అవి నేను రెండో తరగతి చదువుతున్న రోజులు. పడవెక్కి గోదావరి దాటడం, ఏడుస్తూ ఇంటికి రావడం గుర్తొస్తోంది.
అరవై దాటిన వయసులో అలనాటి చిన్నతనం జ్ఙాపకాలను తోడుకోవడం భలే బాగుంటుంది. ఎవరి బాల్యం వారికి తీపే. చిత్రమేమిటంటే ఇతరుల చిన్నప్పటి సంగతులు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. వాటితో తమ బాల్యాన్ని తడిమి చూసుకుంటారంతా. మేమప్పుడు కోటిపల్లిలో ఉండేవాళ్లం. నాన్నగారు అక్కడ హైస్కూల్ హెడ్మాస్టర్. మనం ఎలిమెంటరీ పిలగాడినన్నమాట. కోటిపల్లి అనగానే ఎన్ని జ్ఙాపకాలో! సంబరంలో జీళ్లు, సోమేశ్వరాలయం, ఆలయం ఎదురుగా చెరువు, ఆ చెరువులో పెద్ద పెద్ద తాబేళ్లు, నా జలగండం...అబ్బో, చాలా!
ఓసారి మా అయిదో మావయ్య మా ఇంటికొచ్చాడు. అవడానికి మావయ్యే కానీ వయసు నాకన్నా అయిదారేళ్లే ఎక్కువ. అంటే మనం పిలగాడినైతే, వాడు కుర్రగాడన్నమాట. పేరు బాబ్జీ. ఎప్పుడూ మావయ్యా అని పిలిచింది లేదు. 'ఒరేయ్ బాబ్జీ...' అనే.
బాబ్జీ మావయ్య ఇంటికొస్తే నాకెంతో సంబరం. ఎక్కడెక్కడికో తిప్పుతాడని. ఓ సాయంత్రం ఆ పనే చేశాడు.
'ఒరేయ్ గోదారొడ్డుకి వెళదాంరా...' అన్నాడు. మనం కాదనేదేముంది? ఇద్దరం కలిసి పోయాం. అక్కడ జీళ్లు కొనుక్కున్నాం. కోటిపల్లి జీళ్లకి ప్రసిద్ధి. వాటి రుచే వేరు. సాగుతున్న ఆ జీళ్లను బుగ్గన పెట్టుకుని పాకం పీల్చుకుంటూ గోదారొడ్డుకి వెళ్లాం. అక్కడ అటూ ఇటూ తిరిగే పడవలు ఉన్నాయి.
'ఒరేయ్... పడవెక్కుదామేంట్రా?' అన్నాడు మెరుస్తున్న కళ్లతో బాబ్జీ.
నాకు ఓ పక్క హుషారు, మరో పక్క భయం.
'అమ్మో... ఇంట్లో తెలిస్తే?' అన్నాన్నేను సంకోచంగా.
'ఏం కాదులే. అరగంటలో వచ్చేస్తాంగా...' అంటూ బాబ్జీ జేబులో డబ్బులు చూసుకున్నాడు.
మొత్తానికి ఎక్కేశాం. అదొక నాటు పడవ. పెద్ద తెరచాప. అందరూ దానిలో అడ్డంగా వేసిక చెక్కలపై కూర్చున్నారు. మేం కూడా ఓ చెక్కపై కూర్చున్నాం. నేను కాస్త ఒంగుని చెయ్యి చాపితే అందుతున్న గోదావరి నీళ్లు. నేను ఆ కెరటాలపై నా చిట్టి చేతులు ఆడిస్తుంటే పడవ వాడు చూశాడు.
'ఏయ్... వంగకు...' అంటూ గదమాయించాడు. తర్వాత మమ్మల్ని చెక్కల మీద నుంచి దింపేసి పడవలో కింద కూర్చోబెట్టాడు. మనం బిక్కమొహం వేశాం.
పడవ బయల్దేరింది. బహుశా కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం అనుకుంటా. ఆ వయసులో ప్రయాణం గుర్తుంటుంది కానీ, తీరాల పేర్లేం తెలుస్తాయి?
పడవ అంచు మీద నడుస్తూ ఒకడు పెద్ద గెడకర్రను నీళ్లలోకి దింపి తోశాడు. పడవ ముందుకు కదిలింది. కాపేపలా తోశాక గెడ తీసేశాడు.
'ఇక గెడ వెయ్యడు...' అన్నాడు బాబ్జీ.
'ఏం?'
'గెడకి లోతు అందదు. ఇక్కడ గోదారి ఎంత లోతుంటుందో తెలుసా?'
'ఎంత?'
'ఎంతంటే... రెండు మూడు తాటిచెట్లంత!'
'అంటే?'
'అంటే... తాటిచెట్లను ఒకదాని మీద ఒకటి పెట్టామనుకో, ఎంత ఎత్తుంటుంది? గోదారి అంత లోతుంటుందన్నమాట...'
బాబ్జీ పరజ్ఙానం నా బుల్లి మనసులో ఏదో గుబులు రేపింది.
'ఇంటికెళిపోదాం..' అన్నాన్నేను భయంగా.
'ఇప్పుడెలా? ముందు అవతలి తీరం చేరాలి. ఆ తర్వాత మళ్లీ ఇదే పడవపై తిరిగి రావాలి'
మొత్తానికి అవతలి తీరం చేరాం. అక్కడికెళ్లేసరికి సాయంత్రం అయిపోయింది. ఏవో బిస్కట్లు కొన్నాడు బాబ్జీ. నాలో బెంగ వల్ల అవి ఆనందాన్ని ఇవ్వలేదు. మళ్లీ పడవ బయల్దేరేసరికి చీకటి చిక్కనైంది. నా గుండెల్లో గుబులు పెరిగిపోయింది. పైకి చూస్తే నల్లని ఆకాశం. మినుకుమినుకుమంటున్న నక్షత్రాలు. చుట్టూ చూస్తే గోదావరి కూడా చిక్కని చీకటిలా కనిపించింది. పడవకి ఒరుసుకుంటున్న అలల సడి తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. పడవలో ఓ పక్క గుడ్డి లాంతరు. ఆ గంభీరమైన వాతావరణంలో మన పసి మనసు బావురుమంది.
ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాను.
'ఇంటికెళిపోదాం..ఊ...ఊ....ఊ...' వెక్కిళ్లు మొదలు.
'ఉష్... వెళుతున్నాంగా? ఏడిస్తే పడవ వాడు ఊరుకోడు...' బాబ్జీ బెదిరింపుతో కూడిన ఓదార్పు.
నా ఏడుపు విని పడవ వాడు వచ్చాడు.
'ఎందుకేడుస్తున్నావ్ బాబూ?' అన్నాడు.
'పడవ కదలడం లేదెందుకు?'
'కదుల్తోందిగా?'
'లేదు. వచ్చేప్పుడు మీరు తెడ్లు వేశారు. మరి ఇప్పుడు వేయడం లేదేం?'
మనం ఏడుస్తూ వెలిబుచ్చిన సందేహానికి పడవ వాడితో పాటు, అందులో ఉన్న మిగతావాళ్లు కూడా నవ్వేశారు.
'ఓ... అదా. వచ్చేటప్పుడు ఎదురు. ఇప్పుడు వాలు' అన్నాడు పడవవాడు.
నా కన్నీళ్లు తుడుస్తూ బాబ్జీ వివరించాడు.
'వచ్చేటప్పుడు గోదారికి ఎదురొచ్చామన్న మాట. అప్పుడు తెడ్లు వేస్తే కానీ పడవ కదలదు. ఇప్పుడు అక్కర్లే. కెరటాల వాలుకి తెరచాప సాయంతో వెళిపోతాం' అంటూ బాబ్జీతో పాటు మిగతా వాళ్లు కూడా అనునయించారు. 'ఏడుపాపెయ్...' అన్నారంతా.
నా వెక్కిళ్ల మధ్య ఎలాగైతేనేం, కోటిపల్లి వచ్చేశాం. నెమ్మదిగా పడవ దిగాం.
దూరంగా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టుతో నాన్నగారు. ఆయన చేతిలో బ్యాటరీ లైటు.
నేను ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నగారిని వాటేసుకున్నా. నా వెనక బాబ్జీ మావయ్య బితుకుబితుకుమంటూ వచ్చాడు.
బాబ్జీ చేతికందేంత దగ్గరగా రాగానే నాన్నగారు టెంకిజెల్ల పీకారు. బాబ్జీ కూడా బేరుమన్నాడు. నాకూ పడ్డాయి నడ్డిమీద.
ఇక ఇంటికొచ్చాక అమ్మ, నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకొచ్చారు. ఎక్కువగా బాబ్జీ మావయ్యకే.
వాళ్ల తిట్లలో ఇప్పుడు నాకు పెద్దవాళ్ల బెంగలూ, భయాలూ కనిపిస్తున్నాయి. వాటి వెనక కొండంత ప్రేమ, ఆప్యాయత కూడా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి