విశ్వామిత్రుడితోను, ఇతర మునులతోను కలిసి మిథిలా నగరానికి వెళుతున్న రామలక్ష్మణులు శోణా నదీ తీరంలో విశ్రమించారు. అయోధ్య నుంచి రామలక్ష్మణులు బయల్దేరి అప్పటికి పదకొండు రోజులు గడిచాయి. ఆ మర్నాడు తిరిగి వారి ప్రయాణం మొదలైంది. ఆ మధ్యాహ్నానికల్లా వాళ్లు పవిత్రమైన గంగానది తీరానికి చేరుకున్నారు. హంసలతో, బెగ్గురు పక్షులతో కూడిన ఆ గంగాతీరం ఎంతో అందంగా కనిపిస్తోంది. అందరూ ఆ తీరంలో ఓ ప్రాంతాన్ని శుభ్రపరుచుకుని నివాసానికి అనువుగా మార్చుకున్నారు. ఆ తర్వాత పుణ్య స్నానాలు చేసి, రుషులకూ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకుని హవిస్సులు సమర్పించారు. తరువాత భోజనాలు చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు.
అప్పుడు రాముడు కుతూహలంతో విశ్వామిత్రుని ఇలా ప్రశ్నించాడు.
''మహానుభావా! ఈ గంగానదిని గురించి తెలుసుకోవాలని ఉంది. స్వర్గలోకంలోను, భూలోకంలోను, పాతాళలోకంలో కూడా ఈ గంగానది ఎలా ప్రవహిస్తోంది? అందుకు గల కారణమేంటి? ఏ విధంగా సముద్రాన్ని చేరింది? దయచేసి వివరించండి'' అంటూ వినయంగా అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు గంగానది కథను చెప్పాడు.
పూర్వం హిమాలయం అనే ఓ మహా పర్వతము ఉండేది. హిమవంతుడు అనే ఆ పర్వత రాజు, మేరువు అనే మరో మహా పర్వతుడి కూతురైన మేనను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ సాటిలేని సౌందర్యవతులైన ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్ద కూతురే ఈ గంగాదేవి. రెండో కూతురు ఉమాదేవి. అప్పుడు దేవతలందరూ వచ్చి పెద్ద కుమార్తె అయిన గంగను తమకు అప్పగించమని కోరారు. మూడు లోకాలకూ మేలు చేయాలనే ఉద్దేశంతో హిమవంతుడు గంగాదేవిని వారికి అప్పగించాడు. అప్పుడు ఆ దేవతలు గంగను స్వర్గ లోకానికి తీసుకుపోయారు. అలా ఆమె సురగంగ అయింది. ఇక రెండో కుమార్తె అయిన ఉమాదేవి కన్యగానే తీవ్ర తపస్సు చేసింది. హిమవంతుడు ఆమె కోరిక మీద ఆమెను శివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమే పార్వతి. ఆ విధంగా హిమవంతుడి కుమార్తెలయిన గంగా, పార్వతులు లోకాలలో పూజ్యులయ్యారు.
ఇది విన్నాక రాముడు, ''మహాత్మా! దేవతలు గంగను స్వర్గ లోకానికి తీసుకు వెళ్లారు కదా, ఆపై ఆ నది మానవ, పాతాళ లోకాలకు ఎలా వెళ్లింది? త్రిపథగా ఎలా పేరు పొందింది?'' అని ప్రశ్నించాడు.
అప్పుడు విశ్వా మిత్రుడు అపూర్వమైన అక్కచెల్లెళ్లయిన ఆ గంగా, పార్వతుల గురించి మరిన్ని వివరాలు ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.
''రామా! శివపార్వతులు పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదా, ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంసార జీవితం గడపసాగారు. అలా నూరు దివ్య సంవత్సరాలు గడిచాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు, 'ఇంత కాలం తర్వాత శివపార్వతులకు కుమారుడు జన్మిస్తే అతడు మహా తేజోమూర్తి అవుతాడు. అతడి ప్రభావాన్ని లోకాలు తట్టుకోలేవు' అని భావించారు. ఆపై వాళ్లు శివుడి దగ్గరకు వెళ్లి, ''పరమశివా! నీ మహా తేజంతో పుట్టే పుత్రుడిని లోకాలు భరించలేవు. కాబట్టి నీ తేజాన్ని నీలోనే ఉంచుకుని పార్వతితో కలిసి తపస్సు చేసి అందరినీ అనుగ్రహించు'' అంటూ ప్రార్థించారు.
దానికి శివుడు సరేనని, ''అయితే నా తేజస్సును ఏదో ఒక చోట నిక్షిప్తం చేయాలి. దాన్ని ఎవరు ధరించగలరో చెప్పండి'' అన్నాడు. అప్పుడు దేవతలు భూమిని చూపించారు. శివుడు తన మహా తేజస్సును భూమిపై వదిలాడు. ఆ తేజస్సు పర్వతాలు, వనాలతో నిండి ఉన్న భూలోకమంతా వ్యాపించిపోయింది. భూమి ఆ ప్రభావాన్ని భరించలేకపోవడంతో దేవతలు ఈసారి అగ్నిదేవుడి దగ్గరకు పోయి, ''నువ్వు వాయు దేవుడితో కలిసి ఆ శివ తేజస్సును భరించు'' అని ప్రార్థించారు. అగ్నివాయువులు కలిసి శివతేజస్సులో ప్రవేశించి దాన్ని ఘనీభవించేలా చేశారు. అదే శ్వేత పర్వతమైంది. ఇదంతా చూసిన పార్వతి దేవి దేవతలపై కోపించింది. ఆ కోపంలో ఆమె, ''పుత్రిడిని పొందాలనే నా కోరికకు మీరంతా అడ్డుపడ్డారు. కాబట్టి ఇకపై మీరు మీ భార్యల ద్వారా సంతానాన్ని పొందలేరు'' అంటూ శపించింది. ఆపై ఆమె భూమికి కూడా శాపాన్నిచ్చింది. ''శివ తేజస్సును భరించలేకపోయిన నువ్వు, ఇకపై అనేక రకాల రూపాలు కలిగి ఉంటావు. అనేక మంది రాజుల చేత పరిపాలించబడతావు. నీకు కూడా సంతాన సుఖ సంతోషాలు ఉండవు'' అంది. ఆ తర్వాత శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉత్తర దిశగా వెళ్లి ఓ పర్వతంపై తపస్సులో మునిగిపోయారు.
దాంతో దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ''బ్రహ్మదేవా! ఇంత వరకు మాకు శివుడు మాకు సేనాధిపతిగా వ్యవహరించాడు. ఇప్పుడు తపస్సులో మునిగిపోయాడు. లోక నిర్వహణ కోసం మాకు సేనానాయకుడు కావల్సి ఉంది. ఏం చేయాలో ఆలోచించి దారి చూపించండి'' అని కోరుకున్నారు.
బ్రహ్మ వారిని ఓదార్చి, ''దేవతలారా! పార్వతి శాపం వల్ల మీరెవరికీ పుత్రులు కలిగే అవకాశం లేదు. కానీ శివుడి తేజస్సును అగ్ని దేవుడు ధరించాడు కదా? దానిని గంగలో ప్రవేశపెట్టమని కోరండి. అలా ఆమె ద్వారా ఒక పిల్లవాడు పుడతాడు. అతడే మీకు సేనాధిపతి కాగలడు'' అని సూచించాడు.
దేవతలు అగ్నిదేవుడి దగ్గరకు వెళ్లి బ్రహ్మ ఆదేశాన్ని చెప్పారు. అప్పుడు అగ్ని, గంగ దగ్గరకు వెళ్లి ''నువ్వు శివ తేజస్సును స్వీకరించు. ఇది దేవకార్యం'' అన్నాడు. అప్పుడు గంగ ఓ అందమైన యువతి రూపం పొందింది. అగ్ని దేవుడు ఆమెలో శివ తేజస్సును ప్రవేశపెట్టాడు. గంగా ప్రవాహాలన్నీ ఆ తేజస్సుతో నిండిపోయాయి. గంగ కూడా బ్రహ్మాండమైన ఆ తేజస్సును భరించలేక, అగ్ని సూచనపై దాన్ని శ్వేత పర్వతం దగ్గర విడిచింది. ఆ తేజస్సు ప్రభావంతో ఆ ప్రదేశాలన్నీ బంగారు మయమైపోయాయి. ఆ తేజస్స తీవ్రతను బట్టి ఆయా ప్రదేశాలలో వెండి, రాగి, ఇనుము, తగరము, సీసము లాంటి ధాతువులు ఏర్పడ్డాయి. శ్వేత పర్వతం దగ్గర శరవనమనే రెల్లుగడ్డి అంతా బంగారమైపోయింది. అక్కడే మహా తేజస్వి అయిన కుమార స్వామి ఉద్భవించాడు. ఆ పిల్లవాడికి పాలివ్వడానికి దేవతలు ఆరు మంది కృత్తికలను నియోగించారు. వాళ్లు దగ్గరకు రాగానే ఆ బాలుడు ఆరు ముఖముల వాడై ఆ ఆరుగురు కృత్తికల నుంచి ఒకేసారి పాలు తాగాడు. అందుకే అతడిని కార్తికేయుడని, అగ్ని సంభవుడని కూడా అంటారు. ఆ బాలుడు ఒక్క రోజులోనే వృద్ధి చెంది మహిమాన్వితుడై దేవ సేనలకు అధిపతి అయ్యాడు.
ఇలా కుమార సంభవం గురించి చెప్పిన విశ్వామిత్రుడు, ఆ తర్వాత రామ లక్ష్మణులకు గంగానది ఆకాశం నుండి ఎలా మానవ లోకానికి వచ్చిందో కూడా వివరించాడు. ఆ కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి