బుధవారం, నవంబర్ 12, 2025

‘ఫాస్ట్ ఫుడ్’ తింటున్నారా? అయితే ‘స్లో’ అయిపోయినట్టే






తినండి... మీ ఇష్టం వచ్చినట్టు తినండి...

పిజ్జాలు... బర్గర్లు... ఫ్రెంచ్ ఫ్రైలు... హాట్ డాగ్స్... ఫ్రైడ్ చికెన్లు... డోనట్లు పాస్టరీలు... ఇన్ స్టంట్ న్యూడిల్స్... సాఫ్ట్ డ్రింకులు... శాండ్ విచ్చులు... రాప్ లు... కూల్ డ్రింకులు... ఐస్ క్రీములు... మిల్క్ షేకులు...

అబ్బో... అడుగు బయట పెడితే చాలు... ఎన్నో... ఎన్నెన్నో.

అయితే ఒక్క క్షణం ఇది చదివి... అప్పుడు తినండి. మీ తిండి, మీ ఇష్టం... చెప్పడానికి మేమెవరం?

 ఇంతకీ ఫాస్ట్ ఫుడ్ అంటే ఏమిటి?

ఏముందీ... న్యూటిషన్స్ కన్నా క్యాలరీలు అధికంగా ఇచ్చే తిళ్లన్నీ అవే.

ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తిండి పదార్థాలు ఏదో కాస్తో కూస్తో మీ నడుము చుట్టూ కొవ్వు పెంచుతాయిలే... దాందేముంది? అనుకుంటున్నారా?

కాదు... కానే కాదు...

ఇవి కేవలం వారం రోజుల్లోనే మీ మెదడును “రీవైర్” చేయగలవట. అంటే మీ మెదడు అంతర్గత పనితీరును దెబ్బతీస్తాయన్నేమాట. ఎలాగట? చూద్దాం...

ఉత్తర కరోలైనా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం కనుగొన్నే సంగతి ఇది.  కేవలం నాలుగు రోజుల పాటు జంక్ ఫుడ్ లాగిస్తే చాలు... మెదడు జ్ఞాపక శక్తికి సంబంధించిన న్యూరల్ సర్క్యూట్లు మారిపోవడం ప్రారంభమవుతుంది.

పరిశోధకులు కనుగొన్నదేమిటంటే, ఫాస్ట్ ఫుడ్‌లనబడే అధిక కొవ్వు ఆహారం, మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన హిప్పోకాంపస్ లోని న్యూరాన్ల పనితీరును దెబ్బతీస్తాయి.

దీని ఫలితంగా మెదడులో “సీసీకే ఇంటర్ న్యూరాన్లు” అనే ఒక రకం న్యూరాన్‌ కణాలు అధిక క్రియాశీలతకు లోనవుతాయి. ఇందువల్ల కలిగే చెడ్డ ఏమిటయ్యా, అంటే...  జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. న్యూరాన్ అనే  పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఆరోగ్యానికి హానికరమైన ఆహారపు అలవాట్లు, బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే, మెదడు ఆరోగ్యాన్ని తక్షణమే ప్రభావితం చేస్తాయి.

ఇది చదవగానే... ‘అయ్యబాబోయ్’ అని భయపడిపోకండి. ఎందుకంటే, ఈ నష్టాన్ని తిరిగి సరిచేయవచ్చు. ఆహారంలో మార్పులు, ఉపవాసం లేదా మందుల ద్వారా అయినా సరే — అధిక క్రియాశీల న్యూరాన్లను శాంత పరచవచ్చట. అలా చేస్తే జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చని కూడా పరిశోధక బృందం గుర్తించింది. ఇంతకాలం జంక్ ఫుడ్ ఆరోగ్యం మీదనే దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందనుకున్నారు. కానీ వీటి వల్ల మెదడు కణాలపై కూడా తక్షణ ప్రభావం పడుతుందని ఇప్పుడే తేలిందన్నమాట.

అదండీ సంగతి... ఇంకా మీకు తినాలనిపిస్తే ఏ జొమాటో ద్వారానో ఫాస్ట్ ఫుడ్ ను ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసి లాగించేయండి. మీ ఇష్టం మరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి