విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిధిలానగరం వెళుతూ మధ్యలో గంగానదీ తీరానికి చేరుకున్నారు. రాముడు అడిగిన మీదట విశ్వామిత్రుడు వారికి గంగ అవతరించిన కథంతా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ అక్కడే విశ్రమించారు. మర్నాడు ఉదయం రామలక్ష్మణులు స్నానాదికాలు ముగించి శుచులై విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, ‘‘మహాత్మా! మీరు చెప్పిన గంగ కథను గురించి చర్చించుకుంటూనే రాత్రంగా గడిపాము. పవిత్రమైన ఈ గంగానదిని దాటడానికి ఇక్కడి రుషులు నావను సిద్ధ పరిచారు’’ అన్నారు. తర్వాత విశ్వామిత్రుడు, మునులు, రామలక్ష్మణులు అందరూ కలిసి గంగా నదిని దాటి ఆవలి తీరాన ఉన్న విశాలా అనే నగరాన్ని చేరారు. ఎంతో వైభవంగా ఉన్న ఆ నగరాన్ని చూసిన రాముడు వినయంగా, ‘‘తపస్వీ... ఈ నగరం గురించి తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దీని చరిత్ర ఏమిటి?’’ అని అడిగాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... అది చెప్పాలంటే ఇంద్రుడి గురించి, ఈ ప్రదేశంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. శ్రద్ధగా విను’’ అంటూ మొదలు పెట్టాడు.
‘‘పూర్వం కృత యుగంలో కశ్యప మహర్షికి దితి అనే భార్య ద్వారా బలశాలురైన దైత్యులు, అదితి అనే భార్య ద్వారా ధర్మపరులైన దేవతలు పుట్టారు. వాళ్లందరూ కలిసి రోగాలు, ముసలితనం, మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు. అప్పుడు వారికి క్షీర సాగరాన్ని చిలికి, దాని ద్వారా అమృతాన్ని పొందాలనే ఉపాయం తోచింది. మహా పరాక్రమవంతులైన వాళ్లంతా మంధర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి అనే మహా సర్పాన్ని తాడుగాను చేసుకుని క్షీర సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. ఆ శ్రమకు తట్టుకోలేక తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కుతూ తన కోరలతో పర్వతం శిలలను కాటు వేయసాగింది. అలా వేయి సంవత్సరాలు చిలకగా సముద్రం నుంచి అగ్నితో సమానమైన హాలాహలం అనే భయంకరమైన విషం బయటకి వచ్చింది. ఆ విషం లోకాలన్నింటినీ దహించడం మొదలు పెట్టింది. దాంతో దేవతలంతా శివుడిని ప్రార్థించి ‘రక్షించ’మని మొరపెట్టుకున్నారు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయానికి విష్ణువు కూడా అక్కడకి వచ్చి, శంకరుడిని చూసి చిరునవ్వుతో, ‘‘మహాదేవా... దేవతలతో నీవు ప్రథముడవు. కాబట్టి సముద్ర మథనం నుంచి మొదట పుట్టిన హాలాహలం అగ్రపూజగా నీకే చెందాలి. స్వీకరించు’’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
అప్పుడు శివుడు ఆ ఘోరమైన హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో నిలుపుకుని ‘గరళ కంఠుడు’ అనిపించుకున్నాడు.
దేవదానవులు తిరిగి పాల సముద్రాన్ని చిలుకడం మొదలు పెట్టారు. అప్పుడు కవ్వంగా ఉన్న మంధర పర్వతం మునిగిపోయింది. అప్పడు వాళ్లంతా కలిసి మహా విష్ణువును ప్రార్థించారు. ‘‘మహానుభావా. సమస్త ప్రాణులకు నీవే దిక్కు. దేవతలకు నువ్వే ఆధారం. మంధర పర్వతాన్ని ఉద్ధరించి కాపాడు’’ అంటూ వేడుకున్నారు. వారి మొర విన్న విష్ణువు లక్ష యోజనాల పరిమాణం కలిగిన ఒక పెద్ద తాబేలు ఆకారాన్ని దాల్చాడు. అలా కూర్మావతారం దాల్చిన ఆయన మంధర పర్వతాన్ని వీపున మోస్తూ పైకి లేపాడు. ఆపై ఆ పర్వతంపై తన చేతిని అదిమి అందరితో పాటు తాను కూడా పాల సముద్రాన్ని చిలకడంలో తోడ్పడ్డాడు.
అలా మరో వెయ్యి సంవత్సరాలు చిలికేసరికి సముద్రంలో నుంచి ఒక మహా పురుషుడు ఉద్భవించాడు. ఆయనే ధన్వంతరి. ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు. ఆ తర్వాత పాల సముద్రం నుంచి అరవై కోట్ల మంది సుందరాంగులు బయటకు వచ్చారు. ‘అప్సు’ అంటే జలములు, క్షీరములనే అర్థం ఉంది. ఆ రసం నుంచి పుట్టారు కాబట్టి వాళ్లకి అప్సరసలు అనే పేరు కలిగింది. వాళ్లతో పాటు మరి కొన్ని వేల మంది వనితలు పుట్టుకొచ్చి అప్సరసలకు పరిచారికలయ్యారు.
ఆ తర్వాత పాల సముద్రం నుంచి జలములకు అధిదేవత అయిన వరుణుడి కూతురుగా వారుణి బయటకు వచ్చింది. ఆమె మద్య దేవత. చక్కని చుక్క. దైత్యులెవరూ ఆమెను స్వీకరించలేదు. దేవతలు మాత్రం ఆమెను చేరదీశారు. వారుణికి మరో పేరు సుర. ఆ సురను స్వీకరించక పోవడం వల్ల దైత్యులకు అసురులని, స్వీకరించిన దేవతలకు సురులని పేరు వచ్చింది.
ఆపై పాల సముద్రం నుంచి తెల్లని ఉత్తమ అశ్వమైన ఉచ్చైశ్రవము, దివ్యమైన మణి కౌస్తుభము వెలికి వచ్చాయి. చివరకు అమృత భాండము వచ్చింది. అప్పుడు అమృతం కోసం దైత్యులు, దేవతల మధ్య గొడవ మొదలైంది. రెండు పక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడే విష్ణువు మోహిని అవతారం దాల్చి అమృత భాండాన్ని కైవసం చేసుకున్నాడు. దేవదానవ యుద్ధంలో దేవతలు అనేక మంది దైత్యులను సంహరించారు. ఆపై ఇంద్రుడు దేవతలకు రాజై సమస్త లోకాలను పరిపాలించసాగాడు.
ఇలా క్షీర సాగర మథనం గురించి చెప్పిన విశ్వామిత్రడు, ‘‘రామా. దేవతల చేతిలో తన కుమారులు అనేక మంది చనిపోవడంతో దితి బాధపడుతూ తన భర్త అయిన కశ్యప మహర్షికి మొరపెట్టుకుంది’’ అంటూ తర్వాత జరిగిన కథ చెప్పసాగాడు.
ఆ కథేంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.
సోమవారం, మార్చి 16, 2026
అమృతం సాధించి... అంతలో కలహించి... (పిల్లల కోసం రాముడి కథ15)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి