వ్యవహారంలో ఓ నిర్లక్ష్యం, ఓ వ్యవస్థ పని తీరు, ఓ నిజాయితీ గురించి చెప్పుకోవాలి. వీటితో పాటు ఇది నేర్పిన పాఠాలు కూడా.
మొన్న మంగళ వారం, అంటే ఏప్రిల్ 7ఉదయం మా అమ్మయిని కాలేజీ బస్సు ఎక్కించి మోతీనగర్లో ఐఓబీ ఏటీఎమ్ సెంటర్ కి వెళ్లా, డబ్బులు తీసుకుందామని.
అమ్మయ్య... ఎవరూ లేరు. పొద్దున్నే కదా... నేను లోపలికి వెళ్లే సరికి మరో కస్టమర్ వచ్చి గేటే బయట నుంచున్నాడు. ఒక్క క్షణం తర్వాత వచ్చి ఉంటే ‘ఇతడి వెనకాల నుంచోవలసి వచ్చేది’ అనుకున్నా. జేబులోంచి పర్సు తీసి అందులోంచి ఏటీఎమ్ కార్డు తీశా. పర్సుని తిరిగి జేబులో పెట్టుకోవచ్చు కదా? అబ్బే... ఏటీఎమ్ యంత్రం మీద పెట్టా. పెట్టేటప్పుడు అనుకున్నా కూడా... దీన్ని గుర్తుపెట్టుకుని
తీసుకోవాలని. ఇది అతి విశ్వాసం. పైగా నిర్లక్ష్యం కూడా.
ఎందుకంటే... అంతక్రితం ఓసారి ఐసీఐసీఐ ఏటీఎమ్ కి వెళ్లినప్పుడు
ఇలాగే పర్సును పక్కన ఉన్న చెక్క ర్యాక్ మీద పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చేసి మళ్లీ గుర్తొచ్చి పరిగెత్తా. అది అక్కడే ఉంది. అప్పుడే
అనుకున్నా... ఇంకెప్పుడూ ఇలా పర్సును ఎక్కడా పెట్టకూడదని. ఆ
అనుభవం నేర్పిన పాఠాన్ని నిర్లక్ష్యం చేశానన్నమాట.
సరే... ఇప్పటి విషయానికొస్తే, కార్డు స్లాట్ లో పెట్టాక... పిన్ నెంబర్, ఎమౌంట్ వివరాలు కొట్టా. ఫోన్లో ఓటీపీ వచ్చాక ఎంటర్ చేశా. నోట్లు వచ్చాక తీసి జేబులో పెట్టుకున్నా. కార్డు మరో జేబులోకి తోసేశా. తర్వాత పర్సు అక్కడే మర్చిపోయి బయటకి వచ్చి బండెక్కి ఇంటికి వచ్చేశా. బండి పార్క్ చేసి జేబు చెక్ చేసుకుంటే పర్సు లేదు. ‘మైగాడ్’ మర్చిపోయాననుకుని వెంటనే వెళ్లి చూస్తే పర్సు లేదు.
అందులో క్యాష్ కొంచెమే ఉన్నా, కావలసిన కార్డులన్నీ ఉన్నాయి. పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్రిడిటేషన్, బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు, మెంబర్ షిప్ కార్డులు, వెహికిల్ ఆర్సీలు వగైరా... వగైరా.
ఏం చేయాలి? కాసేపు అయోమయం.
తర్వాత వెంటనే సెల్ తీసి బ్యాంకుల మొబైల్ యాప్స్ ఓపెన్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులను బ్లాక్ చేశా. డ్రైవింగ్ కార్డు ఒరిజినల్ ఉందో, డూప్లికేట్ ఉందో గుర్తులేదు. ఇంటికెళ్లి చూడాలి.
సరే... ఆ తర్వాత చేసిన పని అక్కడే నుంచుని 100కి ఫోన్ కొట్టి విషయం చెప్పా. లొకేషన్ చెప్పేసరికి దగ్గర్లోని పీఎస్ నుంచి ఫోన్
వస్తుందని చెప్పారు. వెంటనే ఫోన్ కి మెస్సేజ్ వచ్చింది. కాసేపట్లో పోలీసుల నుంచి ఫోన్. ‘‘అక్కడే ఉండండి వస్తున్నామ’’న్నారు. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పొలీస్ పెట్రోలింగ్ కారు వచ్చింది. వ్యవస్థ బాగానే పనిచేస్తోందనిపించింది. నేనున్న ఏరియా పరిధిలోని బోరబండ పోలీస్ స్టేషన్ కారు అది. అందులోంచి పొలీస్ శీతల్ సింగ్ దిగి వివరాలు
కనుక్కున్నారు. అక్కడే లొకేషన్ ఫొటోలు తీసుకున్నారు. నన్ను,
ఆయనను కలిపి డ్రైవర్ ఫొటో తీశాడు. నా వివరాలన్నీ చేతిలో ఉన్న ట్యాబ్ లో ఎంటర్ చేశారు. వెంటనే నా సెల్ కి మెసేజ్ వచ్చింది. నాకయితే ముచ్చటేసింది.
‘సర్... ఇంత ఫాస్టుగా వచ్చేశారే...’ అన్నాను ఆశ్చర్యంగా. అప్పుడు చెప్పారు, 100 కి కానీ, 112 కి కానీ ఫోన్ చేస్తే 10 నిమిషాల లోపు లొకేషన్లో ఉండాలనేది వాళ్లకి ఉన్న ఆదేశాలు. తర్వాత మీరు బోరబండ పీఎస్ కి వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్పి వెళ్లి పోయారు. నేను
కాసేపట్లో పీఎస్ కి వెళ్లా. రిసెప్షన్ లో చెబితే అక్కడ యూనిఫామ్ లో ఉన్న అమ్మయి కాగితం, పెన్ను ఇచ్చి రాయమంది. రాశాక దగ్గరుండి మరో పోలీస్ దగ్గరకి తీసుకెళ్లింది. ఆ పొలీస్ నన్ను ఎస్ ఐ సైదులు దగ్గరకి తీసుకెళ్లారు. ఆయన అంతా విని కృష్ణ అనే పొలీస్ ని పిలిచి కేసు
అప్పగించారు. తర్వాత నేను, అతను కలసి స్పాట్ ఏటీఎమ్ దగ్గరకి
వచ్చాం. ఏటీఎమ్ లో సీసీ కెమేరాలు ఉన్నాయో లేదో చూశాక
అతడు చెప్పాడు. మీ పర్సు తీసుకుపోయిన వ్యక్తిని పట్టుకోడానికి మూడు ఛాన్సులున్నాయని.
1. సీసీ కెమేరా ఫుటేజి ద్వారా అసలు మీ తర్వాత ఎవరు ఆ పర్సు
తీశారో గమనించవచ్చు. కానీ కేవలం వ్యక్తి ఫొటో వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
2. సీసీ కెమేరాల్లో అతడి వెహికిల్ నెంబర్ కనిపిస్తే వెంటనే ట్రేస్ చేసి కాల్
చేయవచ్చు.
3. బ్యాంక్ ఏటీఎమ్ లావాదేవీలు పరిశీలించి మీ తర్వాత డబ్బులు డ్రా చేసిన వ్యక్తి ఎకౌంట్ నెంబర్ ద్వారా చిరునామా, ఫోన్ నెంబర్లు తీసుకోవచ్చు.
ఇలా చెప్పిన తర్వాత అతడు నేరుగా బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లి ఐడెండిటీ కార్డు చూపించాడు. ఇద్దరం కూర్చున్నాక మేనేజర్ మీరు
ఎన్నింటికి డబ్బు డ్రా చేశారని అడిగాడు. నేను నా సెల్ ఫోన్ కి వచ్చిన
బ్యాంక్ మెస్సేజి చూపించా. ఉదయం 7.53 గంటలు. తర్వాత సీసీ కెమేరా ఫుటేజిలో 7.50 నుంచి వీడియో చూపించారు. అందులో నేను రావడం నుంచి పర్సు వదిలేసి వెళ్లడం వరకు సినిమా కనిపించింది. నేను వెళ్లిన వెంటనే ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడు టోపీ పెట్టుకుని ఉండడంతో ఫేస్ సరిగా కనిపించలేదు. అతడు డబ్బు డ్రా చేస్తుండగానే నా పర్సును గమనించాడు. దాన్ని తీసి ఓపెన్ చేసి ఏమున్నాయో చూశాడు. తర్వాత తన డబ్బు డ్రా చేసి నా పర్సుతో సహా వెళ్లిపోయాడు. నాతో వచ్చిన పోలీస్ కృష్ణ సీసీ కెమేరా వీడియోనంతా తన సెల్
ఫోన్లో చిత్రీకరించారు. ఫుటేజిలో అతడి టూవీలర్ కనపించింది కానీ
దాని మీద నెంబర్ ప్లేటు లేదు. అంటే... తొలి రెండు ఛాన్సులూ
లేవు. ఇక మిగిలింది అతడు ఏ బ్యాంకు కస్టమర్ అనేది. అదే బ్యాంకు కస్టమర్ అయితే అతడి ఎకౌంట్ వివరాలు వెంటనే చూడవచ్చు. కానీ అతడు వేరే బ్యాంక్ కస్టమర్. దాంతో ఆ వివరాల కోసం ఒక లెటర్ రాసి ఇస్తే ఏటీఎమ్ నిర్వాహకులకు, ఆ బ్యాంకు వాళ్లకి విషయం చెప్పి వివరాలు తెప్పించుకోవాల్సి ఉంటుందని, దీనికి రెండు రోజులైనా పడుతుందని మేనేజర్ చెప్పారు.
ఇక చేసేదేముంది?
అక్కడికక్కడే లెటర్ రాసి మేనేజర్ కి ఇచ్చి నాదీ, పోలీసులదీ నెంబర్లు ఇచ్చి వివరాలు రాగానే చెప్పమని వచ్చేశాం.
నేను బ్యాంకులకు వెళ్లి కొత్త డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసి వచ్చా. ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డు తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ తోనే తలనెప్పి. పోలీసు స్టేషన్లో ఎప్ఐఆర్ తీసుకుని, దానితో పాటు కొత్త కార్డు కోసం అప్లై చేయాలి.
ఏం చేయాలో తేల్చుకుంటుండగానే నాలుగు రోజులు గడిచాయి. శనివారం అంటే, 11వ తారీకున నాకొక కాల్ వచ్చింది. అందులో వ్యక్తి నా పర్సు తనకు దొరికిందని చెప్పాడు. నా ఫోన్ నెంబరు మీకెలా తెలిసిందంటే వస్తే చెబుతానన్నాడు. సరే... మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పా. అతడు మోతీ నగర్లో రాయుడు రెస్టారెంటు దగ్గరకి రమ్మన్నాడు.
నా అంతట నేను వెళ్లిపోతే ఎలా? అందుకని పోలీసు కృష్ణ గారికి ఫోన్ చేశా.
‘అయితే మీరు అక్కడికి వెళ్లండి. మా కానిస్టేబుల్ హరిబాబును పంపిస్తా. అతడేమంటాడో చూద్దాం...’ అన్నారు. నేను వెంటనే
బోరబండ పీఎస్ కి వెళ్లి హరిబాబుతో సహా రాయుడు రెస్టారెంటుకి బయల్దేరాం.
నాకు ఫోన్ చేసిన వ్యక్తినెంబర్లు తీసుకుని హరిబాబు వెంటనే అతడి వివరాలు మొత్తం వాళ్ల ఫ్యామిలీ ఫొటోలతో సహా ట్రేస్ చేశారు. అతడు ఏ డిపార్టుమెంటు ఉద్యోగో కూడా తెలుసుకున్నారు.
‘‘మీరు ఒంటరి గానే వెళ్లి అతడికి ఫోన్ చేయండి. ఇద్దరం ఉన్నట్టు గమనిస్తే అతడు రాకపోవచ్చు. అతడు రాగానే నేను మీ దగ్గరకి వస్తా’’ అని హరిబాబు సూచించారు. నేను అక్కడే చెట్టు కింద నుంచుని ఫోన్ చేశా. నాకు కొద్ది దూరంలోనే హరిబాబు నుంచుని నన్ను గమనిస్తున్నారు. నేను ఫోన్ చేసిన దాదాపు అరగంటకి ఆ వ్యక్తి
వచ్చాడు. ‘‘మీరేనా పర్సు వదిలేసింది?’’ అని అడుగుతూ నా పర్సు తీసి నాకిచ్చాడు. నేను దాన్ని చెక్ చేస్తుండగానే పోలీస్
హరిబాబు వచ్చి మా పక్కన నుంచున్నాడు. తన ఫోన్ లో ఏటీఎమ్ వీడియో ఫుటేజి ఓపెన్ చేసి ఆ వ్యక్తికి చూపించాడు. అతడి పేరు సుధాకర్. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు.
‘‘అవునండీ... నేనే తీసుకుని వెళ్లా. ఆధార్ కార్డు లోని ఎడ్రస్ ద్వారా ఒక
అపార్టుమెంటుకి వెళ్లా కూడా. అయితే అక్కడ ఎవరూ లేరన్నారు. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కోసం కార్డులన్నీ చూశా. ఆఖరికి ఎక్రిడిటేషన్
కార్డు లో చివర మీ ఫోన్ నెంబరు ఉంది. దాన్ని బట్టి మీకు ఫోన్ చేశా’’ అని వివరించాడు.
‘‘ఇలా ఏమైనా దొరికితే దగ్గర్లోని పోలీసులకు చెప్పాలి కదండీ?’’ అని హరిబాబు అడిగాడు.
‘‘నాకా ఆలోచన రాలేదండీ...’ అన్నాడతడు.
‘‘నా పర్సు దొరికిన రోజో, మర్నాడో బ్యాంక్ మేనేజర్ కి ఇవ్వలేకపోయారా? నాలుగు రోజులు ఎందుకు ఊరుకున్నారు?’’ అని నేను అడిగా.
‘‘ఆ రోజు ఇంకా బ్యాంక్ తెరవలేదండీ... తర్వాతి రోజు నేను ఆధార్ కార్డులోని అడ్రస్ వెతుక్కుంటూ ఒక అపార్టుమెంటుకు వెళ్లా కూడా. ఈ లోగా నా పనులు. ఇవాళ కార్డులన్నీ మరోసారి చెక్ చేస్తే ఒక దాంట్లో మీ ఫోన్ నెంబర్ దొరికింది. వెంటనే కాల్ చేశా’’ అన్నాడతడు.
‘‘మరి మీ బండికి నెంబర్ ప్లేటు లేదేంటి?’’ అని అడిగా.
‘‘మేం డిపార్టుమెంటు వాళ్లమే కదండీ? అందుకని పోలీసులు పట్టుకోరు. అందుకే పట్టించుకోవలేదు...’’ అన్నాడు.
నా పర్సులో అన్నీ సరిగానే ఉన్నాయి, డబ్బుతో సహా. పోలీస్ హరిబాబు ఆ వ్యక్తి ఐడెండిటీ కార్డు ఫొటో తీసుకున్నాడు. నా పర్సు ఫొటో కూడా తీసుకున్నాడు. తర్వాత ఎస్ ఐ కి ఫోన్ చేసి చెప్పి, మమ్మల్ని ఇక వెళ్లవచ్చన్నాడు. నేను హరిబాబుకి, ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పా. ఇద్దరూ కనీసం కూల్ డ్రింక్ అయినా తాగుదాం రండన్నా వినలేదు. పన్లు ఉన్నాయంటూ వెళ్లిపోయారు.
ఈ వ్యవహారంలో నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి ఇవి...
1. పర్సును ఎక్కడా నిర్లక్ష్యంగా పెట్టకూడదు. ఎప్పుడు తీసినా జేబులోనే పెట్టుకోవాలి.
2. పర్సులో ముఖ్యమైన కార్డుల డూప్లికేట్స్ ఉండాలి తప్ప, ఒరిజినల్స్ ఉంచకూడదు.
3. పర్సులో ఏమేమి ఉన్నాయో ఒక లిస్టు రాసుకుని ఇంట్లో వేరే చోట భద్రంగా ఉంచుకోవాలి.
4. ముఖ్యమైన కార్డులకు సంబంధించిన డిజిటల్ కాపీలు భద్రం చేసుకోవాలి. ఈ రోజుల్లో డిజీ లాకర్లు, యాప్స్ లాంటి అవకాశాలు ఉన్నాయి కదా. మన కార్డుల ఫొటోలను తీసుకుని మన ఈమెయిల్ కి మనమే పంపుకుని ఏ డ్రైవ్ లోనో సేవ్ చేసుకోవాలి. వీలుంటే రెండు మూడు డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లో దాచుకోవాలి. మన కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోవచ్చు.
ఈ పాఠాలను మర్చిపోకుండా అమలు చేయడం ఆఖరి పాఠం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి