నదుల్లో పుణ్య స్నానాలు అందరం చేస్తాం...
ఓ దణ్ణం పెట్టుకుని, మూడు మునకలు వేసి చక్కా వస్తాం...
ఏ సంకల్పమో చెప్పుకున్నా సాధారణంగా అది రెండు మూడు నిమిషాల వ్యవహారం...
కానీ దాదాపు గంట సేపు చేసే పుణ్యస్నానం అనుభవంలోకి రావడం అరుదైన విషయం...
శాస్త్ర నిర్దేశితంగా, సంప్రదాయబద్దంగా, విపులంగా, అనేక అంశాలను స్పృశిస్తూ... దేవ, రుషి తర్పణాలను, అర్ఘ్యాలను, పితృదేవతలకు జలతర్పణాలను అర్పిస్తూ, జన్మజన్మల పరంపరలో చేసే అనేకానేక పాతకాలను, పాపాలను ఉటంకిస్తూ వాటి నుంచి ప్రక్షాళన కోరుతూ, ప్రార్థన చేస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో తలమునకలవుతూ పునీతలమయ్యేలా చేసే పవిత్ర స్నానం ఎంతటి సంతృప్తిని కలిగిస్తుందో తొలిసారి అనుభవంలోకి వచ్చింది ఆదివారం నాడు.
ఈ ఆదివారం సామాన్యమైనది కాదు. పుష్యమీ నక్షత్రం, అమావాస్యలతో కూడి అరుదుగా వచ్చే భానువారం. ఈ రోజున గోదావరి స్నానం అత్యంత పుణ్యప్రదమైనదని శాస్త్రం చెబుతోంది. 'పుష్యార్క యోగం' అనే ఈ పుణ్యస్నానాన్ని ఆగస్టు 4 ఆదివారం నాడు సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో ఆచరించగలిగాం.
ఈ యాత్ర చేయాలనే సంకల్పం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడం, ఇందులో పాల్గొన్న అందరి చేతా సంపూర్ణ శాస్త్రీయ సంకల్ప సహితంగా పవిత్ర స్నానాలు చేయించడం వెనుక ఘనతంతా హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులైన మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారికే చెందుతుంది.
హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ శర్మగారితో పాటు, నేను, శ్రీనివాసన్‌గారు, రమణరావుగారు, గోపాల కృష్ణగారు కలిసి కారులో బాసర యాత్రకు బయల్దేరాం. ఉదయం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఎన్నో చక్కని అనుభూతులు. ప్రయాణమంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఇదొక చక్కని సత్సంగ యాత్రగా మంచి జ్క్షాపకాలను మిగిల్చింది. దారి పొడవునా ధర్మపరమైన ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. మా అందరి సందేహాలకు శ్రీకాంత్ శర్మ గారు ధర్మపరమైన సమాధానాలు అందించారు. అందరి కబుర్లలో ఎన్నో మంచి విషయాలు చోటు చేసుకున్నాయి.
ఎల్ అండ్ టీ సంస్థతో పెద్ద హోదాలో ఉన్న శ్రీనివాసన్ గారు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైరయిన గోపాల కృష్ణగారు పంచుకున్న అంశాల ద్వారా అన్ని ధర్మాల కన్నా మానవత్వమే సాటిలేనిదని అర్థమైంది. ఓ కుగ్రామంలో తన మేనత్త చనిపోతే, పాడె మోయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో శ్రీనివాసన్ గారు చొరవ తీసుకుని మరో వ్యక్తి సాయంతో కేవలం ఇద్దరే కలిసి పాడె మోసి, ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించడం... ఆఫీసు పని మీద, ఆఫీసు కారులో, బాస్‌తో కలిసి ప్రయాణిస్తూ, దారిలో ఎవరో యాక్సిడెంటుకు గురైన విషయాన్ని గుర్తించి కారు ఆపించి, ఆ ప్రమాదంలో కాలు విరిగి బాధపడుతున్న మహిళను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించడం... గోపాలకృష్ణగారు కూడా తన బంధువొకరు చనిపోయినప్పుడు అనవసర భయాలను, సందేహాలను పక్కన పెట్టి, సొంతవారు సైతం వారిస్తున్నా వినకుండా అంత్యక్రియలు జరిపించడం... లాంటి విషయాలు వింటుంటే అందరూ వీరిలాగా స్పందించగలిగితే సమాజం ఎంత బాగుంటుందో కదా అనిపించింది.
బాసరలో కన్నా నిజామాబాద్ జిల్లాలోని పుష్కర ఘాట్‌లో గోదావరి జలాలు నిర్మలంగా ఉంటాయనుకుని బినోలా గ్రామానికి ముందుగా వెళ్లాం. అక్కడ మేం ఊహించిట్టుగా స్నానం చేయడానికి అనువైన పరిస్థితులు లేకపోయినా, ఆ తీరంలోని ఓ పురాతనమైన ఆలయంలో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకున్నాం. గర్భగుడిలోకి వెళ్లి శివాభిషేకం చేసుకుని, లేత మారేడు దళాలతో అర్చించుకుని ఓ మంచి అనుభూతిని పొందాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వృద్ధుడైన ఆ గుడి అర్చకుడు మా అందరినీ భోజనాని ఆహ్వానించడం. స్నానాలకు వచ్చిన వారందరికీ ఆ అర్చకుడు, ఆయన కుటుంబీకులు కలిసి స్వయంగా వండి అన్నదానం చేస్తారట.
ఎక్కడో మారుమూల గ్రామంలో, ప్రధాన రహదారికి దూరంగా పంట పొలాల మధ్యగా సాగే మట్టి దారిలో, ఆ స్నానాలరేవుకి వచ్చే వారందరికీ వాళ్లు ఇలా ప్రతి రోజూ చేస్తారని తెలిసి ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆ గుడి ఆవరణలో అప్పటికే వంట కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఇదే కదా అసలైన ఆధ్యాత్మికత అంటే? అనిపించింది వారిని చూస్తే. పోనీ ఆ గుడికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు సైతం ఏమీ అందుతున్నట్టు కనిపించలేదు. అయినా ఆ బడుగు వృద్ధుడి ప్రయత్నం చూస్తే అన్నదాన సంకల్పానికి పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని అర్థమైంది. అక్కడికి అరుదుగా వచ్చే యాత్రికుల మీదనే వారు ఆధారపడి ఉండొచ్చు. కానీ వచ్చిన వారందరికీ వండి వార్చి వడ్డించాలని ఎక్కడుంది? ఆ వృద్ధుడికి తోచిన ఆర్థిక సాయం తలా కాస్తా అందించి తిరిగి బాసరకు బయల్దేరి మధ్యాహ్నానికల్లా బాసర చేరుకున్నాం.
అక్కడ ఓ ఘాట్‌లో ఉరవడిగా ప్రవహిస్తున్న గోదావరిలో తనివితీరా, సంతృప్తికరంగా, ఆధ్యాత్మికంగా పవిత్ర స్నానాలను ఆచరించాం. ఆ తీరంలోనే సిమెంటు చప్టా మీద శ్రీకాంత్ శర్మగారి మార్గదర్శకత్వంలో అపరాహ్నం వేళ అమావాస్య తిల తర్పణాలను పితృదేవతలకు సమర్పించుకున్నాం. ఆ తర్వాత అందరం బాసరలోని బ్రాహ్మణ అన్నదాన ఆశ్రమానికి వెళ్లాం. అక్కడ భోజనం నిజంగా అమృతప్రాయంగా ఉంది. కలగలుపు పప్పు,రెండు కూరలు, రసం, స్వీటు, అప్పడం లాంటి పదార్థాలను హాయిగా ఆరగించి, ఆ సత్రానికి ఇతోధికంగా ఆర్థిక విరాళాలు అందించి, బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లాం.
మాతో వచ్చిన రమణరావుగారు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి. ఆయన ఆలయ ఈవోకి ఫోన్ చేయడంతో ఒక వ్యక్తి ప్రత్యేకంగా మా కూడా వచ్చి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించాడు. వ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించి పూజించి జ్ఞాన సరస్వతిని ప్రత్యక్షం చేసుకున్న ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని తనివి తీరా దర్శించకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం. ఈ మొత్తం ప్రయాణమంతా రమణరావుగారే కారు డ్రైవ్ చేశారు. మేం యాత్ర చేసిన ఎర్టిగా కారు కూడా ఆయనదే. రానూ పోనూ దాదాపు 9 గంటల పాటు సాగిన యాత్రలో రమణరావు గారు ఎక్కడా ఎలాంటి అలసటకు కానీ, విసుగుదలకు కానీ గురి కాకుండా సురక్షితంగా హాయిగా మా ప్రయాణం సాగేలా చేశారు. అందరం కలిగి హైదరాబాద్‌కి రాత్రి పదిన్నర కల్లా చేరుకోవడంతో మా బాసర యాత్ర ముగిసింది. నిజంగా ఇదొక అరుదైన యోగం... అద్భుత ప్రయాణం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి