శుక్రవారం, నవంబర్ 22, 2024
సోమవారం, నవంబర్ 11, 2024
రాముడికి దాసులైన దివ్యాస్త్రాలు! (పిల్లల కోసం రాముడి కథ-10)
ఆదివారం, అక్టోబర్ 13, 2024
కుదరని సినిమాతో... మొదలైన ‘ముత్యాల ముగ్గు’!
ఓసారి ముళ్లపూడి వెంకట రమణకి ఓ మంచి ఆలోచన వచ్చింది. త్యాగయ్య జీవితాన్నీ, రాముడి కథనూ సమాంతరంగా చూపిస్తూ ఓ సినిమా చేయాలని! అందులో రాముడిగా ఎన్టీఆర్, త్యాగయ్యగా ఏఎన్నార్ అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు. 'త్యాగరాజ రామాయణం' అని పేరు కూడా ఊహించారు. అనుకుంటే సరిపోతుందా? లెక్కలు వేసుకోవాలి కదా! అలా బడ్జెట్ ఎంతవుతుందో చూస్తే అదొక భారీ సినిమా అవుతుందని తేలింది. నిర్మాతల కోసం అన్వేషణ మొదలైంది. ఎమ్వీఎల్ గా ప్రసిద్ధుడైన రచయిత, నిర్మాత మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహ రావు అప్పట్లో నూజివీడు కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆయన అక్కడి జమీందారీ వంశానికి చెందిన యువకుల్ని ఈ సినిమా నిర్మాణానికి ఒప్పించారు. అన్నీ కుదురుతున్నాయనుకునే సమయానికి 1974లో ఏయన్నార్ గుండె జబ్బు చికిత్స కోసం అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ప్రాజెక్ట్ ఆగింది. ఆయన తిరిగి వచ్చే లోగా తక్కువ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించాలని నిర్మాతలు ముళ్ళపూడిని కోరారు. అప్పుడు ఆయన వాళ్లకి చెప్పిన కథే 'ముత్యాల ముగ్గు'. 'ముత్యాల ముగ్గు' మరపురాని సినిమాగా మిగిలిపోయినా, ముళ్లపూడి ఊహించిన త్యాగరాజ రామాయణం మాత్రం మరుగున పడిపోయింది.
శనివారం, సెప్టెంబర్ 21, 2024
తిరుపతి లడ్డూలో అరాచకం కల్తీ!
తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే...
భక్తులు ముందు కాలి చెప్పులు విప్పేస్తారు!
పులకించిపోతూ అరచెయ్యి చాస్తారు!
చేతిలో పడిన ప్రసాదాన్ని వినయంగా కళ్లకు అద్దుకుంటారు!
'ఏడు కొండలవాడా! వెంకట రమణా!' అని స్మరిస్తూ అత్యంత పవిత్ర భావంతో దాన్ని ఆరగిస్తారు!
అలాంటి భక్తులందరూ ఇప్పుడు నిశ్చేష్టులవుతున్నారు...
ఆ లడ్డూ ప్రసాదంలో చేప నూనె ఉందా?!
పంది కొవ్వు చేరిందా?!
కళ్లకద్దుకుని తినే ఆ పవిత్రమైన ప్రాసాదంలో అపవిత్ర పదార్థాల కల్తీ జరిగిందా?! అంటూ వాపోతున్నారు!
''ఎంత అపచారం! ఎంత ఘోరం! ఇదే ప్రసాదాన్ని వెంకన్న బాబుకు నివేదించారా?'' అనుకుంటూ తల్లడిల్లి పోతున్నారు!
తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి నాణ్యమైనది కాదని తేలిన సంగతి...
ఓ ఆలయానికి చెందిన అంశం కాదు...
ఓ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు...
ఓ దేశానికే పరిమితమైన వ్యవహారం కూడా కాదు...
ప్రపంచ వ్యాప్తంగానే ఇప్పుడిది ఓ ప్రకంపనం! ఓ కలవరం!
తిరుమలను కలియుగ వైకుంఠంగా, వేంకటేశ్వరుడిని అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిగా భావించే భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు...
ఇది... వేర్వేరు దేశాల నుంచి తరలి వచ్చి, వ్యయప్రయాసలకోర్చి, కేవలం అరక్షణం దర్శనంతో జన్మ ధన్యమైపోయిందనుకుని భావించే కోట్లాది మంది మనసులను కలచి వేసే అంశం!
ఈ సంగతిని ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు...
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడుతున్నారన్న అంశంపై వెల్లువలా పెల్లుబుకుతున్న స్పందనలే అందుకు సాక్ష్యం!
దేశవ్యాప్తంగా అనేక మంది పీఠాధిపతులు, సనాతన ధర్మ ప్రచారకులే కాదు... కేంద్ర స్థాయి రాజకీయ నాయకులు, అనేక రాష్ట్రాల నేతలు, ప్రముఖుల నుంచి వినిపిస్తున్న విమర్శలే నిదర్శనం!
ఈ పాపం ఎవరిది?
ఇందుకు భాధ్యులు ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానం ప్రత్యేకంగా వెతకక్కరలేదు...
ఇది కచ్చితంగా జగన్ ప్రభుత్వం నిర్వాకమే!
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైకాపా నిర్లక్ష్యమే!
అన్ని వ్యవస్థలను అవస్థల పాలు చేసిన గత పాలకుల అరాచకమే!
బయట ఆవునెయ్యి కొనుక్కోవాలంటే కిలో రూ. 600 పైగా వెచ్చించాల్సిందే...
కిలో గేదె నెయ్యి కొనాలంటే కూడా దాదాపు అంతే ఇచ్చుకోవాల్సందే...
అలాంటిది... తిరుమల తిరుపతి దేవస్థానానికి కేవలం రూ. 320 కే కిలో నెయ్యి ఇస్తామంటూ ఓ సంస్థ ముందుకు వచ్చిందంటే ఏమిటి దానర్థం?
కచ్చితంగా అది నాణ్యతా ప్రమాణాలకు తగినట్టుగా ఉండదనే!
యధేచ్చగా కల్తీ జరుగుతోందనడానికి నిదర్శనమే!
ఈ సంగతి అక్షరజ్ఞానం లేని సామాన్యుడికి కూడా అర్థమయ్యే విషయమే!
కానీ ఇంత చిన్న అనుమానం తితిదే పాలక వర్గానికి రాకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది...
అలా ఎప్పుడు రాదు?
టెండర్ వ్యవహారంలో అవినీతికి ఆనవాళ్లు ఉన్నప్పుడు!
అయిన వాళ్లకి కాంట్రాక్టు కట్టబెట్టినప్పుడు!
ప్రభుత్వం అండదండలు ఉన్నప్పుడు!
జగన్ ప్రభుత్వం హయాంలో ఇదే జరిగిందనేది నిర్వివాదాంశమే!
అవడానికి తితిదే స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థే...
కానీ అందులో నియామకాలన్నీ జగన్ కనుసన్నల్లో జరిగినవే!
రాజకీయ కోణంలో నింపినవే!
అస్మదీయ బంధువర్గానికి కట్టబెట్టినవే!
అందుకనే కలియుగ వైకుంఠంగా భక్త జనులు భావించే ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో ఇంతటి అపచారం గత ఐదేళ్లుగా జరిగింది!
తిరుమలలో ప్రతి రోజూ 3 లక్షల లడ్డూలు తయారవుతాయి...
ఇందుకు రోజూ 11 వేల కిలోల నెయ్యి అవసరం అవుతుంది...
ఆ లెక్కన నెలకెంత, ఏడాదికెంత అని లెక్కలేసుకుంటే ఇది కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా కురిపించే నెయ్యి సరఫరా కుంభకోణంలో కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగి ఉంటుందనేది ఇప్పుడు సామాన్యులకు సైతం అర్థమవుతున్న బహిరంగ రహస్యం.
జగన్ హయాంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయిన ఈ అపచారం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పిడిన తర్వాత భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేసిన తనిఖీలో నిర్ద్వందంగా బయటపడింది.
తితిదేకి తమిళనాడుకు చెందిన ఏఆర్ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు (లార్డ్), చేపనూనె లాంటి అవాంఛనీయ పదార్థాల ఉనికి ఉందని తేల్చిన నేషనల్ డెయిరీ డెవలప్మెంటు బోర్డు సామాన్యమైనదేమీ కాదు. గుజరాత్లోని ఈ సంస్థ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పని చేస్తుంది. అత్యాధునికి లేబరేటరీలు, పరీక్ష విధానాలు అక్కడ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బాలాజీ భక్తులందరినీ నివ్వెరపరుస్తున్న ఈ నివేదిక లోని అంశాలు బయటకి రాగానే ఉలిక్కి పడిన గత పాలకుల స్పందనలు చూస్తుంటే 'తాటి చెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డికోసం అన్నట్టు'గా కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన బాబాయి తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో చెబుతున్న అంశాలన్నీ ఇలాగే ఆకకు అందనట్టుగా, పోకకు చెందనట్టుగా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ప్రాసాదాలకు రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు అరవై కిలోల స్వచ్ఛమైన నెయ్యిని లక్ష రూపాయలు వెచ్చించి కొనేవాళ్లమని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే కిలో నెయ్యి రూ. 1667 అన్నమాట. మరి లడ్డూ తయారీలకు వాడే నెయ్యిని మాత్రం కిలో రూ. 320లకు ఎలా కొన్నారు? బయటి మార్కెట్టు ధరతో పోలిస్తే అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమనే ఆలోచన ఆయనకు తప్ప అందరికీ తలెత్తుతోంది.
మామూలుగా ఒక కిలో ఆవునెయ్యి తయారవ్వాలంటే దాదాపు 18 లీటర్ల పాలు అవసరం. లీటరు 40 రూపాయలనుకున్నా 700 రూపాయలకు పైగానే ఖర్చవుతుంది. మరాలంటప్పుడు ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు సైతం భరించి అంత తక్కువ ధరకు ఏ సంస్థయినా ఎలా సరఫరా చేయగలరు?
అవినీతి, ఆశ్రిత పక్షపాతాలతో పరిపాలన సాగించిన జగన్ ప్రభుత్వానికి కానీ, ఆయన కనుసన్నల్లో పదవులు సంపాదించుకున్న తితిదే బోర్డులోని పెద్దలకి కానీ ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమే కావు.
అసలు ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రమాణాలు, పద్ధతులు పాటించాలనే విషయానికి వస్తే జగన్ ప్రభుత్వానికి ముందు ఉన్న విధానాల గురించి చెప్పుకోవాలి.
అప్పట్లో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న సంస్థతో ఒప్పందానికి ముందే తితిదే నుంచి అధికారుల బృందం ఆ సంస్థను సందర్శించేది. ఆ సంస్థ సామర్థ్యం, తయారీ పద్ధతులు, సరఫరా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించేది. ఆ తర్వాత గుజరాత లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంటు బోర్డు నుంచి ఆ సంస్థ సర్టిఫికెట్ తెచ్చుకోవాలనే నిబంధన ఉండేది. ఆపై సరఫరా అయ్యే నెయ్యి నాణ్యతపై వివిధ దశలలో తనిఖీలు, పరీక్షలు కూడా ఉండేవి. అయితే జగన్ ప్రభుత్వంలో ఈ విధానాలన్నీ అటకెక్కాయి. నెయ్యి నాణ్యత తనిఖీలు సైతం తూతూ మంత్రంగా, మొక్కుబడిగా మారిపోయాయి.
నిజానికి శ్రీవారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల నిమిత్తం తితిదే సుమారు 48 రకాల సరుకులు కొంటుంది. వీటన్నింటినీ తిరుపతిలోని గోడౌన్లో భద్రపరుస్తారు. వీటి నాణ్యతను పరిశీలించే ల్యాబ్ ఒకటి తిరుమలలో ఉన్నప్పటికీ వైకాపా పాలనలో పరీక్షలు నామమాత్రంగా జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. తితిదేకి రోజూ పది వరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒకో ట్యాంకరులో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది. కొన్ని ట్యాంకర్లలోని నెయ్యిని ర్యాండమ్గా నమూనాలు తిరుమల ల్యాబ్కి తీసుకెళ్లి పరీక్షిస్తారు. ఈ పరీక్షలు నిక్కచ్చిగా చేసే పరికరాలు ల్యాబ్లో లేకపోవడంతో పాటు, ఉన్నంతలో చేసే పరీక్షలు కూడా నామమాత్రంగా ఉంటాయని పలు విమర్శలు ఉన్నాయి.
కిం కర్తవ్యం?
సరే... సాక్షాత్తు గోవిందుడికే అపచారం జరిగింది! అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతు, వృక్ష అవశేషాలు కల్తీ అయినట్టు బయటపడి కోట్లాది మంది భక్తుల మనసులు గాయపడ్డాయి!
మరి ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పటికే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలు జరుపుతున్నారు. తిరుమల క్షేత్రం పవిత్రతను, ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆగమ, వైదిక, ధార్మిక సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఆలయ సంప్రోక్షణ లాంటి చర్యలు కూడా తీసుకోడానికి సమాయత్తమవుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఇక ముందు ఇలాంటివి జరగకుండా చేయాల్సిన చర్యలను తక్షణం చేపట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా యుద్దప్రాతిపదిక మీద పనులు మొదలయితేనే భక్తుల మనోభావాలకు ఊరట లభిస్తుంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినట్టు... సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆగమ శాస్త్రాల్లో ఉన్నట్టు ఆలయాలను పరిరక్షించాలి. రాజకీయ శక్తుల చేతుల్లోకి ఆధ్యాత్మిక సంస్థలు వెళ్లకుండా చూడాలి. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడాలి.
తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి, తదితర సరుకుల నాణ్యతను పకడ్బందీగా పరీక్షించగలిగే అధునాతన లేబరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు నెయ్యిని పరీక్షించాలంటే గ్యాస్ క్రొమొటోగ్రఫీ, హైపెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రొమొటోగ్రఫీ లాంటి ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి పరీక్షలు చేయగలిగే యంత్రాలను ఆ ల్యాబ్లో అమర్చాలి. టెండర్ల ప్రక్రియ నుంచి సరఫరా వరకు, సరఫరా అయిన సరుకును వినియోగించే వరకు వివిధ దశల్లో తనిఖీలకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
వీటన్నింటి కన్నా అతి ముఖ్యమైనది ఒకటుంది...
తిరుమల లడ్డూల్లో పంది కొవ్వు, చేప నూనె, ఇతర వృక్ష, జంతు సంబంధమైన కల్తీ ఎలా జరిగిందనే విషయమై కూలంకషమైన సమీక్ష జరపాలి. అత్యున్నత సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి.
ఇందుకు బాధ్యులైన గత పాలకుల అరాచక విధానాలను అమలు జరిపిన వ్యక్తులకు కఠినమైన శిక్షలు పడాలి! ఇది త్వరగా జరిగితేనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి భక్తకోటి మనస్సులు కుదుట పడతాయి.
PUBLISHED ON JASENA WEBSITE ON 21.9.24
సోమవారం, సెప్టెంబర్ 09, 2024
శనివారం, ఆగస్టు 24, 2024
కృష్ణం వందే జగద్గురుం!
ఏం సుఖపడ్డాడని కృష్ణుడు?
పుడుతూనే పరుగు మొదలు...
చెరసాలలో పుట్టి రాత్రికి రాత్రి గడప దాటాడు...
అవడానికి సర్వ శక్తిమంతుడు...
పుట్టగానే తల్లిదండ్రులకు నిజ రూప దర్శనం ఇవ్వగలిగిన వాడు...
నాలుగు చేతులతో విష్ణువుగా కనిపించి మార్గదర్శనం చేయగలిగినవాడు...
ఆ అవతారమూర్తిని తిలకించడానికి దేవతలంతా తరలివచ్చినా వారి సాయం ఆశించలేదు...
వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు...
గంపలో పసిపిల్లాడిలా పడుకుని, వాన జల్లులో తడుస్తూ, రాత్రికి రాత్రి చలిలో, హోరుగాలిలో, యమున దాటించే ప్రయత్నాన్ని తండ్రి నెత్తిమీదే పెట్టాడు...
ఆది శేషుడు బాధ్యతగా గొడుగు పడితే, యమునా నది వినయంగా దారిస్తే, ఏమీ ఎరగనట్టు కేరింతలు కొడుతూ రేపల్లె చేరుకున్నాడు...
దేవాధిదేవుడై అవతరించి కూడా ఆ అర్థరాత్రి అభద్రతా ప్రయాణం, పాంచభౌతికమైన పరిమితులకు సంకేతమా?
మానవమాత్రులకు తప్పని జీవిత పోరాటానికి మచ్చుగా నిలవాలనే సంకల్పమా?
లేకపోతే... అసాధారణ అలౌకిక లీలా వినోద విన్యాసమా?
ఆ బాల కృష్ణుడికే తెలియాలి!
బొటనవేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటూ ఆనందించే పసికూనగా ఉన్నప్పుడే విషపూరితమైన స్తన్యాన్ని అందించిన పూతన చేసిన హత్యాప్రయత్నంతో మొదలైంది జీవన పోరాటం!
పాలతో పాటు ప్రాణాలు కూడా పీల్చేసి వికృత శరీరంతో మహాకాయంగా విరుచుకుపడిపోయిన పూతన గుండెలపై కూర్చుని ఏం జరిగిందో కూడా తెలియనట్టు అమాయమైన ఆటలాడినా, ఎంత గండం గడిచిందో... అనిపించుకున్నాడు!
బండి మీదకొస్తే ఎడమ కాలితో తన్ని ముక్కలు చేశాడు...
సుడిగాలి ఎగరేసుకుపోతే భరించరాని బరువై ఉసురు తీశాడు...
మడుగులో దాగి విషం చిమ్మే పెను పాము పడగలపై ఆనంద తాండవం చేశాడు...
ప్రకృతి విలయం సృష్టిస్తే చిటికెన వేలు మీద కొండనెత్తి ఏడు రాత్రులు మోసి తన వారిని గొడుగై కాపాడుకున్నాడు...
కార్చిచ్చులో గోపబాలురంతా చిక్కుకుని గగ్గోలు పెడితే, ఆ మంటల్ని స్వాహా చేసి రక్షించాడు...
మన్ను తిన్న చిన్న నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చూపించి కలయో, వైష్ణవ మాయయో తెలియకుండా చేశాడు...
అల్లరి భరించలేక అమ్మ రోటికి కట్టేస్తే, ఈడ్చుకుంటూ వెళ్లి పెద్ద చెట్లను కూల్చి యక్షుల పాపం పోగొట్టి శాపం తీర్చాడు...
గోవులతో సహా గోపాలురందరినీ గోప్యంగా దాచేసి బ్రహ్మ మాయ చేస్తే, అందరి రూపాలు తానై సృష్టి కర్త చెంపలేసుకునేలా చేశాడు...
ఓ కొంగ, ఓ కొండచిలువ, ఓ ఆవు, ఓ గాడిద... ఇలా ఎన్నో రూపాల్లో రక్కసిమూకలు చంపడానికి చక్కా వస్తే ఆ ప్రమాదాలన్నీ కాసుకుంటూ ఎదిగాడు...
ఊరందరికీ తెలుసు సామాన్య బాలుడు కాదని...
నంద యశోదలకు కూడా తెలుసు తమ వాడు కాదని...
దేవకీ వసుదేవులకూ తెలుసు అవతార పురుషుడని...
కంసుడికీ తెలుసు కడతేర్చేవాడని...
మరి ఏ సుదర్శన చక్రమో పంపించి నేరుగా మామ చెర నుంచి అమ్మానాన్నలను విడిపించలేదేం?
ఆరుగురు తోబుట్టువులను కంస మామ కర్కశత్వానికి బలి చేయకుండా ఆపలేదేం?
రాక్షసులందరినీ ఒకే ఒక కౌమోదకీ దెబ్బతో రాలగొట్టలేదేం?
పద్నాలుగేళ్లు ఎదిగే వరకూ ఎందుకాగాడు?
సరే... పెద్దవాడై కంసపీడ విరగడ చేసి తాతగారని రాజును చూసినా రాజ్యసుఖాలు అనుభవించాడా?
లేదు... విద్య కోసం వినయంగా గురుకులంలో చేరి సేవలు చేశాడు...
ఎప్పుడో చనిపోయిన కుమారుడిని యమ లోకం వెళ్లి మరీ తీసుకొచ్చి గురు దక్షిణ ఇవ్వగలిగిన వాడికి విద్యలొక లెఖ్ఖా?
విద్యార్థిగా నేర్చుకోవడమెలాగో నేర్పించడం కాదూ?
చదువులన్నీ చిటికెలో నేర్చుకుని గురుకులం నుంచి వచ్చాకైనా కుదుట పడ్డాడా?
కంసుడికి కూతుళ్లనిచ్చిన జరాసంధుడు అల్లుడిని చంపినందుకు కక్ష కట్టి తరలి వస్తే పదహారు యుద్ధాలు చేశాడు...
ఆ యుద్ధాలతో ప్రజల ప్రశాంతత భగ్నమవుతోందని సముద్రమధ్యంలో కోట కట్టి ద్వారకను జలదుర్గంగా మలిపించాడు...
వలచిన వనిత వర్తమానం పంపితే శత్రుకూటంలోకి చొరబడి రుక్మిణీ కళ్యాణంతో లోకకళ్యాణానికి నాంది పలికాడు...
అష్ట భార్యలతో, ఇష్ట సతులతో ఒకొక్కరికి ఒకొక్కడై పదహారు వేల నూట ఎనిమిది మందిగా సంసారంలో పడినా సేద తీరలేదు...
పట్టపురాణి రుక్మిణికి పుట్టిన తొలి సంతానాన్ని పురిట్లోనే రాక్షసుడు ఎత్తుకుపోతే చిద్విలాసంగా భరించాడు...
ధర్మానికి బద్ధులైన అత్త కొడుకులు పంచపాండవులను అడుగడుగునా ఆదుకుంటూనే ఉన్నాడు...
ధర్మరాజు కోరికపై రాయబారిగా మారి శాంతి సందేశానికి వార్తాహారుడయ్యాడు...
అధర్మ జూదంలో పాండవులను అడవుల పాలు చేసిన కౌరవుల్ని యుద్ధరంగానికి రప్పించేదాకా ఊరుకోలేదు...
ధర్మాన్ని గెలిపించడానికి అర్జునుడి రథానికి చోదకుడయ్యాడు...
అవతార లక్ష్యమైన భూభారాన్ని తగ్గించాకయినా పిల్లా పాపలతో సుఖంగా గడిపాడా?
నమ్ముకున్న పాండవుల బాగు కోరి గాంధారి శాపాన్ని నెత్తి మీద వేసుకున్నాడు...
కళ్ల ముందు అయిన వాళ్లు, వారసులు, పుత్రులు, పౌత్రులు నశించిపోతుంటే నిర్వికారంగా తిలకించాడు...
ఎక్కడో అడవిలో ఒంటరిగా వేటగాడి బాణానికి గురై కాలానికి తలొంచాడు...
ఏం? పుడుతూనే ఎన్నెన్నో ఘనకార్యాలు చేసిన వాడు తల్చుకుంటే క్షణాల్లో అన్నీ చక్కబెట్టలేడా?
శకుని పాచికలు పారకుండా చేయలేడా?
యుద్ధం అవసరం లేకుండానే కౌరవ సేనను దునుమాడి ధర్మజుడికి పట్టం కట్టలేడా?
రణరంగంలో బంధుజనాన్నిచూసి మోహంలో పడిన అర్జునుడికి పద్దెనిమిది అధ్యాయాల గీతను బోధించాల్సిన పనేముంది?
అర్థం చేసుకున్నా... చేసుకోలేకపోయినా... అంతా విష్ణుమాయ!
కష్టం ఎదురైతే కాలు దువ్వి దాని పని పట్టాలని బోధించడానికే...
ఆ విష్ణుమాయ!
యుద్ధం చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడానికే...
ఆ విష్ణుమాయ!
మానవాళికి కర్తవ్యం ఉపదేశించడానికే...
ఆ విష్ణుమాయ!
నీ కర్మలే నిన్ను నడిపిస్తాయని తెలియజేయానికే...
ఆ విష్ణుమాయ!
దేవుడే స్వయంగా రథం నడుపుతున్నా విల్లు ఎక్కుపెట్టి శరసంధానం చేయకతప్పదని చాటడానికే...
ఆ విష్ణుమాయ!
ఆ విష్ణుమాయ తొలగిపోవాలంటే...
ఒకే ఒక మంత్రం నిత్య స్మరణం శరణ్యం...
అదే... కృష్ణం వందే జగద్గురుం!
బుధవారం, ఆగస్టు 21, 2024
ఓ జీవితం... ఓ పుస్తకం... ఓ సినిమా!
'ఇన్నాళ్లూ ఎందుకు చూడలేకపోయాను?'... అనిపించింది ఆ సినిమా చూశాక!
చూశాక దాని గురించి నా అభిప్రాయం రాయాలని కూడా అనిపించింది...
ఇప్పటికే చాలా మంది చూసుంటారు... మాట్లాడుకుని ఉంటారు... రాసి కూడా ఉంటారు...
అయినా నేను కూడా చెప్పాల్సిందే... చెప్పి తీరాల్సిందే!
ఆ సినిమా... ''ట్వెల్త్ ఫెయిల్''!
దేశంలోనే అతి కఠినమైన ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల్లో విజేతల జీవితాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటాయి. అతి సామాన్యమైన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లు, పేదరికం నుంచి ఎదిగిన వాళ్లు, ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించిన వాళ్లూ ఎంతో మంది కనిపిస్తారు. ఒకొక్కరిదీ ఒకో కథ! అందరూ హీరోలే!
'ట్వెల్త్ ఫెయిల్' కథ కూడా ఇదే. అయితే ఇది కేవలం కథ కాదు... నిజ జీవితం ఆధారంగా తీసినది.
ఆ జీవితం మనోజ్ కుమార్ శర్మది. అత్యంత పేదరికంలోంచి వచ్చి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన వ్యక్తిది. 2005 బ్యాచ్కి చెందిన ఇతడి గురించి 2019లో 'ట్వెల్త్ ఫెయిల్' పేరుతో హిందీ రచయిత అనురాగ్ పాథక్ ఓ నవల రాశాడు. ఆ నవలను ఆధారం చేసుకుని తీసిందే ఈ సినిమా. 2023 అక్టోబరులో విడుదలైంది. నవలకీ, సినిమాకి మూలమైన మనోజ్ కుమార్ శర్మ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో బందిపోట్లకు పేరొందిన చంబల్ ప్రాంతానికి చెందిన ఇతడు, ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయి, బీఏ అయిందనిపించుకున్న ఓ సామాన్య నిరుపేద యువకుడు. ఆ డిగ్రీతో దొరికిన ఏదో ఉద్యోగంలో ఏ గుమాస్తాగానో ఇమిడిపోయి ఉంటే, ఇతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలో తెలియాలంటే అతడి ట్వెల్త్ క్లాస్ రోజుల్లోకి వెళ్లి చూడాలి.
పరీక్షకి సిద్ధం అవ్వాలంటే, జేబుల నిండా స్లిప్పులు పెట్టుకుని వెళ్లాలనుకునే స్థాయి అతడిది. గ్వాలియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ సాయంతో పరీక్ష రాసే ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్లందరిదీ అదే స్థాయి. స్వయంగా ప్రిన్సిపాల్ బోర్డు మీద జవాబులు రాస్తుంటే, వాటిని మక్కికి మక్కీగా ఎక్కించేస్తూ కుర్రాళ్లంతా పరీక్ష రాసే సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ రూపంలో నిజాయితీ గల ఓ డీఎస్పీ వచ్చాడక్కడికి. ప్రిన్సిపాల్ బెదిరింపులకి గానీ, లంచానికి గానీ అతడు లొంగలేదు. ఫలితంగా ఆ ఏడాది ఆ కాలేజీలో మొత్తం స్టూడెంట్లందరూ ''ట్వెల్త్ ఫెయిల్'' అయ్యారు. ఆ బ్యాచ్లోని వాడే మనోజ్‌కుమార్ శర్మ.
ఫ్రెండ్సంతా ఆ డీఎస్పీని తిట్టుకుంటే, అతడికి మాత్రం ఆయనలోని నిజాయితీ నచ్చింది. ఆ నిజాయితీ ఇచ్చిన ధైర్యం నచ్చింది.
అప్పుడొక కల కన్నాడతడు. అది నిద్రలో వచ్చే కల కాదు. మెలకువగా ఉన్నప్పుడు తరిమే కల!
''ఎలాగైనా డీఎస్సీ అవ్వాలి!''... అదీ ఆ కల!!
అతడి స్థాయికి అది ఎవరెస్ట్ శిఖరం అంత పెద్దది. అయినా ఎక్కాలనే అనుకున్నాడు.
''నేను మీలా ఓ నిజాయితీ పరుడైన పోలీసు అధికారి అవ్వాలంటే ఏంచేయాలి?'' అని ఆ డీఎస్పీనే అడిగాడు.
''ముందు నిజాయితీగా ఉండు...'' అన్నాడాయన. ఆ మాటలు అతడి మనసులో నాటుకున్నాయి.
అప్పటికి అతడికి ఐపీఎస్ అంటే ఏంటో కూడా తెలియదు.
మళ్లీసారి పరీక్షల సమయానికి గ్వాలియర్ కాలేజీ కుర్రాళ్ళంతా దర్జాగా స్లిప్పులు పెట్టి ఫస్ట్‌క్లాస్ తెచ్చుకుంటే... వాటి కేసి చూడనైనా చూడకుండా నిజాయితీగా తనకొచ్చిందేదో రాసి సాధారణంగా ప్యాస్ అవడం అతడి తొలి విజయం.
కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం కంటే, నిజాయితీగా వచ్చిన థర్డ్ క్లాసే అతడికి ఆనందాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత డీఎస్పీ అవ్వాలన్న కలే అతడిని నడిపించింది. చేతిలో పైసా లేకపోయినా ఓ స్నేహితుడి సాయంతో దిల్లీ తీసుకెళ్లింది. పగలంతా 15 గంటలు పని చేస్తూ, రాత్రి వేళ 6 గంటలు చదువుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిలయినా పట్టువదలకుండా నిలబెట్టింది. చివరి ప్రయత్నంలో మెయిన్స్ క్లియర్ చేయించింది!
ఇదంతా చెప్పినంత సులువు కాదు... అనుభవించినంత కష్టం!
ఇంటికి దూరంగా... ఊరుకాని ఊర్లో... దిల్లీ మహానగరంలో... కడుపు నిండడానికి కూడా పని చేయక తప్పని పరిస్థితిలో... ఐపీఎస్కి సిద్ధం కావాలంటే... ఏం చేయాలో అన్నీ చేశాడతడు!
బత్రూంలు క్లీన్ చేశాడు!
పిండిమరలో పని చేశాడు!
మూడడుగుల స్థలంలోనే రాత్రిళ్లు గుడ్డి బల్బు వెలుగులో చదువుకున్నాడు!
ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నాడు!
అవమానాలు భరించాడు!
ఇంత కష్టపడుతున్నా... ఎక్కడా చిరునవ్వును చెరగనీయలేదు. పట్టుదల సడలనీయలేదు. నిజాయితీని వదులుకోలేదు.
కానీ... ఆ నిజాయితీకే పెద్ద గండం ఎదురైంది మెయిన్స్ ఇంటర్య్యూలో!
''ట్వెల్త్ ఎందుకు ఫెయిలయ్యావు?'' అనే ప్రశ్నే ఆ గండం!
ముందుగానే ఆ ప్రశ్నను ఊహించిన చాలా మంది అతడికి చెప్పారు... అబద్దం ఆడమని. ఎవరో చనిపోయారని చెప్పమన్నారు.
మనోజ్ కుమార్ నాలుగేళ్ల కష్టం ఆ ప్రశ్న ముందు నిలబడింది!
అబద్దం ఆడి ఇంటర్వ్యూ గెలవాలా?
నిజం చెప్పి ఓడిపోవాలా?
ఓడిపోయినా పరవాలేదు కానీ నిజమే చెప్పాలనుకున్నాడు నిజాయితీగా.
''ఆ ఏడాది ఛీటింగ్ జరగలేదు. అందుకే ఫెయిల్ అయ్యాను...'' అన్నాడు ధైర్యంగా.
ఇంటర్వ్యూ గదిలో బాంబు పేల్చిందా జవాబు. బోర్డు సభ్యులే నివ్వెరపోయారు ఆ జవాబుకి!
ఏమనాలో తెలియక, ''ఓ రెండు నిమిషాలు బయట వేచి ఉండు'' అన్నారు.
తిరిగి పిలిచాక అడిగారు... ''ఎందుకలా చెప్పావు? అబద్దం ఆడి ఉండవచ్చుగా?'' అని నేరుగా అడిగారు.
''అబద్దం చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ని అవడం కంటే... నిజం చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడమే నయమనుకున్నాను...'' అన్నాడతను చిరునవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా.
ఆ తర్వాత ప్రశ్నలకు... అతడు ఆ ఛీటింగ్ వ్యవహారం గురించి చెప్పాడు. ఆ ఛీటింగ్ వెనకాల ఉండే స్థానిక నాయకుల ప్రాబల్యం గురించి చెప్పాడు. సమాజంలో అధికారం చేసే ఆగడాల గురించి చెప్పాడు. ఓ నిజాయితీ పరుడి చేతిలో అదే అధికారం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుందనే అతడి నమ్మకం గురించి చెప్పాడు.
అప్పుడు దూసుకొచ్చింది ఆఖరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఛీఫ్ మెంబర్ నుంచి...
''ఈ ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తావ్?''.
నిజాయితీనే నమ్ముకున్న అతడు స్థిరంగా చెప్పాడు...
''సూర్యుడినై వెలుగు పంచాలనుకున్నాను. ఓడిపోయినా పరవాలేదు. ఇంటికెళ్లిపోయి ఓ దీపాన్నై మా వీధికి వెలుగునిస్తా. ఓ టీచరునై చిన్నపిల్లలకి నిజాయితీని పరిచయం చేసి భావి తరాన్ని తయారు చేస్తా...''
ఆ ఛీఫ్ మెంబర్ ఊరుకోలేదు...
''ఓకే... యూకెన్ గో అండ్ బికమ్ ఏ స్ట్రీట్ ల్యాంప్...'' అన్నాడు వెటకారంగా.
అతడు గదిలోంచి బయటకి వచ్చేస్తుంటే... ''వేస్ట్ ఆఫ్ టైమ్...'' అనే ఆ బోర్డు మెంబర్ కామెంట్ వినిపించింది.
ఆ కామెంట్ విన్నాక... అతడికి అర్థం అయింది. ఇన్నాళ్ల తన ప్రయత్నమంతా వృధా!
ఇదేనా నిజాయితీకి దక్కిన ఫలితం? అనుకున్నాడు దిగులుగా.
కానీ... అతడు నమ్మిన నిజాయితీ అతడిని ఓడిపోనివ్వలేదు....
ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో చర్చ జరిగింది.
''ఇతడిని సెలెక్ట్ చేయకపోతే ఈ ఇంటర్వ్యూలన్నీ వేస్ట్...'' అన్నారు మెజర్టీ సభ్యులు!
అలా నిజాయితీ గెలిచింది! ఓ నిరుపేద పల్లెటూరి కుర్రాడిని ఐపీఎస్ అధికారిగా యూనిఫాం వేసి కుర్చీలో కూర్చోబెట్టింది!!
................
ఇదంతా... కేవలం 2005 బ్యాచ్లో దేశం మొత్తం మీద 121 ర్యాంకుతో సివిల్స్ విజేతగా నిలిచిన మనోజ్ కుమార్ శర్మ కథ కాదు. ఏటా సివిల్స్కి సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే యదార్థం. నిజం చెప్పాలంటే... ఒక్క సివిల్స్ విద్యార్థులకే కాదు. ప్రతీ విద్యార్థికీ స్ఫూర్తి దాయకమే. ఇంకా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ కూడా. ఎందుకంటే, ఓ విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా... ఎవరైనా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోయిన ప్రతీసారీ తిరిగి తేరుకుని ఎలా పోరాడాలో చెప్పే కథ ఇది. ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. అందుకే ఈ కథ హిందీ రచయిత అనురాగ్ పాఠక్‌ని ఆకర్షించింది. ఆయన రాసిన రెండో నవలే 'ట్వెల్త్ ఫెయిల్'. ఆయన మొదటి పుస్తకం 'వాట్సాప్ పార్ క్రాంతి' అనే కథల సంపుటి. ఆ కథలన్నీ సోషల్ మీడియా ప్రభావం మీద రాసినవి. పరీక్షలంటే భయపడే విద్యార్థులందరికీ సాయపడాలనే ఉద్దేశంతో మనోజ్‌కుమార్ జీవితాన్ని 'ట్వెల్త్ ఫెయిల్' నవలగా రాశారీయన. ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ నవల బాలీవుడ్ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా దృష్టిలో పడింది. ఆయన సామాన్యుడా? 'మున్నాభాయ్', 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'సంజు' లాంటి మంచి చిత్రాలను అందించిన నిర్మాత. 'పరిందా', '1942-ఎ లవ్ స్టోరీ', 'మిషన్ కాశ్మీర్' లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. అలాంటి అతడి చేతిలో పడిన 'ట్వెల్త్ ఫెయిల్' నవల, ఓ మరపురాని చిత్రంగా తెరకెక్కింది. రూ. 20 కోట్ల బడ్జెట్తో తీస్తే దాదాపు రూ. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాసుల కంటే అధికంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
మనోజ్ కుమార్ శర్మ పాత్రలో నటుడు విక్రాంత్ మాసీ చాలా చక్కగా కుదిరాడు. టీవీ, సినిమాల నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఇతడు మనోజ్ పాత్రలో ఒదిగిపోడానికి ఎంతో కష్టపడ్డాడు. మనోజ్‌కుమార్ ఐపీఎస్ కోసం దిల్లీలో చదువుకునే సమయంలో అతడికి పరిచయమై, ఆ తర్వాత అతడి జీవిత భాగస్వామిగా మారిన శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ అద్భుతంగా నటించింది. అంతక్రితం 'బీచమ్ హౌస్', 'షాదిస్తాన్' 'దిల్ బేకరార్' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకి, శ్రద్ధా జోషి పాత్ర పెద్ద బ్రేక్గా మారింది. అయిదు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న 'ట్వల్త్ ఫెయిల్' సినిమా, తొలి ఫ్రేమ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వదు.
ప్రేక్షకులు మనోజ్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తారు. అతడి కష్టాలు చూసి నిట్టూరుస్తారు. అతడి పట్టుదల చూసి ఆశ్చర్యపోతారు. అతడి పరిస్థితికి కన్నీరుమున్నీరవుతారు. అతడి అవమానాలకు బాధ పడిపోతారు. ఆఖరికి అతడు గెలిస్తే, తామే గెలిచినంతగా కేరింతలు కొడతారు. అలా అడుగడుగునా ప్రేక్షకులు మమేకమయిపోయేంత గొప్పగా వినోద్ చోప్రా సినిమాను మలిచాడు. సినిమాలో చాలా మంది నిజ జీవిత పాత్రలనే పోషించారు. యూపీఎస్సీ కోచ్ వికాస్ దివ్యకీర్తి అదే పాత్రలో నటించాడు. సివిల్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులే వేర్వేరు పాత్రల్లో కనిపించారు. ఇది సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.
ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడం కన్నా, చూడ్డమే మంచింది. ఈ సినిమాను చూడకపోతే ఏదో మిస్సయ్యేవాళ్లమనే సంగతి... ఆ సినిమాను చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. మొత్తం మీద అందరూ 'వితౌట్ ఫెయిల్' తప్పకుండా చూడాల్సిన సినిమా 'ట్వెల్త్ ఫెయిల్''.
+ ఈ సినిమాలో నటులను ఎంపిక చేసుకోడానికి పెద్ద ప్రక్రియే జరిగింది. ముఖ్యమైన ఒకో పాత్రకి 35 మంది కంటే ఎక్కువ మందిని పరీక్షించి మరీ ఎంపిక చేశారు. కానీ మనోజ్ కుమార్ పాత్రకి మాత్రం విక్రాంత్ని ఒక్కరినే పరీక్షించి వెంటనే తీసుకున్నారు.
+ పల్లెటూరి కుర్రాడిగా కనిపించడం కోసం విక్రాంత్ ఈ సినిమాలో ఎలాంటి మేకప్ వేసుకోలేదు. పైగా సహజత్వం కోసం పల్లెటూర్లో ఎండలో గంటల తరబడి గడిపి, చర్మం రంగును ఛామనఛాయగా మార్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతడి చర్మం కొన్ని చోట్ల బాగా కమిలిపోయింది కూడా. ఇది కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
+ మూడేళ్ల కాలంలో ఈ సినిమా స్క్రీన్ ప్లేను వినోద్ చోప్రా 200 సార్లకు పైగా మార్చి రాసుకున్నాడు.
+ సినిమాలో ట్రూత్ అండ్ డేర్ ఆట సన్నివేశంలో నటి మేధా శంకర్ తనే స్వయంగా లైవ్ షూటింగ్ లో పాట పాడింది.
+ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సన్నివేశాన్ని ఆ భవనంలో చిత్రీకరించడానికి అనుమతించకపోవడంతో అచ్చం అలాగే సెట్ ని వేశారు. సినిమా చూసిన యూపీఎస్సీ ఉద్యోగులు అది సెట్ అని గ్రహించలేనంత సహజంగా దాన్ని సృష్టించారు.
+ సినిమాలో చూపించిన గ్రామం సెట్టింగును నిజానికి ముంబై దగ్గర్లో ఎక్కడైనా వేయవచ్చు. కానీ వినోద్ చోప్రా అందుకు ఒప్పుకోకుండా చంబల్ నది దగ్గర సహజమైన ఓ గ్రామాన్నే ఎంచుకున్నాడు. రోజూ షూటింగ్ సిబ్బంది అందరూ మూడు గంటలు ప్రయాణించి ఆ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది.
+ బాక్సాఫీస్ ప్రకారం, 18 ఏళ్ల తర్వాత 25 వారాలు ఆడిన సినిమాగా ఇది నిలిచింది.