గురువారం, మే 28, 2026

శ్రీకృష్ణుడు తీర్చుకోలేని రుణం

 


దేవదేవుడైన శ్రీకృష్ణుడికే దేవతలు సహా ప్రాణులందరూ రుణపడి ఉంటారు కదా? అలాంటిది ఆయన తీర్చుకోలేని రుణం అంటూ ఉంటుందా?

ఉందని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. ఎవరితోనో తెలుసా? గోపికలతో. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 32వ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ ఘట్టం.

ఓసారి గోపికలు శ్రీకృష్ణుడిని అడుగుతారు.

‘‘కృష్ణా... కొందరు తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. మరి కొందరు తమను ప్రేమించని వారిని సైతం ప్రేమిస్తారు. ఇంకొందరు తమను ప్రేమించిన వారిని కానీ, ప్రేమించని వారిని కానీ... ఇద్దరినీ ప్రేమించరు. మరి వీరిలో నీకు ఎవరంటే ఇష్టం?’’ అని అడిగారు.

అందుకు శ్రీకృష్ణుడు, ‘‘సఖులారా... కొందరు ప్రతిఫలాపేక్ష కలవారై ఉంటారు. తమకు మేలు చేసేవారినే సేవిస్తారు. ఇందులో స్నేహం కానీ, ధర్మం కానీ ఉండవు. సహజంగానే దయా స్వభావం కల వారు కొందరుంటారు. వాళ్లు తమను ప్రేమించని వారిని సైతం సేవిస్తారు. ఇలాంటి వారి ప్రేమలో ధర్మం, సుహృద్భావం ఉంటాయి. కొందరైతే తమకు మేలు చేసిన వారిని సైతం సేవించరు. వీరు కృతఘ్నులు, కఠినాత్ములు. నేను వీరిలో ఎవ్వడనూ కాను. అయితే నన్ను ప్రేమించేవారి పట్ల నేను అదే విధమైన ప్రేమను ప్రకటించకుండా, నా పట్ల వారి ప్రేమ మరింత పెరిగేలా, అది నిరంతరం నిలిచేలా వ్యవహరిస్తాను. అందుకోసం నేను వారిని కలిసినట్టే కలిసి, కనిపించినట్టే కనిపించి, దాగినట్టు ఉంటాను. మీతోనే, మీ మధ్యనే ఉంటూ నేను అదృశ్యమవడానికి కారణం అదే. నేను మాయమై ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ వివరించాడు. అందుకు గోపికలు ఎంతో ఆనందపడ్డారు.  

ఆపై శ్రీకృష్ణుడు వారి పట్ల తన గాఢమైన ప్రేమను వెల్లడిస్తూ, ‘‘గోపికలారా... మీ ప్రేమ కపటం లేనిది. మీరు నాపై చూపించే ప్రేమకు తగిన ప్రత్యుపకారము చేయడం నాకు సాధ్యం కాదు. నాకు దేవతలకు ఉండేంత ఆయుర్దాయము ఉన్నా సరే, నేను మీ రుణం తీర్చుకోలేను. మీరు నన్ను చేరుకోడానికి మీ ఇళ్లు, వాకిళ్లు, బంధాలు అనే సంకెళ్లను పూర్తిగా వదిలించుకుని వచ్చారు. నిర్మలమైన మీ ప్రేమ భావాన్ని నాకే సమర్పించారు. అందువల్ల నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను’’ అన్నాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మధురమైన ఈ మాటలు విని గోపికలందరూ సంతోషంతో పొంగిపోయారు. అదీ కృష్ణ తత్వం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి