బుధవారం, జూన్ 14, 2023

సునసూయలు అంటే?





ఓసారి నేను నాన్నగారి దగ్గరకి వెళ్లి, ''సునసూయలు అంటే ఏంటండీ?' అని అడిగాను.

ఏదో పని చేసుకుంటున్న ఆయన ప్రశ్నార్థకంగా మొహం పెట్టి, ''సునసూయలు ఏంట్రా?'' అని అడిగారు.

''అవును నాన్నగారూ, పాటలో కూడా ఉంది'' అన్నాన్నేను.

''ఏదీ ఆ పాటేంటో చెప్పు?'' అన్నారాయన.

నేను హుషారుగా పాడాను కూడా. ''బృందావనమిది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే. ఎందుకె రాధా ఈ సునసూయలు? అందములందరి ఆనందములే...'' అని నేను పాడగానే ఆయన నవ్వేశారు.

''అది ఈ సునసూయలు కాదురా, ఈసునసూయలు...'' అన్నారు.

నాకేమీ అర్థం కాలేదు, నేను చెప్పిందే చెబుతారేంటని.

అప్పుడు వివరించారు, ''ఈసు అంటే ఈర్ష్య. అసూయ అంటే తెలుసుగా? రెండింటినీ కలిపి 'ఈసునసూయలు' అని పాడారు. నువ్వేమో ఆ పదాన్ని విడదీసి, 'ఈ... సునసూయలు' అంటే నాకే అర్థం కాలేదు. రాముడి తోక పివరుండు ఇట్లనియే... లాగా...'' అన్నారు తేలిగ్గా నవ్వేస్తూ.

అన్నట్టు 'రాముడి తోక పివరుండు ఇట్లనియే' తెలుసుగా? 

'రాముడితో కపివరుండు ఇట్లనియే...' అని చదువుకోవాలన్నమాట. 

మీ చిన్నప్పుడు కూడా ఇలాటి అర్థంకాని... అర్థం లేని సందేహాలు కలిగి ఉంటే సరదాగా కామెంట్‌ రూపంలో పంచుకోండి. సరేనా?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి