తన్మయత్నంతో కింద పడి పొర్లసాగారు!

-సృజన

PUBLISHED ON 13.4.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి