'ఏంటయ్యా సెక్రట్రీ... చెమటలు కక్కుతున్నావ్? ఏంటి సంగతులు?'
'నెమ్మదిగా అడుగుతారేంటండి బాబూ? అవతల కొంపలారిపోతుంటేను...'
'చూడు సెక్రట్రీ... ఈ కొంపలారిపోవడాలు, కొంపలంటుకుపోవడాలు మనకి ఆనవయ్యా. ఎందుకంటే, అంటించేదీ ఆర్పేదీ మనమే కద? ఆటికింత కంగారు పడిపోవడం దేనికి?'
'అలాగా సార్. మరి తమరికి ఆనే విషయాలేంటో చెప్పండి, తెలుసుకుంటాను...'
'ప్రజానీకం చైతన్యవంతులవుతున్నారను... ఉలిక్కి పడతాను. జనం నిజాలు తెలుసుకుంటున్నారను... బెంబేలు పడతాను. సామాన్యులు తెలివి మీరుతున్నారను... కంగారు పడతాను. ప్రజలు మేలుకుంటున్నారను... బేజారిపోతాను. అంతకు మించిన ఘోరాలు ఏముంటాయయ్యా? తతిమ్మావన్నీ మనం చేసేవేకద?'
'అయ్యా... అయితే ఇప్పుడు ఉలిక్కిపడి, బెంబేలు పడి, కంగారు పడిపోయి, బేజారైపోయే పరిస్థితే వచ్చిందండి మరి. అందుకే ఆదరాబాదరా మీ దగ్గరకి ఉరుక్కుంటూ వచ్చాను. తమరేమో నిదానంగా వాకబు చేస్తున్నారు...'
'అరె... అవునా? అదేంటి.. మొన్ననే కదయ్యా మన పరిపాలన గురించి నానా అబద్దాలాడతా ప్రసంగించాను? నిన్ననే కదయ్యా మన పథకాలను ఊదరగొట్టి ఉపన్యాసం దంచాను? వెళ్లిన ప్రతి చోటా మన గొప్పలు చెప్పడం, ఎగస్పార్టీవోళ్లని ఎక్కడలేని తిట్లతో ఆడిపోసుకోడం చేస్తూనే ఉన్నాను కదయ్యా. ఇంతట్లోకి ఏమైందయ్యా?'
'ఏమవుతుందండీ, ఆ సినిమాలాయన లేడండీ? సిసింద్రీ అండి బాబూ. సీమ టపాకాయ కూడానండి. ఆయన చైతన్య రథం ఎక్కేసి మీటింగులు పెట్టేస్తున్నాడండి. జనం విరగబడిపోతన్నారటండి. అడుగడుగునా బ్రహ్మరథం పట్టేస్తున్నారటండి. ఆయనేమో తమరు చేసే ఎదవపన్లన్నీ ఏకరవు పెట్టేస్తున్నాడండి. మీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అవకతవకల గురించి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టేస్తున్నట్టు వివరించేస్తున్నాడండి. ఇహ... జనం ఊగిపోతున్నారండి. ఒకటే ఈలలు, చప్పట్లటండి. మన ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు చెబుతుంటే గుండె గుబేలు మంటోందండి. ఆయ్...'
'వార్నీ... అయితే యవ్వారం చాలా దూరం వచ్చిందన్నమాట. మరి మన పోలీసు కుక్కలేం చేస్తున్నట్టు?'
'అయ్యా... ఎన్నికలు రాబోతున్నాయి కదండీ? పూర్వంలాగా మరీ ఆంక్షలు అవీ పెట్టేస్తే మొదటికే మోసం వస్తుందని గమ్మునున్నారండి. ఈలోగా తమరి ప్రచారం మత్తులో ప్రగతేదో జరిగింది కాబోసనుకుని కునికిపాట్లు పడుతున్న జనం మేలుకుని నిజానిజాలేంటో కానుకుంటున్నారండి. పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందండి మరి...'
'మరైతే మన గూండాలేం చేస్తున్నారయ్యా?'
'ఏం గూండాలండి బాబూ. ఆయన ఎక్కడ సభ పెట్టినా అక్కడ మన గూండాల చరిత్రంతా విప్పి చెప్పేస్తున్నాడండి. మన ఎమ్మెల్యేలు, ఎంపీల తాతల కాలం నాటి అకృత్యాలను కూడా బయటపెట్టేస్తున్నాడండి. మనోళ్లు ఎక్కడెక్కడ ఎలా జనం నోళ్లు కొట్టి లక్షల కోట్లు దండుకుంటున్నారో లెక్కలతో సహా సినిమా చూపించేస్తున్నాడండి. రేషన్ బియ్యం మాఫియా లోతెంత, ఇసుక మాఫియా ఎత్తెంత, గంజాయి మాఫియా వెడల్పెంత, గనుల మాఫియా పొడవెంత, మద్యం మాఫియా వైశాల్యమెంత, డ్రగ్స్ మాఫియా ఘనపరిమాణమెంత, మట్టి మాఫియా గుట్టెంత, ముడుపుల యవ్యారం చుట్టుకొలతెంత... ఎక్కడికక్కడ వెల్లడించేస్తున్నాడండి బాబూ...'
'పర్లేదయ్యా గాబరా పడకు. మాఫియా, అవినీతి గురించి ఎంత చెప్పినా జనానికి ఎక్కదయ్యా. ఏ రోజుకారోజు కాయకష్టం చేసుకుంటా, కాస్తో కూస్తో సంపాదించుకుంటా, పెళ్లాం బిడ్డల్ని చూసుకుంటా బతుకులీడుస్తున్న సామాన్యులకి ఎవడో ఎక్కడో ఏదో దోచుకుంటున్నాడంటే పట్టదయ్యా. అందుకేగా మనం ఏవేవో పధకాల పేరు చెప్పి ఆళ్లక్కూడా కాసిని ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నదీ?'
'అయ్యా... తమరు వాటి మీద ఎసరు పెట్టుకుని కూర్చుంటే చెల్లేలా లేదండి. పధకాల ద్వారా వేసేదెంతో అంతకు వంద రెట్లు సొమ్ములు దొడ్డిదారిన తమరు ఆళ్ల దగ్గర్నుంచి ఎలా గుంజుకుంటున్నారో, జెల్లకొట్టి మరీ లాక్కుంటున్నారో, ముందు జేబులో పది రూపాయలు పెడుతూనే, వెనక నుంచి పర్సు ఎలా కొట్టేస్తున్నారో కూడా ఆయన రథం మీద నుంచి చులాగ్గా చెప్పేస్తున్నాడండి. మరి తమరి హయాంలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో, బస్సు టికెట్ ధరల్ని ఎలా ఎగసనదోసారో, అడ్డమైన చెత్త పన్నులు ఎలా విధిస్తున్నారో, నిత్యావసర సరుకుల ధరలు ఎంతలా పెంపు చేశారో, ఇల్లు కట్టుకునే ఇసుక కూడా దొరక్కుండా ఎలా చేశారో, మద్యం రేట్లు ఎలా పెంచేశారో, పెట్రోలుపై సెస్సులు అవీ ఎలా దండుకుంటున్నారో, ఎందులోంచి ఏం చేస్తామంటూ ఎలా లాక్కుంటున్నారో, అలా గుంజుకున్న సొమ్ముతో చేస్తామన్నది చేయకుండా ఎలా లెక్కా జమా లేకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నారో విడమర్చి మరీ వివరించేస్తున్నాడండి. తమరు పధకాల ద్వారా వేసేదంతా కలిపినా ఏడాది పాటు కరెంటు బిల్లులకి కూడా సరిపోదని నిగ్గదీసే నిజానిజాలు వెల్లడించేస్తున్నాడండి. అంచేత తమరు జాగ్రత్త పడాలండి మరి...'
'ఈమాత్రం దానికే హడావుడెందుకయ్యా. వెర్రిజనమేమన్నా లెక్కలడగ్గల్రా? మనమేమన్నాచూపిస్తామా? విషయం అంతదాకా వస్తే మన అనుచరులు, నేరగాళ్లు, దుండగుల సైన్యం ఉంది కదయ్యా. వాళ్లని ఉస్కో అంటే సరి...'
'అయ్యా... అక్కడ జరుగుతున్న చైతన్యం తెలియక తమరిలా నింపాదిగా ఉన్నారండి. తనని చంపడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆయన పసిగట్టేశాడండి బాబూ. దాన్ని కూడా జనానికి చెప్పేస్తున్నాడండి. మరి తమరి జమానాలో నేరాలు, ఘోరాలు ఇన్నీ అన్నీనా చెప్పండి? ఓ పక్క మహిళలపై దౌర్జన్యాల్లో మనం జాతీయస్థాయిలోనే పేరు పడ్డామాండీ? మరో పక్క మన పార్టీవోళ్లంతా ఎక్కడికక్కడ రెచ్చిపోయి కబ్జాలు, దారుణాలు చక్కబెడుతున్నారాండీ? పేదోళ్లకిచ్చిన అసైన్డ్ భూముల్ని కూడా ఆక్రమించేసుకుని తవ్వేసుకుంటున్నారాండీ? అదేంటని అడిగిన వాళ్ల మీద ఎదురు కేసులు పెడుతున్నారాండీ? పోలీసులకి చెప్పుకున్నా దిక్కులేని విధంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించారాండీ? మొత్తానికి హోల్సేల్గా హోలాంధ్రా అంతా నేరాంధ్రాగా ఎలా మారిపోయిందో కూడా ఆయన నూరిపోసేస్తున్నాడండి. లా అండ్ ఆర్డర్ అంతా ఎలా మీ అండ్ మీ గ్యాంగ్ ఆర్డర్‌గా మారిపోయిందో ఎంచక్కగా బోధపరుస్తున్నాడండి. అవతల ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటే, ఆయన ఆవేశం ఆయుధంగా రూపుదిద్దుకుంటుంటే, ఆయన నిజాయితీ నిజాల నిగ్గు తీస్తుంటే, ఆయన చైతన్యం జనంలోకి ప్రవహిస్తుంటే, ఆయన ఉపన్యాసాలు జనం మత్తు వదిలిస్తుంటే... మీరు మాత్రం మీ ముతక రాజకీయ, చచ్చు పుచ్చు తెలివితేటలతో ధీమాగా ఎలా ఉండగలుగుతున్నారండి బాబూ? ముందు మీరు మీ అధికార మైకంలోంచి బయటకి రండి బాబూ.. మీరిలా ఊరుకుంటే అది కూడా ఊడేట్టుంది మరి'
'హ...హ...హ్హా సెక్రట్రీ... నిన్ను, నీ కంగారునీ నేనర్థం చేసుకోగలనయ్యా. కానీ నువ్వే నా నిజ స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నావు. నేనేమన్నా వెర్రిబాగులోడిననుకుంటున్నావా? అధికార పీఠంపై అడ్డంగా బాసింపట్టు వేసుకుని కూర్చున్నవాడిని. అడ్డగోలుగా వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని తోలుబొమ్మలాట ఆడిస్తున్న వాడిని. ఇంత చేసినోడిని ఎన్నికల్లో కకావికలు చేయకుండా వదుల్తానా? ఇంటికో గూఢచారిలాగా మన ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేయలేదంటావా? ఆళ్లని ప్రజాధనంతోనే పెంచి పోషించలేదంటావా? ఆళ్ల సాయంతో ఎవరెవరు మనకి అనుకూలంగా ఉన్నారో, ఎవరెవరు ఎగస్పార్టీ వైపు చేస్తున్నారో గ్రహించలేననుకున్నావా? ఓటర్ల జాబితా సవరణ పేరు చెప్పి లక్షలాది ఓట్లను గల్లంతు చేయలేదనుకుంటున్నావా? కొత్త జాబితాలో దొంగ ఓటర్లను చొప్పించలేదంటావా? మన మాటలకి తలూపని ప్రతి వాడినీ ఎలాగోలా వేధించలేననుకుంటున్నావా? మనమేంటో, మనకి ఎదురు తిరిగితే ఏమవుతుందో ఈ పాటికి జనానికి అర్థం కాలేదనుకుంటున్నావా? ఎన్నికల్లో ఓటుకి నోటు చూపించి వెర్రి జనాన్ని ఊరించలేననుకుంటున్నావా? మందు ప్యాకెట్ చూపించి చేపకి ఎరవేసినట్టు ఆకర్షించలేననుకుంటున్నావా? పోలింగ్ బూత్లను ఆక్రమించుకుని ఎన్నికల అధికారులను పక్కన కూర్చోబెట్టి మనోళ్ల చేత మనకే ఓట్లు వేయించి రిగ్గింగ్ చేయించలేనుకుంటున్నావా? అవసరమైతే ఓటింగ్ యంత్రాలనే ఏమార్చలేననుకుంటున్నావా? ఎలాగోలా చెలరేగిపోయి తిరిగి నేనే అధికారంలోకి రాలేననుకుంటున్నావా? అమాయకుడా... కాబట్టి ఊరికే బెంబేలు పడకుండా నిబ్బరంగా ఉండు. తెలిసిందా?'
'అయ్యా... మీ నీచ, నికృష్ట, అధికార దురంహంకార, దారుణ, దౌర్జన్య, దుండగ, దుర్జన, దురిత, దుష్ట విధానాలు తెలియని వాడిని కాననుకోండి. కానీ జన చైతన్యాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయకండి. అది కానీ జాగృతమైతే కార్చిచ్చు అడవుల్ని కాల్చేసినట్టు, సునామీ తీరాల్ని ముంచెత్తినట్టు, భీకర తుపాను వేళ్లూనుకున్న చెట్లను సైతం పెకలించినట్టు, భయంకర సుడిగాలి సర్వాన్నీఊడ్చేసినట్టు, చలి చీమల శక్తి మహా సర్పాన్ని కూడా మట్టుబెట్టినట్టు... మీ అధికార అతివిశ్వాసాన్ని ఎండుటాకులా ఎగరగొట్టవచ్చు. మీ సెక్రటరీగా మీకు నేనిచ్చే ఆఖరి సలహా ఇదే. ఇక వస్తా'
-సృజన
PUBLISHED ON 21.6.2023 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి