ఆదివారం, సెప్టెంబర్ 24, 2023

చింపాంజీ చెప్పిన పాఠం!


నా చిన్నప్పటి జ్ఞాపకాలను తోడి చూసుకుంటే చెల్లూరులో అక్షరాభ్యాసం జరగడం గుర్తుంది. ఆ వేడుకకి మా నాన్నగారు నాకు నెహ్రూ కోటు కుట్టించారు. దాని రెండో బొత్తంలో గులాబీ పువ్వు కూడా గుచ్చారు. మా నాన్నగారు హెడ్మాస్టరుగా ఉండేవారు. ఆ రోజు అంతా హడావుడే. నా చేత పిల్లలకి పలకలు, బలపాలు పంచి పెట్టించారు. ఎవరెవరో వచ్చారు. అందరూ నాకు ఏవేవో బహుమతులు ఇచ్చారు. అందరూ వెళ్లాక చూసుకుంటే ఎన్ని బొమ్మలో. కీ ఇస్తే గుండ్రంగా స్కూటరు నడిపే చింపాంజీ బొమ్మ, కీ ఇస్తే పాకే పిల్లాడి బొమ్మ... ఇలా చాలా. వాటన్నింటినీ నేల మీద వరసగా పరుచుకుని ఆడుకోవడం గుర్తుంది. నా అక్షరాభ్యాసానికి మా బాబ్జీ మావయ్య కూడా వచ్చాడు. మేమిద్దరం ఆ బొమ్మలతో చాలా సేపు ఆడుకున్నాం. బాబ్జీ నా కన్నా అయిదారేళ్లే పెద్దవాడు. అంటే నేను పిలగాడినైతే, మావయ్య కుర్రగాడన్నమాట. ఇద్దరం చాలా సేపు ఆడుకున్నాక ''ఒరేయ్‌... ఈ చింపాంజీ బొమ్మలో ఏముందో చూద్దామా?'' అన్నాడు బాబ్జీ మావయ్య. 

''ఎలా?'' అన్నాన్నేను బోలెడంత ఆశ్చర్యంతో. 

''ఏముందీ? విప్పితే సరి. ఎలా తిరుగుతోందో తెలుస్తుంది'' అన్నాడు. 

అప్పుడు నాకు బాబ్జీ ఓ హీరోలా కనిపించాడు. ''ఆ...'' అన్నా నేను హుషారుగా. 

''అయితే ఓ చెంచా తీసుకురా'' అన్నాడు బాబ్జీ ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని. 

''మరి బొమ్మ పాడయిపోతుందేమో...'' మనలో బెంగ.

''ఏం కాదెహె. మళ్లీ బిగించేయొచ్చు...'' 

అంతే... మనం పరిగెత్తుకు వెళ్లి ఓ నాలుగు చెంచాలు తెచ్చేశాం. ఈ లోగా బాబ్జీ దాని ముఖమల్‌ చొక్కా విప్పేశాడు. నేను తెచ్చిన చెంచాల్లోంచి ఒకటి ఎంచుకుని దాని వెనక అంచుతో ఆ బొమ్మ స్క్రూలు విప్పాడు. లోపల ఏవేవో పళ్ల చక్రాలు. నేను కుతూహలంగా ఒంగుని చూస్తుంటే లోపల చక్రాలు, అన్నీ విప్పేశాడు.  

''అదీ సంగతి...'' అన్నాడు ఏదో కనిపెట్టినట్టు.

''ఏంటీ?'' అన్నాను నేను ఉత్కంఠతో.

''ఇదిగో... మనం కీ ఇచ్చినప్పుడు లోపల ఈ స్ప్రింగు తిరుగుతుంది. కీ తీసేయగానే దానికి ఆనుకుని ఉన్న ఈ బుల్లి చక్రం తిరుగుతుంది. దీని వల్ల ఈ పెద్ద చక్రం, దాని వల్ల స్కూటరుకి ఉన్న చక్రాలు తిరుగుతాయి...'' అంటూ వివరించాడు. 

''భలే భలే... ఇప్పుడు బింగించేసి చూద్దామా?'' అన్నాన్నేను. 

బాబ్జీ బిగించడం మొదలెట్టాడు మనం ఆసక్తిగా చూస్తుంటే. కానీ స్ప్రింగు ఎగదన్నింది. దాన్ని చుట్ట చుట్టి లోపల పట్టించాడు. ఆ తర్వాత ఒకో స్క్రూ బిగించాడు. ఆఖరుకి చింపాంజీ ముఖమల్‌ చొక్కా వేసేశాడు. తర్వాత కీ హోల్‌లో కీపెట్టి తిప్పాడు. తిరగలేదు!

మనం బిక్క మొహం వేశాం. బాబ్జీ బలవంతంగా తిప్పాడు. కానీ బొమ్మ తిరగలేదు! పక్కకు పడిపోయింది!!

నేను ఏడుపు లంకించుకున్నాను. ''నా చింపాంజీ బొమ్మ పాడయిపోయిందీ...ఈ...ఈ...'' అంటూ!

నా ఏడుపు లోపల పడుకున్న అమ్మ, నాన్నలకి వినిపిస్తుందని బాబ్జీ కంగారు పడ్డాడు. 

''ఏడవకు. ఇంకోటి కొనిపెడతాలే. నేను విప్పానని చెప్పకేం. తిడతారు...'' అంటూ నా నోరు నొక్కి బుజ్జగించి, బతిమాలాడు. 

కాసేపయ్యాక  నేను ఏడుపాపి, ''మరి నాన్నగారు ఈ బొమ్మ తిరగడం లేదేంటని అడిగితే?'' అన్నాను బెంగతోనే. 

బాబ్జీ అపాయం తప్పించుకునే ఉపాయం కోసం ఆలోచనలో పడ్డాడు. 

''ఇన్ని బొమ్మల్లో ఇదేం గుర్తుంటుంది? ఓ పని చేద్దాం. ఈ చింపాంజీ బొమ్మని పాడేద్దాం. సరేనా?'' అన్నాడు బాబ్జీ.

నేను అయిష్టంగానే ''సరే...'' అన్నాను.

ఇద్దరం వీధి తలుపు తీసి బయటకి వెళ్లాం. మా ఇంటి ఎదురుగా రోడ్డుకి అవతల ఓ పెద్ద గొయ్యి ఉండేది. ఆ చుట్టు పక్కల ఇళ్ల వాళ్లు ఆ గొయ్యిలో చెత్తంతా పడేసేవాళ్లు. బాబ్జీ ఆ బొమ్మని అందులోకి గిరవాటు వేశాడు. 

తిరిగి వచ్చి బొమ్మలన్నీ దాచేశాం. కాసేపటికి అమ్మా,నాన్నగారూ లేచారు. 

''ఒరేయ్‌... ఏవీ నీకొచ్చిన బొమ్మలు తీసుకురా..'' అన్నారు నాన్నగారు. 

మనం బెంగగానే బొమ్మలన్నీ తెచ్చాం. ఇంతలో అమ్మ వచ్చి ''ఒరేయ్‌... ఆ చింపాంజీ బొమ్మేదిరా? చాలా బాగుంది'' అంది. 

''అదీ... అదీ...'' అని నేను నసుగుతుంటే, బాబ్జీ అందుకుని, ''అక్కా! దాంట్లో ఏముందో చూద్దామన్నాడే వీడు. విప్పి చూశాం. పాడయిపోయింది...'' అంటూ నెమ్మదిగా చెప్పాడు.

''అప్పుడే తగలెట్టేశారా?'' అంటూ అమ్మ కేకలేసింది. 

''అందులో ఏముందో చూడ్డం ఎందుకు? హాయిగా ఆడుకోక?'' అంటూ అమ్మ నా వీపు మీద ఒకటేసి, ''అయినా వాడు విప్పమంటే విప్పేయడమేనా? ఇద్దరూ కలిసి నిక్షేపంలాంటి బొమ్మని నాశనం చేశారు. వాళ్లిచ్చి గంటయినా కాలేదు...'' అంటూ బాబ్జీని కేకలేసింది.

ఇంతలో నాన్నాగారు, ''సర్లే... పాడయితే పోనీకానీ, ఆ బొమ్మేది?'' అన్నారు. 

''మరేం... బాబ్జీ దాన్ని బయటకి విసరేశాడండీ...'' అని నేను నిజం చెప్పేశా. 

''ఓరి వెధవల్లారా.  అదుంటే జాగ్రత్తగా బిగిద్దుం కదా?'' అన్నారు నాన్నగారు. 

బాబ్జీ కుదుటపడి, ''బావగారూ! ఆ గోతిలోకే విసిరేశామండీ? పోయి తెచ్చేదా?'' అంటూ పరిగెత్తాడు. 

''ఆగరా...'' అంటుండగానే వెళ్లి ఆ గోతిలోకి దిగి, చెత్తంతా వెతికి ఆఖరికి చింపాంజీని తీసుకొచ్చాడు. 

నాన్నగారు దాన్ని చూసి, ''ఎలా విప్పావురా?'' అన్నారు. 

''ఇదిగో... ఈ చెంచాతో...'' అన్నాడు బాబ్జీ.

''ఏడిశావ్‌. వెళ్లి అలమారలో టర్నస్క్రూ ఉంటుంది తే...'' అన్నారు. 

బాబ్జీ వెళ్లి తెచ్చాడు. 

''బాగానే ఉంది. ఇప్పడు దాన్ని బిగిస్తూ కూర్చుంటారా, చిన్నపిల్లాడిలాగ...'' అంటూ అమ్మ ఎకసెక్కం చేసింది.

నాన్నగారు ''చూద్దాం...'' అంటూ పని మొదలెట్టారు. ఈసారి నేను, బాబ్జీ కూడా కుతూహలంగా  ఒంగుని చూడసాగాం. నాన్నగారు జాగ్రత్తగా దాని చొక్కా తీసి, ఆ తర్వాత దాని స్క్రూలు విప్పి, లోపల పరిశీలించారు. 

''వెధవా... ఈ స్ప్రింగుని సరిగా దాని ప్లేస్‌ లో పెట్టలేదురా'' అంటూ సరి చేశారు. తిరిగి అన్నీ బిగించి, చొక్కా వేసి, కీ ఇచ్చారు. 

మా ఇద్దరిలోనూ ఉత్కంఠ! నాన్నగారు దాన్ని నేల మీద పెట్టి వదలగానే ఆశ్చర్యం! అది గుండ్రంగా గిరిగిరా తిరిగింది!  నా మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగింది. బాబ్జీ ఊపిరి పీల్చుకున్నాడు. 

''ఒరేయ్‌... విప్పితే విప్పారు కానీ, దాన్ని పడేయాలని ఎందుకనుకున్నారు?'' అని అడిగారు. మేం చెప్పాం.

''కుతూహలం మంచిదే. కానీ... మీరు ఒక తప్పు చేసి, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. బొమ్మ పాడయితే ఆ సంగతి ధైర్యంగా చెప్పవచ్చు కదా?'' అన్నారు. 

అప్పట్లో అర్థం కాకపోయినా, ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మాటల్లో ఎంత మంచి పాఠముందో తెలుస్తోంది. 

ఏదయినా చేతకాని పనిని వెనకా ముందూ ఆలోచించకుండా చేయకూడదు. ఒకవేళ చేసినా దాని పర్యవసానాల్ని దాచాలని ప్రయత్నించకూడదు. తప్పు చేసినా దాన్ని ధైర్యంగా చెప్పాలి కానీ, కప్పెట్టాలని చూడకూడదు. 

ఇది... నాకు చింపాంజీ చెప్పిన పాఠం! 



1 కామెంట్‌: