ఆదివారం, జూన్ 18, 2023

జై జగదేక వీరా!

ఓ ఆదివారం మా నాన్నగారు నన్ను పిలిచి ''ఒరేయ్‌! జగదేక వీరుడు సినిమా బాగుంటుందిరా. పోయి చూసిరా'' అని మూడు రూపాయలు చేతిలో పెట్టారు. ఇంకేముంది? ఆనందమే ఆనందం. అప్పుడు నేను బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో వెలగబెడుతున్నా. ఇది డెభ్బైల నాటి మాట.  విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉండేవారం. నాన్నగారు అక్కడి జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌. మంచి సినిమాలు వస్తే తీసుకెళ్లడమో, లేదో నన్ను పంపించడమో చేసేవారు. అప్పటికే గోడల మీద పోస్టర్లు చూశాను. ఎన్టీఆర్‌ రాకుమారుడిలా భలే ఉన్నాడనుకున్నా. సైకిల్‌ మీద పోస్టర్లు అతికించే వాడొస్తే వాడెనకాల మా పిల్లకాయలం పరిగెత్తేవాళ్లం. వాడు పోస్టర్‌ తీయడం, దాని వెనక్కి తిప్పి జిగురు రాయడం, దాన్ని గోడ మీద అతికించడం ఆసక్తిగా చూసేవాళ్లం. కాసేపు ఆ పోస్టర్‌ని, దాని మీద హీరో హీరోయిన్లనీ చూసి మురిసిపోతూ ఉండేవాళ్లం. 'జగదేక వీరుడు' సినిమా గురించి నాన్నగారిని అడగాలనుకుంటుంటేనే, ఆయనే లెక్కలతో కుస్తీ పడుతున్నట్లు నటిస్తున్న

 నా దగ్గరకి వచ్చి మూడు రూపాయలిచ్చి సినిమాకి పోయిరా అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మనసులో కెవ్వుకేక కదూ! వెంటనే మనం పుస్తకాలు పక్కకి తోసేసి పరుగో పరుగు. మా ఇంటి వీధి చివరే శ్రీనివాస్‌ థియేటర్‌. అప్పట్లో రిజర్వుడు టికెట్‌ మూడు రూపాయలు ఉండేది. అంటే బాల్కనీ అన్నమాట. నేల టికెట్‌ అర్థరూపాయి. 

చోడవరంలో రెండు థియేటర్లు మా ఇంటికి బాగా దగ్గర్లో ఉండేవి. ఒకటి శ్రీనివాస్‌ అయితే, రెండోది పూర్ణా థియేటర్‌. రెండు థియేటర్ల ఓనర్ల కొడుకులు నానాజీ, రాజాజీ. ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. పొద్దున్నే మా ఇంటికి ట్యూషన్‌కి కూడా వచ్చేవాళ్లు. వాళ్లు ఇంటర్మీడియట్‌ అన్నమాట. 

మనం ఆయాసపడుతూ థియేటర్లో టికెట్‌ కౌంటర్ దగ్గరకి నడుస్తుంటే, ''ఏం బాబూ? సినిమాకొచ్చావా?'' అంటూ వెనక నుంచి నానాజీ పలకరించాడు. 

''అవును''

''పోయి కూర్చో. టికెట్‌ అక్కర్లేదులే'' 

''మా నాన్నగారు డబ్బులిచ్చారు''. మనం కొంచెం టెక్కు చూపించామన్నమాట. నానాజీ నవ్వి అక్కడున్న ఓ థియేటర్‌ పనోడిని పిలిచి, ''ఇదిగో. ఈ కుర్రాడిని రిజర్వ్‌డులో కూర్చోబెట్టు'' అన్నాడు. వాడు నన్ను తీసుకుని అంత పనీ చేశాడు. 

ఎప్పుడైనా నాన్నగారు, అమ్మ, నేను ఈ రెండు థియేటర్లలో దేనికైనా వెళితే నానాజీ, రాజాజీ ఆ సమయానికి అక్కడ లేకపోయినా, థియేటర్‌ ఓనర్లు కానీ, మేనేజర్లు కానీ చూస్తే గుర్తు పట్టి టికెట్‌ తీయనిచ్చే వాళ్లు కాదు. ఒకవేళ ఎవరూ గమనించనప్పుడు నాన్నగారు టికెట్లు కొన్నా మేం థియేటర్లో కూర్చున్న కాసేపటికి ఏ మేనేజరో వచ్చి నాన్నగారికి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసే వాడు. అంతే కాదు, ఇంటర్లెల్లో కూల్‌డ్రింకులు, సమోసాలు వచ్చేసేవి. అదంతా నాకెంతో గొప్పగా ఉండేదన్నమాట. 

నేను వెళ్లి రిజర్వ్‌డ్‌ క్లాసులో కూర్చున్న కాసేపటికి సినిమా మొదలైంది. ఇక మనం ఆ జానపద కథా లోకంలోకి వెళ్లిపోయాం. చిలిపి దెయ్యాలు, అప్సరసలు, జలకాలాటలు, ఎన్టీఆర్‌ సాహసాలు... ఏమని చెప్పాలి? ఓ అద్భుత ప్రభావం. 'హళా... వారుణీ', 'హళా... సఖీ' అనే పిలుపులకి, ఆ  మాటలకి మనం ఫ్లాట్‌. ఆ వయసుకి నాకు హీరోయిన్ల పేర్లు తెలియవు. దేవకన్యలంతే. అందులో రాజనాల అన్నట్టు... 'నా తెలివి పనిచేయడం మానేసింద'న్నమాట. 'ఒసే.. ఏమే... ఏమిటే...' అంటూ పలికే ఇంద్రకుమారి ముద్దు మాటలకి ముచ్చట పడిపోయా. నాగకుమారి నృత్యానికి మైమరచిపోయా. 'ఓం ఏకోనేకోహమస్మి' మంత్రం ఆ తర్వాత చాలా కాలం నన్ను వదలనే లేదు. 

ఇక పాటలు? 

'అయినదేమో అయినది ఇక గానమేలే ప్రేయసీ...'

'ఇది మోహన రాగమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే...'

'ఓ చెలీ ఓ సఖీ ఒహో మదీయ మోహినీ...' 

ఆ పాటలు చూస్తూ  ఆ నటీనటుల భావాలతో మమేకమైపోయా. 

'రారా కనరారా... కరుణ మానినారా... ప్రియతమలారా...' అంటూ ఎన్నీఆర్‌ పాడుతుంటే మన గుండె కూడా బరువెక్కిపోయింది. 

ఒకడు ఐదుగురై, ఏక కాలంలో వాయిద్యాలన్నీ వాయిస్తూ ఎన్టీఆర్‌ పాడే 'శివశంకరీ... శివానంద లహరి...' పాటకి పులకించిపోయా. 

మొత్తానికి సినిమా అయిపోయినా ఆ మత్తులోనే తేలియాడుతూ, కాళ్లీడ్చుకుంటూ చెల్లా శీనుగాడి ఇంటి అరుగు మీద కూలబడ్డా. 

ఫ్రెండ్స్‌ చేరారు. మనం మొదలెట్టాం. ''ఒరేయ్‌. జగదేకవీరుడు మ్యాట్నీకెళ్లారా. సినిమా ఉందిరా...'' అంటూ కబుర్లు మొదలు. 

''భలే వెళ్లావురా, మొదటి రోజే' అంటూ వాళ్లు చుట్టూ మూగారు.

అప్పుడే... మనకొక ఐడియా తళుక్కుమంది. 

''ఒరేయ్‌. ఫస్ట్‌ షోకి పోదామా'' అన్నా హుషారుగా. 

''ఎలారా. డబ్బుల్లేవుగా'' అన్నారు వాళ్లు దిగులాగా.

''నా దగ్గర ఉన్నాయిగా'' అంటూ జేబులోంచి మూడు రూపాయలు చూపించా. నాన్నగారు డబ్బులివ్వడం, నానాజీ లోపలికి పంపిచేయడం అంతా చెప్పా. చుట్టూ జట్టుగాళ్లు నాతో కలిపి ఆరుగురు. 

''ఒరేయ్‌. నేలకి పోదాంరా'' అంటూ నేను మళ్లీ పరుగు. నా వెనకాలే వాళ్లూనూ. అందరం కలిసి అర్థరూపాయి వంతున ఆరు టిక్కెట్లు కొనుక్కుని నేలలోకి దూరిపోయాం. అంటే నేను ఒకే రోజు మ్యాట్నీ, ఫస్ట్‌ షో చూసేశానన్నమాట. 

రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి చేరేసరికి, ''ఏరా, మ్యాట్నీ అయిదున్నరకే అయిపోతుందిగా? ఇంత సేపు ఏం చేశావ్‌?'' అనడిగితే, 

''ఆడుకొని వచ్చా'' అని చెప్పేశా! ఆ తర్వాత ఆ సినిమా వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ టీవీల్లో వస్తే చూడడమే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి