ఆదివారం, జనవరి 28, 2024

జన చైతన్య శంఖారావం!



''నమస్కారం గురూగారూ! ఇవాళ పాఠం పేరేంటండీ...'' అన్నాడు శిష్యుడు నోట్సు తెరచి, పెన్ను క్యాప్తీస్తూ.

''ముందా పుస్తకం మూసేసి, పెన్ను జేబులో పెట్టేసుకోరా...'' అన్నారు గురూగారు తాపీగా.

''అదేంటండీ? ఇవాళ సెలవా?''

''కాదురా... అదిగో ఆ అలమారా తెరచి పై అరలో ఉన్నది తీసుకురా...''

''ఇదేంటండీ? ఇక్కడొక శంఖం ఉందీ?''

''అదే నీకు తొలి పాఠంరా. తీసుకొచ్చి దాన్ని ఊదు...''

శిష్యుడు శంఖం నోటిలో పెట్టుకుని ఊదడానికి ప్రయత్నించాడు. దాంట్లంచి ''తుస్ స్స్స్స్‌...'' అంటూ గాలొచ్చింది కానీ శబ్దం రాలేదు.

రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆయాసం వచ్చి రొప్పసాగాడు.

''లాభం లేదు గురూగారూ! దీన్ని ఊదడం నా వల్ల కాదు...'' అన్నాడు.

''వార్నీ! దీన్నే ఊదలేనోడివి ఇక రాజకీయాలు ఏం నేర్చుకుంటావురా?'' అన్నారు గురూగారు ఎకసెక్కంగా.

''ఊరుకోండి గురూగారూ! దీన్ని ఊదలేకపోతే ఇక అంతేనేటండి? అయినా రాజకీయాలకీ, శంఖం ఊదడానికి ఏంటండి సంబంధం?''

''మరి నేనేదో కాలక్షేపానికి చెప్పాననుకుంటున్నావేంట్రా? ఇది మామూలు ఊదుడు కాదురా, ఎన్నికల శంఖారావంరా బడుద్దాయ్‌!''

''ఏమో సార్‌... అయినా శంఖం ఊదడం రాకపోయినంత మాత్రాన రాజకీయాలకు పనికి రానంటారా?''

''ఏడిశావ్‌! నువ్వు రాజకీయాల్లో ఎందుకూ పనికిరాని దద్దమ్మవైనా, శంఖం మాత్రం ఊదడం రావాలిరా. అదంతే...''

''ఏమిటో గురూగారూ! ఇవాళ పాఠం చిత్రంగా ఉంది. ఈ శంఖమేంటో, ఊదుడేంటో, దానికీ రాజకీయాలకీ సంబంధం ఏమిటో కాస్త నాకర్థం అయ్యేలా చెబుదురూ...''

''ఓరి దద్దమ్మా! నిన్న సంగివలసలో నంగినంగిగా మాట్లాడిన నీ అధినేత ఏం చేశాడో చూడలేదా?''

''... గుర్తొచ్చిందండోయ్‌! శంఖం తీసుకుని, మొహం పైకెత్తి, మెడ నరాలు ఉబ్బిపోయినట్టు ఊదాడండి. ఆ సభ పేరు 'సిద్ధం'టండి...''

''మరదేరా. అందుకే నేను నిన్ను కూడా భావి రాజకీయాలకు సిద్ధం చేస్తున్నా. అర్థమైందా?''

''ఇప్పటికి అర్థమైంది సర్‌. కానీ నాకు శంఖం ఊదడం చేతకావట్లేదండి. ఇక నేను రాజకీయాలకు పనికిరానంటారా?''

''ఒరేయ్‌... నీకు పాలన చేతకాకపోయినా పర్వాలేదు. ప్రజలకు మేలు చేయలేకపోయినా పర్వాలేదు. వ్యవస్థల్ని నడపడం రాకపోయినా పర్వాలేదు. సంపద పెంచడం నీవల్ల కాకపోయినా పర్వాలేదు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడం తెలియకపోయినా పర్వాలేదు. ఉద్యోగాలు కల్పించడం వీలు కాకపోయినా పర్వాలేదు. ఉపాధి అవకాశాలను పెంచడం కుదరకపోయినా పర్వాలేదు. మహిళలకు రక్షణ కల్పించలేకపోయినా పర్వాలేదు. అత్యాచారాలు ఆపలేకపోయినా పర్వాలేదు. బడుగుల బతుకులు బాగు చేయడం రాకపోయినా పర్వాలేదు. వ్యవసాయానికి సాయపడకపోయినా పర్వాలేదు. రోడ్లకు మరమ్మతులు సైతం చేయలేకపోయినా పర్వాలేదు. విద్యావకాశాలను పెంపొందించలేకపోయినా పర్వాలేదు. సామాన్యులను ఆదుకోలేకపోయినా పర్వాలేదు. ఆఖరికి నువ్వు ఏమీ చేయలేని చవట దద్దమ్మవైనా పర్వాలేదు. కానొరేయ్‌... శంఖం మాత్రం ఊదడం మాత్రం తెలియాలొరే! అప్పుడే నువ్వు రాజకీయాలకు పనికొస్తావ్‌. తెలిసిందా?''

''అమ్మబాబోయ్‌! శంఖం ఊదడం అంత ముఖ్యమాండీ?''

''కాదట్రా మరి! నీ అధినేత చేసిందదే కదరా. చూశావా? ఎంత బాగా ఊదాడో!''

''అవునండి! ఊపిరి బిగబట్టి మరీ ఊదాడండి. సభలో జనం చెవులు గింగిర్లెత్తిపోయాయంటే నమ్మండి. మరయితే ఆ శంఖనాదం ఫలించినట్టేనాండీ?''

''శంఖనాదమో, సింగినాదమో? పాపం నాకు మాత్రం చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే అనిపించిరా...''

''అదేంటండీ, అంతమాటనేశారూ? జనం చెవిటివాళ్లంటారా?''

''జనం చెవిటివాళ్లు కాదురా. తెలివైన వాళ్లు. మీ వాడు ఊదిన శంఖనాదాన్నీ వింటారు, ఆయన మాట్లాడిన మాటల్నీ వింటారు. ఏది బాగా మోగిందో, ఏది తుస్సుమందో ఇట్టే పసిగడతారు. నువ్వు మాత్రం ఆయనలా ఊదడమూ నేర్చుకోవాలి, ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఆయన చూడు, ఉత్తరాంధ్రలో సభ పెట్టి ఉత్తుత్తి మాటలు మాట్లాడాడా లేదా? అసలాయన అక్కడి వాళ్లకు ఏం ఊడబొడిచాడో చెప్పలేకపోయినా, ఏం ప్రాజెక్టలు తెచ్చాడో చూపలేకపోయినా బోర విరుచుకుని మరీ మాట్లాడలేదూ? అదిగో... ఆ సిగ్గుమాలిన తనాన్ని నువ్వు ఒంటపట్టించుకోవాలి. అప్పటివరకు అదిగో, ఇదిగో అంటూ కాలక్షేపం చేసి, ఆఖర్లో ఈ పార్టీ మీదేనన్నాడు చూడు, ఆ తెంపరితనం తెలుసుకోవాలి. ఆయనలా అన్నంత మాత్రాన సంబరపడ్డానికి జనమేమైనా ఎర్రిబాగులోళ్లా చెప్పు? అయినా కానీ, ఎన్నికలొచ్చేసరికి అలా జనానికి మస్కా కొట్టే చిట్కాలు అలవరచుకోవాలి. సభలో అలంకరణ చూశావా? ఎగస్పార్టీవోళ్ల బొమ్మలు పెట్టి, కుట్రదారులంటూ నినాదాలు పెట్టించాడు చూడు, అలాంటి కుయత్నాలు చేయడమెలాగో నువ్వు అర్థం చేసుకోవాలి. అయిదేళ్లు పరిపాలించినా, ఎంపీలందరూ నీ వాళ్లయినా దిల్లీలో ప్రత్యేక హోదా కూడా సాధించుకోలేకపోయిన నిర్వాకాన్ని కప్పెట్టి, తప్పంతా ఎగస్పార్టీ వాళ్లదేనంటూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించాడు చూడు, అదిగో... ఆ నయవంచక విధానాలను ఔపోసన పట్టాలి. అర్థమైందా?''

''అర్థమైందండి. మీరు చెబుతుంటే అసలు శంఖం ఊదడం కన్నా, ఇలా ఊకదంపుడుగా మాట్లాడ్డమే ముందు రావాలనిపిస్తోందండి...''

''బాగా చెప్పావు. అయితే ఇప్పుడు ఆ శంఖాన్ని పక్కన పెట్టేసి, అలమార పైన ఒకటి పెట్టాను. దాన్ని తీసుకురా...''

''గురువుగారూ! ఇదొక డప్పండి. దాన్ని బాదడానికి పుల్ల కూడా ఉందండి...''

''రెండూ తీసుకొచ్చావుగా? ఇప్పుడు దాన్ని కొట్టడం నేర్చుకో. ఇది నీకివాళ రెండో పాఠం...''

''లాభంలేదు గురూగారూ! ఇది కూడా నాకు రాదండి...''

''ఇంక నువ్వేం రాజకీయాలకు పనికొస్తావురా? నీ అధినేత ఏం చేశాడో చూడలేదా?''

''అవునండి. డప్పు తీసుకుని డమడమా మోగించాడండి. రాజకీయాల్లో రాణించాలంటే ఇది కూడా నేర్చుకోవలసిందేనా సర్?''

''కాదట్రా మరి? అది మామూలు డప్పా? ప్రచారం డప్పు. నీ పాలన వల్ల వీసమెత్తు ప్రయోజనం లేకపోయినా, ఏదో ఊడబొడిచేసినట్టు హడావుడి చేయాలంటే సొంత డప్పు మోగించడం నేర్చుకోవాలి.  ప్రజల పేరిట పెట్టిన నవరాళ్ల పథకాల వల్ల జనానికి ఒరిగిన దాని కన్నా, వాటి పేరుతో నీ అధినేత గణాలు గడించిందే అధికమయినా... పదే పదే పథకాల గురించే డప్పు కోవడం చూశావుగా? ఆ మాటకారి మాయలను నువ్వు నేర్చుకోవద్దూ? పథాకాల పేరుతో ప్రజలకు ఇచ్చిన  దాని కన్నా,  అంతకు వంద రెట్లుగా వాళ్ల నుంచి పన్నులనీ, ఛార్జీలనీ వసూలు చేసినా, ఆ సంగతి మరపించి మురిపించడానికి ప్రయత్నించాడు చూడు... ఆ నంగనాచితనాన్ని నువ్వు ఔపోసన పట్టాలి. రైతుల అత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నా, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం ముందున్నా... అదేమీ పట్టనట్టు నటిస్తూ, రాష్ట్ర ప్రజలకి బంగారు బాటలు పరిచానంటూ బీరాలు చెప్పాడు చూడు... అలా సొంత డబ్బా మోగించడంలో మెళకువలు మెరుగుపర్చుకోవాలి. అర్థమైందా?''

''ఆహా గురూగారూ! శంఖం ఊదడం, డప్పు కొట్టడం రాజకీయాల్లో ఎంత కీలకమో ఇప్పుడర్థం అయిందండి. మరి ఆయనగారి ఊదుడుకీ, బాదుడికీ ఫలితం ఉంటుందంటారా?''

ఒరేయ్‌... ప్రజలు నీ కన్నా, నాకన్నా, నీ అధినేత కన్నా తెలివైన వాళ్లురా. ఒక్క 75 రోజులు ఓపిక పట్టు. అప్పుడు జనచైతన్య శంఖారావం ఎలా ఉంటుందో, తెలివైన ఓటర్ల దండోరా ఎంత బాగుంటుందో నీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ శంఖం, డప్పు ఇంటికి పట్టుకెళ్లి  నీకు చేతనయింత నేర్చుకో. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 28.1.2024 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి