బుధవారం, ఆగస్టు 21, 2024

ఓ జీవితం... ఓ పుస్తకం... ఓ సినిమా!



'ఇన్నాళ్లూ ఎందుకు చూడలేకపోయాను?'... అనిపించింది ఆ సినిమా చూశాక!

చూశాక దాని గురించి నా అభిప్రాయం రాయాలని కూడా అనిపించింది...

ఇప్పటికే చాలా మంది చూసుంటారు... మాట్లాడుకుని ఉంటారు... రాసి కూడా ఉంటారు...

అయినా నేను కూడా చెప్పాల్సిందే... చెప్పి తీరాల్సిందే!

ఆ సినిమా... ''ట్వెల్త్‌ ఫెయిల్‌''!

దేశంలోనే అతి కఠినమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ పరీక్షల్లో విజేతల జీవితాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటాయి.  అతి సామాన్యమైన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లు, పేదరికం నుంచి ఎదిగిన వాళ్లు, ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించిన వాళ్లూ ఎంతో మంది కనిపిస్తారు. ఒకొక్కరిదీ ఒకో కథ! అందరూ హీరోలే!

'ట్వెల్త్‌ ఫెయిల్‌' కథ కూడా ఇదే. అయితే ఇది కేవలం కథ కాదు... నిజ జీవితం ఆధారంగా తీసినది.

ఆ జీవితం మనోజ్‌ కుమార్‌ శర్మది. అత్యంత పేదరికంలోంచి వచ్చి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగిన వ్యక్తిది. 2005 బ్యాచ్‌కి చెందిన ఇతడి గురించి 2019లో 'ట్వెల్త్‌ ఫెయిల్‌' పేరుతో హిందీ రచయిత అనురాగ్‌ పాథక్‌ ఓ నవల రాశాడు. ఆ నవలను ఆధారం చేసుకుని తీసిందే ఈ సినిమా. 2023 అక్టోబరులో విడుదలైంది. నవలకీ, సినిమాకి మూలమైన మనోజ్‌ కుమార్‌ శర్మ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్‌లో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇనస్పెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గా పని చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో బందిపోట్లకు పేరొందిన చంబల్‌ ప్రాంతానికి చెందిన ఇతడు, ట్వెల్త్ క్లాస్‌ ఫెయిల్‌ అయి, బీఏ అయిందనిపించుకున్న ఓ సామాన్య నిరుపేద యువకుడు. ఆ డిగ్రీతో దొరికిన ఏదో ఉద్యోగంలో ఏ గుమాస్తాగానో ఇమిడిపోయి ఉంటే, ఇతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలో తెలియాలంటే అతడి ట్వెల్త్‌ క్లాస్‌ రోజుల్లోకి వెళ్లి చూడాలి.

పరీక్షకి సిద్ధం అవ్వాలంటే, జేబుల నిండా స్లిప్పులు పెట్టుకుని వెళ్లాలనుకునే స్థాయి అతడిది. గ్వాలియర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ సాయంతో పరీక్ష రాసే ట్వెల్త్‌ క్లాస్‌ స్టూడెంట్లందరిదీ అదే స్థాయి. స్వయంగా ప్రిన్సిపాల్ బోర్డు మీద జవాబులు రాస్తుంటే, వాటిని మక్కికి మక్కీగా ఎక్కించేస్తూ కుర్రాళ్లంతా పరీక్ష రాసే సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రూపంలో నిజాయితీ గల ఓ డీఎస్పీ వచ్చాడక్కడికి. ప్రిన్సిపాల్‌ బెదిరింపులకి గానీ, లంచానికి గానీ అతడు లొంగలేదు. ఫలితంగా ఆ ఏడాది ఆ కాలేజీలో మొత్తం స్టూడెంట్లందరూ ''ట్వెల్త్‌ ఫెయిల్‌'' అయ్యారు. ఆ బ్యాచ్‌లోని వాడే మనోజ్‌కుమార్‌ శర్మ.

ఫ్రెండ్సంతా ఆ డీఎస్పీని తిట్టుకుంటే, అతడికి మాత్రం ఆయనలోని నిజాయితీ నచ్చింది. ఆ నిజాయితీ ఇచ్చిన ధైర్యం నచ్చింది.

అప్పుడొక కల కన్నాడతడు. అది నిద్రలో వచ్చే కల కాదు. మెలకువగా ఉన్నప్పుడు తరిమే కల!

''ఎలాగైనా డీఎస్సీ అవ్వాలి!''... అదీ ఆ కల!!

అతడి స్థాయికి అది ఎవరెస్ట్‌ శిఖరం అంత పెద్దది. అయినా ఎక్కాలనే అనుకున్నాడు.

''నేను మీలా ఓ నిజాయితీ పరుడైన పోలీసు అధికారి అవ్వాలంటే ఏంచేయాలి?'' అని ఆ డీఎస్పీనే అడిగాడు.

''ముందు నిజాయితీగా ఉండు...'' అన్నాడాయన. ఆ మాటలు అతడి మనసులో నాటుకున్నాయి.

అప్పటికి అతడికి ఐపీఎస్‌ అంటే ఏంటో కూడా తెలియదు.

మళ్లీసారి పరీక్షల సమయానికి గ్వాలియర్‌ కాలేజీ కుర్రాళ్ళంతా దర్జాగా స్లిప్పులు పెట్టి ఫస్ట్‌క్లాస్‌ తెచ్చుకుంటే... వాటి కేసి చూడనైనా చూడకుండా నిజాయితీగా తనకొచ్చిందేదో రాసి సాధారణంగా ప్యాస్‌ అవడం అతడి తొలి విజయం.

కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్‌ తెచ్చుకోవడం కంటే, నిజాయితీగా వచ్చిన థర్డ్‌ క్లాసే అతడికి ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తర్వాత డీఎస్పీ అవ్వాలన్న కలే అతడిని నడిపించింది.  చేతిలో పైసా లేకపోయినా ఓ స్నేహితుడి సాయంతో దిల్లీ తీసుకెళ్లింది. పగలంతా 15 గంటలు పని చేస్తూ, రాత్రి వేళ 6 గంటలు చదువుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు మూడు సార్లు ప్రిలిమ్స్‌ ఫెయిలయినా పట్టువదలకుండా నిలబెట్టింది. చివరి ప్రయత్నంలో మెయిన్స్‌ క్లియర్‌ చేయించింది!

ఇదంతా చెప్పినంత సులువు కాదు... అనుభవించినంత కష్టం!

ఇంటికి దూరంగా... ఊరుకాని ఊర్లో... దిల్లీ మహానగరంలో... కడుపు నిండడానికి కూడా పని చేయక తప్పని పరిస్థితిలో... ఐపీఎస్‌కి సిద్ధం కావాలంటే... ఏం చేయాలో అన్నీ చేశాడతడు!

బత్రూంలు క్లీన్‌ చేశాడు!

పిండిమరలో పని చేశాడు!

మూడడుగుల స్థలంలోనే రాత్రిళ్లు గుడ్డి బల్బు వెలుగులో చదువుకున్నాడు!

ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నాడు!

అవమానాలు భరించాడు!

ఇంత కష్టపడుతున్నా... ఎక్కడా చిరునవ్వును చెరగనీయలేదు. పట్టుదల సడలనీయలేదు. నిజాయితీని వదులుకోలేదు.

కానీ... ఆ నిజాయితీకే పెద్ద గండం ఎదురైంది మెయిన్స్‌ ఇంటర్య్యూలో!

''ట్వెల్త్‌ ఎందుకు ఫెయిలయ్యావు?'' అనే ప్రశ్నే ఆ గండం!

ముందుగానే ఆ ప్రశ్నను ఊహించిన చాలా మంది అతడికి చెప్పారు... అబద్దం ఆడమని. ఎవరో చనిపోయారని చెప్పమన్నారు.

మనోజ్‌ కుమార్‌ నాలుగేళ్ల కష్టం ఆ ప్రశ్న ముందు నిలబడింది!

అబద్దం ఆడి ఇంటర్వ్యూ గెలవాలా?

నిజం చెప్పి ఓడిపోవాలా?

ఓడిపోయినా పరవాలేదు కానీ నిజమే చెప్పాలనుకున్నాడు నిజాయితీగా.

''ఆ ఏడాది ఛీటింగ్‌ జరగలేదు. అందుకే ఫెయిల్‌ అయ్యాను...'' అన్నాడు ధైర్యంగా.

ఇంటర్వ్యూ గదిలో బాంబు పేల్చిందా జవాబు. బోర్డు సభ్యులే నివ్వెరపోయారు ఆ జవాబుకి!

ఏమనాలో తెలియక, ''ఓ రెండు నిమిషాలు బయట వేచి ఉండు'' అన్నారు.

తిరిగి పిలిచాక అడిగారు... ''ఎందుకలా చెప్పావు? అబద్దం ఆడి ఉండవచ్చుగా?'' అని నేరుగా అడిగారు.

''అబద్దం చెప్పి ఐపీఎస్‌ ఆఫీసర్‌ని అవడం కంటే... నిజం చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అవడమే నయమనుకున్నాను...'' అన్నాడతను చిరునవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా.

ఆ తర్వాత ప్రశ్నలకు... అతడు ఆ ఛీటింగ్‌ వ్యవహారం గురించి చెప్పాడు. ఆ ఛీటింగ్‌ వెనకాల ఉండే స్థానిక నాయకుల ప్రాబల్యం గురించి చెప్పాడు. సమాజంలో అధికారం చేసే ఆగడాల గురించి చెప్పాడు. ఓ నిజాయితీ పరుడి చేతిలో అదే అధికారం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుందనే అతడి నమ్మకం గురించి చెప్పాడు.

అప్పుడు దూసుకొచ్చింది ఆఖరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఛీఫ్‌ మెంబర్‌ నుంచి...

''ఈ ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తావ్‌?''.

నిజాయితీనే నమ్ముకున్న అతడు స్థిరంగా చెప్పాడు...

''సూర్యుడినై వెలుగు పంచాలనుకున్నాను. ఓడిపోయినా పరవాలేదు. ఇంటికెళ్లిపోయి ఓ దీపాన్నై మా వీధికి వెలుగునిస్తా. ఓ టీచరునై చిన్నపిల్లలకి నిజాయితీని పరిచయం చేసి భావి తరాన్ని తయారు చేస్తా...''

ఆ ఛీఫ్‌ మెంబర్‌ ఊరుకోలేదు...

''ఓకే... యూకెన్‌ గో అండ్‌ బికమ్‌ ఏ స్ట్రీట్‌ ల్యాంప్‌...'' అన్నాడు వెటకారంగా.

అతడు గదిలోంచి బయటకి వచ్చేస్తుంటే... ''వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌...'' అనే ఆ బోర్డు మెంబర్‌ కామెంట్‌ వినిపించింది.

ఆ కామెంట్‌ విన్నాక... అతడికి అర్థం అయింది. ఇన్నాళ్ల తన ప్రయత్నమంతా వృధా!

ఇదేనా నిజాయితీకి దక్కిన ఫలితం? అనుకున్నాడు దిగులుగా.

కానీ... అతడు నమ్మిన నిజాయితీ అతడిని ఓడిపోనివ్వలేదు....

ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో చర్చ జరిగింది.

''ఇతడిని సెలెక్ట్‌ చేయకపోతే ఈ ఇంటర్వ్యూలన్నీ వేస్ట్‌...'' అన్నారు మెజర్టీ సభ్యులు!

అలా నిజాయితీ గెలిచింది! ఓ నిరుపేద పల్లెటూరి కుర్రాడిని ఐపీఎస్‌ అధికారిగా యూనిఫాం వేసి కుర్చీలో కూర్చోబెట్టింది!!

................

ఇదంతా... కేవలం 2005 బ్యాచ్‌లో దేశం మొత్తం మీద 121 ర్యాంకుతో సివిల్స్‌ విజేతగా నిలిచిన మనోజ్‌ కుమార్‌ శర్మ కథ కాదు. ఏటా సివిల్స్‌కి సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే యదార్థం. నిజం చెప్పాలంటే... ఒక్క సివిల్స్‌ విద్యార్థులకే కాదు. ప్రతీ విద్యార్థికీ స్ఫూర్తి దాయకమే. ఇంకా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ కూడా. ఎందుకంటే, ఓ విద్యార్థి అయినా,  ఉద్యోగి అయినా... ఎవరైనా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోయిన ప్రతీసారీ తిరిగి తేరుకుని ఎలా పోరాడాలో చెప్పే కథ ఇది. ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. అందుకే ఈ కథ హిందీ రచయిత అనురాగ్‌ పాఠక్‌ని ఆకర్షించింది. ఆయన రాసిన రెండో నవలే 'ట్వెల్త్ ఫెయిల్‌'. ఆయన మొదటి పుస్తకం 'వాట్సాప్‌ పార్‌ క్రాంతి' అనే కథల సంపుటి. ఆ కథలన్నీ సోషల్‌ మీడియా ప్రభావం మీద రాసినవి.  పరీక్షలంటే భయపడే విద్యార్థులందరికీ సాయపడాలనే ఉద్దేశంతో మనోజ్‌కుమార్‌ జీవితాన్ని 'ట్వెల్త్‌ ఫెయిల్‌' నవలగా రాశారీయన. ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ నవల బాలీవుడ్‌ దర్శక నిర్మాత విధు వినోద్‌ చోప్రా దృష్టిలో పడింది. ఆయన సామాన్యుడా? 'మున్నాభాయ్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'సంజు' లాంటి మంచి చిత్రాలను అందించిన నిర్మాత. 'పరిందా', '1942-ఎ లవ్‌ స్టోరీ', 'మిషన్‌ కాశ్మీర్‌' లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. అలాంటి అతడి చేతిలో పడిన 'ట్వెల్త్‌ ఫెయిల్‌' నవల, ఓ మరపురాని చిత్రంగా తెరకెక్కింది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీస్తే దాదాపు రూ. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాసుల కంటే అధికంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మనోజ్‌ కుమార్‌ శర్మ పాత్రలో నటుడు విక్రాంత్‌ మాసీ చాలా చక్కగా కుదిరాడు. టీవీ, సినిమాల నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న ఇతడు మనోజ్‌ పాత్రలో ఒదిగిపోడానికి ఎంతో కష్టపడ్డాడు. మనోజ్‌కుమార్‌ ఐపీఎస్‌ కోసం దిల్లీలో చదువుకునే సమయంలో అతడికి పరిచయమై, ఆ తర్వాత అతడి జీవిత భాగస్వామిగా మారిన శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్‌ అద్భుతంగా నటించింది. అంతక్రితం 'బీచమ్‌ హౌస్‌', 'షాదిస్తాన్‌' 'దిల్‌ బేకరార్‌' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకి, శ్రద్ధా జోషి పాత్ర పెద్ద బ్రేక్‌గా మారింది. అయిదు ఫిలింఫేర్‌ అవార్డులను అందుకున్న 'ట్వల్త్‌ ఫెయిల్‌' సినిమా, తొలి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వదు.

ప్రేక్షకులు మనోజ్‌ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తారు. అతడి కష్టాలు చూసి నిట్టూరుస్తారు. అతడి పట్టుదల చూసి ఆశ్చర్యపోతారు. అతడి పరిస్థితికి కన్నీరుమున్నీరవుతారు.  అతడి అవమానాలకు బాధ పడిపోతారు. ఆఖరికి అతడు గెలిస్తే, తామే గెలిచినంతగా కేరింతలు కొడతారు. అలా అడుగడుగునా ప్రేక్షకులు మమేకమయిపోయేంత గొప్పగా వినోద్‌ చోప్రా సినిమాను మలిచాడు. సినిమాలో చాలా మంది నిజ జీవిత పాత్రలనే పోషించారు. యూపీఎస్సీ కోచ్‌ వికాస్‌ దివ్యకీర్తి అదే పాత్రలో నటించాడు. సివిల్స్‌కి సిద్ధమవుతున్న విద్యార్థులే వేర్వేరు పాత్రల్లో కనిపించారు. ఇది సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడం కన్నా, చూడ్డమే మంచింది. ఈ సినిమాను చూడకపోతే ఏదో మిస్సయ్యేవాళ్లమనే సంగతి... ఆ సినిమాను చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. మొత్తం మీద అందరూ 'వితౌట్‌ ఫెయిల్‌' తప్పకుండా చూడాల్సిన సినిమా 'ట్వెల్త్‌ ఫెయిల్‌''.

+ ఈ సినిమాలో నటులను ఎంపిక చేసుకోడానికి పెద్ద ప్రక్రియే జరిగింది. ముఖ్యమైన ఒకో  పాత్రకి 35 మంది కంటే ఎక్కువ మందిని పరీక్షించి మరీ ఎంపిక చేశారు. కానీ మనోజ్‌ కుమార్‌ పాత్రకి మాత్రం విక్రాంత్‌ని ఒక్కరినే పరీక్షించి వెంటనే తీసుకున్నారు.

+ పల్లెటూరి కుర్రాడిగా కనిపించడం కోసం విక్రాంత్‌ ఈ సినిమాలో ఎలాంటి మేకప్‌ వేసుకోలేదు. పైగా సహజత్వం కోసం పల్లెటూర్లో ఎండలో గంటల తరబడి గడిపి, చర్మం రంగును ఛామనఛాయగా మార్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతడి చర్మం కొన్ని చోట్ల బాగా కమిలిపోయింది కూడా. ఇది కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

+ మూడేళ్ల కాలంలో ఈ సినిమా స్క్రీన్‌ ప్లేను వినోద్‌ చోప్రా 200 సార్లకు పైగా మార్చి రాసుకున్నాడు.

+ సినిమాలో ట్రూత్‌ అండ్‌ డేర్‌ ఆట సన్నివేశంలో నటి  మేధా శంకర్‌  తనే స్వయంగా లైవ్‌ షూటింగ్‌ లో పాట పాడింది.

+ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సన్నివేశాన్ని ఆ భవనంలో చిత్రీకరించడానికి అనుమతించకపోవడంతో అచ్చం అలాగే సెట్ ని వేశారు. సినిమా చూసిన యూపీఎస్సీ ఉద్యోగులు అది సెట్‌ అని గ్రహించలేనంత సహజంగా దాన్ని సృష్టించారు.

+ సినిమాలో చూపించిన గ్రామం సెట్టింగును నిజానికి ముంబై దగ్గర్లో ఎక్కడైనా వేయవచ్చు. కానీ వినోద్‌ చోప్రా అందుకు ఒప్పుకోకుండా చంబల్‌ నది దగ్గర సహజమైన ఓ గ్రామాన్నే ఎంచుకున్నాడు. రోజూ షూటింగ్‌ సిబ్బంది అందరూ మూడు గంటలు ప్రయాణించి ఆ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది.

+ బాక్సాఫీస్‌ ప్రకారం, 18 ఏళ్ల తర్వాత 25 వారాలు ఆడిన సినిమాగా ఇది నిలిచింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి