బుధవారం, మే 10, 2023

అభినవ పురాణం!



శిష్యుడు వచ్చేసరికి గురువుగారు చెవిలో పువ్వు పెట్టుకుని చాప మీద కూర్చుని వ్యాసపీఠంపై పెద్ద పుస్తకం పెట్టుకుని శ్రద్ధగా చదువుకుంటున్నారు. శిష్యుడు వచ్చి నిశ్శబ్దంగా  చాప మీదే చతికిలపడ్డాడు.

గురువుగారు  పువ్వు తీసి శిష్యుడి చెవిలో దోపి, ''ఆహా... ఏమి ఘట్టంరా. కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు యశోదకి చెప్పాడురా.  పళంగా యశోద వచ్చి కృష్ణుడి చెవి మెలిపెట్టి నోరు చూపించమంది. కృష్ణుడు నోరు తెరిచాడు...'' అంటూ చెబుతుండగా శిష్యుడు అందుకున్నాడు.

''ఇదంతా నాకు తెలుసు గురూగారూ! మా బామ్మ చెప్పింది. అప్పుడా కృష్ణుడి నోటిలో మొత్తం లోకాలన్నీ కనిపించాయంట కదా... '' అన్నాడు.

గురువుగారు తన్మయత్వంతో కళ్లు మూసుకుని, ''ఆహా...  తర్వాత ఏం జరిగిందంటే...'' అంటూ మొదలుపెట్టగానే, శిష్యుడు అడ్డుతగిలాడు.

''అదేంటి గురూగారూ! నేనేదో మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుందామని వస్తే, మీరు పురాణాలు వల్లిస్తున్నారూ? పోనీ నన్ను మళ్లీ రమ్మంటారా?''

''ఒరే, రాజకీయాల్లో ఆరితేరాలంటే పురాణాలు కూడా తెలుసుకోవాలిరా. అందుకే ఇవాళ ఇలా మొదలెట్టాను...''

''ఊరుకోండి సార్‌. పవిత్ర పురాణాలెక్కడ? అపవిత్ర రాజకీయాలెక్కడ? వాటికీ వీటికీ లంకె ఎలా కుదురుతుంది?''

''ఎందుకు కుదరదురా? పురాణాల్లో కథలన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయని తెలీదా?''

''ఏంటో గురూగారూ! మీరేదేదో చెబుతారు. మహిమలు, మాయలు ఉన్న పురాణ కథలు ఇప్పుడు జరగడం ఏంటి సార్‌. నాకేమీ అర్థం కావడంలేదు...''

''ఓరెర్రోడా...  కథల్లో అంతరార్థం గ్రహించుకుని ఇప్పటికి అన్వయించుకోవాలిరా...''

''అదికాద్సార్‌... నాకు పురాణాల గురించి తెలిసిందే తక్కువ. మీరేమో అంతరార్థం, అన్వయం అంటారు. నాలాంటి మట్టి బుర్రగాడికి అవన్నీ ఎలా కుదురుతాయి సార్‌? అదేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి...''

''సర్లె... ఎంత దద్దమ్మవైనా కాస్తో కూస్తో కథలు విని ఉంటావు కదరా. పోనీ సినిమాలైనా చూసి ఉంటావుగా? కాబట్టి నీకు తెలిసిన పాత్రల పేర్లు చెప్పు. అలాంటి వాళ్లు ఇప్పుడున్నారో లేరో చెబుతాను సరేనా?''

''...భక్త ప్లహ్లాద సినిమా  టీవీలో చూశాను సార్‌... అందులో హిరణ్యాక్షుడని ఉంటాడండీ...''

''మరి వాడేం చేశాడు? భూమిని చాపలాగా చుట్ట చుట్టేసి పట్టుకుపోయాడు అవునా? మరి ఇప్పుడు కూడా హిరణ్యాక్షుల్లాంటి రాజకీయ నేతలు ఉన్నారు కదరా... ప్రభుత్వ భూముల్ని, పోర్టుల్ని ఆక్రమిస్తున్నారా? ఎవరెవరికో ధారాదత్తం చేస్తున్నారా? కబ్జాలకు పాల్పడుతున్నారా?  అసలు నీ పరగణాని పాలిస్తున్న ముఖ్యనేతని, ఆయన అనుచరులని మర్చిపోతే ఎలారా? ఏవేవో పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు ఏర్పడుతాయని జనాన్ని నమ్మించి వేలకు వేల ఎకరాలు అయినవారికి అప్పగించి, అందుకు ప్రతిగా వాటాలు అందుకోవడం లేదూ? మరి ఇది భూమిని చుట్ట చుట్టేయడం కాదంటావా? మరి వస్తాయని ఆశ పెట్టిన పరిశ్రమల జాడ ఎక్కడైనా కనిపిస్తోందా? ఉన్నవి కూడా ఉడాయిస్తుంటే ఇక ఉద్యోగాల సంగతి వేరే చెప్పాలా? ఇక  ముఖ్యనేత అండ చూసుకుని అధికార పార్టీ అనుచరులు, నేతలు కలిసి ఎక్కడ ఎలాంటి విలువైన భూమి కనిపించినా వదుల్తున్నారా? ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కూడా అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్న వీరి ఆగడాలు అడుగడుగునా కనిపంచడంలేదా? మరి వీళ్లంతా  హిరణ్యాక్షులకేమైనా తీసిపోతార్రా? అంటే అలనాటి పురాణం ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే కదా? కాదనగలవా?''

''ఇంకేమనగలను సార్‌, మీరింతబాగా అన్వయించాక? అన్నట్టు ఈమధ్యనే పేపర్లో చదివాను సార్‌. అధికార పార్టీకి చెందిన నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎక్కడికక్కడ భూముల్ని తవ్విపోగులు పెట్టి మట్టిని తరలించి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారట సార్‌. అంటే మట్టి తినడమే కదా సార్‌? ఇందాకా మీరు చెప్పారే, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమంటే లోకమంతా కనిపించిందని. ఇదీ అలాగే ఉన్నట్టుంది సార్‌. నేను కూడా బాగా అన్వయించానంటారా?''

''ఏడిశావ్దరిద్రుడా. ఆయన కృష్ణుడు అయితే వీళ్లు నికృష్టులురా. ఆయన చూపించింది అద్భుతమైన లీల అయితే వీళ్లది అవినీతి గోల. వీళ్లని  సీబీఐ వాళ్లో నోరు తెరవమంటే ఎక్కడలేని గనులు, కొండలు, ఖనిజాలు, ఇసుక పర్రలు కనిపిస్తాయి. కానీ వీళ్లు నోరు తెరవరు. ఒక వేళ తెరిచినా తిన్నదంతా అరాయించేసుకుని ఒట్టి నోరు చూపిస్తారు...''

''బాగా చెప్పారు సార్‌. మరయితే హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు కూడా ఇప్పుడున్నాడంటారా?''

''మరయితే  హిరణ్యకశిపుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పు...''

''... గుర్తొచ్చిందండి. తానే దేవుడినన్నాడండి. తనను తప్ప ఎవరినీ పూజించకూడదన్నాడండి. రాజ్యంలో ప్రతి దేవాలయంలోనూ తన ప్రతిమలే నిలబెట్టించాడటండి. బ్రహ్మ ఇచ్చిన వరాలతో రెచ్చిపోయాడండి. తన మాటకి ఎదురు చెప్పిన వాళ్లని చంపించాడండి. ఆఖరికి తన కన్నకొడుకుని కూడా చంపడానికి చూశాడండి...''

''నీకా కథ బాగానే గుర్తుందిరా. కానీ  హిరణ్యకశిపుడిలాంటి నేతని మాత్రం పోల్చుకోలేకపోతున్నావ్‌. నిన్ను, నీ నేలని పాలిస్తున్న ముఖ్యనేత కూడా అంతే కదరా. జనం కోసం తపస్సు చేశాడు.  తపస్సుకి మెచ్ఛి జనం ఇచ్చిన ఓట్ల వరంతో విర్రవీగుతున్నాడు. ఎదురు చెప్పిన వాడిని వేధిస్తున్నాడు. ప్రశ్నించిన వాడిని నానా అక్రమ కేసులు బనాయించి కక్షసాధిస్తున్నాడు. ఆఖరికి సొంత పార్టీ వాళ్లయినా తనది తప్పంటే సహిస్తున్నాడా? గుండాల చేత కొట్టిస్తున్నాడు. పార్టీ నుంచి వెలి వేస్తున్నాడు.  ఇవన్నీ చాలక, తానే దేవుడన్నట్టు అందరినీ నమ్మించడానికి ఊరూవాడా పోస్టర్లు వేయిస్తున్నాడా లేదా? 'మా దేవుడు నువ్వే', 'మాకు అండ నువ్వే' అంటూ జనం తన్మయత్వంతో పూజిస్తున్నట్టు తనకు తానే ప్రచారం చేసుకోవడం లేదూ? అహంకారంతో విర్రవీగిన అలనాటి హిరణ్యకశిపుడి వారసుడు వీడేనంటే తప్పేమైనా ఉంటుందంటావా?''

''తప్పేంటి సార్‌, అక్షరాలా నిజమైతేనూ? మరయితే నాకు కంసుడి కథ కూడా గుర్తొస్తోందండి. వాడు కూడా ఇప్పుడు ఉన్నాడంటారా?''

''ముందు  కంసుడేం చేశాడో నీకు గుర్తున్నంత వరకు చెప్పు చూద్దాం...'

''ఏముందండీ? కన్న తండ్రినే ఖైదు చేయించాడండి. సొంత చెల్లెల్నే నానా పాట్లూ పెట్టాడండి. జైల్లో వేసి బంధించాడండి. తనను చంపబోయేవాడు ఎక్కడో పెరుగుతున్నాడని తెలిసి రాజ్యంలోని పిల్లల్నందర్నీ చంపడానికి రాక్షసుల్ని పురమాయించాడండి...''

''మరి ఇంత చెప్పినవాడివి, అధికార మదంతో విర్రవీగుతున్న నీ నేత పనుల్నే మర్చిపోతే ఎలారా? పురాణాల్ని కథల్లాగా కాదురా,  కథల్లోని సంఘటనలతో పోల్చుకోవాలి. మరి నీ నేత తండ్రి చనిపోగానే  స్థానంలో కూర్చోవాలని చూశాడా? సంతకాల సేకరణ చేశాడా? అప్పట్లోలాగా రాజ్యాలు, రాచరికాలు లేకపోబట్టి కానీ లేకపోతే తండ్రి సింహాసనాన్ని వెంటనే ఆక్రమించుకునేవాడే కదా? ఇక తల్లినే పార్టీ నుంచి తప్పించాడా లేదా? ఇక సొంత చెల్లెలు పరిస్థితి ఏంటో చూస్తున్నావుగా? అంతెందుకు,  బాబాయి హత్యకు దారితీసిన పరిస్థితుల్ని తల్చుకుంటే చాలదూ?  అధికారం కోసం అయినవారిని సైతం కకావికలు చేసిన కంసుడి వారసుడికి కథకి ఇంతకంటే అన్వయాలు ఎక్కడుంటాయి? ఇక తనను ఓడించేవాడు ఎవడైనా ఉన్నాడనిపిస్తే చాలు వాళ్ల మీదకి గుండాల్ని ఉసిగొల్పడం లేదూ? వాళ్ల మీద ఎక్కడ లేని ఆంక్షలు విధించడం లేదూ? ఎవరైనా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే అనుచరులు, పోలీసుల చేత చితగ్గొట్టించడం లేదూ? అన్యాయపు సెక్షన్లతో కేసులు పెట్టించడం లేదూ? ఎక్కడికక్కడ తన మనుషులని పెట్టుకుని ఎదురుతిరిగిన వాళ్లని నానా పాట్లూ పెట్టడం లేదూ? ఇదంతా చూస్తూ కూడా  అభినవ కంసుడిని కనిపెట్టకపోతే ఎలారా?''

''ఆహా... చాలా బాగా చెప్పారు సార్‌. మరయితే రావణాసురులు, కుంభకర్ణులు, దుర్యోధనులు, దుశ్శాసనులు, శకునులు, సైంధవులు... ఇలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదండీ?''

''అడుగడుగునా వాళ్లే కదరా? పాండవులకి నిలువ నీడ లేకుండా చూడాలనుకున్నాడు దుర్యోధనుడు. మరిప్పుడు ప్రతిపక్షాలకు నిలువ నీడ లేకుండా చేయాలనే ఉద్యేశంతో చెలరేగుతున్న నేతని పోల్చుకోలేవా? మాయా జూదంతో పాండవులను ఓడించాడు శకుని. అలా మాయ మాటల పాచికలాడి జనాన్ని నమ్మించిన శకుని జాడ కనిపించ లేదా? నిండు సభలో ద్రౌపది వలువలు ఊడదీయాలని చూశాడు దుశ్శాసనుడు. మరి మహిళలపై అత్యాచారలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న నీ రాష్ట్రంలో అడుగడుగునా చెలరేగి పోతున్న అధికార పార్టీ అనుచరుల ఆగడాలను గ్రహించలేవా? మారీచుడిని బంగారు లేడిలాగా కనిపించేలా చేసి సీతను ఎత్తుకుపోయాడు రావణాసురుడు. అలాగే స్వర్ణయుగాన్ని చూపించి నమ్మించి అసాధ్యమైన హామీలిచ్చి అధికారాన్ని అందుకున్న నేతల తీరు కానుకోలేవా? పరికించి చూస్తే... ప్రజల మేలుకు అడ్డుపడుతున్న సైంధవులు, సామాన్యులు కష్టాలు పడుతున్నా మొద్దు నిద్రపోతున్న అధికార కుంభకర్ణులూ, చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారంలో కూడా వాటాలడుగుతూ జనాన్ని నిలువునా దోచుకుంటున్న పాలక పార్టీ దుష్టచతుష్టయాలు, ప్రకృతి వనరుల్ని సైతం కబళిస్తున్న కబంధులు, అక్రమ వ్యాపారాలతో విజృంభిస్తున్న రాకాసి మూకలూ... ఇలా పురాణాల్లో ఉండే పాత్రలన్నీ మన చుట్టూ వికటాట్టహాసాలు చూస్తూ తిరుగుతూ ఉంటే పోల్చుకోలేకపోతే ఎలారా?''

''అవునండోయ్‌. మరైతే గురూగారూ, పురాణాల్లోలాగా ఇలాంటి రాక్షసులని తుదముట్టించడానికి  రాముడు,  కృష్ణుడు,  ఉగ్ర నరసింహుడు,  పరశురాముడు కూడా వస్తారంటారా?''

''జనచైతన్యమే అవతార పురుషుడిని చూపిస్తుందిరా. తాము ఓటేసి గెలిపించిన వాళ్లంతా తమను ఎలా దోచుకుంటున్నారో, ఎలా వేధిస్తున్నారో, ఎలా రెచ్చిపోతున్నారో, ఎలా విర్రవీగుతున్నారో, ఎలా పేట్రేగిపోతున్నారో, ఎలా పీడిస్తున్నారో, ఎలా పీల్ఛి పిప్పి చేస్తున్నరో, ఎలా మోసం చేస్తున్నారో, ఎలా మాయ చేస్తున్నారో...  సామాన్యులు అవగాహన చేసుకుంటే చాలురా. వాళ్ల చేతిలో ఓటే రామబాణమై రావణాసురుడి తలలు ఖండిస్తుంది.  ఓటే సుదర్శన చక్రమై రాక్షసులను తుదముట్టిస్తుంది. దుష్ట పాలకుల నైజం గ్రహించిన ప్రతి ఓటరూ  పరశురాముడే.  ఉగ్ర నరసింహుడే. అర్థమైందా?''

''అద్భుతం సార్‌. మీరు చెప్పిన అభినవ పురాణాన్ని నిత్యం పారాయణ చేస్తాను''

-సృజన

PUBLISHED ON 7.5.2023 IN JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి