సోమవారం, జనవరి 01, 2024

ఆటవిక ఆట వికట!


 

''కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు...

పట్టు పట్టు గెలుపునే పట్టు...

పదపదా ఇది మన సమయం పదా...

కదకదా  ఇది మన ఆట కదా...''

... హుషారుగా పాట పాడుకుంటూ వచ్చిన శిష్యుడిని ఎగాదిగా చూశారు గురువుగారు.

''ఏంట్రా? నాలుగు రోజుల్నుంచి అయిపూ, అజా లేవు. ఎక్కడికి పోయావ్‌?''

''ఎక్కడకేంటండి బాబూ! ఊరూ వాడా ఒకటే సందడండి. అందరూ ఆటల మీద పడ్డారండి. అబ్బో... ఎంత కోలాహలం? ఎంత హడావుడి? అధికారులని కాదు, నాయకులని కాదు అందరూ మైదానాల్లోనే కనిపిస్తున్నారండి. స్వయంగా ముఖ్యమంత్రిగారు క్రికెట్ఆడారండీ బాబూ! పైగా ఆయన ఆడ్డమే కాదండి... ఆటల మంత్రికి బ్యాటెలా పట్టుకోవాలో దగ్గరుండి మరీ చూపించారండి... భలే సరదాగా ఉంది లెండి...''

''అంటే అవన్నీ చూస్తూ రాజకీయ పాఠాల సంగతి మర్చిపోయావన్నమాట. అంతేనా?''

''రాజకీయ పాఠానికేముందండీ? ఎప్పుడైనా నేర్చుకోవచ్చండి. కానీ ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ వస్తుందేంటండి? అందుకే మీరేమనుకున్నా సరేనని మైదానాలట్టుకుని అలా పోయానండి...''

''అయితే ఇక అట్నుంచటే ఉడాయించలేకపోయావ్‌? మళ్లి ఇటెందుకొచ్చావ్‌?''

''అయ్బాబోయ్‌! అలా కోపగించుకోకండి. ఎప్పటికైనా రాజకీయాల్లో రాటుదేలాలనే కదండీ మీ దగ్గర చేరింది? ఏదో ఎక్కడ చూసినా పాటలూ అవీ పెట్టి ఊదరగొడుతుంటే వెళ్లొచ్చానండి. కరపత్రాలు గట్రా పంచుతూ రారమ్మంటుంటే బాగోదని బయల్దేరానండి...''

''సరేలే. ఇంతకీ నువ్వు గమనించిందేంటో చెప్పు చూద్దాం?''

''అబ్బో... ఏం చెప్పనండి బాబూ? ఇది అలాంటిలాంటి కార్యక్రమం కాదుటండి. దేశ చరిత్రలోనే మైలు రాయంటండి. అసలింత వరకు ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదుటండి. ఇక మన రాష్ట్రం పేరు సువర్ణాక్షరాలతో రాసేసుకోవచ్చుటండి. రాబోయే కాలంలో ఇహ చూస్కోండి, నా రాజా... ఇండియన్క్రికెట్టీం నిండా ఆంధ్రా వాళ్లే ఉంటార్టండి.  ఒలింపిక్స్లో గోల్టు మెడల్స్బోల్డు వచ్చేస్తయంటండి. ఇంటర్నేషనల్ గేమ్స్లో ఇక మనకి తిరుగుండదటండి. మీరేమైనా చెప్పండి గురూగారూ, మన ముఖ్యమంత్రికి మాత్రం భలే ఆలోచన వచ్చింది కదండీ. ఏమంటారు?

''నేనేమనడానికేముందిరా. అన్నీ నువ్వే అంటున్నావు కదా? మరి ఇంత అద్భుతమైన ఆలోచనతో మన క్రీడలకి పదును పెడుతున్న సీఎం గారికి  మంచి బిరుదు ఇవ్వద్దురా?  సంగతి ఏమైనా ఆలోచించావా?''

''అవునండోయ్‌, నిజమే. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మీరు కూడా సమయానుకూలంగా బాగా సూచిస్తారండి...''

''మరయితే  బిరుదేంటో ఆలోచించు ముందు. తర్వాత నేర్చుకుందువుగాని రాజకీయ పాఠాలు...''

''అలాగేనండి. ... ఖేల్రత్న?పోనీ... క్రీడారంగ మార్తాండ?  ఆటల చక్రవర్తి? కేళీ విలాస దురంధర? క్రీడాంగణా ధురీణ? ఏమో సార్‌... నాకు తట్టడం లేదు. మీరే చెబుదురూ?''

''ఆటలో అరటి పండు!''

''అయ్బాబోయ్‌... అదేంటండీ అలాగనేశారు? ఇది వెటకారమా? వెక్కరింపా? ఆయనంత కష్టపడి క్రీడాకారుల్ని పట్టుకుని, ప్రోత్సహించి, రాటుదేల్చి, క్రీడాస్ఫూర్తిని రంగరించి, నూరిపోసి, క్రీడల్ని ఉద్ధరించి, ఊరేగించి... రాష్ట్రానికి మంచి పేరు తెద్దామని తెగ ఆరాట పడుతుంటే మీరిలాంటి బిరుదు ఇస్తానంటారేంటండీ?''

''ఓరెర్రెదవా...  బిరుదు ఆయనకి కాదురా, నీకు!''

''నాకాండీ? నేనేం చేశానండీ?''

''ఒక్క నీకే కాదురోయ్‌. మొత్తం జనాలందరికేననుకో...''

''అదేంటండి బాబూ? అయినా జనాలేం చేశారండీ?''

''పాపం వాళ్లేం చేయలేదురా. ఆయనే అందరినీ ఆటలో అరటి పళ్లు చేసేశాడు. అర్థమైందా?''

''ఏంటో సార్‌! మీ మాటలన్నీ మతలబుగా ఉంటాయి. కాస్త తేలిగ్గా చెబుదురూ?''

''అసలు ఆటలో అరటి పండు అంటే తెలుసురా? ఆడ్డం రాని వాడినీ, అయినా ఆటలోకి తెలియకుండా వచ్చిన వాడినీ, ఏమీ తెలియకపోయినా ఆడేస్తున్నవాడినీ, ఆడే వాళ్ల వెనక పరిగెత్తడం తప్ప ఇంకేమీ చేతకాని వాడినీ... ఇలా రకరకాల అర్థాల్లో దీన్ని వాడతార్రా.  విధంగా చూస్తే ఇప్పుడు ఆంధ్రా వాళ్లంతా ఆటలో అరటి పళ్లయిపోయారన్నమాటే...''

''మొత్తానికి నన్ను మాటల్లో పెట్టి రాజకీయ పాఠం మొదలెట్టేశారని అర్థమైంది గురూగారూ. మరయితే చెప్పండి, మన ముఖ్యమంత్రిగారు ఇలా ఆటల పోటీలు పెట్టడం తప్పంటారా?''

''ఒరే బడుద్ధాయ్‌! ఇలా కొన్ని ప్రశ్నలు నేరుగా అడక్కూడదురా. ఇది రాజకీయాల్లో మొదటి పాఠం. ఒకవేళ నీలాగా ఎవరైనా అడిగినా సూటిగా జవాబు చెప్పకూడదు. ఇది రాజకీయాల్లో రెండో పాఠం. ఇక ఆంధ్రాలో ఆటల దగ్గరకి వద్దాం. ముఖ్యమంత్రిగారు తలపెట్టింది అలాంటిలాంటి కార్యక్రమమా చెప్పు? ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా వంద కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి, ఊరూ వాడా, పల్లెపల్లెల్లో, గ్రామగ్రామాన ఆటల పోటీలు పెట్టి వాటి ద్వారా జనాల్లో నిద్రపోతున్న క్రీడాకారుల్ని ఉన్నట్టుండి తట్టి లేపాలనే ఆలోచన ఉంది చూశావూ? మహ భేషైనదిరా. ఈయన కుర్చీ ఎక్కి నాలుగున్నరేళ్లయినా ఇంత వరకు ఆవులిస్తూ కూర్చుని, తీరా ఎన్నికలకు ముందు మూడు నెలలయినా లేని సమయంలో ఇంత హడావుడి చేస్తున్నందుకు ఎంత మెచ్చుకుంటే మాత్రం చాలుతుందిరా? ఆటలాడ్డం చక్కని వ్యాయాయమని, అందువల్ల ఆరోగ్యం వెల్లివిరుస్తుందని, జనాలందరూ తమ సమస్యలన్నీ మర్చిపోయి మైదానాల్లో పడి ఆడుకుని ఆనందించాలని, ఆటలు చూసి మైమరిచిపోవాలని తెగ ఆరాట పడుతున్న ఆయన అనితర సాధ్యమైన ఆశయాన్ని పొగడడానికి అసలు మన తెలుగు భాష సరిపోతుందిరా? అసలిది ఆటలాడుకునే కాలమా, కాదా, అందుకు అనువైన వాతావరణం ఉందా, లేదా అని కూడా చూడకుండా ఆయన పడుతున్న తాపత్రయానికి విలువగట్టగలవురా?  పక్క పెద్ద పరీక్షలు ముంచుకొస్తుంటే, పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఆరాట పడుతుంటే, కొండల్లాంటి కోర్సులు పూర్తికాక విద్యార్థులు కిందా మీదా పడుతుంటే, అవేమీ పట్టించుకోకుండా వాళ్లలో అణగారిపోయి పడున్న క్రీడాసక్తిని మేల్కొలపాలనే ఆయన ఉద్దేశానికి ఎలా జోహార్లు అర్పించాలో తెలుస్తుందిరా మనకి? ఒకొక్క సచివాలయం పరిధిలో కనీసం 250 మంది ఆటలాడే వాళ్ల పేర్లని నమోదు చేయాలని అటు అధికారుల్ని, ఇటు అనుచరుల్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన చిత్తశుద్ధిని శంకించగలమట్రా? ఆటగాళ్ల పేర్లని నమోదు చేయని ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడకుండా, వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరీ ఆటల అభివృద్ధికి పాటు పడుతున్న ఆయన తపనని కాదనగలమా? చదువులు చట్టబండలై, పరిశ్రమలు పలాయనం చిత్తగించిన పరిస్థితుల్లో యువతీయువకులందరూ పట్టాల కోసమో, పొట్ట కోసమో, ఉన్న ఊరు వదిలి వలసపోయాక...   గ్రామంలో చూసినా నాలుగు పదులు దాటిన నడివయసు వారో, వృద్ధులో మాత్రమే ఉన్నా సరే... ఆటలు సాగాల్సిందేననీ, ఆడేవాళ్లని తీసుకు రావలసిందేనని హుకుం జారీ చూసి ముందుకు సాగుతున్న ఈయన పట్టుదలను మెచ్చుకోకుండా ఉండగలమట్రా? ఎన్నికలు ముంచుకొస్తున్న  తరుణంలో,  తర్వాత ఉంటామో ఊడతామో కూడా తెలియక పోయినా సరే... జనంలో క్రీడాసక్తిని రగిలించాలని ఆయన పెట్టుకున్న లక్ష్యం ఎంత మహత్తరమైందో చెప్పగలువురా?  లక్ష్య సాధన కోసం ఇంటింటి సర్వేలు చేయిస్తూ, గడపగడపకీ కరపత్రాలు పంచిపెడుతూ, ప్రచారంతో హోరెత్తిస్తూ, యువకులు ఎవరూ ముందుకు రాకపోయినా సరే... వెనకాడకుండా ఆఖరికి డ్వాక్రా మహిళల్ని, పొదుపు సంఘాల వారిని, చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులని కూడా బలవంతంగా తీసుకొచ్చి... ఆడి తీరాల్సిందేనని బెదిరిస్తూ, దేబిరిస్తూ క్రీడా విన్యాసాలు చేయిస్తున్న ఆయనగారికి  బిరుదిస్తే మాత్రం చాలుతుందిరా? ఇదంతా ఎన్నికల స్టంటనీ, పేరుకుపోయిన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే దుష్ట ప్రయత్నమనీ విమర్శలు గుప్పిస్తున్నా పట్టంచుకోకుండా, ఒకటా... రెండా... ఏకంగా15 వేల సంచివాలయాల పరిధిలో ఆటల పోటీలు సాగాల్సిందేనని పట్టుదల పట్టి అను కున్నది ఆగకుండా చేసేస్తున్న ఆయన దూకుడుకి జోహార్లప్పించడం తప్ప, ఇక ఎవరైనా చేసేదేముందిరా? అలాగని అన్ని చోట్లా సరైన ఆట స్థలాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా, 5 వేలకు పైగా గ్రామాల్లో అసలు ఆడుకునే మైదానాలే లేకపోయినా ఖాతరు చేయకుండా, అసలు స్కూళ్లలో ఆటల మాస్టార్లు లేకపోయినా సరే, ఏకంగా 3వేల పీఈటీ పోస్టులు ఖాళీగా పడేడుస్తున్నా సరే, వాటిని నింపాలనే ధ్యాసే లేకుండా... 'నేను ఆడుకోవాలని చెబితే ఆడి తీరాల్సిందే ఖబడ్దార్‌' అన్నంత లెవెల్లో క్రీడల పునరుద్ధరణకు అకస్మాత్తుగా కంకణం కట్టుకున్న సీఎంగారి చిత్తశుద్ధిని కొలవడానికి  కొలమానాలు సరిపోతాయిరా? ఆడ్డానికి పిల్లలు రావడం లేదన్నా వినకుండా, అరకొరగా వచ్చిన పిల్లల చేత ఆడించడానికి ఎంపైర్లు కూడా లేరు మొర్రో... అని అధికారులు మొత్తుకుంటున్నా, సొంత సైన్యంగా ప్రతి పనికీ వాడేసుకుంటున్న గ్రామ వాలంటీర్లే న్యాయనిర్ణేతలంటూ తీర్మానించి, జగమొండిగా జనం చేత ఆడిస్తూ,  జనంతో ఆడుకుంటున్న  అపర క్రీడోద్ధారకుడి అసమాన విన్యాసాలని బిత్తరపోయి చూస్తూ మూర్చపోవడం తప్ప ఇక ప్రజలకిక వేరే దారేదిరా? ఆటస్థలాలు లేక ఇంటి స్థలాల లేఔట్లలో, ఇసుక గుట్టలు, కంకర రాళ్ల మధ్య,  పక్క పందులూ గేదెలూ తిరుగుతుంటే, వాటి మధ్యనే సందు చూసుకుని ఆడేసుకోవాలంటున్న మీ అధినేత అసమాన, అనితర సాధ్య, అసాధ్య, అసంబద్ధ విధానాలకు విస్తుపోవడమే కదరా, ఇక నీకూ నాకూ నీ పరగణా ప్రజలకీ మిగిలింది? ఆడించమంటున్నాడే తప్ప అందుకు తగ్గ నిధులు విడుదల చేయడం లేదంటూ అధికారులు తలలు పట్టుకుని మొత్తుకుంటున్నా వింటున్నాడా మీవాడు? మా చేత అడ్డమైన పనులూ చేయించుకుంటున్నారంటూ ఆఖరికి వాలంటీర్లు కూడా అడ్డం తిరిగితే ఆగుతున్నాడా మీ నేత? సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా ఆటలకి దూరం జరిగి బహిష్కరిస్తున్నా ఖాతరు చేస్తున్నాడ్రా  మీ అగ్రజుడు?  విధిలేక చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులని కూడా బతిమాలి ఆడిస్తూ, అవసరమైతే బస్సులు పెట్టి మరీ జనాన్ని మైదానాలకు తరలిస్తూ ఏదో కిందా మీదా పడి అయిందనిపిస్తున్న అధికారుల అవస్థలను పట్టించుకుంటున్నాడ్రా నీ పాలకుడు? మనమేం చేస్తే అదే ఘనకార్యమనుకుంటూ, దానికే ఘనంగా ప్రచారం చేసుకునే వైఖరితో  ఆటల కోసం పంచిపెట్టిన పరికరాల మీద కూడా తన బొమ్మలు ముద్రించుకున్న మీ ఏలిక తెలివితేటలని అసలు అంచనా వేయగలంరా మనం? ఇక  పరికరాలు సైతం నాసిరకంగా ఉన్నాయని అందరూ గగ్గోలు పెడుతున్నా చెవికెక్కించుకుంటున్నాడా? క్రికెట్వికెట్లు పాతుతుంటేనే విరిగిపోతున్నాయంటున్నా, వాలీబాల్ నెట్ లు తొలి మ్యాచ్కే చిరిగిపోతున్నాయంటూ గోల పెడుతున్నా, పరికరాలన్నీ నాసిరకంగా ఉంటున్నాయని మొరపెట్టుకుంటున్నా సరే... ఏమాత్రం చలించకుండా ఆటలాడిస్తున్నాడు చూడు, ఇలాంటి మీ వాడి ముందు సర్కస్లో పెద్దపులుల్ని ఆడించే రింగ్మాస్టర్కూడా తీసికట్టే కదరా? ఏమంటావ్, ఏం మాట్లాడవేం?''

''ఇంకేం మాట్లడతానండీ బాబూ... దిమ్మదిరిగి పోతేను. అమ్మమ్మమ్మా... ఆటల వెనక ఇంత లోతు ఉందాండీ? ఛీ ఛీ.. ఇది పచ్చి రాజకీయ నికృష్ట ఆలోచన తప్ప మరేదీ కాదని ఇప్పుడర్థమైందండి. ఎన్నికల ముందు ఎలాగోలా యువతని ఆడించి నాలుగు ఓట్లు దండుకోవచ్చనే  నీచ తలంపండి. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించాలనే దుష్ట యోచనే కానీ, క్రీడాభివృద్ధి చేసే పద్ధతిది కాదని తేలిపోయిందండి. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాలం కాని కాలంలో ప్రజాధనాన్ని దుబారా చేయడానికైనా వెనకాడని తెంపరి తనమేనండి ఇది. పాపం... అమాయక జనాన్ని వెర్రి వాళ్లని చేయడమేనండి ఇదంతానీ...''

''ఓరి నీ ఆవేశంగూలా! ఆటల వెనుక అర్థాలు గ్రహించాలి కానీ, ఊరికే వాగకూడదురా బడుద్ధాయ్‌. అయినా జనాలేమన్నా వెర్రివాళ్లనుకుంటున్నావేంట్రా? నీ ఏలిక అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అడ్డదిడ్డంగా ఆడుతున్న ఆటలన్నీ చూస్తూనే ఉన్నార్రా. అసలాటేంటో వాళ్లు మూడు నెలల్లో మొదలెడతారు. జనం ఓటుని స్పిన్చేసి బౌలింగ్చేస్తే మీవాడి వికెట్లు విరిగి అవతల పడతాయ్‌. ఓటు బ్యాట్పైకెత్తి షటిల్సర్వీసు చేస్తే కాక్కకావికలైపోతుంది. ఆడింది ఇక చాల్లే అని ఓటర్లు ఖోఖో చెప్పారనుకో, అధినేత అనుచరులంతా కోర్టు బయటకెళ్లి నుంచో వలసిందే. ఒకొక్క ఓటరూ కూత పెట్టి కబడ్డీ ఆడితే మీ వాడి జట్టంతా ఔటయి చిత్తయిపోతారు. ఓటుని జనం పైకెగరేసి వాలీబాల్షాట్లా కొట్టారనుకో నెట్చిరిగిపోయి మరీ పాయింట్లు మారిపోతాయ్‌. తిక్కరేగిన ప్రజలు రెచ్చిపోయి ఫుట్బాల్ఆట మొదలెట్టారనుకో, ఏలుతున్న వాళ్లంతా గోల్లోకి పడి గోల పెట్టాల్సిందే. అసలైన ఎన్నికల ఆట ముందుంది. తెలిసిందా?''

''అదిరిపోయిందండి బాబూ! మీ దగ్గరకి రాకపోయుంటే అసలీ ఆటల్లో అంతరార్థం తెలిసేదే కాదు నాకు. మొత్తానికి గొప్ప పాఠమే చెప్పారండి...''

''మరయితే ఇప్పుడు చెప్పరా. మీ వాడికి ఎలాంటి బిరుదు సరిపోతుందో?''

''ఖేల్ ఖతం ఖల్నాయక... నీచ క్రీడా నికృష్ట... అనాగరిక ఆటల సార్వభౌమ... దుష్ట కేళీ దురంధర... అపర క్రీడా విధ్వంసక... అడ్డగోలు ఆటల నాయక... ఆటవిక ఆట వికట.... బాగున్నాయాండీ?''

''సెభాష్రా... మరి వచ్చేప్పుడు పాడేవే పాట... దాని బదులు సరైన పాట పాడుతూ పోయిరా...''

''కొట్టు కొట్టు ఓటుతో దెబ్బ కొట్టు...

పట్టు పట్టు దుష్ట నేత పనిపట్టు...

పదపదా ఇది ఓటరు సమయం పదా...

కదకదా ఇది ఎన్నికల కాలం కదా!''

-సృజన

PUBLISHED ON 1.1.2024 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి