ఆదివారం, నవంబర్ 09, 2025

మెదడు మెదడుతో కలబడితే...



‘మెదడు మెదడుతో కలబడితే ఆ కలయిక ఫలమేమి?’ అని పాతపాటనేమీ పాడుకోనక్కరలేదు. ఒక వేళ పాడినా సమాధానం దొరకదు. అయితే మెదడు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న న్యూరో సైన్స్ శాస్త్రవేత్తలు మాత్రం ఓ కొత్త విషయం కనిపెట్టారు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలతో తేలిందేమిటంటే, న్యూరోసైన్స్ అర్థం చేసుకున్న దాని కన్నా మనిషి మెదడు మరెంతో సామర్థ్యాన్ని కలిగి ఉందని. తాజా పరిశోధన విషయానికి వస్తే... మెదడు ‘అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ’ ఉన్న విద్యుత్ అయస్కాంత తరంగాలను విడుదల చేస్తుందని తేలింది. ఈ సంకేతాలు చాలా దూరం ప్రయాణిస్తూ, ఇతరుల మెదళ్ల నుంచి విడుదల అయ్యే అవే తరహా తరంగాలతో అనుసంధానం కాగలవని కూడా తెలిసింది. ఈ విషయం సహజంగానే అనేక ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి సంకేతాలను కచ్చితంగా కలపగలిగితే మనుషుల మధ్య మాటలు అవసరం లేకుండానే భావాలను పంచుకోవచ్చా అనేది ఓ ప్రశ్న. అలాగైతే అవచేతనంగా కూడా మౌనంగా సంభాషించోగలమా అనేది మరో ప్రశ్న.

అప్పుడు... ‘మౌనంగా నీ మనసు పాడిన ప్రేమ గానమును వింటినే... తెలుపక తెలిపే అనురాగము నీ కనులలో కనుగొంటినే...’ లాంటి పాటలను కవితాత్మక ఊహలతో కాకుండా, ప్రేమికులు నిజంగానే తెలుసుకుంటారనుకోవచ్చు. ఏదో సరదాగా ప్రేమ అనుకున్నా, అన్ని రకాల భావజాలాన్ని ఇలాంటి ఒకే తరహా విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పంచుకోగలిగితే ఎలా మారుతుందనేది మరొక ప్రశ్న.

‘ఇదిగో ఇప్పుడే నువ్వు నన్ను మనసులో తిట్టుకున్నావ్. ఏం? ఒళ్లు ఎలా ఉందేంటి?’ తరహా కీచులాటలు కూడా మొదలవుతాయేమో మరి.

ఇంతకీ మెదడు నుంచి ఈ తరంగాలు ఎలా పుడతాయి? మెడడులో కోట్లాదిగా ఉండే కణాలైన న్యూరాన్లు, లయబద్ధంగా చలించినప్పుడు ఇలా జరుగుతోందని చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ తరంగాలు, ఇతర వ్యక్తుల మెదడు పంపించే తరంగాలకు సమన్వయంగా స్పందించవచ్చు. దీని వల్ల ఆ వ్యక్తుల మనస్థితి, ఏకాగ్రత, నిర్ణయాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

మెదడు నుండి మెదడుకి భావాల ప్రసారం అనేది ఇప్పటికిప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ లాగానో, భవిష్యత్తు శాస్త్రం లాంటిదో అనిపించినా, ప్రారంభ పరిశోధనలను బట్టి... ఇప్పటికే కొంత అనుభవంలోకి వచ్చింది. ఉదాహరణకు సంగీతం వినడం, ఒకే అనుభూతి కలగడం లాంటి విషయాల్లో చెప్పుకోదగిన సమన్వయం ఉంటుందనే తెలుస్తోంది.

పరిశోధనలు మరింత ధృవపడితే, అవి మానవ అనుబంధాలు, అనుభూతులు, సమూహ ప్రవర్తనలను కూడా మార్చివేయగలుగుతాయనే చెప్పాలి.  అంటే, మన మెదడు కేవలం వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించడమే కాకుండా ఒక సున్నితమైన, ప్రపంచవ్యాప్త "సామూహిక చైతన్య జాలంలో" కూడా భాగస్వామ్యం చేస్తుందేమో అనే సంకేతం ఇస్తున్నాయి. సైన్స్ ఇప్పుడే ఈ అజ్ఞాత, లోతైన మానవ అనుసంధానాలను అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.