గురువారం, మే 28, 2026

ఇంద్రుడిని చంపే పుత్రుడి కోసం దితి తపస్సు (పిల్లల కోసం రాముడి కథ – 16)



విశ్వామిత్రుడు, ఇతర మునులతో కలిసి మిథిలకు ప్రయాణిస్తున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో గంగానదిని దాటి విశాలా అనే నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని గురించి రాముడు అడిగిన ప్రశ్నకు బదులుగా విశ్వామిత్రుడు... దేవదానవులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికిన వివరాలన్నీ చెప్పడు. అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు విజయం పొంది ఇంద్రుడు స్వర్గానికి రాజయ్యాక ఏం జరిగిందో చెప్పసాగాడు.

‘‘రామా... ఆ యుద్ధంలో తన కుమారులైన దానవులు మరణించడంతో దితి ఎంతో దు:ఖించింది. ఆమె తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది.

‘‘దేవతల చేతిలో నా కుమారులు అందరూ మరణించారు. కాబట్టి ఇంద్రుడిని చంపగలిగే పుత్రుడిని పొందడం కోసం నేను తపస్సు చేస్తాను. అందుకు అనుమతి ఇవ్వండి’’ అని అడిగింది. కశ్యపుడు అందుకు అంగీకరించి, ‘‘నువ్వు వెయ్యి సంవత్సరాలు పవిత్రతతో తపస్సు చేస్తే నీ కోరిక తీరుతుంది’’ అని చెప్పాడు.

అప్పుడు దితి కుశప్లవనము అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. ఆ ప్రదేశం ఇదే. తనను చంపే పుత్రుడిని పొందడం కోసం తన పినతల్లి దితి తపస్సు చేస్తున్న సంగతి ఇంద్రుడికి తెలిసింది. అతడు ఆ ప్రదేశానికి వచ్చి దితికి సపర్యలు చేయసాగాడు. ఆమె తపస్సుకు కావలసిన అగ్ని, సమిధలు, కుశలు, జలములు లాంటి సామగ్రిని సమయానికి సమకూరుస్తూ తన పినతల్లికి సేవలు చేశాడు. అలా 990 ఏళ్లు గడిచాయి.

ఇంద్రుడి సేవలకు సంతోషించిన దితి, ‘‘నాయనా... నిన్ను జయించగల పుత్రుడి కోసమే ఈ తపస్సు చేస్తున్నాను. నీ సేవలకు ఎంతో సంతోషించాను. నాకు పుత్రుడు కలిగి, అతడు నిన్ను జయించడానికి సిద్ధమయినప్పుడు నేను వద్దని వారిస్తాను. అప్పుడు మీరిద్దరూ కలిసి ముల్లోకాలను పాలించండి’’ అంది. అలా చెప్పిన తర్వాత  మధ్యాహ్న సమయం కావడంతో నిద్ర ముంచుకు వచ్చిన దితి, పాదాల వైపుగా తల పెట్టుకుని పడుకుండిపోయింది. పగటి పూట పడుకోవడం, ఆమె జుట్టుకు పాద ధూళి సోకడమనే దోషాల వల్ల ఆమె అశుచి అయింది. అందువల్ల వ్రత భంగమైనదని గ్రహించిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో శిశువును ఏడు ముక్కలు చేశాడు. ఆ సమయంలో ఆ శిశువు ఏడ్వగా ఇంద్రుడు ‘ఏడవకు, ఏడవకు’ అంటూనే ఖండించాడు. శిశువు ఏడుపు విని మెలకువ వచ్చిన దితి ఇంద్రుడితో ‘చంపకు... చంపకు’ అంటూ నిద్ర లేచింది. పినతల్లి మాట విని బయటకు వచ్చిన ఇంద్రుడు, ‘‘తల్లీ... నువ్వు పాదాల వైపు తల పెట్టుకుని పడుకోవడం వల్ల అపవిత్రురాలివయ్యావు. అందుకనే నన్ను చంపడం కోసం పుడుతున్న వాడిని ముందుగానే ముక్కులుగా చేశాను. నన్ను క్షమించు’’ అన్నాడు.

దితి ఎంతో దు:ఖించినా తర్వాత తేరుకుని, ‘‘దేవేంద్రా... నా అపరాధం వల్లనే ఇలా జరిగింది. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అయితే నాకొక ఉపకారం చెయ్యి. నువ్వు ఖండించడం వల్ల ఏడు భాగాలైన నా కుమారులు ఏడు లోకాలకు పాలకులు అవ్వాలి. ఏడు రకాల వాయువులకు అధిష్ఠాన దేవతలై సంచరించాలి. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలోను, ఇంకొకడు ఇంద్రలోకంలోను, మూడో వాడు వాయువు పేరుతో అంతరిక్షంలోను ఉండాలి. మిగిలిన నలుగురు నీ ఆదేశాలను పాలిస్తూ నాలుగు దిక్కులా ఉంటారు. వీళ్లను ఖండించేటప్పుడు నువ్వు ఏడవవద్దంటూ ‘మారుద:’ అన్నావు కాబట్టి, ఇక నుంచి వీళ్లు ‘మరుత్తులు’ అనే పేరుతో ప్రసిద్ధులవుతారు’’ అంది.

దితి మాటలు విన్న ఇంద్రుడు వినయంగా ఆమెకు నమస్కరించి, ‘‘అలాగే తల్లీ... అంతా నువ్వు అనుకున్నట్టుగనే జరుగుతుంది. నీ కుమారులు దేవతలై సంచరిస్తారు. నీకు క్షేమమగుగాక’’ అన్నాడు.

ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ‘‘రామా... దితి తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు సేవలు చేసిన ప్రదేశం ఇదే. ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజుకు, అలంబుస అనే పట్టపు రాణికి విశాలుడనే కుమారుడు కలిగాడు. అతడే ఈ విశాల అనే నగరాన్ని నిర్మించి పాలించాడు. విశాలుడి కుమారుడు హేమచంద్రుడు. అతడి తనయుడు సుచంద్రుడు. అతడికి ధూమ్రాశ్వుడు అనే కొడుకు పుట్టాడు. అతడికి సృంజయుడు కలిగాడు. అతడకి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వడికి సోమదత్తుడు పుట్టారు. సోమదత్తుడి పుత్రుడు కాకుత్‌స్థుడు. అతడికి పుట్టిన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు’’ అంటూ వివరించాడు. ఆ తర్వాత ‘‘రామా... ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమిద్దాం. రేపు మిథిలా నగరానికి వెళదాం’’ అన్నాడు.

అంతలోనే విశాల నగరాన్ని పాలిస్తున్న సుమతి మహారాజు తన రాజ్యానికి విశ్వామిత్రడు వచ్చినట్టు విని పురోహితులతో, బంధువులతో కలసి వచ్చాడు. ఆయనను సకల మర్యాదలతో పూజించి, వినయంగా చేతులు జోడించి కుశల ప్రశ్నలు వేశాడు.

‘‘ఓ మహర్షీ... మీరు మా దేశానికి రావడం వల్ల నేను ధన్యుడనయ్యాను’’ అంటూ రామలక్ష్మణులను చూసి, ‘‘మహాత్మా... ఈ యువకులిద్దరూ దేవతల లాగా ప్రకాశిస్తున్నారు. వీరిని చూస్తుంటేనే ఎంతో పరాక్రమవంతులని తెలుస్తోంది. అందంలో అశ్వినీ దేవతలనే మించిపోయారు. ధనుర్బాణాలు, ఖడ్గాలు ధరించిన వీరు ఎవరు? ఈ అడవిలో కాలినడకన రావడానికి కారణం ఏమిటి? వీరి గురించి వినాలని కోరుకుంటున్నాను’’ అని అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు, ‘‘వీరిద్దరూ దశరథుడి కుమారులైన రామలక్ష్మణులు’’ అని పరిచయం చేసి, సిద్ధాశ్రమంలో తను చేసిన యాగం గురించి, మారీచ సుబాహులను ఎదుర్కొని రామలక్ష్మణులు యాగ రక్షణ చేయడం గురించి అన్ని సంగతులు వివరంగా చెప్పాడు.  అంతా విన్న సుమతి మహారాజు పరమానందం చెంది, రామలక్ష్మణులకు తగిన రీతిలో సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి వారందరికీ ఆతిథ్యమిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి