సోమవారం, మే 15, 2023

కంత్రీ నెంబర్‌ వన్‌!



అధినేత కుర్చీలో కూర్చుని ఏదో దురాలోచనలో ఉండగా, సెక్రటరీ హడావుడిగా వచ్చాడు.

''సార్‌... నమస్కారం. మీరేం కంగారు పడకండి. నిబ్బరంగా ఉండండి. నేను చూసుకుంటాను...'' అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా.

''నేను కంగారు పడ్డం దేనికయ్యా...'' అన్నాడు అధినేత అయోమయంగా.

''అదే సార్‌... పొద్దున్న పేపర్లలో వార్తలు చదివి వెంటనే ఆదరాబాదరా బయల్దేరానండి. వచ్చేటప్పుడు వైద్యుల్ని కూడా వెంట బెట్టుకుని వచ్చానండి. బయట వెయిట్చేస్తున్నారండి. పిలవమంటారా?''

''వైద్యులేంటయ్యా... దేనికి?''

''ఒకాయన షాక్తగిలిన వాళ్లని తేరుకునేలా చేయడంలో స్పెషలిస్టండి. ఇంకొకాయన తలకేదైనా బొప్పి కడితే ట్రీట్మెంటు ఇవ్వడంలో ఆరితేరినాయనండి. మరొకాయన ఎక్కడ ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా చిటికెలో చికిత్స చేసేస్తాడండి. బీపీ, హార్టుబీట్చూసే డాక్టర్లను కూడా తెచ్చానండి. వీళ్లతో పాటు ఎందుకైనా మంచిదని సిగ్గుతో చితికిపోతుంటే ధైర్యం నూరిపోసే సైకాలజిస్టుని కూడా తీసుకొచ్చేశానండి...''

''వీళ్లంతా ఎందుకయా? ఇప్పుడు నాకేమయిందని?''

''భలేవారు  సార్‌. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకేమీ కాకుండా చూసుకోవడం సెక్రటరీగా నా బాధ్యత కదండీ? మీకెందుకు మీరు ధైర్యంగా ఉండండి. వాళ్లని లోపలికి రమ్మంటాను. ఆపై అంతా వాళ్లే చూసుకుంటారు. అన్నట్టు... ఇంట్లో ఎక్కడా అద్దాలు లేకుండా తీసేయమని నౌకరుకి ఫోన్చేశానండి. తీసేశాడా?''

''అవునయ్యా... పొద్దునే లేచి మొహం కడుక్కుని అద్దంలో చూసుకుందామంటే అది కనిపించలేదు. బాత్రూం, బెడ్రూమ్‌, డ్రెస్సింగ్ రూమ్స్లో కూడా అద్దాలు కనిపించలేదు. అది నీ పనా? ఎందుకలా?''

''సార్‌... నాకు తెలుసండీ. పొద్దున్నే అన్ని పేపర్లలోనూ పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీల్లో వచ్చిన హెడ్లైన్స్చూసి మీరెంత బాధ పడి ఉంటారో ఊహించగలనండి. అలాంటప్పుడు అద్దంలో మీ మొహం మీరు చూసుకోవాలన్నా కూడా  సిగ్గుగానే ఉంటుందండి. ఆ మాత్రం బాధ కూడా మీకు ఉండకూడదలని అలా చేశానండి. ఇప్పటికైనా కాస్త తేరుకున్నారాండీ?'' అంటూ సెక్రటరీ మంచినీళ్ల గ్లాసు అందించాడు.

ఆ సరికి అధినేత మొహం కందగడ్డలాగా తయారైంది. కోపం నషాళానికి ఎక్కింది.

విసురుగా లేచి నుంచుని నీళ్ల గ్లాసు విసిరికొట్టి, ''నోర్ముయ్‌! నీకసలు బుద్ధుందా? ఏం వాగుతున్నావ్‌?'' అంటూ పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు.

సెక్రటరీ ఒక్కసారిగా ఉలిక్కి పడినా అధినేత మొహాన్ని పరిశీలనగా చూస్తూ, ''ఆఖరికి నేను భయపడినంతా జరుగుతోంది. మీరు పెద్ద షాక్కే గురయ్యారన్నమాట. లేకపోతే మీ క్షేమం కోసం ఆరాటపడే నా మీదే అరుస్తారా చెప్పండి? అయినా పర్వాలేదులెండి. మీ పెర్సనల్సెక్రట్రీగా ఇవన్నీ నేను లెక్క చేయను. మీరు మాత్రం అలా నిదానంగా కూర్చోండి చెప్తాను...'' అంటూ అధినేతని కూర్చోబెట్టబోయాడు.

అధినేతకి ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్పినా సెక్రటరీ వినేలా లేడని గ్రహించి, కోపాన్ని తమాయించుకుని, ''సెక్రట్రీ... నేను బాగానే ఉన్నాను కానీ, ముందసలు నీ హడావుడి దేనికో, డాక్టర్లని ఎందుకు తీసుకొచ్చావో, పేపర్లలో వార్తలేంటో, నువ్వెందుకు కంగారు పడుతున్నావో చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది...'' అన్నాడు.

అప్పటికి సెక్రటరీ కుదుటపడ్డాడు.

''అదేసార్. మీరు జారీ చేయించిన జీవో నెంబర్వన్ని హైకోర్టు అడ్డంగా కొట్టేసింది కదండీ. అన్ని పేపర్ల మొదటి పేజీల్లోనూ అదే వార్తండి. ప్రభుత్వానికి ఇదొక షాక్అని ఒకళ్లు రాస్తే, గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మరోకరు హెడ్డింగ్పెట్టారండి. ప్రభుత్వానికి మొట్టికాయ పడిందని, తల బొప్పి కట్టిందని... ఇలా అందరూ తలొక రకంగా రాశారండి. మరి ప్రభుత్వమంటే మీరే కదండీ? ఆ పళంగా మీరెంత మధన పడి ఉంటారోనని తెగ వర్రీ అయిపోయానండి. అందుకే ఎక్కడ దెబ్బ తగిలినా ట్రీట్మెంటు చేయడానికి సిటీలో స్పెషలిస్టులందరినీ కారెక్కించుకుని చక్కా వచ్చేశానండి. మీరేమో ఇదంతా అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తున్నారు...'' అన్నాడు ఉడుకుమోత్తనంగా.

అప్పటికి అధినేతకి అంతా అర్థమై ఒక్కసారిగా నవ్వొచ్చేసింది.

''..హ్హ..హ్హా! సెక్రట్రీ... అదా సంగతి! చంపేశావయ్యా. నీ కంగారుతో నన్ను తికమక పెట్టేశావ్‌...'' అన్నాడు అధినేత నవ్వుతూనే.

సెక్రటరీ తెల్లమొహం వేసి, ''అదేంటి సార్‌? అంత తేలిగ్గా నవ్వేస్తున్నారు? తమంతటి వారైన తమరు ప్రజానీకం పేరు పెట్టి, జనం మేలు కోరి ఓ జీవో జారీ చేయించినప్పుడు, రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు దాన్ని వెంట్రుక ముక్కలా తీసి అవతల పారేస్తే మీకేమాత్రం నామోషీగా లేదాండీ? నామర్దాగా అనిపించడం లేదాండీ? అసలిదెంత అప్రతిష్టండీ? తల్చుకుంటే నాకే తల కొట్టేసినంత పనయ్యిందండి. మీరు మాత్రం ఇలా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండీ?'' అన్నాడు ఆశ్చర్యంగా.

అధినేత నవ్వాపుకుని, ''నా మీద నీ అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తోందయ్యా. అందుకే నువ్వొట్టి వెర్రిబాగులవాడివైనా పనిలో కంటిన్యూ చేస్తున్నాను'' అంటూ వంగి సెక్రటరీకి కనిపించేలా తల వంచి చూపించాడు.

ఆ తల చూసిన సెక్రటరీ ఆశ్చర్యపోయాడు. తల నిండి బొడిపెలే. అధినేత పాలనలో కంకర లేచిపోయిన రోడ్డులాగా ఎగుడు దిగుడుగా అన్నీబొప్పులే కనిపించాయి.

''చూశావా సెక్రట్రీ. కంగారు పడకు. లెక్క పెట్టాలని కూడా చూడకు, కష్టం. ఇవన్నీ ఏంటనుకున్నావ్‌. కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి మనం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు, సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలేనయ్యా ఇవన్నీ. వందలకొద్దీ ఉంటాయనుకో. మందలింపో, హెచ్చరికో, చీవాట్లో... ఏదైనా కానీ న్యాయస్థానాలిచ్చిన ఇలాంటి తీర్పులతో నా తల బొప్పి కట్టేసిందయ్యా. అందుకని ఇక నెప్పి తెలియడం మానేసింది'' అన్నాడు అధినేత ఎప్పుడూ అలవాటైన విధంగా అదోలా నవ్వుతూ. ప్రజలకి లాగే ఆ నవ్వుకి అర్థం ఏంటో సెక్రటరీకి కూడా అంతుపట్టలేదు. కానీ ఎన్ని వ్యతిరేక తీర్పులొచ్చినా అధినేత సిగ్గుపడడానికి, సరిదిద్దుకోడానికి, తరచి చూసుకోడానికి, తడిమి చూసుకోడానికి, సవరించుకోడానికి అతీతంగా ఎదిగిపోయాడని మాత్రం అర్థమైంది. దాంతో కుదుటపడ్డాడు.

''అమ్మయ్య. పోన్లెండి. కోర్టుల చివాట్లు, మందలింపులకేముందండి. మీరు స్థిమితంగా ఉన్నారు, నాకదే చాలు. కానీ సార్‌... నాకు అర్థం కాక అడుగుతానూ... మీరు జీవో నెంబర్వన్ని ప్రజల పేరు చెప్పే కదండీ జారీ చేశారు? మరిలా ఎదురు తన్నిందేం?'' అన్నాడు అమాయకంగా.

అధినేత తల తడుముకుంటూ, ''చూడు సెక్రట్రీ. మనమేం చేసినా ప్రజల పేరు మీదే చేస్తామయ్యా. కానీ లోపల ఉద్దేశాలు మాత్రం వేరే ఉంటాయన్నమాట...'' అన్నాడు గుంభనంగా.

''అదికాద్సార్‌. జాతీయ రహదారుల మీద ప్రదర్శనలు, ఆందోళలను జరిగితే జనానికి చికాకని, ట్రాఫిక్జామ్లవుతాయని, అంబులెన్సులు సైతం ఆగిపోతాయని, ప్రయాణాలు ఆలస్యమవుతాయని మీరు అప్పట్లో నాతో చెప్పారండి.  అసలు ప్రజల ప్రాణాలు కాపాడ్డానికేనని కూడా అన్నారండి. మరి వీటన్నింటినీ కోర్టు అర్థం చేసుకోలేదేంటారా?

''ఇవన్నీ ఆ జీవో జారీ చేసేప్పుడు నీకు, ప్రజలకీ చెప్పిన కారణాలయ్యా. కానీ మన మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు...''

''ఏంటండి అది?''

''జాగ్రత్తగా విను సెక్రట్రీ. నువ్వు అమాయకుడివి కాబట్టి, రేప్పొద్దున నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి చెబుతున్నా. నా పాలనలో మనం చేసే పనులన్నీ ప్రజల పేరు మీద, వారి మేలు కోసమనే చేబుతామయ్యా. వాటిని పాపం... వెర్రి జనం బాగానే నమ్మేస్తారు. కానీ ఈ ఎగస్పార్టీలున్నాయి చూడు ఆళ్లు మాత్రం ఆవులిస్తే పేగులు లెక్కెడతారు. మన తీసుకునే ఒకో నిర్ణయం వెనుక, జారీ చేసే ప్రతి జీవో వెనుక మన అసలు ఉద్దేశాలేంటో చటుక్కున గ్రహించేస్తారు. గ్రహించి ఊరుకుంటారా? ఆ నిర్ణయాల వల్ల జనానికి ఎంత నష్టం కలుగుతుందో చెప్పడానికి ఆందోళనలు చేపడతారు. రోడ్ల మీదకొచ్చి సభలు, సమావేశాలు పెడతారు. తెల్లారి లేస్తే నాలుగు కాసులు సంపాదించుకోడానికి ఎవరి పనుల మీద వాళ్లు తిరిగే సామాన్యులంతా ఇలాంటివి జరిగినప్పుడే కదా గుమిగూడతారు? అప్పుడు ఆ ఎగస్పార్టీవోళ్లు మన నిర్ణయాల వల్ల ఎంత చేటు జరుగుతుందో విడమర్చి చెబుతారు. అప్పుడేమవుతుంది? జనం చైతన్యవంతులైపోతారు. మరి అలా జనం తెలివిమీరిపోతే, మన పప్పులు ఉడుకుతాయా? ఉడకవు. మన ఉద్దేశాలు నెరవేరుతాయా? అవవు. మరందుకనే ఈ నెంబర్వన్జీవోని జారీ చేయించానన్నమాట. అర్థమైందా?''

''ఆహా... ఇప్పటికి అర్థం అయింది సార్‌. పైకి ప్రజల ప్రయోజనాలని అడ్డం పెట్టి, లోపాయికారీగా ప్రతిపక్షాల నోరు నొక్కడమన్నమాటండి. మరందుకేనన్నమాట, ఎవరైనా సరే సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు లాంటివి...  జాతీయ రహదారులు, మున్సిపాల్టీ రోడ్లు, గ్రామాల రహదారుల మీద పెట్ట కూడదని రూలెట్టాశారన్నమాట. ఆహా...ఏం తెలివి సార్‌? ఈ రోడ్లన్నీ నిషేధించేస్తే ఇక ఎక్కడెట్టుకోవాలండీ సభలు, అడవుల్లో తప్ప! మీకు మీరే మేధావండి బాబూ...''

''మరందుకేరా... ఎగస్పార్టీవోళ్లు ఏకంగా కోర్టుకు పోయారు. కోర్టుకి కూడా అంతా అర్థమై కొట్టేసిందన్నమాట. తెలిసిందా?''

''తెలిసిందండి. అందుకేనన్నమాట, స్వాతంత్రం రావడానికి కూడా ఇలా రోడ్ల మీద జరిగిన సభలు, ఆందోళనలే కదా కారణమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాధమిక హక్కులకు కూడా ఇది భంగమని కుండబద్దలు కొట్టేసింది. నిజానికి నాకింకోటి కూడా అర్థమవుతోందనండి. గతంలో మీలాగా ఎవరూ పాదయాత్రలు అవీ చేసి, ప్రజల మనసు దోచుకోకుండా కూడా దీన్ని ప్రయోగించి ఉంటారు కదండీ? అసలు ఇలాంటి జీవో ఉంటే మీరు కూడా పాదయాత్ర చేయడానికి వీలుండేది కాదేమోనండి. అవునంటారా?''

''కాదనడానికేముందిరా. అదే మన దురుద్దేశమయినప్పుడు?''

''కానీ సార్‌. మరిప్పుడెలాగండీ? అవతల ఎన్నికలు కూడా వస్తున్నాయి. హైకోర్టు వ్యాఖ్యానాలని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఏద్దేవా చేస్తూ, జీవో నెంబర్వన్ను కోర్టు కొట్టేసింది కాబట్టి రెచ్చిపోయి ప్రతిపక్షాలన్నీ రోడ్ల మీదకొచ్చి మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తే ఏం చేయాలండీ?''

అధినేత పగలబడి నవ్వేశాడు. ''ఓరెర్రి సెక్రట్రీ! జీవో ఉంటే మనం చేసే ఎదవ పన్లకి ఊతంగా ఉంటుందని తప్ప, అది లేకపోతే ఏం చేయలేమని కాదు కదయ్యా! అధికారం చేతిలో పెట్టుకుని ఎగస్పార్టీవోళ్లని నానా తిప్పలు పెట్టడానికి మనం బెదిరించి, దువ్వి  మచ్చిక చేసుకున్న పోలీసులు లేరా? పెంచి పోషించుకుంటున్న గూండా అనుచరులు లేరా? ప్రతిపక్షాల సభలకి చోటిస్తే ఊళ్లకి ఊళ్ల మీదే కక్ష కట్టడం లేదా? లేనిపోని రూల్సెట్టి  ఆ గ్రామాల్లో ఇళ్లను బుల్డోజర్లు, క్రేన్లు పెట్టి కూలగొట్టడం లేదా? ఎగస్పార్టీవోళ్ల సభలెట్టే చోట కరెంటు ఆపు చేయించడం లేదా? ప్రతిపక్ష నాయకులు చేతులూపకూడదని, జనానికి అభివాదాలు చేయకూడదని శాంతి భత్రతల పేరు చెప్పి అడ్డమైన ఆంక్షలు పెట్టడం లేదా? అంతెందుకయ్యా, ఎగస్పార్టీవాళ్ల సభలకు వెళితే చాలు, జనాలకి రేషన్కార్డులు, ప్రభుత్వ పధకాలు రద్దు చేయడం లేదా? మనకి ఎదురు తిరిగితే ఏమవుతుందో ప్రజానీకానికీ, ఇతర జననాయకులకీ ఈ పాటికే అర్థమైపోయిందయ్యా. అయినా మననేం చేయగలరు చెప్పు... బోధపడిందా? హహ్హహ్హా!''

అధినేత అతివిశ్వానికి, అహంకార ధోరణికి  సెక్రటరీ బిత్తరపోయాడు. ఏమనాలో తోచలేదు.

మనసులో మాత్రం, ''ఆ జీవో నెంబర్వన్సంగతెలా ఉన్నా, నువ్వు మాత్రం కంత్రీ నెంబర్వన్అని బోధపడింది'' అనుకున్నాడు.

పైకి మాత్రం వినయంగా, ''ఇక వెళ్లొస్తాను సార్‌...' అని బయటకి నడిచాడు.

అధినేత మరో జీవో కోసం దురాలోచనలో పడ్డాడు!

-సృజన

PUBLISHED ON 15.5.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి