శనివారం, ఆగస్టు 24, 2024

కృష్ణం వందే జగద్గురుం!

ఏం సుఖపడ్డాడని కృష్ణుడు?

పుడుతూనే పరుగు మొదలు...

చెరసాలలో పుట్టి రాత్రికి రాత్రి గడప దాటాడు...

అవడానికి సర్వ శక్తిమంతుడు...

పుట్టగానే తల్లిదండ్రులకు నిజ రూప దర్శనం ఇవ్వగలిగిన వాడు...

నాలుగు చేతులతో విష్ణువుగా కనిపించి మార్గదర్శనం చేయగలిగినవాడు...

ఆ అవతారమూర్తిని తిలకించడానికి దేవతలంతా తరలివచ్చినా వారి సాయం ఆశించలేదు...

వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు...

గంపలో పసిపిల్లాడిలా పడుకుని, వాన జల్లులో తడుస్తూ, రాత్రికి రాత్రి చలిలో, హోరుగాలిలో, యమున దాటించే ప్రయత్నాన్ని తండ్రి నెత్తిమీదే పెట్టాడు...

ఆది శేషుడు బాధ్యతగా గొడుగు పడితే, యమునా నది వినయంగా దారిస్తే, ఏమీ ఎరగనట్టు కేరింతలు కొడుతూ రేపల్లె చేరుకున్నాడు...

దేవాధిదేవుడై అవతరించి కూడా ఆ అర్థరాత్రి అభద్రతా ప్రయాణం, పాంచభౌతికమైన పరిమితులకు సంకేతమా?

మానవమాత్రులకు తప్పని జీవిత పోరాటానికి మచ్చుగా నిలవాలనే సంకల్పమా?

లేకపోతే... అసాధారణ అలౌకిక లీలా వినోద విన్యాసమా?

ఆ బాల కృష్ణుడికే తెలియాలి!

బొటనవేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటూ ఆనందించే పసికూనగా ఉన్నప్పుడే విషపూరితమైన స్తన్యాన్ని అందించిన పూతన చేసిన హత్యాప్రయత్నంతో మొదలైంది జీవన పోరాటం!

పాలతో పాటు ప్రాణాలు కూడా పీల్చేసి వికృత శరీరంతో మహాకాయంగా విరుచుకుపడిపోయిన పూతన గుండెలపై కూర్చుని ఏం జరిగిందో కూడా తెలియనట్టు అమాయమైన ఆటలాడినా, ఎంత గండం గడిచిందో... అనిపించుకున్నాడు!

బండి మీదకొస్తే ఎడమ కాలితో తన్ని ముక్కలు చేశాడు...

సుడిగాలి ఎగరేసుకుపోతే భరించరాని బరువై ఉసురు తీశాడు...

మడుగులో దాగి విషం చిమ్మే పెను పాము పడగలపై ఆనంద తాండవం చేశాడు...

ప్రకృతి విలయం సృష్టిస్తే చిటికెన వేలు మీద కొండనెత్తి ఏడు రాత్రులు మోసి తన వారిని గొడుగై కాపాడుకున్నాడు...

కార్చిచ్చులో గోపబాలురంతా చిక్కుకుని గగ్గోలు పెడితే, ఆ మంటల్ని స్వాహా చేసి రక్షించాడు...

మన్ను తిన్న చిన్న నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చూపించి కలయో, వైష్ణవ మాయయో తెలియకుండా చేశాడు...

అల్లరి భరించలేక అమ్మ రోటికి కట్టేస్తే, ఈడ్చుకుంటూ వెళ్లి పెద్ద చెట్లను కూల్చి యక్షుల పాపం పోగొట్టి శాపం తీర్చాడు...

గోవులతో సహా గోపాలురందరినీ గోప్యంగా దాచేసి బ్రహ్మ మాయ చేస్తే, అందరి రూపాలు తానై సృష్టి కర్త చెంపలేసుకునేలా చేశాడు...

ఓ కొంగ, ఓ కొండచిలువ, ఓ ఆవు, ఓ గాడిద... ఇలా ఎన్నో రూపాల్లో రక్కసిమూకలు చంపడానికి చక్కా వస్తే ఆ ప్రమాదాలన్నీ కాసుకుంటూ ఎదిగాడు...

ఊరందరికీ తెలుసు సామాన్య బాలుడు కాదని...

నంద యశోదలకు కూడా తెలుసు తమ వాడు కాదని...

దేవకీ వసుదేవులకూ తెలుసు అవతార పురుషుడని...

కంసుడికీ తెలుసు కడతేర్చేవాడని...

మరి ఏ సుదర్శన చక్రమో పంపించి నేరుగా మామ చెర నుంచి అమ్మానాన్నలను విడిపించలేదేం?

ఆరుగురు తోబుట్టువులను కంస మామ కర్కశత్వానికి బలి చేయకుండా ఆపలేదేం?

రాక్షసులందరినీ ఒకే ఒక కౌమోదకీ దెబ్బతో రాలగొట్టలేదేం?

పద్నాలుగేళ్లు ఎదిగే వరకూ ఎందుకాగాడు?

సరే... పెద్దవాడై కంసపీడ విరగడ చేసి తాతగారని రాజును చూసినా రాజ్యసుఖాలు అనుభవించాడా?

లేదు... విద్య కోసం వినయంగా గురుకులంలో చేరి సేవలు చేశాడు...

ఎప్పుడో చనిపోయిన కుమారుడిని యమ లోకం వెళ్లి మరీ తీసుకొచ్చి గురు దక్షిణ ఇవ్వగలిగిన వాడికి విద్యలొక లెఖ్ఖా?

విద్యార్థిగా నేర్చుకోవడమెలాగో నేర్పించడం కాదూ? 

చదువులన్నీ చిటికెలో నేర్చుకుని గురుకులం నుంచి వచ్చాకైనా కుదుట పడ్డాడా?

కంసుడికి కూతుళ్లనిచ్చిన జరాసంధుడు అల్లుడిని చంపినందుకు కక్ష కట్టి తరలి వస్తే పదహారు యుద్ధాలు చేశాడు...

ఆ యుద్ధాలతో ప్రజల ప్రశాంతత భగ్నమవుతోందని సముద్రమధ్యంలో కోట కట్టి ద్వారకను జలదుర్గంగా మలిపించాడు...

వలచిన వనిత వర్తమానం పంపితే శత్రుకూటంలోకి చొరబడి రుక్మిణీ కళ్యాణంతో లోకకళ్యాణానికి నాంది పలికాడు...

అష్ట భార్యలతో, ఇష్ట సతులతో ఒకొక్కరికి ఒకొక్కడై పదహారు వేల నూట ఎనిమిది మందిగా సంసారంలో పడినా సేద తీరలేదు...

పట్టపురాణి రుక్మిణికి పుట్టిన తొలి సంతానాన్ని పురిట్లోనే రాక్షసుడు ఎత్తుకుపోతే చిద్విలాసంగా భరించాడు...

ధర్మానికి బద్ధులైన అత్త కొడుకులు పంచపాండవులను అడుగడుగునా ఆదుకుంటూనే ఉన్నాడు...

ధర్మరాజు కోరికపై రాయబారిగా మారి శాంతి సందేశానికి వార్తాహారుడయ్యాడు...

అధర్మ జూదంలో పాండవులను అడవుల పాలు చేసిన కౌరవుల్ని యుద్ధరంగానికి రప్పించేదాకా ఊరుకోలేదు...

ధర్మాన్ని గెలిపించడానికి అర్జునుడి రథానికి చోదకుడయ్యాడు...

అవతార లక్ష్యమైన భూభారాన్ని తగ్గించాకయినా పిల్లా పాపలతో సుఖంగా గడిపాడా?

నమ్ముకున్న పాండవుల బాగు కోరి గాంధారి శాపాన్ని నెత్తి మీద వేసుకున్నాడు...

కళ్ల ముందు అయిన వాళ్లు, వారసులు, పుత్రులు, పౌత్రులు నశించిపోతుంటే నిర్వికారంగా తిలకించాడు...

ఎక్కడో అడవిలో ఒంటరిగా వేటగాడి బాణానికి గురై కాలానికి తలొంచాడు...

ఏం? పుడుతూనే ఎన్నెన్నో ఘనకార్యాలు చేసిన వాడు తల్చుకుంటే క్షణాల్లో అన్నీ చక్కబెట్టలేడా?

శకుని పాచికలు పారకుండా చేయలేడా?

యుద్ధం అవసరం లేకుండానే కౌరవ సేనను దునుమాడి ధర్మజుడికి పట్టం కట్టలేడా?

రణరంగంలో బంధుజనాన్నిచూసి మోహంలో పడిన అర్జునుడికి పద్దెనిమిది అధ్యాయాల గీతను బోధించాల్సిన పనేముంది? 

అర్థం చేసుకున్నా... చేసుకోలేకపోయినా... అంతా విష్ణుమాయ!

కష్టం ఎదురైతే కాలు దువ్వి దాని పని పట్టాలని బోధించడానికే... 

ఆ విష్ణుమాయ!

యుద్ధం చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడానికే... 

ఆ విష్ణుమాయ!

మానవాళికి కర్తవ్యం ఉపదేశించడానికే... 

ఆ విష్ణుమాయ!

నీ కర్మలే నిన్ను నడిపిస్తాయని తెలియజేయానికే... 

ఆ విష్ణుమాయ!

దేవుడే స్వయంగా రథం నడుపుతున్నా విల్లు ఎక్కుపెట్టి శరసంధానం చేయకతప్పదని చాటడానికే... 

ఆ విష్ణుమాయ!

ఆ విష్ణుమాయ తొలగిపోవాలంటే... 

ఒకే ఒక మంత్రం నిత్య స్మరణం శరణ్యం...

అదే... కృష్ణం వందే జగద్గురుం!









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి