మంగళవారం, ఆగస్టు 01, 2023

నీచ నేత నిజ స్వరూపం!



''గురువుగారూ! నాదో సందేహమండీ...''

''రాజకీయాల్లో సందేహాలుండకూడదురోయ్‌. వెంటనే తీర్చేసుకో...''

''అదేంటండీ? ఎంత రాజకీయాల్లో ఉన్నా సందేహాలు రాకుండా ఎలా ఉంటాయి సార్‌. ఓ మంచి పని చేస్తున్నప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తుందోలేదోననే అనుమానం వస్తుంది కదండీ?''

''ఓరెర్రోడా! అసలు రాజకీయాల్లో మంచి పనులెక్కడుంటాయిరా, మంచిగా కనిపించేవే తప్ప?''

''ఏంటో గురూగారూ! మీ మాటలు తికమకగా ఉంటాయండి. మంచిగా కనిపించడమేంటండీ?''

''ఒరేయ్‌. నువ్వు అసలు సంగతి మర్చిపోయి మాట్టాడుతున్నావురా. నువ్వు నా దగ్గరకు  వస్తున్నదెందుకు? నీచ రాజకీయాలు నేర్చుకోడానికే కద? మరలాంటప్పుడు ఇక మనం ఉన్నదున్నట్టు మాట్లాడేసుకోవాలి కానీ, మంచేంట్రా మంచి?''

''అవునండోయ్‌. మనసా వాచా కర్మణా నీచ మార్గంలో వెళుతున్నప్పుడు ముసుగులెందుకు లెండి. అదేగా మీరు చెప్పదలుచుకున్నది?''

''పాయింట్లోకి వచ్చావురా. ఇంతకీ నీ సందేహమేంటో చెప్పలేదు...''

''అదే గురూగారూ! ఇంతకాలంగా మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నాను కదండీ? అసలు నేను ఏ మాత్రమైనా పనికొస్తానా లేదా అనే సందేహం పీడిస్తోందండి...''

''వహార్నీ! అదా?  మా చెడ్డ సందేహమే వచ్చిందిరా. మరయితే నువ్వు ఏ మాత్రం రాటుదేలావో తెలియడానికి ఓ పరీక్ష పెడతాను. సరేనా?''

''ఏం పరీక్షండీ అది?''

''ఇప్పుడు నేనొక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతాను. ఆడెవడో నువ్వు కనిపెట్టాలి. అంతేకాదురోయ్‌. ఆడు ప్రజల ముందు వేదికలెక్కి ఎలా మాట్లాడుతాడో నేను చెబుతాను. నువ్వు మాత్రం ఆడి మనసులో అసలు మాటల్ని దొరకబుచ్చుకుని అదే తీరులో చెప్పాలి...''

''ఆహా... భలే పరీక్షండీ. మరైతే ఇక మొదలెట్టండి...''

+++

గురువుగారు లోపలికి వెళ్లి ఓ తెల్ల చొక్కా వేసుకుని వచ్చారు. దాని చేతులు కొంత వరకు మడత పెట్టారు. ఆపై ఓ మైకు పైకెత్తి పట్టుకున్నారు. రెండో చేత్తో ఆ మైక్మూతి మీద 'టప్‌... టప్‌...' అంటూ కొట్టారు. మొహం ఆముదం తాగినట్టు పెట్టారు. నవ్వో, ఏడుపో తెలియకుండా మొహం పెట్టారు. ఆపై మొదలు పెట్టారు...

''ఇక్కడకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకీ, ప్రతి అక్కయ్యకీ, ప్రతి అవ్వకి, ప్రతి తాతకీ, ప్రతి స్నేహితుడికీ... చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నా. ఈ రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన సుదినం. పేదవాడి కోసం, పేదవాడి సంక్షేమం కోసం నేను పాటుపడుతున్న సంగతి మీకు తెలిసిందే. అందుకోసం నేను పేదవాడి శత్రువులతో అనుక్షణం పోరాటం చేస్తన్నా. ఆ శత్రువులు ఎలాంటి వారయ్యా అంటే... వాళ్లు పెదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అడ్డుకుంటారు. పేదవాడికి ఇల్లు కట్టించొద్దని ఆపుతుంటారు. అలాంటిది ఇవాళ వాళ్లందరితో పోరాడి మీ కోసం ఇల్లు కాదు...  ఏకంగా ఊళ్లకు ఊళ్లే కట్టడానికి నిర్ణయించుకున్నా''.

గురువుగారు ఆపి చూసేసరికి శిష్యుడు కింద పడి పొట్టపట్టుకుని తెగ నవ్వుతూ దొర్లుతున్నాడు.

''.........హా! అదరగొట్టేశారు గురూగారూ! మీలో ఓ మిమిక్రీ ఆర్టిస్టు కూడా ఉన్నట్టు ఇప్పుడే తెలిసిందండి. ఎంత బాగా అనుకరించారండీ బాబూ... ఆ చేతులూపడాలూ, ఆ మొహం పెట్టడాలూ, ఆ హావభావాలూ... అబ్బో... చూస్తుంటే నవ్వాగలేదంటే నమ్మండి...'' అన్నాడు నవ్వుతూనే.

''అది సరేరా. మరి ఈ నేత ఎవరో కనుక్కున్నావా?''

''ఇంకెవరండి బాబూ... మా అధినేతండి. ఆయన ప్రసంగాన్ని అచ్చం అలాగే దించేశారండీ బాబూ...''

''బాగానే పోల్చుకున్నావులే కానీ... అక్కడాగరా. ఇప్పుడు నువ్వు అచ్చం ఆయనలాగే మాట్లాడుతూ ఆయన మాటల వెనుక మతలబులేంటో, ఆయన అంతరంగంలో మాయేంటో... ఆయన మాటల్లోనే చెప్పాలి'' అంటూ గురువుగారు మైకు శిష్యుడి చేతికిచ్చారు.

శిష్యుడు వెంటనే తన చొక్కా విప్పేసి, తెల్ల చొక్కా వేసుకుని చేతులు మడత పెట్టుకుని సిద్ధమైపోయాడు.

కసాయి వాడు మేకను కొట్టేటప్పుడు కత్తి ఎలా ఊపుతాడో అలా చేతులు పైనుంచి కిందకి ఊపుతూ మొదలుపెట్టాడు.

''ఇక్కడకి వచ్చిన ప్రతి గొర్రెకి, ప్రతి మేకకి, ప్రతి అమయకుడికి, ప్రతి వెర్రిబాగులోడికి, ప్రతి దద్దమ్మకి, ప్రతి తెలివితక్కువ వాడికి చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఈ రోజు నా నీచ రాజకీయ చరిత్రలోనే మర్చిపోలేని రోజు. ఎందుకంటే పేదల కోసమని చెప్పి, పేదల పేరు చెప్పి, వాళ్లకి ఇల్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తానని చెప్పి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా, అలవోకగా... పైకి ఏమాత్రం ఎవరికీ ఏ అనుమానం రాకుండా మా పార్టీ వాళ్లు, మా బంధువులు, మా అనుచరులు, మా పల్లకీ మోసేవాళ్లు అందరికీ లబ్ది చేకూర్చడానికి ప్రారంభోత్సవం చేసిన రోజు. ఇందుకోసం నేను పేదల మిత్రులతో ఎంత పోరాటం చేశానో తెలియదు. నిజాలు నిర్భయంగా చెప్పేవారినీ, నేను చేసే ప్రతి పనిలోను లోపాయికారీగా ఉండే ప్రతి నీచ కుతంత్రాన్ని ఎండగట్టేవారినీ ఎదుర్కొని ఈ పథకం మొదలు పెట్టాను. ప్రతి చోట మీ కోసం భూములు సేకరిస్తామని ముందుగానే మా అనుచరులకి, నా అడుగుజాడల్లో నడిచే వాళ్లకి ఉప్పందించడంతో వాళ్లంతా ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలను, చెరువులను అతి చౌకగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత అవే భూములని ప్రభుత్వానికి భారీ ధరలకి అమ్మేసి కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నారు. వాళ్లకి చెల్లించిన  ఆ డబ్బంతా మీ ప్రజా ధనమే. మీరు చెమటోడ్చి కష్టపడుతూ, నేను వేసిన నానా చెత్త పన్నుల రూపంలోను, సెస్సుల రూపంలోను, ఛార్జీల రూపంలోను, ధరవరల రూపంలోను, సర్దుబాటు బిల్లుల రూపంలోను మీరంతా కట్టిన సొమ్ములేనని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఆ భూముల్లో పేదల కోసం ఇళ్లు కట్టే కాంట్రాక్టును కూడా మా పార్టీ నేతలకి, వాళ్ల బంధువులకి, వాళ్ల అనుచరులకి బినామీ పేరు మీదనే కేటాయించాను. మళ్లీ ఆ రూపంలో కూడా వాళ్లు పెట్టిన భారీ బిల్లుల్ని చూసీచూడకుండా మంజూరు చేయించేశాను. అంటే ఆ విధంగా కూడా మళ్లీ మీ ధనమే వాళ్ల జేబుల్లోకి చేరింది. అందుకే ఈనాడు చిన్నవర్షానికే ఆ కాలనీలన్నీ జలమయమైపోయాయని మీరు తెలుసుకోలేరు. ఇలా మిమ్మల్నినిలువునా దోచుకోడానికి మీరు ఇచ్చిన అధికారమే కారణం. అందుకే మీకు పేరుపేరునా వందనాలు సమర్పించుకుంటున్నా...''

శిష్యుడి అభినయానికి గురువుగారు చప్పట్లు కొట్టారు.

''సెభాష్రా. మీ అధినేత నీచ అంతరంగాన్ని బాగా బయటపెట్టావు. ఇప్పుడు ఇది విను మరి...'' అంటూ గురువుగారు మళ్లీ తెల్ల చొక్కా వేసుకుని చేతులు మడత పెట్టారు.

''ఓ అమ్మ, ఓ అక్క, ఓ అవ్వ, ఓ తాత... మీకు తెలుసు, మీ ముందుకు ఇప్పుడొక దత్తపుత్రుడు వచ్చాడు. ఓ లారీ ఎక్కాడు. ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఏంటేంటో చెబుతున్నాడు. మీసం మెలేస్తున్నాడు. చొక్కాలు ఊడదీస్తానంటున్నాడు. పంచెలూడదీయించి పరిగెత్తిస్తానంటున్నాడు. అతడి లాగా నేను చేయలేను. మీ గ్రామంలో నేను నియమించిన వాలంటీర్లను తప్పు పడుతున్నాడు. పొద్దున్నే లేచి మీ ఇంటి తలుపు తట్టి, మిమ్మల్ని చిరునవ్వుతో పలకరించి, మీ యోగక్షేమాలు కనుక్కుని, మీకు పింఛను అందుతోందో లేదో, మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకునే వాళ్లని ఏదేదో అంటున్నాడు. మీకు మీటలు నొక్కి నే....రు...గా డబ్బులు మీ కాతాల్లో పడేలా చేస్తుంటే అతడు సహించలేకపోతున్నాడు. కాబట్టి అతడి అబద్ధాలను నమ్మకండి...''

గురువుగారు చెబుతుండగానే శిష్యుడు వచ్చి మైకు తీసుకుని అభినయం మొదలుపెట్టాడు.

''ఓ వెర్రి, ఓ గొర్రి, ఓ మేక, ఓ ముసలి ఓటరూ... మీకు తెలుసు, మీ ముందుకొక నాయకుడు వచ్చాడు. అతడు నా నీచ ఆలోచనలన్నింటినీ ఔపోసన పట్టినట్టు పసిగట్టేశాడు. ఓ వాహనం ఎక్కి ఊరూరా తిరుగుతూ నిజాలు చెప్పేస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకపు గొర్రెల్లాంటి మిమ్మల్ని చైతన్య వంతుల్ని చేసేస్తున్నాడు. నిజాయితీగా నిజాలు చెబుతున్నాడు కాబట్టే ఆవేశంతో ఊగిపోతున్నాడు. అదే నా భయం. అందుకనే అతడు చెబుతున్న విషయాల గురించి కాకుండా, అతడి వ్యక్తిగత జీవితం గురించి నేను బురద జల్లుతా ఉన్నా. నేనెందుకు వాలంటీర్లను నియమించానో అతడికి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. ప్రతి ఊళ్లోను, ప్రతి వీధిలోను నాకంటూ ఓ అనుచరుడు ఉండేలా నేను ఏర్పాటు చేసుకున్న గూఢచారి వ్యవస్థ ఇది. పైగా వాళ్లకి ఇచ్చేది కూడా ప్రభుత్వ ధనమే. అంటే మీ ప్రజాధనమే. అంటే మీ సొమ్ముతో మీమీదే నేను ఈ వాలంటీర్లతో నిఘా పెట్టానన్న విషయం మీకు తెలియదు. పైకి వాళ్లు మిమ్మల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు కనిపిస్తారు కానీ, మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వివరాలన్నీసేకరిస్తారు. మీరు ఏ పార్టీ మద్దతు దారులో, మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారో, మీరు నా నీచ నిజస్వరూపాన్ని ఎంత వరకు తెలుసుకున్నారో, మీలో నా పరిపాలన పట్ల, నా ప్రభుత్వం పనితీరు పట్ల ఎంత వరకు అసంతృప్తి ఉందో  పసిగడతారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా మీ పేర్లను ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. మీరెవరైనా ప్రతిపక్ష నేత సభలకు వెళ్లినా ఆ సంగతి నాకు ఉప్పందిస్తారు. దాంతో నేను అధికారులను ఉసిగొలిపి, ఏవేవో పిచ్చి నిబంధనలు చూపించి మీ ఇంటినో, దుకాణాన్నో కూలగొట్టించి పగ తీర్చుకుంటా. లేదా నేనిప్పటికే గులాములుగా చేసుకున్న పోలీసులను పంపించి మీమీద ఎక్కడా కనిపించని సెక్షన్ల పేరిట తప్పుడు కేసులు బనాయిస్తా. దాంతో మీరు పీక్కోలేక, లాక్కోలేక నానా పాట్లూ పడతారు. ఇంకా కావాలంటే నేను ప్రతి ఊళ్లూనూ పెంపుడు కుక్కల్లాగా పెంచి పోషిస్తున్న రౌడీలను, గూండాలను మీ మీదకు పంపి భయభ్రాంతుల్ని చేస్తా. ఇదిగో... ఇవన్నీ ఆ జననాయకుడు అరటిపండు వొలిచి నోట్లో పెట్టినంత సులువుగా మీకు వివరించేస్తున్నాడు. ఇక నేను మీటలు నొక్కి మీ కాతాల్లోకి నే....రు...గా పంపిస్తున్నా డబ్బు గురించి కూడా అతడు కూపీలాగి చెబుతున్నాడు. నేను ఇసుకని, గనులని, మద్యమని, రేషన్బియ్యమని, గంజాయని... ఇలా రకరకాలుగా రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంటున్న లక్షల కోట్లాది రూపాయల సొమ్ములో ఏదో కొంత ముష్టి వేసినట్టు మీకు నే...రు...గా... వేస్తున్నానని లెక్కలు చెప్పేస్తున్నాడు. మీ నుంచి వంద రూపాయలు దోచుకుని మీకు ఒక పైసా పడేస్తున్నానని మీకు వివరించి మిమ్మల్ని తెలివైన వాళ్లని చేస్తున్నాడు. అదే నాకు బెంగ. ఓ పక్క ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో మీరేమాత్రం తెలివి మీరినా నన్ను మళ్లీ ఎన్నుకోరు. అప్పుడు నా అక్రమ సంపాదన ఏం కావాలి? అందుచేత ఓ గెర్రె, ఓ మేక, ఓ వెర్రి... మీరిలాగే తెలివితక్కువ, అమాయక, వెర్రిబాగుల, బుద్దిమాలిన జనంలాగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ నన్నే ఎన్నుకుని మరోసారి మోసపోవావలని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నా...'' అంటూ శిష్యుడు ముగించాడు.

గురువుగారు ఆనందంగా వచ్చి శిష్యుడికి శాలువా కప్పారు.

''నీకు నేను చెప్పిన రాజకీయ పాఠాలు బాగా వంటబట్టాయిరా. ఇక నీ సందేహం తీరినట్టేనా?'' అన్నారు గురువుగారు.

శిష్యుడు ఓసారి బుర్రగోక్కుని, ''సార్‌... మరో సందేహం వచ్చిందండి...'' అన్నాడు.

''అఘోరించు...''

''మరి గురువుగారూ! జనం నిజంగానే చైతన్యవంతులైపోయి, మా అధినేత లాంటి నీచ నికృష్ట నేతల నిజస్వరూపాలు పసిగట్టేస్తే ఎలాగండీ?''

''ఒరేయ్‌... నిజంగా ఆరోజే వస్తే అంతటి సుదినం మరొకటి ఉండదురా. అది ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగిన మంచి అధ్యాయమవుతుందిరా. అదేంటో నీకు అర్థం కాదుకానీ, ఇవాల్టికి పోయిరా''.

-సృజన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి