పోలీసులా? పాలకుల తొత్తులా? నేతలు ఉసికొల్పితే ఉరికి, కసితీరా కరిచే శునక జాతి ప్రతినిధులా? శాంతియుత ప్రదర్శనలు చేసుకునేవారిపై విరుచుకుపడతారా? హత్యానేరం అభియోగంపై అరెస్టు కాకుండా ప్రయత్నించే నేతలను కంటికి రెప్పలా కాపాడుతారా? పాలక పార్టీవారిపై ఈగ వాలనివ్వరా? అన్యాయమని అడిగినవారిపై దౌర్జన్యాలకు తెగబడతారా? ఇదెక్కడి చోద్యం?...
ఇలాంటి విమర్శలన్నీ పోలీసు శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. అందరూ తర్జనభర్జనలు పడి చివరికి రాష్ట్రంలో పోలీసులకి ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడితో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
+++++++
వివిధ స్థాయుల్లోని పోలీసులను ఓ పెద్ద మందిరంలో సమావేశపరిచారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు గొంతు సవరించుకున్నాడు.
''మిత్రులారా! ఇది ఆంతరంగిక సమావేశం. ముందుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. స్వేచ్ఛగా సమాధానం చెప్పండి'' అన్నాడు.
''అడుక్కో...'' ఓ గొంతుక బొంగురుగా వినిపించింది వెనక కుర్చీల నుంచి.
నిపుణుడు గతుక్కుమన్నా తేరుకుని, ''మీరంతా సమాజానికి రక్షణ కల్పించే ఆదర్శవంతమైన ఉద్యోగంలో ఉన్నారు కదా? మరి శాంతిని పరిరక్షించాలంటే ఏం చేయాలి?'' అని ప్రశ్నించాడు.
''ఇరగదీయాలి!'' బుల్లెట్లా వచ్చిదొక సమాధానం.
''కుళ్లబొడవాలి!'' మరో కరకు గొంతు గట్టిగా అరిచింది.
''బూతులు తిడుతూ రెచ్చిపోవాలి'' ఇంకొ గళం గరగరలాడింది.
నిపుణుడు తెల్లబోయినా తేరుకుని, ''అదేంటి? అలా చేయడం తప్పు అనిపించడం లేదా?'' అన్నాడు.
''తప్పా? తొక్కా? అలా చేస్తేనే దార్లోకి వస్తారు ఎదవలు...'' అన్నాడో పోలీసు.
''అలా చేస్తే మీ మీద ప్రజల నుంచి విమర్శలు వస్తాయి కదా? అప్పుడు సిగ్గుగా ఉండదా?''
''సిగ్గా? ఎగ్గా? ప్రజలేమంటే మాకేటి? అధికారంలో ఉన్న నేతలు ముఖ్యం కాని...'' అన్నాడింకో ఖాకీ నిర్లక్ష్యంగా.
నిపుణుడికి ఏమనాలో అర్థం కాలేదు. అయినా చిరునవ్వు చెరగనీయకుండా, ''ఉదాహరణకు కొందరు నిరసన ప్రదర్శన జరపాలనుకున్నారనుకోండి. అది శాంతియుతంగా జరగడానికి మీరేం చేస్తారు?'' అని అడిగాడు.
''అసలా ప్రదర్శనే కదలకుండా కాళ్లిరగదీసి ఆపేస్తే పోద్ది. అప్పుడంతా శాంతియుతమే కద?'' అన్నడొక పోలీసు.
''మరి అలా ప్రదర్శన జరిపే వారు రైతన్నలో, మహిళలో అయితే వాళ్లతో సున్నితంగా వ్యవహరించాలి కదా?''
''సున్నితమా గుడ్డా? ఇయ్యన్నీ చూసుకుంటే డ్యూటీ చేయలేం. ఆడోళ్లయితే ఏంటంట? కొంగులుచ్చుకుని, జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చేయడమే. ఒసేయ్... ఎంటే వాగుతున్నావంటూ బూతులు లంకించుకుంటే సిగ్గుపడిపోయి ఆళ్లే పోతారు. ఇక రైతులైనా, ముసిలోళ్లయినా మాకొకటే... ఊరేగింపు సాగకూడదంతే...''
''అప్పుడు ఉద్రేకాలు మరింత చెలరేగుతాయి కదా?''
''ఆళ్ల ఉద్రేకాలు రేక్కుండానే కదా మేం చెలరేగేది? ఇక ఆళ్లంతా చెల్లాచెదురే...''
నిపుణుడు గొంతు పెగల్చుకుని, ''మిత్రులారా! కానీ అలా చేస్తే మీకే నష్టం కదా? బాధితులు మీమీదే కేసులు పెడితే?''
''ఏడిశారు. మామీద కేసు పెట్టడానికి వస్తే ఎవడు రాసుకుంటాడు? ఆళ్లు కేసు పెట్టడానికి బయల్దేరాని తెలియగానే స్టేషన్లో ఎవరూ లేకుండా చూసుకుంటాం. అందరూ ఏవేవో డ్యూటీల మీద బయటకెళ్లినట్టు చెప్పిస్తాం. ఒకేల ఆళ్లు అక్కడే బైఠాయిస్తే అర్థరాత్రి వరకూ అందుబాటులోకి రాం. ఆ పాటికి విసుగొచ్చి పోతారు. అయినా కూర్చున్నారనుకో, ఏదో మొక్కుబడికి కాగితం ముక్క రాసుకుంటాం. ఆనక దాన్ని చించి అవతల పారేస్తాం'' అన్నాడొక చురుకైన పోలీసు.
''అరె... చిత్రంగా ఉందే. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో, ఏమైందో రికార్డు చేయాలి కదా?''
''హ...హ...హా... నువ్వేదో ఎర్రోడివయ్యా. మా ఇలాకాలో ఎలా చేసినా అడిగే వారుండరు. దర్యాప్తు తూతూ మంత్రమే. రిపోర్టూ అంతే. ఆనక విషయం సద్దుమణిగాక ఫైల్ క్లోజ్ చేసేయడమే...'' అన్నాడో ముతక ఖాకీ.
నిపుణుడికి గొంతు తడారిపోయింది. కాసిని మంచినీళ్లు తాగి, ''మరి మీరిలా మీ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేస్తే పైనుంచి మీకు ఒత్తిడి ఉండదా?''
''పైనుంచి అంటే...?''
''అంటే... అదే... మీ ఉన్నతాధికారుల నుంచో, లేదా మంత్రులు, ముఖ్యమంత్రి, హోం మంత్రి లాంటి వాళ్ల నుంచో...''
ఒక్కసారిగా హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. కొందరు పోలీసులు బాన పొట్టలు పట్టుకుని మరీ నవ్వసాగారు. కొందరు కింద పడి దొర్లసాగారు.
''అ...హ...ది...కా...ద..హ...య్యా! అసలు పైవాళ్లు చెప్ప బట్టే కదా, మేం ఇలాంటి ఎదవ పనులు చే...హే..సే..హే...ది?'' అంటూ పోలీసులు నవ్వుతూనే సమాధానం చెప్పారు.
నిపుణుడిలో పట్టుదల పెరిగింది. ''అది కాదండీ... ఏ సంఘటన జరిగినా మీడియా అదీ ఉంటుంది కదా? వాళ్లు మీ దౌర్జన్యాన్ని ఫొటోలు, వీడియోలు తీస్తే ప్రజల ముందు పరువు పోదూ?'' అన్నాడు.
మరోసారి హాలంతా నవ్వులతో నిండిపోయింది. ఓ పోలీసు లేచి, ''నిరసన చేసేటోళ్లను తుక్కురేగ్గొట్టేప్పుడు మీడియో వాళ్లని కూడా చితగ్గొట్టి తరిమేస్తాంగా? ఆళ్ల కెమేరాలు పగలగొట్టేస్తాంగా?'' అన్నాడు వెకిలిగా నవ్వుతూనే.
''ఫొటోలు, వీడియోలు లేకపోయినా ప్రింట్ మీడియాలో వార్తలొస్తాయి కదా? అప్పుడు న్యాయస్థానాలు కూడా సూమోటో కేసు తీసుకోవచ్చుగా?'' అన్నాడు నిపుణుడు.
''ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే రాసుకుంటారు, మాకేంటి? మా పాలకుడి సొంత పేపరుందిగా? అందులో పెద్ద పెద్ద అక్షరాలతో వేరే విధంగా వార్తలొస్తాయి. ఇతర పత్రికలు రాసిదంతా అబద్దమని కథనాలుంటాయి. దాంతో ప్రజలు గందరగోళంలో పడిపోతారు. అంతే...'' అన్నాడొక పోలీసు ముసిముసిగా నవ్వుతూ.
''ఇక ఏ కోర్టయినా సూమోటో కేసందనుకో. ఆ జడ్జిల మీదనే మా అధినేతలు సుప్రీం కోర్టులో కేసెట్టగలరు. అంతటి ఘనుల పాలనలో మాకేటి ఢోకా?''అన్నడింకో పోలీసు నిర్లక్ష్యంగా.
వ్యక్తిత్వ నిపుణుడు బుర్రగోక్కున్నాడు. ఆపై టాపిక్ మార్చాలనుకుని, ''ఇదంతా సరే. ఇప్పుడు మీరెలా ప్రవర్తిస్తే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారో చెబుతాను. ఉదాహరణకి ఒక హత్యో, మానభంగమోలాంటి తీవ్రమైన నేరం జరిగిందనుకోండి. అప్పుడు ముందుగా మీరేం చేస్తారు?'' అనడిగాడు.
''ముందు ఆ నేరం చేసినోడు ఎవరో కనిపెడతాం. ఆ తర్వాత ఆడెవరి తాలూకానో తెలుసుకుంటాం...''
''నేరస్థుడు ఎవరైనా ముందుగా అరెస్టు చేయాలి కదా?''
''అబ్బే... ఆడు ఏ ఎమ్మెల్యే తాలూకానో, మంత్రిగారి అనుచరుడో, పాలక పార్టీ నేతల చుట్టమో అయితేనో? ఆనక ఎక్కడ లేని తలనొప్పులు. మమ్మల్ని బదిలీ చేయడమో, వీఆర్లో పడేయడమో చేస్తారు. అంచేత ఆడి జోలికెళ్లం. పైగా పైవాళ్లు చెబితే ఆడికే రక్షణ కల్పిస్తాం. మరెవర్నో కేసులో ఇరికిస్తామంతే...''
''అయ్యో... అలా అయితే బాధితులకి న్యాయం జరగదుగా?''
''పోతే పోద్ది. మాకు అన్యాయం జరగదుగా?''
నిపుణుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రూటు మార్చాలనుకుని, ''సరే... ఫ్రెండ్స్! మీరంతా సమాజంలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు మానవహక్కులు ఎంత బలమైనవో చెబుతాను...'' అన్నాడు.
''మానవ హక్కులు బలమైనవా? ఆటి కన్నా బలమైనవి మా దగ్గరున్నాయిగా?'' అన్నాడొక పోలీసు లేచి నుంచుని.
''ఏంటవి?''
''మా లాఠీలు! బూట్లు!!''
ఆ సమాధానానికి మరోసారి నవ్వులు చెలరేగాయి. వ్యక్తిత్వ నిపుణుడు చిన్నబోయాడు. అయినా తేరుకుని, ''మీ పరిధిలో మీరు ఇలా చేసినా చెల్లిపోతుందేమో. కానీ మీ కంటే పెద్దవైన కేంద్ర దర్యాప్తు సంస్థలు అవీ ఉన్నాయిగా? వాళ్లు జోక్యం చేసుకుంటేనో?'' అన్నాడు.
''ఆళ్లు అడుగు ముందుకేయగలరేంటి? ఏ హత్య కేసులో నిందితుడినో అరెస్టు చేయడానికి ఏ సీబీఐ వాళ్లో వచ్చారనుకోండి. ఆళ్లకి ముందుగా మేమే ఉప్పందిస్తాం. దాంతో ఆడి అనుచరులంతా ఆడింటి చుట్టూ బైఠాయిస్తారు. సీబీఐ వాళ్లు అరెస్టు చేయడానికి వచ్చినా ఎక్కడా దారీ తెన్నూ ఉండదు. మేం శాంతిభద్రతల పేరు చెప్పి ఆడి అనుచరుల మానవ హక్కులు పరిరక్షిస్తాం. అవసరమైతే ఆళ్లకి టిఫిన్లు, కాఫీలు అందిస్తాం. కళ్ల ముందు ఏం జరుగుతున్నా బొమ్మల్లాగా చూస్తూ ఉండిపోతాం. అంతే...'' అన్నాడొక పోలీసు చాలా చులాగ్గా.
నిపుణుడు ఈసారి మరో మార్గంలో ముందుకెళ్లడానికి ప్రయత్నించాడు.
''ఫ్రెండ్స్! మీ చర్యల వల్ల, మీ ప్రవర్తన వల్ల మీ రాష్ట్రాన్ని పాలించే అధినేతకి ఎంత అప్రతిష్ట వస్తుందో గ్రహించారా? అది ఆయనకి నామర్దా కాదా? అందువల్ల మీరు మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని మీకు అనిపించడం లేదా?'' అనడిగాడు.
అప్పుడు తల పండిపోయిన ఓ పెద్ద వయసు పోలీసు లేచి ఘాటుగా మొదలెట్టాడు.
''ఊరుకోవయ్యా బాబూ. నువ్వెక్కడి పెర్సనాలిటీ డెవలపర్వయ్యా? అసలు ఆ అధినేత మీదే సవాలక్ష కేసులున్నాయని తెలియదా? లక్షల కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులకు సంబంధించిన నేరారోపణలు ఉన్నాయని తెలుసుకోలేదా? ఆ కేసులన్నింటికీ ఓ కొలిక్కి తేడానికి కోర్టులే కిందా మీదా పడుతున్నాయని చదవడం లేదా? ఇక ఇక్కడి అమాత్యుల మీద కూడా బోలెడన్ని కేసులు అతీగతీ లేకుండా పడున్నాయని అర్థం చేసుకోలేవా? అధినేత మనుషులు, అమాత్యులు అనుచరులు ఎక్కడికక్కడ అవినీతిని అందలం ఎక్కిస్తున్నారని గ్రహించలేవా? అన్నింటిలోనూ వాటాల రాజకీయం రాజ్యమేలుతోందని తెలియలేదా? నువ్వు చెప్పదలుచుకున్న వ్యక్తిత్వ వికాస పాఠాలు ఏమైనా ఉంటే వాళ్లకి చెప్పుకోవయ్యా. ఆళ్ల పాలనలో కిక్కురుమనకుండా మా ఉద్యోగాలు మేం బిక్కుబిక్కుమంటూ చేసుకునే మా మీద పడతావేంటి?'' అంటూ సమావేశంలోంచి వెళ్లిపోయాడు. ఆయన వెనకు అందరూ ఒకొక్కరుగా జారిపోయారు.
ఆఖరికి వ్యక్తిత్వ వికాస నిపుణుడు మాత్రమే మిగిలాడు. అతడు డైరీ తెరిచి ఓ కొత్త సూత్రం రాసుకున్నాడు.
''పాలకులు మారనంత వరకు ఈ రాష్ట్రం గతి ఇంతే!'' అని!
-సృజన
PUBLISHED ON 30.5.2023 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి