మంగళవారం, ఆగస్టు 01, 2023

చిగురించిన సీత!

 


         

 “నౌ యువార్ ప్రెగ్నెంట్…” అని డాక్టర్ వసుంధర చెప్పగానే చెప్పలేని అనుభూతికి లోనయింది సీత.

          సంతోషించాలా?  బాధపడాలా?

          రెండూ కలిసిన భావాల ఉధృతిని నిభాయించుకోవడం మూడు పదులు చూడని సీతకి కష్టమైంది.

          వెంటనే ఆమె కళ్లల్లో ఓ పొరలాగా చెమ్మ అల్లుకుంది. ఆ చెమ్మ చెలియలి కట్ట దాటబోతుంటే చూపుడు వేలితో అద్దుకుంది. మనసులో ఏదో ఉద్వేగం.

          ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీటి ధారను ఇక ఆపలేకపోయింది.

          తల వంచుకుని కూర్చుండిపోయింది.

          డాక్టర్ వసుంధర తన కుర్చీలోంచి లేచి వచ్చి సీత భుజం మీద చెయ్యి వేసి నొక్కింది.

          “కంట్రోల్ యువర్ సెల్ఫ్‌ సీతా! నువ్వీ క్షణం కోసం ఎంత ఎదురు చూశావో గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్విలాంటి ఎమోషన్స్ రానివ్వకూడదు. అది బిడ్డ ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది…”

          ఆమె ఏవేవో జాగ్రత్తలు చెప్పుకుపోతోంది.

          సీత హ్యాండ్ బ్యాగ్ లోంచి కర్చీఫ్ తీసుకుని మొహమంతా తుడుచుకుంది.

          ఓసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. క్షణాల్లో మామూలు మనిషైంది.

          ‘తనిలా బేలగా ఉండకూడదు. ఈ క్షణం నుంచి ఎన్నో తట్టుకోవాలి…’ అనుకుంది నిశ్చలంగా.

          అలనాటి సీతకి రాముడే అగ్నిపరీక్ష పెట్టాడు.

          ఈనాటి సీతకి అడుగడుగునా అగ్నిపరీక్షలే.

          ఎందుకంటే… సీత భర్త రామ్మోహన్ చనిపోయి రెండేళ్లయింది!

***

          ఫొటోలో రామ్మోహన్ నవ్వుతున్నాడు. ఆ నవ్వు సీత కళ్లలో అలుక్కుపోయింది. కారణం కన్నీళ్లు.

          “రామ్మోహన్… నన్ను క్షమించగలవా? నేను చేసింది తప్పా?” అని మూగగా అను కుంది. ముద్ద మందారాన్ని ఆ ఫొటో ముందు పెట్టింది. భర్తను ఏకాంతంలో రామ్మోహన్ అనే పిలిచేది. ఇప్పుడు కూడా ఏకాంతమే. గదిలో టేబుల్ మీద రామ్మోహన్ ఫొటో. దాని ఎదురుగా కుర్చీలో సీత.

          “నువ్వేమన్నావ్ రామ్మోహన్? ఆఖరి రోజుల్లో నీ మాటలు మర్చిపోగలనా? నేను మోడులా మిగిలిపోకూడదన్నావ్. చిగురించాలన్నావ్. అదే జరిగిందిప్పుడు. కానీ… ఇది కాదు కదా నువ్వు కోరుకున్నది? నీ ఉద్దేశం వేరు కదా? అందుకే నన్ను క్షమించు…” అనుకుంటూ ఆ ఫొటో తీసుకుని కొంగుతో తుడిచి పెట్టింది.

          టేబుల్ సొరుగు లాగింది. అందులో పైకి కనిపిస్తూనే ఉంది అయిదేళ్ల నాటి పెళ్లి శుభలేఖ.

          ‘సీతా వెడ్స్ రామ్మోహన్!’ ఇటు పక్క ఇంగ్లిషులో. అటు పక్క తెలుగులో.

          ‘జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మరాగాయితాః’

          రోజుకోసారైనా ఆ శుఖలేఖ చదువుకోవడం అలవాటు సీతకి.

          రామ్మోహన్ నవ్వంటే సీతకిష్టం. సీత కళ్లంటే రామ్మోహన్‌ కి ఇష్టం.

          ఆ నవ్వు కోసమే అతడి కేసి చూసేది. ఆ చూపు కోసమే అతడు నవ్వేవాడు.

          ఒకే ఆఫీసులో ఉద్యోగాలు ఆ నవ్వుల్ని, ఆ చూపుల్ని దగ్గర చేశాయి.వాళ్ల మనసుల్ని ఒక్కటి చేశాయి. ఆఖరికి ఇద్దరికీ పెళ్లి చేశాయి.

          కానీ… ఆ పెళ్లి ముచ్చట మూడేళ్లకే ముగిసిపోయింది.

          తల్చుకుంటే ఇప్పటికీ కలలాగా అనిపిస్తుంది సీతకి!

          రామ్మోహన్‌ కి పిల్లలంటే ఇష్టం.

          “ఇదిగో సీతా… ఇప్పుడే చెబుతున్నాను. నో మెజర్స్. ఆరు నెలలు తిరక్కుండా ప్రెగ్నెన్సీ రావాలి. తెలుసా?” ఫస్ట్ నైట్ రామ్మోహన్ చిలిపిగా చెప్పిన మాటలు గింగురు మంటూనే ఉంటాయి సీత చెవుల్లో. ఆ రాత్రి ఆ మాటలు విని సిగ్గుల మొగ్గయింది తను.

          ఆ పై రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. అవన్నీ ఎలా గడిచాయో తెలియలేదు ఇద్దరికీ.

          ప్రపంచంలో ఆనందం మాత్రమే ఉందేమో అనేంత హాయిగా గడిపారు ఇద్దరూ.

          ఆ తర్వాత నుంచి మొదలైంది నిరీక్షణ.

          సీతకి ప్రతి నెలా బెంగే. నెలసరి రెండు రోజులు ఆగితే ఏదో ఆశ. నాలుగు రోజులు ఆగితే  తెలియని ఆనందం. కానీ… వచ్చేస్తే ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదన దుఃఖమ య్యేది. ఆ దుఃఖం నిరాశగా మారేది.

          ఇద్దరూ తిరగని ఆసుపత్రి లేదు. చేయించుకోని పరీక్షలు లేవు. ఏవేవో రిపోర్టులు. ఏవేవో కారణాలు. ఎన్నెన్నో జాగ్రత్తలు. అన్నీ పాటించేది సీత.

          అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో, యునానీ… అందరు స్పెషలిస్టుల్నీ కలిసే వారు ఇద్దరూ.

          ఏ మందులో ఏముందో? ఏది ఎలా పనిచేస్తుందో? అన్నీ వాడేవారు.

          గుళ్లు, గోపురాలు, క్షేత్రాలు, వ్రతాలు, పూజలు… అన్నీ అయ్యాయి.

        ‘రామ్మోహన్‌ కి శుభవార్త చెప్పే క్షణాలు తన జీవితంలో అసలు ఉన్నాయా?’ అనిపిం చేది. ఆ ఊహకి ఏడుపొచ్చేది.

          “ఏంటే… ఇన్నాళ్లయింది? ఇప్పుడే వద్దనుకున్నారా?” అంటూ అడిగేవారు స్నేహితురాళ్లు.

          “దేవుడిస్తే దెయ్యం కంటుంది… నువ్వేం బెంగ పడకమ్మా…” అనేది అత్తగారు. 

          ఆ నిరీక్షణలోనే రెండేళ్లు గడిచిపోయాయి.

          “నాకు చచ్చిపోవాలని ఉంది…” అంది సీత ఓ రాత్రి రామ్మోహన్‌ తో. అలా అంటుండగానే ఏడుపొచ్చేసింది. రామ్మోహన్ చటుక్కున లేచి ఆమె కన్నీళ్లు తుడిచాడు.

          “ఛ…ఛ… అవేం మాటలు? ఇలా ఎప్పుడూ మాట్లాడకు. ఇప్పుడేం కొంప మునిగిం దని? అయినా మన పెళ్లయి ఏమంత కాలం గడించిందని?” అంటూ ఓదార్చాడు.

          కానీ… సీతకు తెలుసు, రామ్మోహన్ పిల్లల కోసం ఎంత ఎదురుచూస్తున్నాడో! అతడికి పిల్లలంటే ఎంత ఇష్టమో!

          “అసలు మనకి పిల్లలు పుడతారా?” అని బేలగా అడుగుతూ అతడి గుండెల పై వాలిపోయింది.

          ఆ ప్రశ్నకు రామ్మోహన్ వద్ద కూడా జవాబు లేదు. 

          ఇలాంటి రాత్రులు ఏన్నో గంభీరంగా గడిచాయి వాళ్లకి.

***

          సీతకి ఊహ తెలిసే సరికే  నాన్న లేడు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ తనను పెంచుకొచ్చిన అమ్మంటే ప్రాణం సీతకి. చదువయ్యి, తను కూడా ఉద్యోగంలో చేరాక, అమ్మని అపురూపంగా చూసుకోవాలనుకుంది. కానీ ఆ అవకాశం రాలేదు. సీత ఉద్యోగం లో చేరిన కొన్నాళ్లకే అమ్మ ఓ రాత్రి గుండెపోటుతో నిద్రలోనే చనిపోయింది.

          నాన్న లేని బాల్యం ఓ అగ్ని పరీక్ష.

          అమ్మ లేని జీవితం ఓ అగ్ని పరీక్ష.

          అప్పుడే రామ్మోహన్ తోడుగా నిలిచాడు. భరోసానిచ్చాడు. ధైర్యాన్నిచ్చాడు. ప్రేమని చ్చాడు. జీవితాన్ని కూడా ఇచ్చాడు.

          అలాంటి రామ్మోహన్‌ కి తనేం ఇవ్వగలిగింది?

          ఈ ఆలోచన అనుక్షణం ఎదురయ్యే అగ్నిపరీక్షే సీతకి.

          కానీ… అంతకు మించిన అగ్నిపరీక్ష విధి ఆమెకు విధించింది.

***

          ఓ రోజు ఆఫీసులో క్యాంటిన్‌ కి వెళుతూ కళ్లు తిరిగి పడిపోయాడు రామ్మోహన్. ఆఫీసులో అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ రొటీన్ పరీక్షలు చేశాడు. ఏవో మందులు ఇచ్చాడు. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టేశారు. చిత్రంగా చాలా నీరస పడిపోయాడు రామ్మోహన్.

          అత్తయ్య, మావయ్య బెంగపడిపోయారు. ఇద్దరూ వృద్ధులే. రామ్మోహన్ ఒక్కడే కొడుకు. అతడి మీదే కళ్లు పెట్టుకుని పెంచుకొచ్చారు. ఓ పక్క వాళ్లకి ధైర్యం చెబుతూ రామ్మోహన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లేది సీత. ఓ డాక్టర్ కొన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్టులు పుచ్చుకుని మరో డాక్టర్ దగ్గరకి వెళ్ల మనేవాడు. ఆ డాక్టర్ మళ్లీ టెస్టులు చేయించేవాడు. ఇలా కొన్ని వారాలు గడిచాయి.

          ఆఖరికి విషయం తేల్చారు. స్టొమక్‌ లో మాలిగ్నెంట్ ట్యూమర్!

          అది తట్టుకోలేని అగ్ని పరీక్ష సీతకి.

          స్కానింగులు… బయాప్సీలు… ట్యూమర్ మార్కర్స్ టెస్టులు… అన్నీ అయ్యాక క్యాన్సర్ అని తేల్చారు.

          ఓ పక్క ఉద్యోగం… మరో పక్క వృద్ధులైన అత్తమామలు… మరో పక్క రామ్మోహన్ పరిస్థితి.

          అన్నీ ఒక్కతే అయి ఎదుర్కొంది సీత.

          రామ్మోహన్‌ కి కీమో థెరపీ మొదలు పెట్టారు. అతడి రూపం పూర్తిగా మారిపోయింది.

          ఇప్పుడిక సీతకి ఏ ఆశా లేదు. రామ్మోహన్‌ కి నయమైతే చాలు.

          ‘దేవుడా… నాకు పిల్లలు అక్కర్లేదు. ఆయన్ని దక్కించు…’ అంటూ మూగగా ప్రార్థిం చేది.

          బయటకి మాత్రం చిరునవ్వుతో అత్తయ్యకి, మావయ్యకి ధైర్యం చెప్పేది.

          “తల్లిలా చూస్తున్నావ్… నేనే నీ బిడ్డనయ్యానా సీతా?” అనేవాడు రామ్మోహన్.

          తనకు దుఃఖం తన్నుకొచ్చేది. అయినా మొహంలో బెంగ కనిపించకుండా మాట్లాడాల్సి వచ్చేది.

          “సీతా! నాదో కోరిక. నాకేదేనా అయితే… నువ్వు మోడులాగా మిగిలిపోకూడదు. మళ్లీ పెళ్లి చేసుకుని చిగురించాలి… సరేనా?” అన్నాడు రామ్మోహన్ రెండో రౌండ్ కీమో థెరపీకి ఆసుపత్రిలో జాయినయ్యాక.

          ఆ తర్వాత అతడు మాట్లాడే అవకాశం రాలేదు.

          అతడి శరీరం ఇక తట్టుకోలేకపోయింది.

          కానీ… ఆ అగ్ని పరీక్షను సీత తట్టుకుంది. నిలదొక్కుకుంది. అత్తమామల్ని ఓదార్చే బాధ్యత ఆమెను ఆరిందాగా మార్చింది. వాళ్లకి ధైర్యం చెప్పింది.

          “ఇక మీరే నాకు పిల్లలు, పెద్దలు కూడా…” అంది. తిరిగి ఉద్యోగంలో చేరింది. జీవితాన్ని ఎదుర్కొంది సీత.

***

          “అమ్మా సీతా! నువ్విలా మిగిలిపోకు. నీకంటూ జీవితాన్ని ఏర్పరుచుకో. వాడి చివరి కోరిక కూడా అదేగా?” అంటూ నచ్చచెప్పబోయింది ఓసారి ఆమె అత్తగారు.

          సీతకి గుండెల్లో గుబులుగా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు.

          మావయ్యగారు అందుకున్నారు…

          “సీతా! మా గురించి ఆలోచించకమ్మా… మేం ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుతాం. నువ్వు అప్పుడప్పుడొచ్చి చూస్తూ ఉందుగానిలే…” అంటూ వివరించారు.

          కళ్లలో నీళ్లు చిప్పిళ్లాయి సీతకి.

          వాళ్లేం చెప్పబోతున్నారో అర్థమైంది.

          ‘ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు? కన్న కొడుకు కళ్ల ముందే వెళ్లిపోయినా, ఆ దుఃఖాన్ని తట్టుకుని నా గురించి దిగులు పడుతున్నారు. చూసే దిక్కులేని వృద్ధాప్యం. మావగారు ప్రైవేటు ఉద్యోగి కావడంతో పెన్షన్ సదుపాయం కూడా లేదు. ఏవో కొన్ని డిపాజిట్లు తప్ప ఎలాంటి ధైర్యం లేదు. నేనే వాళ్లకి ఆధారం. కానీ… వాళ్లు మాత్రం అవేమీ కాకుండా, కేవలం నా జీవితం చిగురించాలని కోరుకుంటున్నారు…’

          అలా అనుకోగానే రామ్మోహన్ గుర్తొచ్చాడు సీతకి.

          అమ్మ పోయేముందు తరచు ఇంటికి వస్తుండేవాడు. అమ్మతో ఎంతో బాగా మాట్లాడే వాడు. ఏదో రోజు తనే మా ప్రేమ గురించి చెబుదామనుకున్నాడు. కానీ అంతలోనే అమ్మ పోయింది. అప్పుడు తనకు ఎంత ధైర్యంగా నిలిచాడు!

          ఆ దుఃఖంలో, ఆ ఒంటరి తనంలో ఎంత ఓదార్పునిచ్చాడు!

          తనే గనుక తల్చుకుంటే బోలెడంత కట్నం ఇచ్చి పిల్లనిచ్చే సంబంధాలు ఎన్ని ఉండవని! కానీ వాటన్నింటినీ కాదని, వెనకా ముందూ ఏమీ లేని తనని ఎంచుకున్నాడు.

          అత్తయ్య, మావయ్య కూడా  ఏమీ అనలేదు సరికదా, ఎంతో సంతోషించారు.

          “ఒరే… ఒక్కగానొక్క కొడుకువి. నీ ఆనందమే మా ఆనందం…” అంటూ తనని వాళ్ల జీవితాల్లోకి నిండుగా ఆహ్మానించారు.

          అలాంటిది ఇప్పుడు… రామ్మోహన్ అనుకోకుండా వెళ్లిపోయాడని… నేను మరో తోడు వెతుక్కోవాలా? ఇదేనా బంధాలకు విలువ? ఇలా సాగేవి సీత ఆలోచనలు.

          కానీ… పగలంతా ఉద్యోగం, బాధ్యతలతో గడిచిపోయినా, రాత్రి గదిలో పడుకున్న ప్పుడు ఒంటరితనం ముప్పిరిగొనేది సీతని!

          ఎలాంటి తోడు, ఎలాంటి బంధం లేని నిస్సారమైన జీవితం నిలువెత్తున నిలబడి ప్రశ్నించేది.

          ‘ఎన్నాళ్లిలా? ఇప్పుడంటే అత్తమామలు ఉన్నారు. ఆ తర్వాత? ముప్ఫై ఏళ్లు కూడా లేని తను ఇలా ఒంటిగా, మోడుగా జీవితమంతా గడపగలదా?’ ఇలాంటి భావాలు కూడా ఓ అగ్నిపరీక్షే సీతకి!

***

          నిస్సారంగా సాగిపోతున్న సీత జీవితంలో రమణ పరిచయం ఓ మలుపు. సీతకి ఆ ఊరి నుంచి బదిలీ అయింది. ఆ ఊరు దగ్గరే కాబట్టి అత్తమామల్ని కదపలేదు. వాళ్ల కోసం ఓ వంట మనిషిని కుదిర్చి తను మాత్రం వెళ్లింది. వారాంతాల్లో అత్తమామల దగ్గరకే వచ్చేసేది. ఆ కొత్త ఊళ్లో కొత్త మనుషుల మధ్య రమణ స్నేహం సీతకి ఓ వరమే.

          సీత కథంతా విన్న రమణ ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు.

          ఆ మాటలు ఎంతో పాజిటివ్‌ గా ఉండేవి.

          “జీవితంలో ఏ దశలోనూ నిరాశను రానీయకూడదు సీతా! లోకం ఏమనుకున్నా నీ జీవితం నీది. దాన్ని నీకు కావలసినట్టు మార్చుకోవడం నీ హక్కు…” అంటూ సాగే రమణ మాటలు సీత మీద ఎంతో ప్రభావం చూపించేవి.

          వీకెండ్స్‌ లో  రమణని ఇంటికి కూడా తీసుకెళ్లేది సీత. అత్తమామలకు కూడా రమణ కలివిడితనం, ఉత్సాహం, కబుర్లు ఎంతో నచ్చేవి.

          ఆఖరికి రమణ దగ్గర కూడా అత్తమామలు తమ ఆలోచనలు చెప్పేవారు.

          “నువ్వైనా చెప్పు రమణా… సీత అలా ఉండిపోవడం మాకు మా కడుపు కోత కన్నా ఎక్కువగా బాధ పెడుతోంది. ఎలాగోలా తనకొక బంధం ఏర్పడాలనే మా కోరిక…” అనే వాళ్లు.

          “నా ప్రయత్నం కూడా అదేనండీ… కానీ పరిస్థితులు కూడా కలిసి రావాలిగా?” అంటూ రమణ ఇచ్చే భరోసా తనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.

***

          గతం జ్ఞాపకాలన్నీ ఇప్పుడు సీత కళ్ల ముందు కదలాడుతున్నాయి. డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు సీత చెవుల్లో రింగురుమంటున్నాయి.

          “నీది ప్రెసైజ్ ప్రెగ్నెన్సీ సీతా! చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పోని ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎలాంటి ఆందోళనకు చోటివ్వకు…” అంటూ డాక్టర్ చెప్పిన మాటలు తల్చుకుంది సీత.

          రేపు… ఈ సంగతి అత్యయ్యగారికి చెప్పాలి… అనుకుంటూ కడుపు మీద అపురూపం గా నిమురుకుని నిద్రలోకి జారుకుంది సీత.

          మర్నాడు అత్తయ్యగారిని తన గదిలోకి పిలిచి కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పింది సీత. అసలిదంతా ఎలా మొదలైందో వివరించడానికి ప్రయత్నించింది. ఆఖరుగా డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు కూడా చెప్పింది.

          అంతా విన్న అత్తయ్య గారు నమ్మలేనట్టుగా వింది. కాసేపు మౌనంగా ఉన్నాక చెప్ప లేని ఉద్వేగానికి గురయ్యిందావిడ. తర్వాత తేరుకుని నెమ్మదిగా తమాయించుకుని, “నాకు చాలా ఆనందంగా ఉందమ్మా… ఇప్పుడు నీకంటూ ఓ బంధం ఏర్పడుతోంది. నీ జీవితం మీద మాకిక ఎలాంటి బెంగా ఉండదు…”

          ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది సీత.

          ఆ పై ఆవిడ మరో సంగతి కూడా గుర్తు చేసింది.

          “సీతా! ఇప్పుడు సరే… నాలుగో నెల వచ్చిన దగ్గర్నుండి అందరూ తలో మాటా అంటారు. సమాజం అలా ఉంది. మరి ఎలా ఎదుర్కొంటావో… నీకు మాత్రం మా భరోసా ఎప్పుడూ ఉంటుంది…” అందావిడ.

          నిజమే… రాబోయే రోజులే అసలైన అగ్నిపరీక్ష సీతకి!

          ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి.

          “ఏంటిది? భర్త పోయి రెండేళ్ల తర్వాత ఎలా?”

          “ఎవరితోనైనా సహజీవనం చేస్తోందేమో?”

          “ఏకంగా పెళ్లే చేసుకోవచ్చుగా? ఈ చాటు మాటు వ్యవహారాలెందుకూ?”

          ఆ తర్వాత గుసగుసలు కాస్తా వ్యాఖ్యానాలుగా మారాయి.

          “సిగ్గు లేకపోతే సరి…”

          “ఎవరేమనుకుంటారోననే జంకు కూడా ఉండదు ఇలాంటి వాళ్లకి…”

          అడపాదడపా ఆ వ్యాఖ్యలు, విమర్శలు చెవిన పడుతూనే ఉన్నాయి సీతకి!

          అయినా అప్పటికే అగ్నిపరీక్షలకి అలవాటు పడిపోయిన సీత వేటికీ చలించలేదు.

          ఇంట్లో అత్తగారు కూడా చెప్పేవారు. చుట్టు పక్కల వాళ్లు, దూరపు బంధువుల వాళ్ల  ఆరాలు మొదలయ్యాయిట. ఎప్పుడూ రాని వాళ్లు ఇంటికి రావడం, ఎప్పుడూ పలకరిం చని వాళ్లు కూడా ఫోన్లు చెయ్యడం… చివరకి సీత మాట ఎత్తడం! అందరికీ ఆవిడ ఖరా ఖండిగానే జవాబు చెప్పారుట.

          “చూడండి… సీత జీవితం తనిష్టం. అది ఆమె వ్యక్తిగతం. మాకేమీ అభ్యంతరం లేదు. మీకిక ఈ విషయం అనవసరం…”

***

          ఇలా ప్రశ్నార్థకాలు… ఆరాలు… వ్యాఖ్యానాలు… విమర్శలు… ఆరోపణలు… ఛీత్కారాల మధ్యే తొమ్మది నెలలు గడిచిపోయాయి సీతకి. డాక్టర్ వసుంధర సలహా పై ఆసుపత్రిలో చేరింది. అత్తమామలు, రమణ తప్ప కన్నెత్తి చేసినవారు లేరు.

          ఆఖరికి సీత ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.

          పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

          ఆసుపత్రి నుంచి వచ్చేసే ముందు రోజు డాక్టర్ వసుంధర సూచన పై బిడ్డను ఎత్తు కుని కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చింది సీత. అత్తమామలు, రమణ కూడా వచ్చి కూర్చున్నా రు.

          హాలు నిండా విలేకరులు కూర్చుని ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయసాగారు. టీవీల వాళ్లు వీడియో కెమేరాలు సవరించుకున్నారు.

          ఆ హడావుడి మధ్య డాక్టర్ వసుంధర చెప్పడం మొదలు పెట్టారు.

          “ఇది చాలా అరుదైన కేసు. అందుకే మిమ్మల్నందరినీ పిలిచాను. ఈమె పేరు సీత. భర్త చనిపోయి రెండేళ్లయింది. అంతక్రితం నుంచి సీత, ఆమె భర్త రామ్మోహన్ ఇద్దరూ మా ఆసుపత్రికి వచ్చేవారు. పిల్లలు పుట్టకపోవడంతో కృత్రిమ పద్ధతిలో గర్భధారణ కోసం ప్రయత్నించాను. కానీ ఈలోగానే అనుకోకుండా రామ్మోహన్ క్యాన్సర్ సోకి అకస్మాత్తుగా మరణించారు. తర్వాత రెండేళ్లకి సీత వచ్చి తనకు సంతానం కావాలని అడిగింది. అది కూడా రామ్మోహన్ ద్వారానే అని చెప్పింది. ఎందుకంటే సంతాన సాఫల్య ప్రయత్నాల కోసం రామ్మోహన్ స్పెర్మ్‌ మా ఆసుపత్రిలో స్టోర్ చేశాం. దాని ద్వారా సంతానం పొందే వీలుందా అనేది సీత కోరిక. ఇది వైద్య శాస్త్రానికి కూడా ఓ సవాలే. ఎందుకంటే ఇంత వరకు ఇలా అడిగిన వారు ఎవరూ లేరు. ఎన్నో సార్లు ప్రయత్నించాం. కానీ వీలు కాలేదు. ఆఖరికి ఓసారి కాంజుగేషన్ అయింది. ఈ విషయంలో సీత అత్తమామల సహకారం కూడా అరుదైనదే. తమ కొడుకు మరణించాక రెండేళ్లకి తమ కోడలి ద్వారానే తమకి వారసుడు రావడం వాళ్లకి కూడా ఆనందమే కదా. కానీ ఈలోపు వాళ్లు ఎన్ని ప్రశ్నలు, సవాళ్లు ఎదుర్కొని ఉంటారో అందరూ ఊహించ గలిగిందే… అందుకనే సమాజ పరంగా కూడా ఇది అరుదైన అంశం…”

          డాక్టర్ వసుంధర చెప్పిన వివరాలు వినగానే విలేకర్ల సందడి మొదలైంది. అరుదైన హ్యూమన్ యాంగిల్ స్టోరీ కావడంతో సీత అభిప్రాయాలు అడగసాగారు. వరస పెట్టి టీవీ ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చింది సీత.

          “ఇందులో మీరెవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా?” అంటూ అడిగాడో విలేకరి.

          “అవును… ఏం చేయాలో తోచని స్థితిలో ఇలా ప్రయత్నించవచ్చంటూ సలహాని చ్చిన నా స్నేహితురాలు రమణ సాయం మరిచిపోలేను. నిరాశలో కూరుకుపోయిన నా కోసం అనేక సార్లు ఆసుపత్రులకి తిరిగి వివరాన్నీ సేకరించి, డాక్టర్లతో మాట్లాడింది. నన్ను మానసికంగా సిద్ధం చేసింది…” చెప్పింది సీత.

          ఆ ప్రెస్మీట్, ఆ హడావుడి పూర్తయ్యాక ఒడిలో ఒద్దికగా పడుకున్న బిడ్డను ఆనందం గా చూసుకుంది సీత. ఆ ఆనందం… రాముడు మాట మీద మంటల్లో దూకి అగ్నిపునీతగా బయటకి వచ్చిన అలనాటి సీతను తలపించేదే!

PUBLISHED ON NECHELI.COM WEB MAGAZINE 4TH ANNIVERSERY SPL ISSUE IN JULY, 2023


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి