బుధవారం, మే 24, 2023

పెద్దపులి పేద వేషం!

''అనగనగా ఒక పులిరా. అడవిలో కష్టపడి మాటు వేయడం, పొంచి ఉండడం, పరుగులు పెట్టడం... ఇలా నానా పాట్లూ పడి వేటాడి తినడం కష్టమనిపించింది దానికి. ఏం చేయాలా అని ఆలోచిస్తే దానికో ఉపాయం తోచిందిరోయ్‌. అవడానికి మనం క్రూరమృగమైనా, సాధుజంతువులా వేషమేసుకుంటే ఎవరూ పోల్చుకోలేరూ, అప్పుడు సులువుగా వాటితో కలిసిపోయి వీలు చిక్కినప్పుడల్లా ఒకోదాన్ని తినేసి హాయిగా కడుపునింపుకోవచ్చూ... అనుకుందిరా. అప్పుడది ఏం చేసిందో తెలుసా?  ఆవు చర్మం వెతుక్కుని దానిలోకి దూరిపోయి మారువేషం వేసుకుంది.  పళంగా అడవి వదిలేసి ఊర్లోకి పోయి ఆవుల మందలో కలిసి పోయింది. ఇక అప్పటి నుంచి పెద్దగా కష్టపడక్కరలేకుండా ఒకో ఆవునీ తినేయడం మొదలు పెట్టింది... ఏరా రాసుకుంటున్నావా?'' అంటూ ఆగారు గురువుగారు.

అప్పటిదాకా ఆయన చెప్పిందంతా శ్రద్దగా రాసుకుంటున్న శిష్యుడు పెన్ను పక్కన పెట్టి, ''రాసుకున్నాను గురూగారూ!  తర్వాత ఏమైందో చెప్పండి'' అన్నాడు.

''మరి  కథలో నీతి ఏంటిరా?''

''అదేంటి సార్‌. అవినీతి కథ చెప్పి నీతి అడుగుతారూ?''

''ఒరే నీతనేది నువ్వు కథను అర్థం చేసుకున్నదాన్ని బట్టి ఉంటుందిరా. నీ సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అడిగినదానికి జవాబు చెప్పు...''

''నీతంటే... తేలిగ్గా భోంచేయాలంటే పులిలా ఆలోచించాలి సార్‌. అంతేనాండీ?''

''అయితే నువ్వు గోముఖ వ్యాఘ్రానివన్నమాట...''

''అదేంటండీ అంతమాటనేశారూ? పోనీ  నీతేంటో మీరే చెప్పండి...''

''నువ్వు  కథలో పులిని ఆదర్శంగా తీసుకున్నావురా. అందుకే అలా అన్నాను. మరి ఆవుల వైపు నుంచి ఆలోచించావనుకో. అవి తమలోనే కలిసిపోయి, పైకి అమాయకంగా కనిపించే పులిని కనిపెట్టే తెలివిని అలవరచుకోవాలి. లేకపోతే తమకే నష్టం. మందలో ఉన్న ఆవులు ఒకొక్కటిగా మాయం అవుతున్నాయంటే అవి అప్రమత్తమవాలి కదా? అదీ అసలు నీతి''

''ఏంటో గురూగారూ! కథ బాగానే ఉంది కానీ, నాకీ కథలెందుకండీ చెప్పడం? నేనేదో మీ దగ్గర నాలుగు రాజకీయ పాఠాలు నేర్చుకుని ఎప్పటికో అప్పటికి  నేతగా మారాలనుకుంటుంటే, మీరిలా కథలతో కాలక్షేపం చేస్తే ఎలా సార్‌?''

''ఓరెర్రెదవా... నేను చెప్పింది రాజకీయ పాఠమేరా.  కథలో పులి ఎవరో కాదు, ఇప్పుడు నిన్ను పాలిస్తున్న అధినేతే. ఇక ఆవులంతా ప్రజానీకం. మారువేషం వేసుకుని తమ మందలో జొరబడిన పులి వేషాలను ఇప్పటికైనా కనిపెట్టలేదనుకో. ఆవుల ప్రాణానికే ప్రమాదం కదా?''

''అవునండోయ్‌! బాగా చెప్పారు. మరైతే ఇందులో నేను నేర్చుకోవలసినదేముందంటారు?''

''గంగిగోవుల్లాంటి ప్రజలను నమ్మించాలంటే ఏం చేయాలో అది నేర్చుకోవాలి. మారువేషం వేసుకుని మాయ మాటలు చెప్పి మందలో ఒకడిగా కలిసిపోవాలి. అప్పుడు కథలో పులిలాగా ఏమాత్రం కష్టపడకుండా నువ్వు పాలించే నీ రాజ్యం మొత్తాన్ని గంపగుత్తగా భోంచేయవచ్చు. అచ్చం నీ పరగణా పాలకుడిలాగా అన్నమాట. అర్థమైందా?''

''కథ వరకు అర్థమైంది సార్‌. కానీ మా పాలకుడిలాగా అన్నారు కదా, అదెలాగో తెలియలేదండి...''

''నువ్వంత బుర్ర తక్కువ వాడివి కాబట్టే నీకు పాఠంలాగా కాకుండా, కథలాగా చెప్పాన్రా.  నీ పాలకుడి వేషాలు నేను చెబితే కానీ కనిపెట్టలేకపోతే కథలో ఆవులాగా అమాయకుడివన్నమాటే కదా? మందలో ఒకడిగా కలిసిపోడానికి మంచోడిలా మారువేషం వేసుకోలేదూ మీ వాడు? ఊరూవాడా తిరుగుతూ ఏమన్నాడు? బడుగుల కోసమే తన బతుకన్నాడు. సామాన్యుడిని సంపన్నుడిగా చేయడమే తన లక్ష్యమన్నాడు. జనాన్ని ఉద్ధరించడమే తన ధ్యేయమన్నాడు. నేనూ మీలో ఒకడినేనన్నాడు. అలా ప్రజల్నినమ్మించి మందలో కలిసిపోయాడు. మరి పాలకుడై ఇన్నేళ్లు అయింది కదా? సామాన్యుల బతుకులేమైనా మరాయా? మరింత అణగారాయి. మరి మీ నేత కేసి ఓసారి చూడు. అంతకంతకు సంపన్నుడయ్యాడు. తన అనుచరులను కూడా సంపన్నులను చేశాడు. అయినవారికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నాడు. తెలుస్తోందా?''

''అవును గురూగారూ! మేం నెత్తిన పెట్టుకున్న మా నేత గోవు వేషం వేసుకున్న పెద్దపులని అర్థమైందండి. మీరు చెప్పిన కథలో కంటే  పులి మరింత క్రూరమృగమని తెలిసిందండి.  నిజం పులి కథే ఆసక్తిగా ఉందండి. ఇంకా చెప్పండి గురూగారూ...''

''అయితే విను. జనారణ్యంలోకి జొరబడి మారువేషంతో వేటాడుతున్న  నేత పులి ఇప్పుడు మరో మరో వేషం వేస్తోందిరోయ్‌. అదే పేదవాడి వేషం. పొద్దున, మధ్యాహ్నం కాస్తంత ఉప్మా, రాత్రి జావ తాగుతూ జీతం తీసుకోకుండా పని చేస్తున్న పేద అధినేతనని ప్రచారం చేసుకోవడం లేదూ? మరి  మాటల్ని గంగిగోవుల్లాగా నమ్మేస్తే ఏమవుతుంది. పులి పాచిక పారుతుంది. మరో సారి మందలో జొరబడి మొత్తం నాశనం చేసేస్తుంది. ఒక్కసారి నిదానించి ఆలోచిస్తే తెలిసిపోదూ, మీ నేత నిజంగా పేదవాడో కాదో. పేద అరుపులు అరుస్తున్న ఆయన చెప్పుల కేసి చూస్తే చాలదూ  మాటల్లో మతలబేంటో తెలియడానికి.  చెప్పుల ఖరీదుతో  నిరుపేద కుటుంబం ఏడాది పాటు కడుపు నిండా తిండి తినవచ్చని తెలిస్తే పులి బండారం బయటపడినట్టే కదా?  చెప్పుల ధర లక్షా 34 వేల రూపాయల పైమాటేనని పేపర్లతో చదవలేదా నువ్వు? మొసలి చర్మంతో తయారు చేసే  చెప్పులేసుకుని మొసలి కన్నీరు కారుస్తున్నదెందులో కాస్త ఆలోచిస్తే గోవులా మాట్లాడుతున్న పులి ఘాండ్రిపు వినపడదూ? ఆయన జేబులో పెట్టుకునే పెన్ను ఖరీదు లక్ష రూపాయలైతే, ఆయన తాగే మంచి నీటి సీసా ఖరీదు 5 వేల నాలుగు వందల పైమాటే. ఒకప్పుడు ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సిన స్థితి నుంచి ఈనాడు 9 చోట్ల విలాసవంతమైన భవంతులకు యజమానిగా మారాడంటే ఆవుల మందలో జొరబడి ఆవురావురుమంటూ ఎంత భోంచేస్తున్నాడో గ్రహించుకోవద్దూ? అయినా సొంత ఇల్లు కూడా లేదంటూ జాలిగా మాట్లాడుతుంటే  మాటల వెనుక మాయేంటో తెలుసుకోవాలా లేదా చెప్పు? ఇప్పుడు వేరే వాళ్లకి అధికారం అందిస్తే రాష్ట్రంలో ఒక్క పేదవాడు కూడా జీవించలేడంటూ వాగుతుంటే వాడి అసలు ఉద్దేశం ఏంటో కాస్తయినా బుర్ర పెట్టి ఆలోచించాలి కదా? ఇసుక, మద్యం, బియ్యం, గనులు, సెజ్లు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, పోర్టులూ అంటూ ఇలా ప్రతి దాన్నీ అయిన వారికి అప్పగించి వారి నుంచి కమీషన్లు దండుకుని లక్షలాది కోట్లను భోంచేస్తూ కూడా పైకి అమాయకంగా నవ్వుతుంటే,  నవ్వు వెనుక ఉన్న నిజస్వరూపాన్ని పసిగట్టాలా లేదా? బుర్రకెక్కుతోందా లేదా?''

''ఆహా...  అసలు పులి కథ భలే ఉందండీ.  ఇందులోంచి పిండుకోవలసిన పాఠమేంటో కూడా మీరే చెబుదురూ?''

''ఏముందిరా? రేప్పొద్దున ఎప్పటికైనా  నేతగా మారాలనుకుంటున్న నువ్వు ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో ముందుగా నేర్చుకోవాలంతే...''

''ఛీ... ఛీ...గురువుగారూ! నేను రాజకీయాలు నేర్చుకోవాలని వచ్చాను కానీ, ఇలాంటి నీచ, నికృష్ట, దగుల్బాజీ, దగాకోరు, దౌర్జన్య, దుండగ, దురంహంకార, దరిద్ర, బడాచోర్నాయకుడిగా మారాలనుకోవడం లేదండీ. మరిప్పుడు ఏం చేయాలో చెప్పండి...''

''అలా అయితే నీ అధినేత బండారాన్ని ఎప్పటికప్పుడు జనానికి అర్థం అయ్యేలా చెబుతూ వాళ్లని చైతన్యవంతుల్ని చేయాలి. అధికారం అందినా అందకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ప్రజల సమస్యలనే తన సమస్యలనుకుంటూ, వాటి పరిష్కారం కోసం తన సొంత సొమ్మును సైతం ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ముందుకు నడుస్తున్న నిజమైన నాయకుడిని గుర్తుపట్టి అతడి వెంట జనం సైన్యంలా నడిచేలా జాగృతం చేయాలి. మందలో మారువేషంలో తిరుగుతున్న పెద్దపులిని తరిమి తరిమి కొట్టేలా అమాయకమైన ఆవుల్లాంటి ప్రజలకు ధైర్యం నూరిపోయాలి. అదే నీకు స్వచ్ఛ రాజకీయంలో తొలి పాఠం. పోయిరా''

-సృజన

PUBLISHED ON 23.5.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి