శుక్రవారం, ఆగస్టు 18, 2023

అబద్దాల చక్రవర్తి!



అధినేత అద్దంలో చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, సెక్రటరీ వచ్చాడు.

''రావయ్యా సెకట్రీ! నీకోసమే చూస్తున్నాను. నిన్న స్వతంత్ర దినం సందర్భంగా మనం ఇచ్చిన స్పీచ్ఎలా ఉంది?''

''అదిరిపోయింది సార్‌...''

''నేనడిగింది నీ అభిప్రాయం కాదయ్యా... నువ్వెలాగూ నేనేది చెప్పినా అదిరిందనే అంటావు. జనం ఏమనుకున్నారూ అని...''

''వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అదే సార్‌. ఎలాగూ వినక తప్పదు కాబట్టి విన్నాక తలలూపేశారండి...''

''అంటే మన ప్రసంగంతో ఏకీభవించారంటావా?''

''ఏకీభవించక చేసేదేముందండీ? తమరు ఎక్కడ ఏ ప్రసంగం చేసినా చెప్పేదదే కదండీ? పైగా మీ స్పీచ్కూడా ఆళ్లకు తెలిసిందే కదండీ? పార్టీ సమావేశమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రారంభోత్సవమైనా, బడి పిల్లలు పాల్గొనే సభలాంటిదైనా, ఆఖరికి బారసాలైనా, పెళ్లయినా తమరి ధోరణి అదే కదండీ? ఓ మార్పా, ఓ చేర్పా, ఓ సమయమా, ఓ సందర్భమా? ఇక అందులో కాదనేదేముందండీ?''

''అంతేనంటావా? అయినా అదేంటోనయ్యా సెక్రట్రీ, మైకు మూతి ముందుకు రాగానే మనకి మైకం కమ్మేస్తుందయ్యా. బుర్రలో ఉన్నవన్నీ నోట్లోంచి కుమ్ముకుంటూ బయటకొచ్చేస్తాయి. ఆ తొందర్లో ముందెనకలుండవనుకో. అయినా అన్నీ చెప్పానా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది. అందుకే నిన్ను అడుగుతుంటా. నువ్వయితే మనలో మన మాటగా ఉన్నదున్నట్టు చెబుతావని. ఏమీ మర్చిపోలేదు కద?''

''అబ్బే... ఏదీ మర్చిపోలేదండి. ఓ టేపు రికార్డరు లాగా, ఓ సినిమాలో సన్నివేశంలాగా అన్నీ అలాగే ఉన్నాయండి. తమరి హయాంలో చేసినవెన్నో ఉన్నట్టు, మీరు తప్ప మరెవరూ అంతలేసి పనులు చేయనట్టు, అసలు మీ వల్లనే బడుగుల బతుకులు బాగుపడినట్టు, ఆమాటకొస్తే సామాన్య జనానికి అంతక్రితం ఊపిరి తీసుకోవడం కూడా రానట్టూ, తమరి ప్రభుత్వం వచ్చాకనే గాలి పీల్చుకుంటున్నట్టు... అబ్బబ్బ... ఏం చెప్పారండి బాబూ! వింటున్న నాకే దిమ్మదిరిగిపోయిందంటే నమ్మండి''

''మరి చెప్పొద్దుటయ్యా? ఈ వెర్రి జనానికి ఏదీ పట్టదనుకో. ఇంటికెళ్లగానే అన్నీ మర్చిపోతారు ఎర్రెదవలు. అందుకే పదే పదే అదే అదే సోది చెబుతూ ఊది ఊది ఊదరగొడుతూ ఉంటా. అయినా ఆళ్ల బుర్రల్లోకి ఎక్కిందో లేదో డౌటేననుకో...''

''ఎక్కకేం చేస్తుందండీ. అందుకే మీరు చెబుతూ ఉంటూ ఎవరూ నోరెత్తలేదండి. అసలు ఇంతలేసి అభివృద్ది పనులు మన చుట్టూ జరిగిపోయాయా, మన బతుకులన్నీ ఇంతలా బాగుపడిపోయాయా, మన రాష్ట్రం మరీ ఇంతగా వెర్రెత్తినట్టు ప్రగతి దారుల్లో పిచ్చి పరుగులెట్టేస్తోందా, కాస్తయినా వెనకా ముందూ చూసుకోకుండా ఎదిగిపోతోందా, అసలు బడుగులనేవారు లేనే లేరా, సామాన్యులందరూ అసామాన్యలైపోయారా, పేదరికమనేది పేరుకైనా లేదా... అని ఒకటే దిగ్భ్రాంతకి గురయిపోయారండి. కొయ్యబొమ్మల్లా అందరూ మాన్ప్రడిపోయారంటే నమ్మండి. ఆ షాక్లో పడి గుడిసెకెళ్లి నేల మీద చింకి చాప పరుచుకుని పడుకున్నాక కూడా భ్రమలు తొలగవనుకోండి. ఆ మత్తులో, ఆ మైకంలో స్వర్ణయుగం అంటే ఇదేనని నిద్రలో కలవరించినా ఆశ్చర్యంలేదండి. ఆయ్‌...''

''...హ్హ...హ్హా! మనకి కావలసిందదేనయ్యా. ఈ వెర్రి జనాన్ని ఎప్పుడూ మత్తులో ముంచెత్తాలయ్యా. లేకపోతే ఏమరిపోతారు. ఆళ్లు గంజినీళ్లు తాగుతున్నా, అదే పరమాన్నమన్నట్టు నమ్మించాలి. చెమటలు చిందిస్తూ తెగ కష్టపడక తప్పకపోయినా మనవల్లనే ఆ పాటయినా సుఖంగా ఉన్నట్టు భ్రమ కల్పించాలి. నిజానికి అదో కళ అనుకో...''

''అబ్బో... ఆ కళలో తమరి తర్వాతేనండి బాబూ అందరూనూ. అబద్దాన్ని నిజంగా చెలామణీ చేయడంలోనూ, నిజాన్ని దాచిపెట్టి అబద్దాన్ని అలవోకగా అందలమెక్కిండంలోనూ, నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేయడంలోనూ, అబద్దాన్ని అలంకరించి తైతక్కలాడించడంలోనూ ... నిజంగా మీరు ఆరితేరిపోయారంటే అందులో ఆవగింజంతయినా అబద్దం లేదంటే నమ్మండి...''

''వార్నీ... మొత్తానికి నువ్వుండవలసినవాడివయ్యా. ఇంతకీ నా ఉపన్యాసంలో నిజాలూ, అబద్దాలూ తార్మార్తక్కిడ మార్అయిపోయాయంటావ్‌. ఏదీ ఒక్కసారి ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పి చూడు. నా నైజం నీకెంత మాత్రం అంతుచిక్కిందో చూస్తాను... అహ... మనలో మన మాటలే...''

''అమ్మమ్మ... అంతలా నన్ను ఆకాశానికెత్తేయకండి. తమరి నైజం తెలుసుకోవడం నా తరమా? మీ స్పీచ్విని జేజేలు కొట్టే జనంలాగా నన్నూ జమేయకండి మరి. అయినా తమంత వారు తమరు అడిగారు కాబట్టి చెబుతానండి. ఆనక అబద్దపు కేసులవీ పెట్టించకూడదండి మరి...''

''...హా...ర్నీ! భయపడకయ్యా... ఆ కేసులన్నీ ఎగస్పార్టీ వాళ్ల కోసమూ, మనల్ని ప్రశ్నించే వాళ్ల కోసమయ్యా. నీలాగా, నా జనంలాగా ఎర్రిబాగులవాళ్ల కోసం కాదులే. ధైర్యంగా చెప్పు. వింటాను...''

''అమ్మయ్య... అలా భరోసా ఇచ్చారు కాబట్టి సరేనండి మరి. అసలు మిమ్మల్ని మించిన గుండెలు తీసిన బంటు ఎవరుంటారనిపించిందండీ బాబూ మీ ఉపన్యాసం విన్నాక. ఆహా... ఏం చెప్పారండీ? పాదయాత్రల కాలంలో కేంద్రం మెడలు వంచుతానని భ్రమ కల్పించారు కదండీ? మరి ఈ నాలుగేళ్లలో ఏం చేశారండీ? నలభై సార్లు ఢిల్లీ వెళ్లి పెద్దలందరికీ మూడు నామాల వాడి బొమ్మలు చేతిలో పెట్టి మెడలు వేలాడేసుకుని వచ్చేశారండి. మాట్టాడితే మూడు రాజధానులంటున్నారు కానీ, నాలుగేళ్లయినా ఒక్క చోట కూడా రాజధాని నిర్మాణానికి ఇటుకేసింది లేదండి. అవునాండీ? అయినా సరే, స్వతంత్ర దినోత్సవం నాడు మళ్లీ మూడు రాజధానుల మాటెత్తడానికి ఎంత ధైర్యం కావాలండీ తమకి? ఎంత నిస్సిగ్గు నిబ్బరం ఉంటే అలా మాట్లాడగలరు చెప్పండి? ఇహ... గాంధీగారి మాటెత్తి ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యం తమరి వల్లనే సాకారమైనట్టు ఎంత తెగువగా బొంకారండీ? వింటున్న నాకే బుర్రగిర్రున తిరిగిపోయిందండి బాబూ. ఓ పక్క గ్రామాల్లో సమాంతర వ్యవస్థను ఏర్పాటు  చేసి వాలంటీర్లకీ, గ్రామ సచివాలయ సిబ్బందికీ లేనిపోని పెత్తనం కట్టబెట్టి, ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి కూడా... అంత ధీమాగా బోరవిరుచుకుని మరీ ఎలా బుకాయించారండీ బాబూ? నాకయితే కళ్లు బైర్లు కమ్మాయనుకోండి. అసలన్నింటి కంటే పెద్ద జోకేంటంటేనండీ, ఓ పక్క పోలవరంతో సహా అన్ని జల ప్రాజెక్టులూ తాబేలుతో పందెం కట్టి ఓడిపోతుంటే, తమరు మాత్రం అన్నింటి పనులూ చకచకా సాగిపోతున్నాయని వాగడానికి ఎంత తెగింపు కావాలండి బాబూ?  ఆ విషయంలో మీకు జోహార్లండి! అసలది కాదండి బాబూ హైలైటు. సామాజిక న్యాయం అనే మాటకి తమరే అసలైన అర్థం చెప్పినట్టు మాట్టాడారు చూడండి... అందుకెంత తెగింపు ఉండాలండీ? ఓ పక్క పదవులను అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కట్టబెట్టామని చెప్పారు కానీండీ, ఆ పదవుల్లో ఉన్న వారికి చిన్నపాటి నిర్ణయమైనా తీసుకోడానికి అధికారం ఇచ్చారా చెప్పండి? అసలు ఉపముఖ్యమంత్రులను కూడా ఏనాడైనా నోరెత్తనిచ్చారాండీ? ఇక మంత్రుల సంగతి చెప్పేదేముందండీ? వాళ్లందరినీ ఊరేగే విగ్రహాలుగా మార్చేసి, ప్రతి చిన్న విషయం కూడా తమరికి తెలియకుండా పరిష్కారం కానంతగా అధికార కేంద్రీకరణ చేసుకుని కూడా... అబ్బబ్బబ్బ... వికేంద్రీకరణ గురించి, సామాజిక న్యాయం గురించీ అనర్గళంగా స్పీచ్దంచగలిగారంటే... ఆహా... అది కాదుటండీ, అసలు సిసలు రాజకీయ చాతుర్యం? ఓ పక్క విద్యార్థుల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామంటారా? మరో పక్క విద్యావ్యవస్థ మొత్తం గబ్బు పట్టిన సంగతిని మర్చిపోతారా? ఆ మాటకొస్తే... రైతులకు పాదయాత్రల సందర్భంగా మీరిస్తానన్నదెంత, ఇప్పుడిస్తున్నదెంత అనేది చూసుకోకుండా కేంద్రం ఇచ్చే సాయాన్ని కూడా మీరే ఇస్తున్నట్టు బరితెగించి ఉపన్యాసం దంచారు చూడండి... అది కాదుటండీ... అరాచకీయ నైపుణ్యం? ఓ పక్క రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం పైపైకి ఎగబాకుతున్న నిజాన్ని విస్మరించి కూడా ఇలా మాట్లాడారంటే...  అసలు ప్రపంచ నీచ రాజకీయ చరిత్రలో ఎవరికుంటుందండి బాబూ ఇంత దబాయింపు? వేర్వేరు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశానంటూ ఎంత ఘనంగా గొప్పలు చెప్పుకున్నా, తమరు ఓటు బ్యాంకు కోసం ప్రవేశపెట్టిన నవ రత్నాల పధకాల నిధుల్నే వాటి ద్వారా మళ్లిస్తూ వంచన చేస్తున్ననిజాన్ని మరుగునపరిచారు చూశారా... ఆ గుండె ధైర్యానికి జేజేలండి. అమ్మమ్మమ్మ... అంబేద్కర్సూక్తుల్ని ఎంత బాగా వాడుకున్నారండి బాబూ. నాకయితే మతిపోయిందంటే నమ్మండి. చేతులకు సంకెళ్లు లేకపోయినా, భావాలకు స్వేచ్ఛ లేకపోతే అది స్వతంత్రం కాదంటూ భలే అబద్దాలు దంచికొట్టాశారు చూడండి అంతకుమించిన దగాకోరుతనం ఎవరికుంటుందండీ, తమకు తప్ప? అహ... ఓ పక్క తమరి హయాంలో ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది చెప్పండి? నిలదీసిన ప్రతిపక్షాల వారిపై రాజకీయ కక్ష కడతారా, నిజం రాసే పత్రికలపై అక్రమ కేసులు పెడతారా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారా, నిరసన ప్రదర్శన చేసే వారు ఆడవాళ్లని కూడా చూడకుండా ఈడ్చి పారేయిస్తున్నారా, ఎలుగెత్తి ప్రశ్నించే వారిని గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులంటూ అణచేస్తున్నారా, అసలు ఎవరినైనా నోరెత్తనిస్తున్నారా అంట? ఇంత చేస్తూ కూడా ప్రజల స్వేచ్ఛ గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంత అలవోకగా నీతులు వల్లించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది చెప్పండి? అసలదీ ఇదీ కాదండీ, అన్నీ మీకు తెలిసి కూడా, మీరు మాట్లాడిన దాంట్లో నిజాలేంటో, అబద్దాలేంటో తెలిసి కూడా, మీ సెక్రట్రీని అయిన పాపానికి నన్ను అమాయకంగా అడుగుతున్నారు చూడండి... ఆహా...ఆహా... ఎంత నంగనాచితనం? ఎంత బరితెగించినతనం? ఒక్క మాటలో చెప్పాలంటే తమరు సాక్షాత్తూ... నిజాలకు పాతరేసే అబద్దాల చక్రవర్తులండి! అబద్దాలు చెప్పి నమ్మించే నిజమైన నీచ రాజకీయ రాజాధిరాజులండి!''

సెక్రట్రీ చెప్పినదంతా ఆనందంగా, తమకంగా, ముసిముసినవ్వులు నవ్వుతూ, తన్మయత్వంతో, తనివి తీరా విన్నాడు అధినేత.

''నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ సెక్రట్రీ, ఇంతకీ నువ్వు నన్ను తిడుతున్నావా? పొగుడుతున్నావా? సమర్ధిస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా?''

''అయ్యా... మీ ఉప్పు తిని బతుకుతున్నవాణ్ని. ఏదో చెప్పమంటే చెప్పాను. నన్ను మాత్రం ఇలాంటి చిక్కు ప్రశ్నలేసి ఇబ్బంది పెట్టకండి మహాప్రభో!''

అధినేత పగలబడి నవ్వేశాడు.

''భయపడకయ్యా సెక్రట్రీ! నా వెర్రి ప్రజలెంతో నువ్వూ అలాంటివాడివే నాకు. నేను ఎదగాలంటే నీలాంటోళ్లు ఉండాలయ్యా. కాబట్టి ధైర్యంగా ఇంటికి పోయి రేపు నేను తీసుకురాబోయే స్వర్ణయుగం గురించి కలలు కంటూ పడుకో. పోయిరా''

-సృజన

PUBLISHED ON 18.08.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి